సోమవారం, ఏప్రిల్ 09, 2012

చెహోవ్ ఎగరేసిన 'సీతాకోకచిలుక'

ఏ రచననైనా 'గొప్ప రచన' గా నిలబెట్టేది సమకాలీనత. తర్వాతి తరాలు కూడా చదివి "అచ్చం మనచుట్టూ జరుగుతున్న వాటిని గురించి రాసినట్టే ఉంది" అనుకోవడం ఒక్కటీ చాలు, ఓ రచనని గొప్ప రచన అనడానికి. రష్యన్ కథకుడు చెహోవ్ కథల్నిసాహితీవేత్తలనేకులు 'గొప్ప కథలు'గా అభివర్ణించడానికి కారణం బహుశా ఆ కథల్లో కనిపించే సమకాలీనతే కావొచ్చు. చిన్న కథనైనా, పెద్ద కథనైనా ఆసాంతమూ ఆసక్తిగా మలచడం చెహోవ్ ప్రత్యేకత. ఓ. హెన్రీ కథలు చదువుతున్నంతసేపూ ఆలోచన అతడిచ్చే 'మెరుపు ముగింపు' మీదే ఉంటుంది. అదే చెహోవ్ దగ్గరికి వచ్చేసరికి, ముగింపు కన్నా కథనం ఆసక్తికరంగా అనిపిస్తుంది. (హెన్రీనీ, చెహోవ్ నీ పోల్చే సాహసం చేయబోవడం లేదు నేను).

చెహోవ్ రాసిన 'The Butterfly'/The Grasshopper' కథ 'సీతాకోకచిలుక' పేరుతో తెలుగులోకి అనువాదమయింది. ఇది ప్రేమించి పెళ్ళిచేసుకున్న వోల్గా ఇవనోవ్నా, ఓసిప్ దిమోవ్ ల కథ. ఓల్గా అందమైన అమ్మాయి. లలితకళలంటే ఎంతో ఇష్టం. స్వతహాగా చిత్రకారిణి. గొంతు బాగుంటుంది అంటారామె మిత్రులు. మిత్ర బృందమంతా రచన, సంగీతం, చిత్రలేఖనం, నాటక రంగాల్లో పేరున్న వాళ్ళే. దిమోవ్ వృత్తి పట్ల ఎంతో అంకిత భావం ఉన్న ఓ వైద్యుడు. వోల్గా తండ్రి కూడా వైద్యుడే. ఆయన చివరి ఘడియల్లో దిమోవ్ చేసిన సేవలు అతడి పట్ల ఆమెకి మంచి అభిప్రాయాన్ని కలిగిస్తాయి. దిమోవ్ కి తన వృత్తి తప్ప ఇతర విషయాలు పట్టవు. సాహిత్యాన్నీ, కళల్నీ అతడు బొత్తిగా ఆస్వాదించలేడు. అతన్ని పెళ్ళి చేసుకోడానికి అభిరుచుల్లో తేడా అడ్డుగా అనిపించదు వోల్గాకి.

ఎంతో సౌహార్ద్రమైన వైవాహిక జీవితాన్ని ఆరంభిస్తారు వోల్గా, దిమోవ్ లు. వారికి ఒకరినొకరు గౌరవించుకోవడం తెలుసు. అలాగే ఒకరి మిత్రులని మరొకరు ఆదరిస్తారు. దిమోవ్ వృత్తీ, వోల్గా ప్రవృత్తీ నిరాటంకంగా కొనసాగుతూ ఉంటాయి. అతడు ఆస్పత్రికి వెళ్ళగానే ఆమె తన మిత్ర బృందాన్ని చుట్టి వస్తుంది. వారిలో ఎక్కువమంది పురుషులే. వారానికోసారి వారికి తన ఇంట్లో విందు ఏర్పాటు చేస్తుంది. వారి చర్చల్లో తను పాల్గోలేకపోయినా, విందుల్లో పాల్గొంటూ ఉంటాడు దిమోవ్. భర్త తన మిత్ర బృందంలో చేరకపోవడం రాన్రానూ ఓ వెలితిగా అనిపిస్తూ ఉంటుంది వోల్గాకి. ఇదే విషయం ఓసారి అతన్ని అడిగేస్తుంది కూడా. వైద్యం తప్ప ఇతరాలు తన మనసుకి దగ్గరకి రావనీ, అలాగని వేటినీ తను చిన్నచూపు చూడననీ కచ్చితంగా చెప్పేస్తాడు దిమోవ్. పైకి కనిపించని అసంతృప్తి పెరుగుతూ ఉంటుంది వోల్గాలో.

కొందరు చిత్రకారులతో కలిసి వోల్గా నదీ తీరానికి బయలుదేరుతుంది వోల్గా. అనుకోని పరిస్థితుల్లో, చిత్రకారుడైన తన మిత్రుడు ర్యాబోవ్ స్కీ కి దగ్గరవుతుంది. పర్యటన నుంచి తిరిగి వచ్చాక కూడా ర్యాబోవ్ తో తన సంబంధాన్ని కొనసాగిస్తుంది వోల్గా. అయితే, ఈ విషయాన్ని తన భర్త నుంచి దాస్తుంది. జరుతున్నదేమిటో సులభంగానే అర్ధమవుతుంది దిమోవ్ కి. సున్నిత మనస్కుడైన దిమోవ్ ఆమెని ఒక్క మాటా అడగడు సరికదా, ర్యాబోవ్ తో ఆమె అనుబంధం తనకి తెలియనట్టే ప్రవర్తిస్తాడు. వోల్గా స్నేహాలు, వారాంతపు విందులూ ఎప్పటిలాగే జరుగుతున్నాయి. వోల్గా-ర్యాబోవ్ ల అనుబంధం అందరికీ తెలిసిపోతుంది.కానైతే, ర్యాబోవ్ నిజాయితీగా లేకపోవడం కలచివేస్తుంది వోల్గాని. తను అటు దిమోవ్ కీ, ఇటు ర్యాబోవ్ కీ దూరం అవుతున్నానని అర్ధమవుతుంది ఆమెకి. 

వోల్గా మనఃస్థితిని గమనించిన దిమోవ్ ఆమెకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. తన వృత్తిలో సాధించిన అపురూపమైన విజయాన్ని ఆమెతో పంచుకుంటాడు. అయితే, వైద్య వృత్తిని గురించి ఏమాత్రమూ తెలియని, ఆసక్తి చూపని వోల్గా కనీస స్పందన కనబరచదు. మానసికంగా దెబ్బతిన్న దిమోవ్, ఉన్నట్టుండి మంచాన పడతాడు. స్వతహాగా వైద్యుడు కావడంతో వోల్గాని పిలిచి తనకి డిఫ్తీరియా సోకిందనీ, తన దగ్గరికీ రావొద్దనీ చెప్పడంతో పాటు తన వైద్య మిత్రులకి కబురు చేయమని కోరతాడు. దిమోవ్ కి ప్రమాదకరమైన జబ్బు చేసిందన్న విషయం తెలిశాక, వోల్గాలో పశ్చాత్తాపం మొదలవుతుంది. జరిగిందంతా అతనితో చెప్పేసి, క్షమాపణ కోరి, కొత్త జీవితం మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటుంది. భర్త జబ్బుతో మంచాన పడ్డా, తన మిత్రులెవరూ కనీసం పలకరించడానికి రాకపోవడం ఆలోచనలో పడేస్తుంది వోల్గాని.

దిమోవ్ కి డిఫ్తీరియా సోకడం యాదృచ్చికం కాదనీ, అతడు కావాలనే ఆ వ్యాధి బారిన పడ్డాడనీ అతని మిత్రుల ద్వారా తెలుసుకున్న వోల్గా కుంగిపోతుంది. దిమోవ్ మంచితనం, అతడు సమకూర్చిన సౌకర్యాలూ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తాయామెకి. జరిగినదానికి ఆమె చింతిస్తూ ఉండగానే, దిమోవ్ చనిపోయాడని చెబుతారు అతని మిత్రులు. దిమోవ్ అంతిమ సంస్కారం కోసం అతడి మిత్రులు చర్చిని సంప్రదించడం ఈ కథకి ముగింపు. ముందుగా చెప్పినట్టు కథతో పాటుగా కథనమూ వెంటాడుతుంది. ఎక్కడా హడావిడి పడకుండా తాపీగా కథ చెబుతాడు చెహోవ్. తను సృష్టించిన పాత్రల ప్రవర్తనపై ఎలాంటి తీర్పులూ చెప్పని ఈ రచయిత, కథను మాత్రం చెప్పి, తీర్పుని పాఠకులకి వదిలేస్తాడు. కథని పూర్తిగా చదివి పక్కన పెట్టినా వోల్గా, దిమోవ్ లు ఓపట్టాన మన స్మృతి నుంచి చెరగరు. (ఎప్పుడో చదివిన ఈ కథని గుర్తుచేసి, మళ్ళీ చదివించిన బ్లాగ్మిత్రులు శైలజాచందు గారికి కృతజ్ఞతలు. ఇంగ్లిష్ వెర్షన్ ని ఇక్కడ చదవొచ్చు).

7 కామెంట్‌లు:

  1. చాలా తక్కువ సమయంలో మీరు వ్రాసిన కథా పరిచయం అద్భుతంగా ఉంది మురళిగారు. చెకొవ్ ప్రతి పాత్రనూ perfect గా చిత్రీకరించడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. Wow, Interesting!
    మీరు రాసిన విధానం కూడా ఎక్కడా బిగి సడలకుండా నడచింది. Will read the story.
    Thanks

    రిప్లయితొలగించండి
  3. "తను సృష్టించిన పాత్రల ప్రవర్తనపై ఎలాంటి తీర్పులూ చెప్పని ఈ రచయిత, కథను మాత్రం చెప్పి, తీర్పుని పాఠకులకి వదిలేస్తాడు."

    కథ చదవకపోయినా ఈ టపా చదువుతూ ఉంటే అదే అనిపించింది .

    పాత్రలని జడ్జ్ చెయ్యకుండా . రూపకల్పన చేసిన కథలు నాకు ఇష్టం ..

    మంచి కథను పంచుకున్నందుకు థాంక్సులు .

    వాసు

    రిప్లయితొలగించండి
  4. gata 3 samvatsaraluga mee blog chaduvutunnanu. manasu balenapudu me blog naa first choice. beetalu vaarina nela meeda vaana jallu la untayandi mee rachanalu..

    రిప్లయితొలగించండి
  5. 'The painted veil' సినిమా కధ కూడా కొంత ఈ కధని పోలివున్నట్టు అనిపించింది. ఈ సినిమా కూడా బావుంటుంది.

    రిప్లయితొలగించండి
  6. @చందు ఎస్: నిజమండీ.. పాత్ర చిత్రణ అలా గుర్తుంది పోతుంది.. ఎన్నాళ్ళయినా.. ...ధన్యవాదాలు.
    @కుమార్ యెన్: తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @వాసు: చెహోవ్ కథలు చాలా బాగుంటాయండీ.. తప్పక చదవండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. @అమ్ము: పెద్ద ప్రశంస!! ధన్యవాదాలండీ..
    @మురారి: అవునండీ.. మిత్రులొకరు ఇదే మాట అన్నారు.. చూడాలి, వీలైనప్పుడు.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి