ఆదివారం, ఫిబ్రవరి 21, 2010

మరచిపోయా...

అనుకోకుండా ఒక కార్యక్రమానికి వెళ్లాను. తెలిసిన వ్యక్తే కానీ ఏడాది తర్వాత ఒకరికొకరం ఎదురు పడ్డాం. నవ్వీనవ్వనట్టుగా నవ్వాడు. నేను దగ్గరికి వెళ్లి "హవార్యూ" అంటూ షేక్ హ్యాండిచ్చా. "హూ ఆర్యూ" అన్నట్టుగా చూసి, నన్ను కొంచం పక్కకి నడిపించాడు. "వెరీ సారీ.. మిమ్మల్ని గుర్తు పట్టలేక పోతున్నాను.." అన్నాడు చాలా అపాలజెటిక్ గా.. పెద్ద షాక్ నాకు. ఎందుకంటే తెలుగు పండుగలు మొదలు, జాతీయ పండుగ వరకూ ఏ పండుగ వచ్చినా, ప్రత్యేక సందర్భం వచ్చినా తన నుంచి నాకు క్రమం తప్పకుండా ఎస్సెమ్మెస్ రూపంలో సందేశాలు అందుతాయి. నేను అస్సలు బద్ధకించకుండా వెంటనే జవాబు పంపుతాను.

ఇప్పుడింక చేసేదేముంది.. నన్ను నేను పరిచయం చేసుకున్నాను.. తను పాపం చాలా బోల్డన్ని క్షమాపణలు చెప్పాడు. నేనప్పుడు మెసేజీల గురించి చెప్పాను. "నా ఫోన్లో చిప్ సరిగ్గానే పనిచేస్తోందండీ.. బుర్రలో చిప్ కే కొంచం ప్రాబ్లం వచ్చినట్టుంది.." అన్నాడు తను నవ్వుతూ. ఓ పది నిమిషాలు మాట్లాడుకున్నాం. తర్వాత నేను బయటికి వచ్చేస్తున్నప్పుడు తను మళ్ళీ నా దగ్గరికి వచ్చి "ఇంకెప్పుడూ మిమ్మల్ని మర్చిపోను" అని హామీ ఇచ్చాడు. బాగా నవ్వుకున్నాం ఇద్దరం.

ఇది అతనికి మాత్రమే వచ్చిన సమస్య మాత్రమే కాదు, అప్పుడప్పుడూ నాకూ ఎదురవుతూ ఉంటుంది. ఫోన్లో అయితే మొహమాటం లేకుండా "సారీ.. మీరెవరో చెప్పండి" అని అడిగేస్తాను.. ఎదురుగా ఉన్నప్పుడైతే ఓపక్క మాట్లాడుతూనే మరో పక్క తీవ్రంగా ఆలోచిస్తాను, అవతలి వ్యక్తిని గుర్తు చేసుకునేందుకు. మరచిపోడానికి ఇదీ కారణం అని ప్రత్యేకంగా ఒకటో, పదో కారణాలు చెప్పడం కష్టం. సాధారణంగా అందరూ "వయసు ప్రభావం" అనేస్తూ ఉంటారు కానీ దీనికి బోలెడన్ని మినహాయింపులు ఉన్నాయి.

తరచూ కొత్త వ్యక్తులని కలుసుకుంటూ ఉండడం, ఒక వ్యక్తిని రెండు సార్లు కలవడానికి మధ్య బాగా గ్యాప్ రావడం, ఒకేలాంటి రూపు రేఖలు, హావభావాలు ఉన్నవాళ్ళు ఒకరికి మించి మనకి పరిచయం కావడం.. ఇలాంటివన్నీ కొంచం ఎక్కువ మంది చెప్పే కారణాలు. కొంతమందిని ఒక్కసారి చూడగానే గుర్తు పెట్టేసుకుంటాం. వాళ్ళ పరిచయం మనకి సంతోషాన్నో, శిరోభారాన్నో కలిగించడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. అదే మరికొందరిని ఎన్నిసార్లు చూసినా.. అబ్బే.. కష్టం.

రోజూ ఉదయాన్నే పేపర్లు తెచ్చే కుర్రాళ్ళని గుర్తు పెట్టుకోవాలని నేను విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటాను. సగం నిద్రలో ఉండడం వల్ల వాళ్ళ ముఖాలు వెంటనే రిజిస్టర్ అవ్వవు. కష్టపడి గుర్తు పెట్టుకునేసరికి వాళ్ళు మారి వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. పేపర్ బిల్లు ఇచ్చే ప్రతిసారీ సందేహమే, 'పేపర్ తెచ్చేది ఇతనేనా?' అని.

తెలిసిన వాళ్ళలో చాలామంది మనం గుర్తు పట్టలేకపోడాన్ని కొంచం సహృదయంతోనే అర్ధం చేసుకుంటారు. అదే బంధువులయితేనా? మన పని అయిపోయినట్టే. అరుదుగా కలిసే దూరపు బంధువులని గుర్తు పెట్టికోవడం ఎవరికైనా కష్టమే అనుకుంటాను. నేరుగా గుర్తు పట్టలేదు అని చెప్పేస్తే చాలా బాధ పడిపోయి, "ఇప్పుడంటే ఇలా అయిపోయాం కానీ, ఒకప్పుడు మీ కుటుంబం మా కుటుంబం ఎంత బాగా ఉండేవో" అంటూ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతారు.

అలా అని ఈ గండం గట్టెక్కడం కోసం మాటల్లో పెడదామా అంటే ఏం మాట్లాడితే ఏం తంటానో తెలీదు. 'పిల్లలు బాగున్నారా?' అనో 'అమ్మా నాన్నా బాగున్నారా?' అనో దాటేద్దామంటే ఏ కొత్త సమస్య వస్తుందో అని సందేహం. (ఒకటి రెండు అనుభవాలు తల బొప్పి కట్టించాయి) 'మీరెవరు?' ని నేరుగా అడగ కూడదు, మాట్లాడకుండా ఉండకూడదు, మాటల్లో దొరికిపోకూడదు. తాడు మీద నడవడం సులువు, ఇంతకన్నా.

ఇలాంటి గండాలు గట్టెక్కడానికి ఈమధ్యనే నేనో చిట్కా కనిపెట్టాను. ఫంక్షన్లలో ఒక్కళ్ళం ఎవరికీ దొరక్కుండా ఎవరైనా 'బంధుమూర్తి' ని ఫాలో అయిపోతే చాలు. సదరు బంధుమూర్తి సాధారణంగానే మంచి మాటకారీ, కలుపుగోలు వ్యక్తీ అయి ఉంటాడు కాబట్టి, మనం ఏమీ మాట్లాడకుండానే అవతలి వాళ్ళ వివరాలు తెలుసుకోవచ్చు. సదరు బంధుమూర్తే మనపాలిట విలనై "వీణ్ణి గుర్తుపట్టావా?" అని నిండు సభలో మనల్ని గర్వంగా ప్రశ్నిస్తే మాత్రం, తప్పించుకునే సాధనం ఉండదు, ఓ వెర్రి నవ్వు నవ్వేయడం తప్ప.

మర్చిపోవడం వల్ల చాలా లాభాలుంటాయన్న జ్ఞానోదయం మనకి కొంచం ఆలస్యంగా కలుగుతుంది. ముఖ్యంగా, మన దగ్గర అప్పు తీసుకున్న వాడు మనల్ని మర్చిపోయినప్పుడు వద్దన్నా ఈ జ్ఞానం కలిగి తీరుతుంది. మనకి అప్పిచ్చిన వాడు మాత్రం మనల్ని మరచిపోడు. బాకీ తీరేంత వరకూ మన యోగక్షేమాలు విచారిస్తూనే ఉంటాడు. అప్పిచ్చిన మొత్తం కొంచం పెద్దదైతే మన ఆరోగ్యం కోసం ప్రత్యేక పూజలూ అవీ కూడా చేయించే అవకాశం ఉంది.

