మంగళవారం, సెప్టెంబర్ 06, 2011

ప్రజల మనిషి

'తెలంగాణా తొలినవల' అన్న ప్రత్యేకతని సొంతం చేసుకున్న నవల వట్టికోట ఆళ్వారు స్వామి రాసిన 'ప్రజల మనిషి.' తెలంగాణా సాయుధ పోరాటానికి పూర్వరంగాన్ని పరిచయం చేస్తూ రాసిన ఈ నవలలో కథా స్థలం నిజామాబాద్ జిల్లాలోని దిమ్మెగూడెం అనే ఓ పల్లెటూరు. ఆ ఊరి శ్రీవైష్ణవుల కుర్రాడు కంఠీరవం ఇంటి సమస్యల కారణంగా చిన్న నాడే ఊరు విడిచిపెట్టి బయటి ప్రపంచాన్ని తెలుసుకోవడం, మరోపక్క అతను ఊరికి తిరిగి వచ్చేనాటికి ఊరి జనంలో కూడా చైతన్యం రావడం కథాంశం.

దిమ్మెగూడెం 'దొర' రామభూపాల రావు అరాచకాల వర్ణనతో కథ ప్రారంభమవుతుంది. దొరకూతుర్ని కాపురానికి పంపుతున్నాడు. ఊళ్ళో బాగా పాలిచ్చే ఆవు రైతు కొండయ్య పెరట్లో ఉంది. ఆవుని తన కూతురి అత్తారింటికి తోలించమని కబురు పెట్టాడు దొర. అంతేనా? దొర ఇంటికి కావాల్సిన కూరగాయల మొదలు విస్తళ్ళ వరకూ సమస్తమూ సమకూర్చాల్సింది ఊరివాళ్ళే. విస్తళ్ళు పంపాల్సిన బాధ్యత కంఠీరవం తల్లి ఆండాళ్ళమ్మ మీద పడుతుంది. ఆకులు కోసుకు రావడం కోసం బడి మానేస్తాడు కంఠీరవం. అప్పుడే ఆ కుర్రవాడిలో 'దొరకోసం ఇదంతా ఎందుకు చేయాలి?' అన్న ఆలోచన మొదలవుతుంది.

కంఠీరవం తండ్రి హఠాత్తుగా మరణించడం, అన్న వెంకటాచార్యులులో భేదాభిప్రాయాలు రావడంతో ఇల్లు విడిచి పెట్టి వెళ్లిపోతాడతడు. నిజామాబాదు లో శ్రీవైష్ణవ కుటుంబం ఆశ్రయం ఇస్తుందతనికి. వెంకటాచార్యులు దొర పంచన చేరతాడు. దొర ఆగడాలు మితిమీరతాయి. భూములు ఆక్రమించుకోవడం, దౌర్జన్యాలు చేయడం నిత్యకృత్యాలవుతాయి ఆ ఊళ్ళో. నిజాం ప్రభుత్వం మొదలు పెట్టిన హరిజనుల మత మార్పిడి ప్రచారం ఆ ఊరికీ వస్తుంది. అప్పటికే చదువుకుని గ్రంధాలయోద్యమంలో ప్రవేశించిన కంఠీరవం ఊరికి వచ్చి, మత మార్పిడులని ప్రశ్నించి, కేసులో ఇరుక్కుని జైలుకి వెళ్తాడు.

ప్రభుత్వానికి ఎదురు చెప్పే ధైర్యం లేని రామభూపాలరావు, మత మార్పిడుల అనంతరం హైదరాబాదు నుంచి ఆర్య సమాజికులని రప్పించి, శుద్ధి ద్వారా హరిజనులని తిరిగి హిందువుల్లో కలుపుతాడు. అయితే, వచ్చిన ఆర్యసమాజికులు వెంటనే తిరిగి వెళ్ళకుండా ఊరి ప్రజల్లో చైతన్యం కోసం ప్రయత్నించడం మింగుడు పడదు అతడికి. ఊళ్ళో గ్రంధాలయం ఏర్పాటు చేసిన ఆర్య సమాజికులు, జనంలో నాటుకుపోయిన భయాన్నీ, అజ్ఞానాన్నీ పోగొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంతలో జైలు శిక్ష పూర్తి చేసుకున్న కంఠీరవం కొందరు మిత్రులతో కలిసి ఊరికి తిరిగివచ్చి దొరతో తలపడడం, మరోపక్క హైదరాబాద్ సంస్థానంతో కాంగ్రెస్ పోరాటం మొదలవడంతో నవల ముగుస్తుంది.

నల్గొండలో ఒక పేద కుటుంబంలో జన్మించిన ఆళ్వారు స్వామి, చిన్ననాడే ఊరు విడిచిపెట్టారు. 'శారద' కలంపేరుతో 'రక్తస్పర్శ' వంటి విలక్షణ కథలు రాసిన నటరాజన్ లాగానే హోటల్ కార్మికుడిగా పనిచేస్తూ రచనా వ్యాసంగం కొనసాగించారు. గ్రంధాలయోద్యమంలో కీలక పాత్ర పోషించారు. నవల చదువుతుంటే కంఠీరవం మరెవరో కాదు ఆళ్వారు స్వామే అనిపించక మానదు. అదే విషయాన్ని ధృవీకరించారు ముందు మాట రాసిన దాశరధి రంగాచార్య. అంతే కాదు, ఆళ్వారు స్వామి తనకి పినమామగారవుతారని కూడా చెప్పారు. కథానాయకుడితో సహా పాత్రలన్నీ నేలమీద నడిచేవే అయినా, చాలాచోట్ల సంభాషణలు ఉపన్యాస ధోరణిలో సాగాయి.

రంగాచార్య నవలలు 'చిల్లర దేవుళ్ళు' 'మోదుగుపూలు' గుర్తొచ్చాయి చాలాసార్లు. అయితే, ఆళ్వారు స్వామి స్పూర్తితోనే తాను నవలా రచనకు పూనుకున్నానన్నారు రంగాచార్య. నిజాం పాలనతో తెలంగాణా ప్రాంతంలోని సామాన్యులు ఎదుర్కొన్న కష్టనష్టాలని నిశితంగా చిత్రించిన నవల ఇది. 'ప్రజల మనిషి' కి కొనసాగింపుగా ఆళ్వారు స్వామి రాసిన 'గంగు' నవలని గురించి మరోసారెప్పుడైనా. 1955 లో 'దేశోద్ధారక గ్రంధమాల' తొలిసారిగా ప్రచురించిన 'ప్రజల మనిషి' ని తర్వాతికాలంలో ఆరుసార్లు పునర్ముద్రించింది విశాలాంధ్ర. 154 పేజీల ఈ పుస్తకం వెల రూ. 60. అన్ని ప్రముఖ పుస్తకాల షాపులతో పాటు ఏవీకెఎఫ్ లోనూ దొరుకుతోంది.

3 కామెంట్‌లు:

  1. చాలా రోజులయ్యింది మీ బ్లాగు చదివి. చాలా పోస్టులే ఉన్నాయి.
    ఈ బుక్ చదవలేదు కానీ దాశరధి రంగాచార్య పుస్తకాలు చదివాను,
    బాగున్నాయి

    రిప్లయితొలగించండి
  2. మత ఉద్యమంగా మొదలైన ఆర్యసమాజం రాజకీయపోరాటంలోకి ఎలాదిగింది?, ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం లాంటివి నిజాంపైనా, పరిపాలనపైనా ఎలా పోరాటం ప్రారంభించింది అనే విషయాలు చాలా బాగా చిత్రీకరించారనిపించింది ఈ నవల చూస్తే. ముఖ్యంగా జైలులో దొంగకు కంఠీరవంతో గల చనువు గౌరవంగా ఎలా మారిందో రాయడం చూస్తే చాలా సున్నితమైన అంశాన్ని పట్టుకున్నారనిపించింది. కొన్ని కొన్ని సార్లు కంఠీరవం మాటలు అసందర్భ ప్రసంగాల్లోకి దారితీస్తాయి.
    ఎలాగైనా ఓ మంచి నవల చదివించారు నాతో మీరు.

    రిప్లయితొలగించండి