బుధవారం, సెప్టెంబర్ 21, 2011

ఒక్క రూపాయ్...

పావలా పరమపదించింది. అర్ధ రూపాయి పరిస్థితి కూడా ఇవాళో, రేపో అన్నట్టుగా ఉంది. మన జేబుల్లో చెప్పుకోదగ్గ నాణెం అంటే ఒక రూపాయి. రూపాయికి ఏమొస్తుంది? "ఓ కేజీ బియ్యం వస్తాయి" అంటున్నారు ముఖ్యమంత్రి ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి. అందరికీ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన వారికి నవంబరు నుంచీ, ప్రస్తుతం కేజీ రెండు రూపాయలకి విక్రయిస్తున్న బియ్యాన్ని కేవలం ఒక్క రూపాయికే ఇవ్వబోతున్నామన్నది ముఖ్యమంత్రి ప్రకటన.

ఒక్కో తెల్ల కార్డు కుటుంబానికి నెల ఒక్కింటికీ గరిష్టంగా ఇరవై కేజీల చొప్పున పంపిణీ చేసే సబ్సిడీ బియ్యం ధరని సగానికి సగం తగ్గించడం వల్ల ఎవరికి ప్రయోజనం? దారిద్ర్య రేఖకి దిగువన ఉన్న ఒక్కో కుటుంబానికీ తగ్గే నెలవారీ ఖర్చు కేవలం ఇరవై రూపాయలు మాత్రమే! అదే సమయంలో అసలే ఆర్ధిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వం మీద పడే అదనపు భారం, బియ్యం లెవీ ధరని అనుసరించి నెలనెలా పెరుగుతూనే ఉంటుంది. పన్నులు కట్టే జనాభా మీద ఏదో రూపంలో ఈ భారం పడుతుందన్నది నిస్సందేహం.

ముప్ఫయ్యేళ్ళ క్రితం కిలో రెండు రూపాయల బియ్యం పధకాన్ని రాష్ట్రంలో ప్రకటించినప్పుడూ, ప్రవేశ పెట్టినప్పుడూ అదో సంచనలం. లక్షలాది కుటుంబాలని నిజంగానే మేలు చేసిన ఈపథకం, అప్పట్లోనే రాష్ట్ర ఖజానాకి ఎంతో కీడుని కూడా చేసి, వారుణి వాహిని ఏరులై పారడానికి ప్రత్యక్ష కారణం అయ్యింది. ఎన్టీఆర్ అనంతరం తెలుగు దేశం పార్టీ ప్రభుత్వం అమలు చేయడం మానేసిన ఈ పథకాన్ని, ప్రజలకి అనేక మేళ్ళు చేయడంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరించింది.

ఓపక్క నిత్యావసర వస్తువుల ధరలన్నీ రోజురోజుకీ పైపైకే వెళ్తుంటే సబ్సిడీ బియ్యం ధర మాత్రం అంతకంతకూ కిందకి దిగడం వెనుక మతలబు ఏమిటి? అభివృద్ధి కార్యక్రమాలు అమలు సక్రమంగా జరిగితే, పేదరికం తగ్గి ఇలాంటి పధకాల అవసరమే ఉండకూడదు కదా. మరి పథకాలు "విజయవంతంగా" అమలవుతూ ఉండగానే, ఇలా బియ్యం ధర తగ్గించడం ఎందుకు? పోనీ ఈ తగ్గింపు వల్ల పేదల జీవితాల్లో గణనీయమైన వెలుగు వచ్చేస్తుందా? కుటుంబానికి నెలకి ఇరవై రూపాయల చొప్పున మాత్రమే కలిగే ప్రయోజనం వెనుక నిజమైన ప్రయోజనం ఎవరికి?

అసలు ఈ రెండు రూపాయల బియ్యం పధకం అమలు మీద ఓ సర్వే చేయిస్తే, ఆసక్తికరమైన విషయాలెన్నో బయటికి వస్తాయి. ఉపాధి హామీ లాంటి పధకాల కారణంగా కూలీ రేట్లు గణనీయంగా పెరగడంతో, చాలామంది తెల్లకార్డులున్న వాళ్ళు సైతం 'మంచి బియ్యం' కొనడానికే మొగ్గు చూపుతున్నారు. మంచిదే! వాళ్ళకోసం కేటాయిస్తున్న సబ్సిడీ బియ్యం చాలావరకూ నల్ల బజారుకీ, అక్కడినుంచి లిక్కర్ తయారు చేసే బెవరేజేస్ లాంటి అనేకానేక చోట్లకి దారి మళ్ళుతున్నాయన్నది పేపర్లు చెబుతున్న మాట.

నిజానికి, ఇలా సబ్సిడీ బియ్యం ధర తగ్గించడం కన్నా బహిరంగ మార్కెట్లో కేజీ ఒక్కింటికి ముప్ఫై రూపాయలు పైచిలుకు పలుకుతున్న బియ్యం ధరకి కళ్ళాలు బిగిస్తే 'దారిద్ర్య రేఖకి దిగువున ఉన్న' వారితో సహా అనేకానేకమంది జనం ప్రభుత్వాన్ని మెచ్చుకునే వాళ్ళు. కానీ ఏం లాభం, అలా చేస్తే వ్యాపారస్తులంతా గుర్రుమని, మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉంది. జనం కన్నా, వాళ్ళ బాగు కొంచం ఎక్కువ ముఖ్యం. ఎందుకంటే వాళ్ళలో చాలామంది ప్రత్యక్షంగా రాజకీయ నాయకులు, మరికొందరు పరోక్షంగా సహాయకారులు.

ఇలా సబ్సిడీ బియ్యం ధర తగ్గించడం వల్ల ఎవరికీ ఏ ఇబ్బందీ ఉండదు. పైగా, ఈ బియ్యాన్ని బ్లాకులో కొనుక్కునే వ్యాపారస్తులకి కొంచం బరువు తగ్గుతుంది కూడా. ప్రభుత్వమేమో పేదలకోసం తనెంత కష్టపడుతోందో పేపర్లలోనూ, టీవీల్లోనూ రంగురంగుల్లో చెప్పుకోవచ్చు. సబ్సిడీ కింద పోయేది ప్రజల సొమ్మే కాబట్టి, ఉన్న పన్నులు పెంచో, కొత్త పన్నులు వేసో జనం ముక్కు పిండి వసూలు చేసుకోవచ్చు. ఏమో, ప్రభుత్వం పని చేయడం లేదన్న అపప్రథని ఏ కొంచమైనా తగ్గించుకోవచ్చేమో కూడా.

11 కామెంట్‌లు:

  1. చాలా బాగా రాశారు మురళి గారు. జనానికి అర్థం కాని విషయం ఏంటంటే ఇలా అడ్డదిడ్డంగా సబ్సిడీలు ఇచ్చెయ్యడం వల్ల అంతిమంగా నష్టపోయేది ప్రజలే. ఇలా రూపాయికి, రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చేస్తే ఇంక రైతులకి సరిపడా మద్దతు ధర ఎలా ఇస్తారు?

    రిప్లయితొలగించండి
  2. అవునండీ. ధరలు చాలా ఫ్రస్ట్రేటింగ్ గా వున్నాయి. పైగా యూ.పీ. యే హయాం లో ధరలు రోజు రోజు కీ పెరుగుతున్నయ్యే తప్ప తగ్గే పరిస్థితి ఎక్కడా కనపడటం లేదు. వీటిల్లో కృత్రిమ ధరలు కొన్ని కూడానూ. ప్రభుత్వం గిమ్మిక్కులకే ప్రాధాన్యత నిస్తొంది. ఎవరి గోల వాళ్ళది.

    రిప్లయితొలగించండి
  3. ఛాల బాగా ఛెప్పేరు. సబ్సిడి పేరుతో జరిగే మోసాలు ఎన్నో చివరికి టాక్ష్ రూపమ్ లొ మనమే భరించాలి ..ఇది ఒక కుట్రే..ప్రజలు కూదా గమనిస్తున్నారు.
    బ్బగున్దన్ది.. మీ బ్లొగ్ పొస్త్.
    వసంతం..

    రిప్లయితొలగించండి
  4. ప్రజలకు మంచి చేసే పాలసీలపై కాక మంచి చేస్తున్నట్టు కనపడే స్కీములు(పనిలో పని స్కాములు)పై దృష్టి పెట్టేవారిని జనం మహానుభావుల్లా చూసినన్నాళ్లూ ఈ స్థితి మారదు.

    రిప్లయితొలగించండి
  5. భగవంతుడా మా పాలకులకి కాస్త కామన్ సెన్స్ ప్రసాదించు స్వామి.

    రిప్లయితొలగించండి
  6. >>> రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది తెలుపు రంగు రేషన్ కార్డు కలిగిన వారికి నవంబరు నుంచీ, ప్రస్తుతం కేజీ రెండు రూపాయలకి విక్రయిస్తున్న బియ్యాన్ని కేవలం ఒక్క రూపాయికే ఇవ్వబోతున్నామన్నది ముఖ్యమంత్రి ప్రకటన........

    బియ్యం Kg/Rs.2. కి కూడా కొనలేని దౌర్భాగ్య స్థితి లో రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల మంది ని ఉంచగలిగిన ప్రభుత్వాన్ని మెచ్చుకోరా మీరు.?

    రిప్లయితొలగించండి
  7. @గోదావరి: ధన్యవాదాలండీ..
    @ఎన్నెల: ధన్యవాదాలండీ..
    @చాణక్య: అవునండీ.. బొత్తిగా అర్ధం లేని సబ్సిడీ ఇది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  8. @Sujata: కాంగ్రెస్ వాళ్లకి, ఢిల్లీ ట్రేడ్ గ్రూపులు బాగా దగ్గర అని వినికిడండీ.. అందుకే ప్రైస్ కంట్రోల్ విషయంలో ప్రభుత్వం చూసీ చూడనట్టు పోతూ ఉంటుంది.. మరీ ముఖ్యంగా చక్కర ధరలమీద అస్సలు కంట్రోల్ ఉండదు.. ధన్యవాదాలు.
    @వసంతం; అంతేకదండీ.. బరువుని మొయ్యాల్సింది మనమే మరి! ధన్యవాదాలు.
    @పక్కింటబ్బాయి: నిజం చెప్పారు.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  9. @సుమ: మనం చేయగలిగేది అ ప్రార్ధన మాత్రమేనండీ.. ధన్యవాదాలు.
    @బులుసు సుబ్రహ్మణ్యం: నాలుగో పేరాలో నా గోడు అదే కదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి