శనివారం, మే 05, 2012

జమీల్యా

దాదాపు పదేళ్ళ క్రితం.. ఓ మిత్రుడితో పుస్తకాల గురించి మాట్లాడుతుండగా, తను అంతక్రితం ఎప్పుడో చదివిన ఓ పుస్తకాన్ని గురించి చాలా ఉత్సాహంగా చెప్పారు. "చాలా చిన్న పుస్తకం.. లైబ్రరీలో కూర్చుని ఓ గంటలో చదివేశాను. ఓ పట్టాన మర్చిపోలేం.. వివాహిత అయిన ఓ ముస్లిం యువతి ప్రేమకథ..." తను చెబుతూ ఉండగానే "మైదానం రాజేశ్వరి లాగా?!" అడిగాన్నేను. "కాదు..కాదు.. ఇది పూర్తిగా వేరే కథ.. పేరు గుర్తు రావడం లేదు కానీ చదవాల్సిన పుస్తకం," కాసేపు పుస్తకం పేరు, రచయిత పేరు గుర్తు చేసుకోడానికి ప్రయత్నించి విఫలమయ్యారు తను.

కిర్గిజ్ రచయిత చింగీజ్ ఐత్ మాతోవ్ నవల 'జమీల్యా' చదవడం పూర్తి చేయగానే, నాకు పదేళ్ళ క్రిందటి సందర్భం,సంభాషణ గుర్తొచ్చాయి. సందేహం లేదు, తను చెప్పిన నవల ఇదే. పాకెట్ సైజులో తొంభై ఆరు పేజీలున్న ఈ నవలని చదవడం మంచినీళ్ళ ప్రాయం. సున్నితమైన కథ, పరుగులు పెట్టించే కథనం, పెద్దగా ఇబ్బంది పెట్టని అనువాదం. ముగింపుతోనే కథ ప్రారంభమవుతుంది కాబట్టి ఏమవుతుందో అన్న ఆదుర్దా ఉండదు. అయితేనేం, కథలో లీనమైపోయిన పాఠకుడికి పుస్తకం చదవడం పూర్తైపోయిందన్న విషయం అర్ధం కాడానికి కొంత సమయం పడుతుంది, కచ్చితంగా.

"ప్రపంచంలోని బహు సుందరమైన ప్రేమకథల్లో ఒకటిగా గణుతికెక్కిన రచన" ఇది ప్రకాశకుల మాట. 'కిర్గిజ్ జాతిపిత' గా పేరుపొందిన చింగీజ్ కి అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చిపెట్టిన నవల 'జమీల్యా.' కిర్గిస్తాన్ గిరిజన జీవన సౌందర్యానికి అక్షర రూపం ఈ నవల. కథా కాలం రష్యా-జర్మనీల మధ్య యుద్ధం ముమ్మరంగా ఉన్న సమయం. రష్యా యువకులంతా నిర్బంధంగా సైన్యంలోకి తరలింప బడ్డారు. వారిలో కొత్తగా పెళ్ళైన సాదిక్ కూడా ఉన్నాడు. ఒక పేద గిరిజన ముస్లిం కుటుంబానికి చెందిన వాడు సాదిక్. పెద్ద తమ్ముడితో సహా యుద్ధానికి బయలుదేరాడు, తన భార్య జమీల్యాని ఉమ్మడి కుటుంబంలో వదిలి.


సాదిక్ తల్లి, పెద తండ్రి, పెద తల్లి, (తెగ సంప్రదాయం ప్రకారం తన భర్త మరణాంతరం సాదిక్ తల్లి తన బావ గారిని వివాహం చేసుకుంటుంది), తమ్ముడు చిట్టి, చెల్లెలు.. ఇదీ కుటుంబం. చిన్నపిల్లలిద్దరూ బడి ఈడు వాళ్ళు. యుద్ధం కారణంగా బడి మూసేస్తారు. తండ్రి చేతి పని వాడు. మిగిలిన కుటుంబం అంతా ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో గోధుమలు పండిస్తూ ఉంటారు. జమీల్యా చాలా సరదా అయిన యువతి. కష్ట పడి పని చేసే స్వభావం. అయితే, ఎవరిచేతా మాట పడదు. ఆమె ప్రవర్తన ఒక్కోసారి ఉమ్మడి కుటుంబ నియమావళికి విరుద్ధంగా ఉన్నా, ఆమె స్వభావాన్ని అర్ధం చేసుకున్న కుటుంబ సభ్యులంతా దానిని 'చిన్నతనం' గా సరిపెట్టుకుంటారు.

"జమీల్యా మంచి అందంగా ఉండేది. దార్యమైన శరీరం, వొయ్యారం ఒలికే తీరు, బిగుతుగా జంట జడలుగా దువ్వుకున్న తిన్నని బిరుసు జుట్టు. తెల్లని రుమాలును తమాషాగా నుదుటి మీదకి వొక్క రవ్వ ఐమూలగా వచ్చేటట్టు తలపైన చుట్టుకునేదేమో, అది ఆమెకి చక్కగా అమరి ఆమె చామన ఛాయ ముఖానికి వింత విన్నాణం చేకూర్చేది. జమీల్యా నవ్వేటప్పుడు ఆ కారునలుపు వాలు కళ్ళు యవ్వనోత్సుకతతో వెలిగిపోయేవి, ఇక తటాలున ఏ కొంటె గోంగూర పాటో పాడడం మొదలెట్టడంతో ఆ సొంపారు కళ్ళు కన్యాయోగ్యం కాని మెరపులతో తళ్కుమనేవి." ఆంటాడు రచయిత. సహజంగానే ఊళ్ళో ఉన్న కోడెకారు, యుద్ధం నుంచి వచ్చేసిన సైనికుల కళ్ళన్నీ జమీల్యామీదే. అయితే, ఎవర్ని ఎక్కడ ఉంచాలో బాగా తెలిసిన పడతి జమీల్యా.

కుటుంబ సంప్రదాయాలని గౌరవించే సాదిక్ ఏనాడూ భార్యకి ప్రత్యేకంగా ఉత్తరం రాయడు. తల్లిదండ్రులకి రాసిన ఉత్తరం చివర్లో ఆమె క్షేమం తలుస్తూ ఓ వాక్యం మాత్రం రాస్తూ ఉంటాడు. అతడు సైన్యం నుంచి తిరిగి వచ్చే రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఆ కుటుంబం. ఉమ్మడి వ్యవసాయ క్షేత్రంలో పండించిన గోధుమలని సైనికుల కోసం తరలించేందుకు పక్కనే ఉన్న టౌన్ లోని రైల్వే స్టేషన్ కి తీసుకెళ్ళాల్సిన బాధ్యత జమీల్యా కుటుంబానికి, కాలి గాయంతో సైన్యం నుంచి తిరిగి వచ్చేసిన దనియార్ అనే అనాధ యువకుడికీ అప్పగించ బడుతుంది. జమీల్యాకి సాయంగా చిట్టిని పంపుతుంది ఆమె కుటుంబం. దనియార్ ఏ ప్రత్యేకతా లేనివాడు. అంతర్ముఖుడు. మొదటి రోజు స్టేషన్ కి వెళ్ళిన జమీల్యాకి, అక్కడ తారస పాడిన ఓ సైనికుడి ద్వారా సాదిక్ త్వరలోనే ఊరికి తిరిగి రాబోతున్నట్టు తెలుస్తుంది.

అయితే, జమీల్యా-దనియార్ ల మధ్య మొదలైన ఓ స్పర్ధ అనుకోకుండా పెద్దదై వారిద్దరూ ఒకరినొకరు తెలుసుకోడానికి కారణం అవుతుంది. దీనంతటికీ సాక్ష్యం చిట్టి. తనకి తెలియకుండానే జమీల్యాని మూగగా ప్రేమించే చిట్టి కూడా ఒకానొక దశలో జమీల్యా-దనియార్ లు ఏకమైతే బాగుండునని కోరుకుంటాడు. ఎవరికీ ఎలాంటి ప్రత్యేకతా లేనివాడుగా కనిపించే దనియార్, జమీల్యాకి ఎంతో ప్రత్యేకమైన వాడవుతాడు. వెన్నెల రాత్రుల్లో, టౌన్ నుంచి ఖాళీ బళ్ళతో టౌన్ నుంచి తిరిగి వస్తున్నప్పుడు దనియార్ పాడే పాటలు ఆమెని యేవో వింతలోకాల్లో విహరింపజేస్తాయి. ఉమ్మడి కుటుంబం, తెగ సంప్రదాయాలు, త్వరలోనే తన భర్త తిరిగి రాబోతున్నాడన్న సంగతీ బాగా తెలిసిన జమీల్యా, ఓ వర్షపు రాత్రి దనియార్ పట్ల తన ప్రేమని ప్రకటిస్తుంది, చిట్టి సాక్షిగా. తర్వాత ఏం జరిగిందన్నది - తర్వాతి కాలంలో చిత్రకారుడిగా ఎదిగిన - చిట్టి నుంచి వినాల్సిందే.

ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురించింది. వుప్పల లక్ష్మణరావు (తెలుగు నవల 'అతడు-ఆమె' రచయిత) సాఫీగా అనువదించారు. పుస్తకంలో పెద్దగా అచ్చు తప్పులు లేనప్పటికీ, అనువాద రచయిత పేరు పుప్పల లక్ష్మణరావుగా ప్రచురింపబడడం విషాదం. చదువుతున్నప్పటి కన్నా, చదివి పక్కన పెట్టాక మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చి ఆలోచింపజేసే రచన ఇది. (వెల రూ. 40, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

16 కామెంట్‌లు:

  1. ఇప్పుడే చదివాను,చాల నచ్చింది నాకు,పరిచయం చేసినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  2. సోవియెట్ యూనియన్ బాగా బతికిన కాలంలో ఇలాంటి ఎన్నో నవలలు తెలుగులో చదివే అవకాశం దొరికింది. ప్చ్!

    రిప్లయితొలగించండి
  3. ఆసక్తి కరంగా ఉంది.తప్పక చదవాలి. పరిచయం చేసినందుకు ధన్యవాదములు.

    రిప్లయితొలగించండి
  4. ఈ పుస్తకం కినిగె నుండి కూడా కొనుక్కోవచ్చు. http://kinige.com/kbook.php?id=731

    రిప్లయితొలగించండి
  5. బాగుందండీ. మంచి పరిచయం. అనువాద రచనలంటే నాకు సహజంగా ఉండే భయం మీరు చేస్తున్న ఈ పుస్తక పరిచయాల వల్ల పోతోంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. చక్కని పరిచయం మురళీగారూ! కొత్తావకాయగారి లాగే నాకూ అనువాద రచనలంటే కొంచెం జంకు. కానీ అనువాదం బాగా చేసినట్టు అనిపిస్తోంది ఈ పుస్తకంలో. తప్పకుండా చదవాల్సిందే.

    రిప్లయితొలగించండి
  7. మంచి పరిచయం.

    బాబోయ్ కూడలి.. వామ్మో మాలిక - 2 చూడండి, http://jeedipappu.blogspot.in/2012/05/2.html
    అలాగే http://100telugublogs.blogspot.in/ కూడా

    రిప్లయితొలగించండి
  8. కొత్తావకాయ గార్కి అనువాదరచనలంటే సహజంగా భయమైతే నాకు అనువాద రచనలంటే సహజంగా ఇష్టం. కనుక తప్పకుండా చదువుతానిది.

    రిప్లయితొలగించండి
  9. అవును ఈ పుస్తకం హృదయపు తడిని తడిమే ఒక జ్ఞాపకం

    రిప్లయితొలగించండి
  10. @వినయ్ రెడ్డి: ధన్యవాదాలండీ..
    @కృష్ణ: అవునండీ.. మాంచి రంగు కాగితం మీద, అందమైన ప్రింట్.. తక్కువ వెలకే! ...ధన్యవాదాలు..
    @వనజ వనమాలి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  11. @ఒరెమున: ధన్యవాదాలండీ..
    @కొత్తావకాయ: భయం అని కాదు కానీ, అనువాదాలు అనగానే నేను కూడా ఆచితూచి చదువుతానండీ :-) ధన్యవాదాలు
    @చాణక్య: అనువాదం బాగుందండీ.. ఎక్కడా కృతకంగా అనిపించలేదు.. చదవండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. @జీడిపప్పు: చూస్తానండీ... ధన్యవాదాలు
    @పురాణపండ ఫణి: ధన్యవాదాలండీ..
    @పక్కింటబ్బాయి: తప్పక చదవండి.. మిమ్మల్ని నిరాశ పరచదని చెప్పగలను.. ధన్యవాదాలు

    రిప్లయితొలగించండి
  13. @శశికళ: యెంత బాగా చెప్పారండీ!! ధన్యవాదాలు
    @ఆలపాటి రమేష్ బాబు: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  14. మురళిగారు, చాలా బాగుంది. ఈ కథ గుర్తు చేసినందుకు ధన్య వాదాలు .

    రిప్లయితొలగించండి