గురువారం, మార్చి 31, 2011

నిత్యనూతనుడు

పుష్కర కాలం క్రితం ఓ పెళ్ళికి వెళ్లాను. ఉన్నట్టుండి కళ్యాణ మండపంలో చిన్నపాటి కలకలం. అతిధులంతా పెళ్లి చూడ్డానికి బదులుగా, వెనక్కి తిరిగి గుమ్మంవైపు తిరిగి చూస్తున్నారు. "హ్యాట్సాఫ్ అంకుల్.." "హ్యాట్సాఫ్ అంకుల్.." అంటున్నారు పిల్లలంతా. ఎవరా అని కుతూహలంగా చూస్తే, నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్. వాళ్ళబ్బాయి, మరో సహాయకుడు చక్రాల కుర్చీ తోస్తుండగా, వేదికకి దగ్గరగా వచ్చి, నూతన దంపతులని ఆశీర్వదించి, అటుపై భోజనానికి కదిలారు.

అదిగో, సరిగ్గా అప్పుడే నూతన్ ప్రసాద్ తో మాట్లాడే అవకాశం దొరికింది నాకు. నేను వెళ్ళింది పెళ్ళికూతురి తరపున. ఆయన వచ్చింది పెళ్ళికొడుకు తరపున కావడంతో, దగ్గరుండి ఆయన భోజనం సంగతి కనుక్కునే బాధ్యత నాకప్పగించారు పెళ్ళికూతురి తరపు వారు. నిజం చెప్పొద్దూ.. "ఇప్పుడీయన సినిమా గొప్పలన్నీ నేను భరించాలన్నమాట" అనుకున్నాను మనసులో. నా అంచనాకి భిన్నంగా నూతన్ ప్రసాదే మొదట మాటకలిపారు.

"మీరు పెద్ద సినిమా యాక్టర్ కదా.. ఇప్పుడు పిల్లలంతా మిమ్మల్ని కేవలం మీరు చేస్తున్న టీవీ ప్రోగ్రాం ('హ్యాట్సాఫ్' అని అప్పట్లో ఈటీవీలో వచ్చేది) తో మిమ్మల్ని గుర్తు పడుతుంటే ఎలా అనిపిస్తోంది?" అని అడిగాను నేను. "నేను పుడుతూనే సినిమా నటుణ్ణి కాదండీ. మొదట రంగస్థలం, తర్వాత సినిమా, ఇదిగో ఇప్పుడు టీవీ. నన్ను నటుడిగా గుర్తు పట్టారు కదా చాలు నాకు," అన్నది తన సమాధానం. "అంటే, సినిమా వాళ్ళు టీవీకి రావడాన్ని ఒక మెట్టు దిగడంగా అనుకుంటారు కదండీ?" అన్నాను.
"ఏ నటుడుకైనా మీడియం ఏమిటన్నది ఎప్పుడూ సమస్య కాదు. తన టాలెంట్ చూపించే అవకాశం ఎంత ఉంది? జనం నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? అన్నది మాత్రమే చూస్తాడు. చూస్తూ ఉండండి, టీవీలో నటించడానికి అందరూ పోటీ పడే రోజు వస్తుంది," అన్నారు తను. వాళ్ళబ్బాయిని (పేరు పవన్ అని జ్ఞాపకం) పరిచయం చేశారు. "నాతోనే ఉంటున్నాడు" అంటూ. "సినిమాల్లోకి తీసుకొస్తారా?" తడుముకోకుండా అడిగేశాను నేను. "వాడిష్టం. వస్తానంటే వద్దనను.. ఇక్కడి కష్ట నష్టాలన్నీ భరించగలగాలి, వాడికంటూ వాడు పేరు తెచ్చుకోవాలి. ఇప్పటివరకైతే చేస్తానని అనలేదు" అన్నారాయన. వాళ్లబ్బాయిది చిరునవ్వే సమాధానం.

సాధ్యమైనంత వరకూ మరొకరి మీద ఆధారపడకుండా తన పనులు చేసుకోడానికి ప్రయత్నిస్తున్న ఆయన్ని యాక్సిడెంట్ గురించి గుర్తు చేసి బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది. అందుకే "సినిమాలేవైనా చేస్తున్నారా?" అని అడిగాను. "నాకోసం వేషం తయారు చేసి పిలుస్తుంటే వెళ్లి చేసి వస్తున్నా. వేషం ఇమ్మని ఎవరినీ అడగడం లేదు. టీవీ ప్రోగ్రామ్స్ ఉన్నాయి చాలు" అని జవాబొచ్చింది. ఆయన సినిమాలు కొన్నింటినీ "పిశ్చాత్తాపం" "క్లిష్ట పరిస్థితి" లాంటి ఉచ్చారణలనీ గుర్తు చేశాను. సంతోషించారు చాలా.

"నా ఒక్కడి గొప్పతనమూ కాదండీ.. రచయితలు రాసినవి, దర్శకుడు చెప్పినట్టుగా నేను చేశానంతే. జనానికి నచ్చింది, అదృష్టం.." అన్నారు. "ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయంటే కారణం నా గొంతే. అది జనానికి నచ్చడమే..." అంటూ భోజనం ముగించారు. "చాలా సంతోషం అండీ. భోజనం బాగుంది," అని నూతన్ ప్రసాద్ అన్నప్పుడు, "ఈయన నిజంగా సినిమా మనిషేనా?" అని సందేహం కలిగింది నాకు. ఆయన మరణ వార్త విన్నప్పటి నుంచీ ఆనాటి సంభాషణ మళ్ళీ మళ్ళీ గుర్తొస్తోంది.

12 కామెంట్‌లు:

  1. ayana gurinchi em cheppina enta cheppina takkuve..naku istam ayana voice antey..

    రిప్లయితొలగించండి
  2. నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ తెలుగు చలనచిత్రం పరిశ్రమ లో మంచి పేరెన్నిక పాత్రలు చేసే అతి కొద్ది మంది క్యారెక్టర్ ఆర్టిస్ట్ లలో ఒకరు.
    "దేశం చాల క్లిష్ట పరిస్థితిల్లో వుంది ..అన్న నూతన్ ప్రసాద్ డైలాగ్ ఇప్పటికి పాపులరే..
    1984 లో సుందరీ-సుబ్బారావు..సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు గెల్చుకున్న నూతన్ ప్రసాద్ జీవితం లో ఎన్నో ఒడిదుడుకులు చూసారు..
    బామ్మ మాట బంగారు బాట సినిమా షూటింగ్ లో ప్రమాదవశాత్తు సంభవించిన ఒక యాక్సిడెంట్ అతని జీవితాన్నే మార్చేసింది..
    ఏదేమైనా నేడు తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒక గొప్ప క్యారెక్టర్ నటుడిని కోల్పోయింది..

    రిప్లయితొలగించండి
  3. హ్మ్ ! ఎదిగిన కొద్దీ వోదగటం అంటే ఇదేనేమో ! ఆయన ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను .

    రిప్లయితొలగించండి
  4. "ఇప్పటికీ నాకు అవకాశాలు వస్తున్నాయంటే కారణం నా గొంతే. అది జనానికి నచ్చడమే..."

    అయన ఉచ్చారణ , డైలాగ్ చెప్పే విధానం (స్టైల్), గొంతు త్రివేణి సంగమం.

    రిప్లయితొలగించండి
  5. మంచి నటుడుని ఇప్పుడు కాదండి ఆయన కి యాక్సిడెంట్ అయినపుడే కోల్పోయాము. నాకు ఇష్టమైన యాక్టర్ .

    రిప్లయితొలగించండి
  6. ఈ అనుభవాన్ని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు మురళి గారు. నిండుకుండ తొణకదు అన్న మాట ఇలాంటి వారిని చూసే పుట్టిందేమో.. అంతటి విద్వత్తుండీ ఒదిగి ఉండటం నిజంగా గొప్పవిషయం. మయూరిగారు చెప్పినట్లు ప్రమాదం జరిగినపుడే ఓ మంచి నటుడిని కోల్పోయాం. ఇపుడు కనీసం ఆయన స్వరం వినే, అడపాదడపా హుందా అయిన పాత్రల్లో చూసే అవకాశం కూడా లేకుండా పోయింది. ఏంటో వరుసగా ఇలా మొన్న రమణ గారు నిన్న నూతన్ ప్రసాద్ గారు :-(

    రిప్లయితొలగించండి
  7. mee nunchi aa mahaa natudi gurinchi ekkuva raastarani aasinchanu.
    Kaanee mugimpu baagaa chepparu :)

    రిప్లయితొలగించండి
  8. మురళీ గారూ ఇది http://pakkintabbayi.blogspot.com/
    నా కొత్త బ్లాగు కూడలి లో ఇంకా లిస్ట్ చేయలేదు.ఈ లోగా మీరోసారి చూడాలని నా కోరిక(అసందర్భ ప్రసంగానికి క్షమాపణలతో)
    --పవన్ సంతోష్ సూరంపూడి

    రిప్లయితొలగించండి
  9. చాలా మంచి (నాకు ఇష్టమైన) ఆర్టిస్ట్. చక్కని ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకున్నందుకు మీకు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  10. @శిరీష: నిజమేనండీ, ధన్యవాదాలు.
    @కథాసాగర్: విలక్షణమైన గొంతు ఉన్న అతికొద్ది మంది నటుల్లో ఒకరు కూడానండీ.. ధన్యవాదాలు.
    @శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  11. @వాసు: 'త్రివేణి సంగమం' ..చక్కటి పోలిక.. ధన్యవాదాలండీ..
    @మయూరి: చక్రాల కుర్చీలో కూర్చుని కూడా కొన్ని మంచి పాత్రలు చేశారండీ.. ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: ఇంతలోనే సుజాత.. ప్చ్.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  12. @phanikris: నిజానికి ఏమీ రాయాలని అనిపించలేదండీ.. కానీ ఆ జ్ఞాపకం పదే పదే గుర్తొచ్చి ఈ టపా రాయించింది. ధన్యవాదాలు.
    @పక్కింటి అబ్బాయి: బాగుందండీ కొత్త ఇల్లు.. ఖాళీగా ఉంచకుండా అలంకరిస్తూ ఉండండి, వీలైనప్పుడల్లా :-) ..ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి