గురువారం, మే 03, 2012

జాజి పూసే వేళ...

'కాలం వేళ్ళ సందుల్లోనుంచి ఇసుకలా జారిపోతోంది....' తెలియకుండా గడిచిపోయే తీరుని ఇంత చక్కగా అక్షరాల్లో బంధించిన అజ్ఞాత రచయితకి అభివందనాలు. నిజం కదూ.. ఎప్పుడో అలసినప్పుడో, మనసు పుట్టినప్పుడో ఓసారి వెనక్కి చూసుకుందాం అనుకుంటే కనుచూపు మేరంతా పాదముద్రలే.. ఎక్కడ మొదలు పెట్టి ఏ చోట ముగిస్తామో తెలియని ప్రయాణమే కదా జీవితం. ఇంతకీ ఇలా వెనక్కి చూసుకున్నప్పుడు గడిచిన జీవితం మొత్తం సినిమా రీలులాగా కనిపించదు కాక కనిపించదు.. కేవలం కొన్ని సందర్భాలు, సన్నివేశాలు మాత్రమే కాలపరిక్షను ఎదుర్కొని నిలబడతాయి.

జీవిత సారాన్ని 'కష్టం-సుఖం' అని రెండు ముక్కల్లో తేల్చి పారేశారు మన పెద్దవాళ్ళు. నిజమే, జరిగిపోయిన వాటికి జాబితా వేయడం మొదలుపెడితే ఈ రెండు వర్గాలనీ దాటవు. కష్టాలు బావుంటాయి. మరీ ముఖ్యంగా అవి తీరిపోయాక మాబాగుంటాయి. ఇక సుఖం.. దీనికి అంతు ఏమన్నా ఉందా? ఇక చాలు అనిపిస్తుందా? 'సుఖం అనే ఎండమావిని చేరుకోవడం కోసం కష్టాల ఎడారిలో చేసే ప్రయాణమే జీవితం' అంటుంటారు కొందరు.. ఒప్పుకోవాలని అనిపించదు.. కష్టాన్ని గుర్తించినంత, గుర్తు పెట్టుకున్నంతగా సుఖాన్ని గుర్తు పెట్టుకోము కదా మరి..

ఎర్రటి ఎండలో బయట తిరిగొచ్చాక, నీడ పట్టున కూర్చుని చల్లటి నీళ్ళు తాగడంలో ఎంత సుఖం ఉందసలు? ఎండని గుర్తు పెట్టుకున్నంతగా నీళ్ళు తాగి, విశ్రమించడాన్ని గుర్తు చేసుకోం. ఎండా, మనదే, నీళ్ళూ మనవే అయినప్పుడు ఎండని మాత్రమే గుర్తుంచుకుని, నీళ్ళని మర్చిపోవడంలో తప్పు ఎవరిది మరి. నీడా, నీళ్ళూ అంత గొప్పగా ఉంటాయని మనకి చెప్పిన ఎండని మెచ్చుకోవాలి న్యాయంగా. కష్టం వల్లే కదా, సుఖం విలువ బాగా తెలుస్తుంది. 

'నా మొహాన సుఖపడే రాత లేదు' లాంటి మాటలు విన్నప్పుడు ఎంత ఆశ్చర్యం కలుగుతుందో. ఆశించింది దొరకడం మాత్రమే సుఖం అనే ధోరణి వల్ల, కేవలం కష్టాలని మాత్రమే గుర్తించి గుర్తుపెట్టుకుంటున్నారేమో అనుకుంటూ ఉంటాను. పోనీ, సుఖపడడం కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? ఏదీ తనంతట తాను రాని లోకంలో ఉన్నాం మనం. కష్టమైనా, సుఖమైనా తగినంత కారణం లేనిదే వచ్చి వాలిపోదు.మనం ఆలోచించనిదో, ఆలోచించడానికి ఇష్టపడనిదో ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది.

మన కష్టసుఖాలకి - మరీ ముఖ్యంగా కష్టాలకి - మరొకర్ని బాధ్యులని చేసేయడం మనకి వెన్నతో పెట్టిన విద్య. ఎవరి కర్మకి వారే కర్తలవుతారనే విషయాన్ని చాలా సులువుగా మర్చిపోగలం. అప్పుడైతేనే చేతులు దులిపేసుకోవచ్చు. మరీ ముఖ్యంగా, మనల్ని మరొకరితో పోల్చుకుని వాళ్ళు సుఖ పడిపోతున్నారనీ మనం మాత్రం కష్టాల్లో మునిగి తేలుతున్నామనీ బలంగా నమ్ముతున్నప్పుడు, అవతలి వారికి అన్నీ అయాచితంగా వచ్చి పడ్డాయనీ, మనం ఎంత ప్రయత్నం చేసినా 'ఏదో అడ్డుపడి' దొరకాల్సింది దొరకలేదనీ అనేసుకోగలం.

జాజులు పూసే సాయంత్రం వేళ, పడక్కుర్చీలో విశ్రాంతిగా జేరబడి, కళ్ళు మూసుకుని పాటలు వినడం చాలా బాగుంటుంది. ఎప్పుడంటే, రోజంతా శ్రమ చేసినప్పుడు.. మనం నిర్వర్తించాల్సిన పనులు పూర్తి చేసినప్పుడు. ఏమీ చెయ్యకుండా, కనిపించిన వాళ్ళనీ, కనిపించని వారినీ తిట్టుకుంటూ రోజంతా గడిపేసినప్పుడు జాజి తీగె మీదనుంచే వచ్చే చల్లగాలి ఏమాత్రమూ ప్రత్యేకంగా అనిపించదు. అలాగే, అనుక్షణం దూరం జరిగే గమ్యమే లక్ష్యంగా సాగే పరుగుపందెంలో తలమునకలై ఉన్నప్పుడు జాజుల వాసన నాసికను తాకనే తాకదు..కదూ..

20 వ్యాఖ్యలు:

రాజి చెప్పారు...

"ఏదీ తనంతట తాను రాని లోకంలో ఉన్నాం మనం. కష్టమైనా, సుఖమైనా తగినంత కారణం లేనిదే వచ్చి వాలిపోదు."

ఉదయాన్నే మంచి మాటలు చెప్పారండీ...

.శ్రీ. చెప్పారు...


కష్టం వస్తేనే కదా గుండె బలం తెలిసేది
దుఖానికి తలవంచితే తెలివికింక విలువేది


'కస్టమ్స్ - సుకమ్స్' గురించి బాగా చెప్పారు :)

ఎక్కడో చదివిన quote:

Happiness is a state of mind. More correctly put, it is the state beyond the mind.


జంటపదాలు అయిన "కష్టసుఖాలు" కష్టాల తరువాత సుఖాలు ఉన్నాయని సూచిస్తే,

"సుఖదుఃఖాలు" సుఖాల తరువాత దుఃఖం ఉందని చెప్తుంది.

Tejaswi చెప్పారు...

"ఆశించింది దొరకడం మాత్రమే సుఖం అనే ధోరణివల్ల, కష్టాలని మాత్రమే గుర్తించి గుర్తుపెట్టుకుంటున్నారేమో అనుకుంటూ ఉంటాను".

నా దృష్టిలో ఇదే జీవిత సారం. ఇంత మంచి మాటలు రాసినందుకు వేవేల అభినందనలు, మాకందరికీ ఎరుకబరచినందుకు ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

"జాజులు పూసే సాయంత్రం వేళ, పడక్కుర్చీలో విశ్రాంతిగా జేరబడి, కళ్ళు మూసుకుని పాటలు వినడం చాలా బాగుంటుంది. ఎప్పుడంటే, రోజంతా శ్రమ చేసినప్పుడు.. మనం నిర్వర్తించాల్సిన పనులు పూర్తి చేసినప్పుడు." -- absolutely correct

Anaamika చెప్పారు...

"మరీ ముఖ్యంగా, మనల్ని మరొకరితో పోల్చుకుని వాళ్ళు సుఖ పడిపోతున్నారనీ మనం మాత్రం కష్టాల్లో మునిగి తేలుతున్నామనీ బలంగా నమ్ముతున్నప్పుడు, అవతలి వారికి అన్నీ అయాచితంగా వచ్చి పడ్డాయనీ, మనం ఎంత ప్రయత్నం చేసినా 'ఏదో అడ్డుపడి' దొరకాల్సింది దొరకలేదనీ అనేసుకోగలం."... చాలా బాగా చెప్పారు మురళి గారు.

చెప్పాలంటే...... చెప్పారు...

chaalaa baavundi mi tapaa..!!

కొత్తావకాయ చెప్పారు...

హ్మ్మ్... బాగా నచ్చేసిన వాక్యమైతే ఇది.

"అనుక్షణం దూరం జరిగే గమ్యమే లక్ష్యంగా సాగే పరుగుపందెంలో తలమునకలై ఉన్నప్పుడు జాజుల వాసన నాసికను తాకనే తాకదు..కదూ.."

ఉమాశంకర్ చెప్పారు...

One of the best again Murali gaaru.

I read it 5-6 times and i am sure i will come back and read it again and again.

Ammu చెప్పారు...

enta baga chepparandi! vennello jaji pandiri kinda nilabaddattundi manasu ki

పరిమళం చెప్పారు...

:) :)

??!!

KumarN చెప్పారు...

ఎప్పుడంటే, రోజంతా శ్రమ చేసినప్పుడు.. మనం నిర్వర్తించాల్సిన పనులు పూర్తి చేసినప్పుడు

That's the key.


"అనుక్షణం దూరం జరిగే గమ్యమే లక్ష్యంగా సాగే పరుగుపందెంలో తలమునకలై ఉన్నప్పుడు జాజుల వాసన నాసికను తాకనే తాకదు..కదూ.

అందుకే మధ్యమధ్యలో stop n smell the roses అంటారు

మురళి చెప్పారు...

@రాజి: ధన్యవాదాలండీ..
@శ్రీ: కష్టసుఖాలు-సుఖదుఃఖాలు మంచి పరిశీలనండీ.. ధన్యవాదాలు..
@తేజస్వి: ఇవి అందరికీ తెలిసినవేనండీ.. యేవో ఆలోచనలు.. అలా..అలా.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@పురాణపండ ఫణి: ధన్యవాదాలండీ..
@అనామిక: ధన్యవాదాలండీ..
@చెప్పాలంటే: ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@కొత్తావకాయ: అయినా... పరుగు తప్పదు కదండీ.. ధన్యవాదాలు.
@ఉమాశంకర్: నిజంగా!! ...ధన్యవాదాలండీ..
@అమ్ము: అబ్బ..యెంత చక్కని పోలిక!! ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@పరిమళం: నవ్వు, ప్రశ్నలు, ఆశ్చర్యాలు అని అర్ధం చేసుకున్నానండీ :-) ..ధన్యవాదాలు.
@కుమార్ యెన్: కానీ, స్మెల్ చేయడం మర్చిపోతున్నామేమో అనిపిస్తోందండీ ఒక్కోసారి.. ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

జాజులు పూసే సాయంత్రం వేళ, పడక్కుర్చీలో విశ్రాంతిగా జేరబడి, కళ్ళు మూసుకుని పాటలు వినడం చాలా బాగుంటుంది. ఎప్పుడంటే, రోజంతా శ్రమ చేసినప్పుడు.. మనం నిర్వర్తించాల్సిన పనులు పూర్తి చేసినప్పుడు.
true
ఓ రెండ్రోజులు బద్ధకంగా కూచుని.. మూడోరోజు విజృంభించి పనులు చేసేసినాకా.. సాయంకాలం ఓ కప్పు కాఫీ తాగుతూ అనుకునేదిదే.
కష్టపడేవాడిదే సుఖమంటే..

ప్రణీత స్వాతి చెప్పారు...

bavundi.

Karuna చెప్పారు...

నాకెందుకో ఈ సారి మీరు ఎప్పుడు లేని విధంగా వేదాంతం మాట్లాడారేమో అనిపించింది. కానీ నాకు టపా లోని ప్రతి వాక్యం నచ్చింది. నిజంగా అన్ని నిజాలే చెప్పారు. కాకపోతే ఇలాంటి టపా కి ప్రత్యేకమైన కారణం ఏదో వుండి ఉంటుందేమో అనిపించింది. సాదారణంగా మనకు కష్టాలు వచినప్పుడు ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా వస్తాయి.

I hope you didn't get any :-)

మురళి చెప్పారు...

@పక్కింటబ్బాయి: నిజం కదండీ! ధన్యవాదాలు..
@ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..
@కరుణ: మనసుకి కష్టం అయితే ఏమీ లేదండీ.. ఒకరి గురించి మొదలైన ఆలోచన, ఈ టపా రూపు తీసుకుంది.. ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

ee rojullo viluvala gurinchi matladite vallani outdated group ga bhavistunnaru. ee parugullo jeevitamanta jaaripotondi.. ilanti marinni post la kosam eduru chustu..

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి