శుక్రవారం, ఫిబ్రవరి 24, 2012

పంచమ స్వరం

"నా దృష్టిలో బ్లాగన్నది మన జీవితంలో ఓ భాగం కాదు. మన అభిప్రాయాలు, మనసులోని భావాలు పంచుకోవటానికి ఓ వేదిక అంతే! కుదిరిన రోజు వ్రాస్తాం..లేని రోజు లేదు! నచ్చిన వాటిని మెచ్చుకుంటాం..నచ్చని వాటిని వదిలేస్తాం!" ...అభిప్రాయం బాగుంది కదూ.. ఇది నాది కాదు. నాకు నచ్చే బ్లాగు రాసే ఒకానొక బ్లాగరిది. ఆ బ్లాగు నిన్ననో, మొన్ననో మొదలయ్యింది కాదు.. ఐదేళ్ళ క్రితం వెలుగు చూసింది.. తొలి తరం తెలుగు బ్లాగుల్లో ఒకటి. బ్లాగు పేరు సరిగమలు, బ్లాగరి పేరు సిరిసిరిమువ్వ (నాకు మాత్రం మువ్వగారు!) ." రెండూ ఒకదానితోఒకటి పోటీ పడుతున్నాయి కదూ.

ఐదేళ్ళలో నూటముప్ఫై (మాత్రమే) టపాలు వ్రాసి, రాశి కన్నా వాసి ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పిన మువ్వగారికి ముందుగా శుభాభినందనలు. సీనియర్ అని అందరూ అనుకోడమే కానీ, "నేను సీనియర్ని" అన్న భావం ఆవిడ టపాల్లో కానీ, వ్యాఖ్యల్లో కానీ ఎక్కడా కనిపించదు. కొత్తగా బ్లాగుల్లోకొచ్చి బిక్కుబిక్కుమంటూ దిక్కులు చూసే రోజుల్లో, టపాలకి వచ్చిన వ్యాఖ్యలు ఏదో ఊతం దొరికినట్టుగా అనిపిస్తాయి, నిజం. రాయడం కన్నా, బ్లాగులు చదవడానికి ఎక్కువ ఇష్టపడే మువ్వ గారు, ఎంతో ఆచితూచి, నొప్పించక తానొవ్వక వ్యాఖ్యానిస్తారు..అవి కూడా సదరు బ్లాగరికి మరిన్ని టపాలు రాయాలనే ఉత్సాహాన్ని కలిగించేవిగా ఉంటాయి.

తెలుగంటే మువ్వగారికి ఎంత ఇష్టమంటే,
"తెలుగులో వ్రాస్తున్నానన్న తృప్తికోసమే నేను బ్లాగు వ్రాస్తున్నానేమో!" అనేటంత. అంతర్జాలంలో తెలుగు వ్యాప్తికి ఆవిడ చేస్తున్న పరోక్ష కృషి చాలామందికి తెలిసిందే. అంతెందుకూ, క్రమం తప్పకుండా 'పొద్దు' పొడవడం వెనుక, మువ్వగారి నిశ్శబ్ద కృషీ ఉందన్నది ఓ వినికిడి. సాహిత్యం మీద ఇష్టం, వర్తమాన అంశాలమీద స్పందించే తీరు, పల్లెటూరి బాల్యాన్ని గురించిన జ్ఞాపకాలు, మానవ సంబంధాల్లో వస్తున్న మార్పులపై సునిశిత పరిశీలన...ఇవన్నీ మువ్వగారి బ్లాగులో నాకు బాగా నచ్చే విషయాలు.


మెజారిటీ బ్లాగులు స్ప్రుశించేవి పరిమిత అంశాలనే. కానైతే మువ్వగారు మొత్తం నూట పదకొండు వైవిద్యభరితమైన వర్గాల్లో రచనలు చేశారు! దాదాపుగా ఒక టపాలో ఎంచుకున్న అంశానికీ, మరో టపాలోని విషయానికీ పోలిక ఏమాత్రమూ లేదన్నమాటే. అచ్చుతప్పులు లేని చక్కని భాష (నాలాంటి వాళ్ళు ముఖ్యంగా నేర్చుకోవాల్సిన విషయం), సూటిగా, స్పష్టంగా, కొండొకచో గంభీరంగా ఉండే విషయ ప్రకటన, అటుపై వ్యాఖ్యలకి ఆత్మీయంగా ఇచ్చే జవాబులు. "మువ్వగారిలాగా వ్యాఖ్యలకి జవాబులు రాయాలి" అని చాలాసార్లే అనుకున్నా, బ్లాగు ప్రయాణం మొదలు పెట్టిన తొలి రోజుల్లో.

నా బ్లాగులో వారు రాసిన మొదటి వ్యాఖ్యకి నా జవాబు అప్పుడప్పుడూ గుర్తు చేసుకుని నవ్వుకుంటూ ఉంటాను. 'ఝుమ్మంది నాదం' పాటని తల్చుకున్నానా రోజు. అలాగే, 'గుండె గొంతుకలోన కొట్టాడడం' అంటే ఏమిటో తెలుసా మీకు? ఓ బ్లాగరుగా నేనా అనుభూతిని పతాక స్థాయిలో పొందింది మువ్వగారి
'బ్లాగు పుస్తకంలో నెమలీక'ని చూసిన క్షణంలో. ప్రకృతి జన్యమైన భారతీయ సంగీతంలో పంచమ స్వరానికి ఆధారం కోయిల గానం. వసంతానికి కొంచం ముందుగా బ్లాగులోకంలో 'సరిగమల' ప్రస్థానాన్ని ఆరంభించిన మువ్వగారు ఈ ప్రయాణాన్ని ఎన్నెన్నో వసంతాలపాటు నిరంతరాయంగా కొనసాగించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. మేరు పర్వతాన్ని అద్దంలో చూపించడం అసాధ్యమే అయినా, మానవ ప్రయత్నంగా మొదలుపెట్టి, ఈనాలుగు మాటల్నీ మీతో పంచుకుంటున్నా..

11 వ్యాఖ్యలు:

వేణూ శ్రీకాంత్ చెప్పారు...

సిరిసిరిమువ్వ గారికి మరొక్కసారి అభినందనలు :) చాలాబాగా రాశారు మురళి గారు.

మధురవాణి చెప్పారు...

సిరిసిరిమువ్వ గారి సరిగమలని నెమలీక స్వరంలో వినిపించారన్నమాట మా కోసం.. :)
బాగా చెప్పారండీ మన మువ్వ గారి గురించి. ఆత్మీయంగా వ్యాఖ్యానించడం, స్పందించడం అంటే నాకు గుర్తొచ్చే అతి కొద్దిమంది బ్లాగర్లలో మువ్వ గారు ముందుంటారు. మీ బ్లాగ్ముఖంగా మువ్వ గారికి మరోసారి శుభాకాంక్షలు. :)

Sujata చెప్పారు...

Well Said !

100% నిజం. ఆవిడ వ్యాఖ్య రాసారంటే మన టపాలో కాస్తో కూస్తో విషయం వున్నట్టు లెక్క! ఎన్ని విషయాలు తెలుసో ఈ 'ఎన్సైక్లోప్లీడియా' గారి కి ! అనుకున్నాం చాలాసార్లు.

సిరిసిరిమువ్వ చెప్పారు...

మురళి గారూ అంతా మీ అభిమానం అంతే! నేను వ్రాసేవన్నీ ఊసుపోక వ్రాతలేనండి!

క్రమం తప్పకుండా 'పొద్దు' పొడవడం వెనుక, మువ్వగారి నిశ్శబ్ద కృషీ ఉందన్నది ఓ వినికిడి!...అయ్యో ఇది మాత్రం పూర్తిగా అవాస్తవమండి. క్రమం తప్పకుండా పొద్దు పొడవటంలో నా పాత్రం ఇసుమంత కూడా లేదండి..పొద్దు లో నేను చిటికెన వేలు కాదు కదా గోరు కూడా పెట్టను!

మీ ఆత్మీయ టపాకి ..మీ అభిమానానికి ధన్యవాదాలు!

Sravya Vattikuti చెప్పారు...

మురళి గారు భలే రాసారు మువ్వ గారి బ్లాగు గురించి !
సిరిసిరిమువ్వ గారికి అభినందనలు ! మువ్వ గారు మీరు భలే మోడెస్టీ అండి, మీరు పొద్దు లో వేలు గోరు పెడతారని కాదు పెట్టె వాళ్లకి అడ్డుపడరని అది మరి మీ కృషే కదా :P

చాణక్య చెప్పారు...

"సీనియర్ అని అందరూ అనుకోడమే కానీ, "నేను సీనియర్ని" అన్న భావం ఆవిడ టపాల్లో కానీ, వ్యాఖ్యల్లో కానీ ఎక్కడా కనిపించదు."

ఇది అక్షరసత్యం. ఇది ఆవిడని ప్రత్యక్షంగా చూసిన తర్వాత నాకు అనిపించింది. నిజం చెప్పాలంటే ఇంత సీనియర్ బ్లాగర్ అయ్యుండి అంత సౌమ్యంగా ఉన్నారు, ఈవిడ సిరిసిరిమువ్వగారేంటి అని అనుమానం కూడా వచ్చింది. :)

చాలా చాలా బాగా రాశారు మురళీగారు. :)

Zilebi చెప్పారు...

నెమలి కన్ను మురళి గారు,

సరి, సరి సిరి సిరి మువ్వ గారి గురించి చాలా బాగా చెప్పరండీ !

సరి, ఇంతకీ సిరి సిరి మువ్వ గారు ఎవరండీ ? వరూధిని గారేనా ?

చీర్స్
జిలేబి.

మురళి చెప్పారు...

@వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
@మధురవాణి: "సరిగమలని నెమలీక స్వరంలో వినిపించారన్నమాట " ..హ..హ.. ధన్యవాదాలండీ..
@Sujata: "ఆవిడ వ్యాఖ్య రాసారంటే మన టపాలో కాస్తో కూస్తో విషయం వున్నట్టు లెక్క!" ..true ..ధన్యవాదాలండీ..

మురళి చెప్పారు...

@సిరిసిరిమువ్వ: మువ్వగారూ.. నే చెప్పాలనుకున్న సంగతి శ్రావ్య గారు చెప్పేశారు.. ధన్యవాదాలండీ..
@శ్రావ్య వట్టికూటి: 'మోడెస్టీ' ..నే చెప్పాలనుకున్నదీ ఇదే నండీ.. ధన్యవాదాలు.

మురళి చెప్పారు...

@చాణక్య: ధన్యవాదాలండీ..
@జిలేబి: హ..హ.. ధన్యవాదాలండీ..

Narayanaswamy S. చెప్పారు...

సంతోషం

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి