"తెలుగు నవల పట్నాల్లో కాపురం పెట్టి పల్లెల్ని మరిచిపోయిందన్న అభిప్రాయానికి ఈ నవల ఒక మినహాయింపు. రచయిత్రికి పల్లెలలోను, మనుషులలోను గల అత్యంత ఆత్మీయతా బంధాలు అడుగడుగునా స్ఫురిస్తాయి. ఏడేళ్ళ అమ్మాయి వర్ధనిని ముఖ్య పాత్రగా తీసుకుని నవల రాసి మెప్పించడం జీవితం పట్ల ఎంతో శ్రద్ధ, ఆరాధన ఉన్నప్పుడు మాత్రమే సాధ్యం" ...మెచ్చుకుని ముందుమాట రాసినవారు, తెలుగు కథకి కొత్త వెలుగులద్దిన 'దామల్ చెరువు అయ్యోరు' మధురాంతకం రాజారాం.
'రేగడి విత్తులు' తో తెలుగు సాహితీలోకాన్ని ఆకర్షించి, 'దృశ్యాదృశ్యం' అనే నిరుపమాన నవలని అందించిన రచయిత్రి చంద్రలత తొలి నవల 'వర్ధని.' చతుర మాసపత్రిక మే, 2006, సంచికలో ప్రచురితమైన ఈ నవలకి నేపధ్యంగా, తెలుగు సాహిత్యంలో అతి తక్కువగా ఉపయోగించుకున్న 'చైల్డ్ సైకాలజీ' ని నేపధ్యంగా తీసుకున్నారు రచయిత్రి. ఓ ఏడేళ్ళ అమ్మాయి మనస్తత్వాన్ని పాఠకుల కళ్ళకి కట్టడం మాత్రమే కాదు, పిల్లల పెంపకం అన్నది ఎంత శ్రద్ధగా నిర్వహించాల్సిన బాధ్యతో కొంచం గట్టిగానే చెప్పారు.
మహబూబ్ నగర్ జిల్లాలోని ఓ పల్లెటూళ్ళో వ్యవసాయం చేసుకునే ఉమ్మడి కుటుంబమే 'వర్ధని' నవలలో కథాస్థలం. ఇద్దరు అన్నదమ్ములు కోటయ్య, ముకుందం. వీరిలో ముకుందం పెద్ద కూతురు వర్ధని. ఆ ఇంట్లో తొలి ఆడపిల్ల. అన్నదమ్ములిద్దరూ ఆ అమ్మాయికి తమ తల్లి వర్ధనమ్మ పేరు పెట్టుకోడమే కాదు, ఎంతో గారాబంగా చూసుకుంటారు కూడా. తల్లిదండ్రుల దగ్గర కన్నా, పెదనాన్న, పెద్దమ్మల దగ్గర చేరిక ఎక్కువ వర్ధనికి. వాళ్ళు చేసే ముద్దు కారణంగా తనని తను ఓ యువరాణీ లాగా భావించుకుంటూ, అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది. ఆ ఊళ్ళో, ఆ ఇంట్లో ఆమె ఆడింది ఆట. చెల్లెలు వాణీని కూడా కనీసం మనిషిలాగా గుర్తించదు వర్ధని.
ఉన్నట్టుండి ఒకరోజు తన భార్యాపిల్లలతో కలిసి పట్నం బయలుదేరి అక్కడ కాపురం పెడతాడు ముకుందం. ఈ మార్పు వర్ధని ఆసలు ఊహించనిది, భరించలేనిది. తల్లి, తండ్రి, చెల్లెలితో ఇమడలేని వర్ధనిలో మిగిలి ఉన్న ఆశ ఒక్కటే. ఎప్పటికైనా తను పెద్దమ్మ, పెదనాన్నల దగ్గరికి వెళ్లిపోవచ్చని. పండుగ సెలవులకి ఊరికి వెళ్ళిన వర్ధనికి శరాఘాతం తగులుతుంది. పెద్దమ్మ, పెదనాన్న ఆ ఇంట్లోకి కొత్తగా వచ్చిన తమ మనవరాలిని ముద్దాడుతూ కనిపిస్తారు. ఇన్నాళ్ళూ తనదైన స్థానాన్ని, ఆ పసిపిల్ల దక్కించుకోడాన్ని ఏమాత్రం భరించలేదు వర్ధని. ఆ పసిపిల్లమీద హత్యాప్రయత్నం చేసేంత ఉన్మాదంలోకి వెళ్లి పోతుందామె.
నవల చదువుతుంటే, ఎక్కడా కూడా ఇది రచయిత్రికి తొలి నవల అన్న భావన కలగదు. ముగింపులో వచ్చే సంభాషణల్లో తొంగిచూసే కొద్దిపాటి నాటకీయతని మినహాయించుకుంటే, మిగిలిన కథనంతటినీ అత్యంత సహజంగా కళ్ళకి కట్టారు చంద్రలత. పల్లెవాతావరణం, రైతు కుటుంబాలు, అక్కడి పద్ధతులు, ఉమ్మడి కుటుంబం...వీటన్నింటి మధ్యకీ పాఠకులని తెసుకెళ్ళిపోయారు. నిజానికి ఇదే కేన్వాసుని మరికొంచం విస్తరించి, 'రేగడి విత్తులు' నవలలో ఉపయోగించారు. "ఒక సాధారణమైన విషయాన్ని అసాధారణంగా చెప్పగలిగిన రచయిత్రి, మంచి ఇతివృత్తాన్ని స్వీకరించి - ఆద్యంతం ఉత్కంఠ కొనసాగేటట్లుగా ఒక సీరియల్ నవల రాయవచ్చు," అన్న మధురాంతకం వారి మాటలు స్ఫూర్తి కలిగించి ఉండొచ్చు, బహుశా.
కథలో పాఠకులని ఎంతగా లీనం చేస్తారంటే, వర్ధని తప్పు చేస్తున్నప్పుడల్లా ఆమెకి నచ్చచెప్పాలనీ, ఇంట్లో పెద్దవాళ్ళని మందలించాలనీ అనిపిస్తుంది పాఠకులకి. ఓ ఏడేళ్ళ పిల్ల ఆలోచనలనీ, భయాలనీ, పెరిగిన వాతావరణం కారణంగా ఆమెలో పోటీపడే సుపీరియారిటీ, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లనీ అత్యంత సహజత్వంతో చిత్రించిన తీరు ముచ్చట గొలుపుతుంది. అప్పటికే 'రేగడివిత్తులు' 'దృశ్యాదృశ్యం' చదివేసి ఉండడంతో, ఈనవల పూర్తి చేసిన వెంటనే నాకు "పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది" అన్న నానుడి గుర్తొచ్చింది. ('వర్ధని,' పేజీలు 118, వెల రూ.60, ప్రభవ పబ్లికేషన్స్ ప్రచురణ, అన్ని పుస్తకాల షాపులూ)