అధిక శాతం పురుషులు తప్పక గుర్తు పెట్టుకునే, తరచూ తలచుకునే కొందరు వ్యక్తులు: చిన్నప్పుడు మనల్ని స్కూల్లో కొట్టిన మేష్టారూ, హైస్కూల్లో, కాలేజీలో మనతో కలిసి చదువుకున్న అమ్మాయిలూ, మనం ప్రేమలేఖ ఇచ్చిన అమ్మాయిలూ (లిస్టు మరీ పెద్దదయితే కనీసం మొదటి ప్రేమలేఖ ఇచ్చిన అమ్మాయి), మొదటి ఉద్యోగం ఇచ్చిన బాసూ, అప్పు తీసుకున్న మిత్రులూ, పిల్లనిచ్చిన మావగారూ... ఎవరి జాబితా వాళ్ళది. మీరూ మీ జాబితా వేసుకోండి, సరదాగా.

23 కామెంట్‌లు:

  1. ప్రతీ ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనే ఇబ్బందే..ఈ మరుపు. నాకూ ఈ మధ్యన మరుపు బాగానే ఎక్కువైంది. అదాటున మాట్లాడి వెళ్ళిపోయే వాళ్ళనే కాదు..బాగా పరిచయమున్న వాళ్ళనీ, బంధువులనీ కూడా ఒక్కోసారి మర్చిపోయి..వాళ్ళని అడగలేక, నాకు గుర్తు రాక చాలా అవస్థ పడుతున్నా. టపా బాగుందండీ.

    రిప్లయితొలగించండి
  2. చాలాసందర్భాల్లో ఆబంధుమూర్తిని నేనే. కాలేజీరోజుల తర్వాత దూరమైనమిత్రులెప్పుడైనా కలిస్తే అందరికీ ఉమ్మడిబంధుమూర్తిని నేనే.
    నాజాబితా- ముక్కోణపుప్రేమల్లో నాకుపోటీదారులు మరియు వాటాదారులు, బాకీపెట్టి ఎగ్గొట్టిన టిఫిన్‌సెంటర్లు మరియు స్టెషనరీషాపులు, ఋణాలిచ్చిన బాంకుమేనేజర్లు

    రిప్లయితొలగించండి
  3. మీరు చెప్పినది రైటే.నాకూ ఉంది ఈ సమస్య. తెలిసిన మనిషిని చూడగానే గుర్తు పట్టి పలకరిస్తాను. కానీ పేరు మాత్రం ఓ పట్టాన గుర్తు రాదు.

    రిప్లయితొలగించండి
  4. సాధారణంగా ఎదుటి వ్యక్తుల్ని మనం పెద్దగా పట్టించుకోనప్పుడో లేదా మనకు ఇంట్రెస్ట్ లేనప్పుడో మర్చిపోతుంటాం. ఇప్పుడు ఫర్లేదు కాస్త జాగ్రత్తపడుతున్నాను కానీ, B.Tech లో హాస్టల్లో చదివేటప్పుడైతే ఎవ్వరినీ పెద్దగా గుర్తు పెట్టుకునే వాడిని కాదు. అక్కడక్కడే ఉంటారు కాబట్టి, రోజుకు పది సార్లు చూస్తుంటాం కాబట్టి ఫేసులు గుర్తుండేవికానీ, పేర్లు అస్సలు గుర్తు పెట్టుకునేవాడిని కాదు.

    నాకు కొంచెం పాప్యులారిటీ ఎక్కువ కాబట్టి, అందరూ నన్ను ఎంచక్కా పేరుతో పిల్చేవాళ్ళు. నాకేమో వాళ్ళ పేర్లు గుర్తుండేవి కాదు. అందుకే ఎంచక్కా "ఏరా మామా..బాగున్నావా?", "ఏం..బావా...ఈ మధ్య అస్సలు కనిపించడం లేదు?" అంటూ మామా, బావలతో మ్యానేజ్ చేసేటోణ్ణి. :)))

    రిప్లయితొలగించండి
  5. చాలా బాగా రాసారు..

    నేను డిగ్రీ తరువాత ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ హైదరాబాదులో ఉన్నప్పుడు, మా కాలనీ కిరాణాషాపుల్లోనూ, టెలిఫోన్ బూత్ దగ్గరా, ఇరానీ కేఫ్ లో, స్వీటు షాపు దగ్గరా..ఇలా చాలాచోట్ల సాయంత్రం వేళల్లో ఒకాయన తరచుగా కనపడేవాడు .బాగా పరిచయమున్న వ్యక్తిలాగా అనిపించేవాడు.ఈయన్ని ఎక్కడ చూసానబ్బా అని బుర్రబద్దలయ్యేలా ఆలోచించేవాణ్ని.ఆయన కనపడ్డప్పుడల్లా నాపని కూడ కాసేపు పక్కనపెట్టి విశ్వప్రయత్నం చేసేవాణ్ణి గుర్తుకుతెచ్చుకోవడానికి .అలా ఆయన దాదాపు రెండేళ్ళు నాతో దోబూచులాడాడు.తర్వాత తెలిసిన విషయమేమంటే, ఆయన ఆర్టీసీ కండక్టరు. ఆ రూట్లో ప్రతిరోజూ నేనేక్కే సిటీ బస్సులో కండక్టరు ఆయనే.ఆ రెండేళ్లపాటు దాదాపు ప్రతిరోజూ చూసేవాణ్ని ఆయన్ని బస్సులో. సాయంత్రాలు డ్యూటీ దిగి ,సివిల్ డ్రస్ (అనొచ్చా?) లో ఉండేసరికి గుర్తుపట్టలేకపోయా.గుర్తుకొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది నాకు.

    అలానే ఒక ఐదేళ్ళ క్రితం ముంబైలో అమెరికన్ కాన్సులేట్ ఎదుట ఒకబ్బాయి కనపడ్డాడు. ఈయనెవరో బాగా తెలిసినాయనలా ఉన్నాడే, ఎవరై ఉండొచ్చు? అనుకుంటుండగా తనే నాదగ్గరికివచ్చి మిమ్మల్నెక్కడో చూసానండీ అన్నాడు. మీరు కాలిఫోర్నియాలో ( సన్నీవేల్ ) ఎప్పుడన్నా ఉన్నారా అడిగితే అవునూ అన్నా.కాసేపు ఇద్దరం గుర్తుకుతెచ్చుకోవడానికి ప్రయత్నించి ,లాభంలేదనుకొని గుడ్ బై చెప్పేసుకున్నాం.చాలా వరకు ఇద్దరిలో ఎవరో ఒకరు గుర్తు చేస్తారు మనం పలానా చోట కలిసాం అని.అప్పుడు మాత్రం ఇద్దరికీ గుర్తు రాలేదు.నాకు ఇప్పటికీ గుర్తురాలేదు..చాలా సార్లు ప్రయత్నించి వదిలేసా.

    ముఖాల్ని గుర్తు పెట్టుకోవడంలో నేను చాలా చాలా పూర్.ముఖ్యంగా మన తెలుగు సినిమా ముంబై హీరోయిన్ల విషయంలో.రెండో రీల్ లో కనపడ్డ హీరోయిన్ని పదోరీల్ కొచ్చేసరికి మరచిపోతా ( ఒకరికంటే ఎక్కువ హీరోయిన్లు ఉన్న సినిమాల్లో ఈ కన్ఫ్యూజన్ ఎక్కువ , మిగతా సినిమాల్లో సీన్ ని బట్టి గుర్తుపడతా ఈమె హీరోయిన్ అని )

    రిప్లయితొలగించండి
  6. హ్హహ్హహ్హ.బాగా రాసారు మురళీ.నా లిస్టులో మీరు చెప్పిన పేర్లతో పాటు, ఇలాంటి పోస్టులు రాసి మమ్మల్ని అలరించే మీరెలా ఉంటారో అని కేరికేచర్లు గీస్తూ ఉంటాను గాల్లో అప్పుడప్పుడు. ఒకవేళ మిమ్మల్ని కలవడం తటస్థిస్తే ఎలా పరిచయం చేసుకోవాలి అని ఆలోచన ఇప్పుడే మొదలయ్యింది.

    రిప్లయితొలగించండి
  7. చాలా సరదాగా రాసారు. నిజమేనండీ, అవతలి వ్యక్తి బాగా తెలిసినవాల్లలా మాట్లాడుతూ వుంటే మీరెవరు అని అడగాలంటే మహా ఇబ్బందిగా ఉంటుంది. నాకూ మొహాలు సరిగా గుర్తు ఉండవు. కనీసం మూడు సార్లు కలిస్తే కానీ గుర్తు ఉండవు. అలాగే వాయిస్ కూడా, కొందరు ఫోన్ లో వాయిస్ వినగానే యిట్టె గుర్తుపట్టేస్తారు. నాకెందుకో అది సాధ్యం కాదు.

    రిప్లయితొలగించండి
  8. ఏవిటో మురళి గారు ఈ మతి మరుపు తో కొంచెం ఇబ్బంది గానే ఉంది. ముఖ్యంగా పాపం ఓల్డ్ స్టూడెంట్స్ కనిపించి ఎంతో ప్రేమగా పలకరించినప్పుడు:) బహుశా, కాంపిటీషన్ పెడితే నేనే ఫస్ట్ ఒస్తానని నా గాఢ నమ్మకం. మొత్తానికి అందరికీ చాలా ముఖ్యమైన విషయాన్ని మీరు గుర్తుచేశారు.

    రిప్లయితొలగించండి
  9. అన్యుల మనముల్ నొప్పింపక తానొవ్వక తప్పించుక తిరుగు ధన్యులు మురళిగారు బ్లాగరీ !
    "బంధుమూర్తే మనపాలిట విలనై" :) :)
    నా లిస్టైతే చాలా పెద్దది ..ఒక టపా అవుతుంది :) :)

    రిప్లయితొలగించండి
  10. నాకు పాత స్నహితులను గుర్తు పట్టే విషయములో కొంచెం జ్ఞాపక శక్తి ఎక్కువేనండి .ఈమధ్య మా పాపను హాస్టల్ లో చేర్చడానికి వెల్తే పదిహేనేళ్ళక్రితం మా హాస్టలో సీనియరైన ఆమెని గుర్తుపట్టి పలకరిచేను . లక్కీగా ఆమెకి కూడా నేను గుర్తున్నాను కాబట్టిసరిపోయింది లేకపోతే నాకు కూడా మీపరిస్థితే ఎదురయ్యెదేమో .
    కానీ నేను ఇంట్లొ వస్తువులు ఎక్కడపెట్టేనో మర్చిపోయి అస్తమానూ నెలుక్కుంటూ ఉంటాను .

    రిప్లయితొలగించండి
  11. భలే మంచి టాపిక్ రాసారు :)
    నేను ఎదుర్కొనే తీవ్రమైన సమస్య ఇదే.పది మంది కలిసే చోట దాదాపు అందరు నన్ను గుర్తుపడతారు కాని అక్కడ అందరు నాకు గుర్తుండరు .పలకరించగానే చక్కగా ఒక నవ్వు నవ్వేస్తాను ,నా అదృష్టం కొద్ది అవతలి వారు అర్ధం చేసుకుంటారు ఫలాని సందర్భం లో మీరు ఇలా చెప్పారు ప్రస్తుతం ఇలా ఉన్నాం అంటూ ఆప్యాయంగా చెబుతారు అన్నిటికి సమాధానం "ఒక చిన్న స్మైల్ "ఇచ్చేస్తాను.కొన్ని సార్లు ఎలైట్ ని కలిసినప్పుడు వాళ్ళ పేర్లు గుర్తురాక బుర్ర బద్దలు కొట్టుకుంటాను. ఏమోగాని కొన్నిసార్లు ఎవరైనా గుర్తుపడతారని ఇష్టం అయిన పనులు పబ్లిక్ లో మానేసినవి కోకొల్లలు -:):)

    రిప్లయితొలగించండి
  12. కొంత మంది ఉంటారు (స్వానుభవం మీద చెబుతున్నా) వాళ్ళు కదిలే వికీ పీడియాలు. ఎక్కడెక్కడో ఎవరెవరెవరెవరినో కూడా గుర్తుపెట్టుకుంటారు. ఇంకా అమ్మయిలనైతే వంస వృక్షం తో సహా. భలే ఆశ్చర్యమేస్తుంది. మరీ గూగుల్ వాడి ఇన్బాక్స్ లాగ ఇంత మెమరీ నా అని.

    నా జాబితా మీరు చెప్పినదానికి దగ్గర గానే ఉంది లెండి :)

    రిప్లయితొలగించండి
  13. ప్చ్... నేను .. నా జబితా రాద్దమనుకొని మొన్న అనుకుని మర్చి పోయానండి, సరేద్దు అని కష్ట పడి గుర్తు పెట్టుకుని ఈ రోజు వస్తే ఆ జాబితా ఏమిటో మర్చి పోయానండీ. గుర్తొచ్చినప్పుడు వచ్చి రాస్తానే. సరేనా. ఈ....ఈ.... ఈ.....

    రిప్లయితొలగించండి
  14. నాకైతే ఎప్పటప్పటి సంగతులో గుర్తుంటాయి . మా కోడలైతే కాస్త టైం ఇస్తే ఆంటీ , సంవత్సరమే కాదు డేట్స్ తో సహా చెప్పేస్తారు అంటుంది . కాని మనుషుల విషయానికొస్తే , ఎప్పుడూ ఎదురైయ్యే సమస్యే , వీళ్ళనెక్కడ చూసాను , బాగా తెలిసిన వారిలా వున్నారే అని .

    రిప్లయితొలగించండి
  15. @ప్రణీత స్వాతి: నిజమేనండీ.. అనుభవించినప్పుడే తెలుస్తుంది ఆ ఇబ్బంది ఏమిటో.. ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: మీరు ఎగ్గొట్టిన బాకీలు కూడా గుర్తుంచుకుంటారా!! యెంత విశాల హృదయం అండీ మీది :):) ..ధన్యవాదాలు.
    @హరేఫల: నాక్కూడా అప్పుడప్పుడూ ఎదురయ్యే సమస్యేనండీ ఇది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @నాగ ప్రసాద్: కాలేజీ రోజులనుంచీ కూడా మీకు పాపులారిటీ ఎక్కువేనన్న మాట!! ఈ మామ, బావ భలే రక్షిస్తాయి కానీ, చుట్టాల దగ్గర మన పప్పులుడకవండీ.. ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: టపా మీకు బాగా నచ్చిందని మీ వ్యాఖ్య చెబుతోందండీ.. హీరోయిన్ల విషయంలో మీ ఇబ్బంది చదివి నవ్వొచ్చింది.. నేను వాళ్ళని బాగానే గుర్తు పట్టగలుగుతాను :):) ..ధన్యవాదాలు.
    @శ్రీనివాస్ పప్పు: గోదారి రేవులోనో, నావలోనో, ఏటి గట్టునో, లంక వొడ్డునో.. ఎప్పుడో ఎక్కడో కలుస్తామండీ.. ఊహలెప్పుడూ అందంగా ఉంటాయి కాబట్టి నా ఊహా చిత్రం కూడా అందంగానే ఉండి ఉంటుందని ఆశిస్తున్నాను :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @శ్రీకర్ బాబు: గొంతు విషయంలో ఒక్కోసారి నేను కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటానండీ.. ధన్యవాదాలు.
    @అక్షర మోహనం: నిజమేనండీ.. చూసే వాళ్లకి ముచ్చటే :):) ధన్యవాదాలు. అన్నట్టు మీరు తెలుగులో వ్యాఖ్యలు రాయడానికి ఈ లంకె సాయపడుతుంది. http://www.google.com/transliterate/indic/Telugu
    @జయ: నిజమేనండీ చాలా ఎంబరాసింగ్ గా ఉంటుంది ఆ పరిస్థితి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. @పరిమళం: టపా రాసేయండి మరి.. మేమూ తెలుసుకుంటాం మీ జాబితాని :) ..ధన్యవాదాలు.
    @రాధిక(నాని); "అస్తమానూ నెలుక్కుంటూ ఉంటాను" ఒక్కసారి గోదారొడ్డుకి తీసుకెళ్ళి పోయారు నన్ను.. యెంత సంతోషం కలిగిందో.. దగ్గరి స్నేహితులని గుర్తుపట్టగలం కానీ, ఒకటి రెండు పరిచయాలు మాత్రమె ఉన్నవాళ్ళని వెంటనే గుర్తు పట్టలేం కదండీ.. ధన్యవాదాలు.
    @చిన్ని: సినిమా వాళ్ళు 'మాకు ప్రైవసీ ఉండదు' అనడం చదివినప్పుడల్లా "ఆహా సామాన్యుడిగా ఉండడం వాళ్ళ యెంత స్వేచ్చగా ఉండగలుగుతున్నానో కదా" అనిపిస్తూ ఉంటుందండీ నాకు.. ఈ సమస్య కేవలం సినిమా వాళ్లకి మాత్రమె పరిమితం కాదన్న మాట. 'కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్ని వదులుకోవాలి' అన్నారు కదండీ పెద్దాళ్ళు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. @వాసు: అబ్బో.. అలాంటి వాళ్ళు నా చుట్టూనూ ఉన్నారండీ.. కొన్ని కొన్ని విషయాల్లో నేను కూడా ఆ జాబితాలోకే వస్తానేమో :):) ..ధన్యవాదాలు.
    @భావన: సూపరండీ.. నాకు 'మతిమరపు సంఘం మహాసభలు' జోక్ గుర్తొచ్చింది.. సభ జరపడానికి ఒక్కరు కూడా రారు, ఎందుకంటే అందరూ మర్చిపోతారన్న మాట!! ..ధన్యవాదాలండీ..
    @మాలాకుమార్: మీరు నడిచే కంప్యూటర్ అన్నమాట.. కంప్యూటర్ కూడా మనుషుల్ని గుర్తు పట్టదు కదండీ!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. మరే మరే ఈ బాధలు పడలేక అసలు ఎందుకొచ్చిన గొడవలు అని నేను ఫంక్షన్స్ కి వెళ్ళడం మానేసిన రోజులు కూడా లేకపోలేదు. బయటి వాళ్ళ సంగతి సరే కానీ నాకు మా భంధువుల తో కూడా పెద్ద చిక్కే ఎంతంటే కలిసిన ప్రతిసారి వాళ్ళే నేను ఫలానా అని పరిచయం చేసుకుని మాట్లాడటం అలవాటు చేసుకునేంత :-)

    రిప్లయితొలగించండి
  21. సదరు బంధుమూర్తే మనపాలిట విలనై... :-D :-D
    నా సంగతి చెప్పాలంటే.. ఇప్పటి దాకా అయితే ఇలాంటి సమస్య రాలేదు. ఒకటి రెండుసార్లు చూసిన వాళ్ళే కాకుండా, వేరేవాళ్ళ ద్వారా విన్న విషయాలు, సంఘటనలు, వ్యక్తులూ కూడా చాలా వరకూ గుర్తుంటారు నాకు. కానీ, భవిష్యత్తులో ఏమవుతుందో చెప్పలేం కదా.. నా బుర్రలో ఉన్న మెమరీ కార్డు నిండిపోతే!! ;-)

    రిప్లయితొలగించండి
  22. @వేణూ శ్రీకాంత్: వాళ్లకి మీరు అర్ధమయిపోయారు కాబట్టి పెద్దగా ఫీలవ్వరు లెండి, మీరు గుర్తు పట్టక పోయినా :):) ..ధన్యవాదాలు.
    @మధురవాణి: మీరు మీ మెమరీ కార్డుని ఇలాగే కాపాడుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి