శనివారం, ఫిబ్రవరి 26, 2011

శకునాలుచెప్పే బల్లి

"అందరికీ శకునాలుచెప్పే బల్లి తను వెళ్లి కుడితిలో పడిందిట.." బామ్మ నోట ఈ సామెత ఎన్నిసార్లు విన్నానో లెక్కలేదు చిన్నప్పుడు. ఇవాళ పదేపదే గుర్తొచ్చిన సామెత ఇది. యాదృచ్చికంగా చూసిన రెండు టీవీ కార్యక్రమాలు ఇందుకు కారణం. టీవీ ఛానళ్ళు మారుస్తూ బాపూ సినిమాల్లోని పాటలు వస్తుంటే 'స్టూడియో ఎన్' దగ్గర ఆగాను మధ్యాహ్నం. బహుశా ముళ్ళపూడి వెంకట రమణకి నివాళిగా ఏదన్నా కార్యక్రమం ప్రసారం చేస్తున్నారేమో అనుకున్నాను మొదట.

అయితే, వ్యాఖ్యానం చూశాక అర్ధమయ్యింది ఏమిటంటే, కనుమరుగైపోతున్న తెలుగు వారి కట్టూ బొట్టూ పట్ల ఆ చానల్ వారు తీవ్ర ఆవేదన వెలిబుచ్చుతూ చేసిన కార్యక్రమం అని. వారి ప్రకారం ఇప్పుడు స్కూళ్ళలోనూ, కాలేజీల్లోనూ, కార్యాలయాలలోనూ ఎక్కడా కూడా మహిళల వస్త్రధారణ, అలంకరణ మన సంస్కృతిని ప్రతిబింబించడం లేదు. వయసుతో నిమిత్తం లేకుండా అందరూ ఫ్యాషన్ల వెంబడి పరుగులు తీస్తున్నారు తప్ప, సంస్కృతిని పట్టించుకోవడం లేదు.

టీవీ చానళ్ళు ఏ కార్యక్రమం చేయాలన్నా అందుకు ముడి సరుకు సినిమా తప్ప మరొకటి లేదు కాబట్టి, ఈ కథనానికి కూడా జతగా కొన్ని సినిమా పాటల క్లిప్పింగులని వాడుకున్నారు. దర్శకులు బాపూ, వంశీలకి తెలుగు వారి కట్టూ బొట్టూ అంటే యెంతో మమకారం అని చెబుతూ, వారి సినిమాల్లో పాటల క్లిప్పింగులు కొన్ని ప్రసారం చేశారు. అలాగే ఇప్పటి తాజా సినిమాల్లో తారల వస్త్రధారణ గురించి ఆందోళన చెందుతూ అర్ధనగ్న క్లిప్పింగులనీ పనిలో పనిగా ప్రసారం చేసేశారు.

అంతటితో ఊరుకోకుండా, ఇప్పుడందరూ పరభాషా తారలే కాబట్టి వారు తెలుగు అలంకరణని వాళ్లకి ఇష్టం వచ్చినప్పుడు మాత్రమే చేసుకుంటున్నారనీ, అదికూడా పూర్తిగా కాకుండా, కొంతమేరకేననీ కూడా గమనించేశారు. "ఇలా అయితే తెలుగు సంస్కృతి నిలబడేదెలా?" అని ఆవేదన చెందేశారు కూడా. ఈకార్యక్రమం చూడగానే నాకు విపరీతంగా నవ్వొచ్చింది. ఎందుకంటే, సదరు కార్యక్రమాన్ని ప్రెజెంట్ చేసిన యాంకర్ పేరుకి చీర కట్టుకున్నా, ఇతరత్రా ఏ రకంగానూ కూడా తెలుగు అలంకరణ చేసుకోలేదు.

నేటి తెలుగు నాయికలు జడ వేసుకోడం లేదనీ, వోణీలని మరిచిపోయరానీ అరగంట సేపు ఆవేదన చెందిన ఆ యాంకర్ కూడా జడ వేసుకోలేదు. తూర్పు కొండల మధ్యన ఉదయించే సూర్యుడిలాంటి బొట్టూ కనిపించడం లేదు మన నాయికలకి అని చెప్పినావిడ నుదిటి మీద ఎంత పరకాయించి చూసినా బొట్టు కనిపించ లేదు నాకు. ఇక ఆవిడ చదివిన స్క్రిప్టులో తెలుగు పదాలని వెతికి పట్టుకోవడం చాలా కష్టమైపోయింది. మరి ఈ కార్యక్రమం చూశాక బామ్మ చెప్పిన సామెత గుర్తు రాకుండా ఎలా ఉంటుంది?

ఈ కార్యక్రమం చూడ్డానికి కొన్ని గంటల ముందే ఉదయాన అనుకోకుండా టీవీ తొమ్మిది దగ్గర కాసేపు ఆగాను. రాంగోపాల్ వర్మతో ఇంటర్వ్యూ లాంటి చర్చ. నిన్ననో, మొన్ననో ఆయన ఆ ఛానల్ మీద దావా వేసినట్టు ఎక్కడో చదివాను. ఆ నేపధ్యంలో, కార్యక్రమం ఏమై ఉంటుందా అని కాసేపు చూశాను. దావాకి కారణమైన తమ వివాదాస్పద ప్రోగ్రాం ని సమర్ధించుకోడానికి శతవిధాల ప్రయత్నించారు యాంకర్. "నా సినిమాలని ఏమన్నా అనండి. కానీ నావి కాని ఉద్దేశాలని నాకు ఆపాదించడం మానండి" అని మళ్ళీ మళ్ళీ చెప్పారు రాంగోపాల్ వర్మ.

"మీరీ వివాదం చేస్తున్నది మీ తదుపరి సినిమాని ప్రమోట్ చేసుకోడానికే కదా?" అని యాంకర్ తెలివిగా ప్రశ్నిస్తే, "నా సినిమా పబ్లిసిటీ కన్నా, మీ చానల్ కి పెరిగే టీఆర్పీ రేటింగే ఎక్కువ" అని అంతకన్నా తెలివిగా జవాబిచ్చారు వర్మ. మధ్యలో యండమూరి కలగజేసుకుని వర్మకి ఏదో సలహా ఇవ్వబోతే, దానిక్కూడా తీవ్రంగా స్పందించారు వర్మ. మెరుగైన సమాజం కోసం చర్చని హడావిడిగా ముగించారు ఛానల్ వారు.

23 కామెంట్‌లు:

  1. ఇటువంటీ ఆవేదనల్ని మన టీవీ ఛానెళ్ళు వెలిబుచ్చుతుండడం హాస్యాస్పదం. ఇందాకే టీవీ9లో ఫేషను మీద చేసిన ఒక ముక్కలో - "మన లంగా వోణీలాగానే గాగ్రా చోళీ కూడా సెలెబ్రేషన్ డ్రెస్" అని సెలవిచ్చింది లంగరమ్మ.

    రిప్లయితొలగించండి
  2. నేను చూసా ఆ చర్చ రజనీకాంత్ ఎంత సేపూ వర్మ ని ఎక్కడ ఇరికిద్దామా అనే ప్రయత్నం కనపడింది. వర్మ సమాధానాలు తనదయిన శైలి లో బాగానే చెప్పాడు.
    సినిమా తీసేవాళ్ళు కథ బాగుంది ఇది తప్పకుండ హిట్ అవుతుంది అనే నమ్మకం తో నే తీస్తారు అని పదే పదే చెప్పిన రజనీకాంత్ మాత్రం ఎంత సేపూ మీరు ఫ్లాప్ అయ్యే సినిమాలు ఎందుకు తీస్తారు అన్న ప్రశ్ననే వివిధ రకాలుగా ప్రోగ్రాం అంతా అడుగుతూనే ఉన్నాడు.

    రిప్లయితొలగించండి
  3. నాకో సందేహం వస్తుంటుంది చాలామాట్లు. తెలుగు సంస్కృతి అంటే ఆడవారి వస్త్ర ధారణ దగ్గరే ఆగిపోతుందెందుకు.మగవారి పంచ,లాల్చీ/పొడుగు చొక్కా, కండువా ల గురించి మాట్లాడరెందుకు.సంస్కృతి అంటే వాళ్ళ ఉద్దేశ్యం లో వస్త్ర ధారణ కి మించి లేదా.

    రిప్లయితొలగించండి
  4. మురళీగారు,
    మీరు మరీనూ. సామాజిక బాధ్యతతో వాళ్ళు కార్యక్రమాలు చేస్తుంటే ఆ విషయాన్ని ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన చెందుతూ మరో కార్యక్రమం చేస్తేనే కానీ వారి ఆరాటాన్నీ, తపననీ, ఆవేదననీ మనమెవరమూ గుర్తించేలా లేము. :)

    కొత్తపాళీ గారు,
    "మన లంగా వోణీలాగానే గాగ్రా చోళీ కూడా సెలెబ్రేషన్ డ్రెస్"
    హహ్హహ్హ.
    బులుసు గారు,
    :) నాదీ ఇదే సందేహమండి.

    రిప్లయితొలగించండి
  5. బాగుందండి మీ విశ్లేషణ. ఈ మధ్య మా కాలేజ్ లో ఈ ఆంకరమ్మల గొడవెక్కువైపోయింది. ఏదోఓదానికి వచ్చేస్తున్నారు. ఎంతో సాంప్రదాయబద్ధంగా ఉండే మా అమ్మాయిలు వీళ్ళను చూసి ఏం నేర్చుకుంటారో అని మా భయం:)

    రిప్లయితొలగించండి
  6. లంగరమ్మ..భలే తర్జుమా చేశారు కొత్తపాళీ గారు.

    ఐతే ఆవిడ కూడా గొప్ప పండితురాలన్నమాట(నా లాగే) :):):)

    రిప్లయితొలగించండి
  7. :) అవును.. సంస్కృతి అంటే ఆడ వాళ్ళు పట్టు చీరలూ, అవసరానికి మించి నగలు పెట్టుకోవటం అన్న అభిప్రాయం ..

    లంగరమ్మ --- LOL.. నేనూ ఇంక ఈ పదాన్ని వాడుకుంటాను..

    రిప్లయితొలగించండి
  8. అందుకే మురళిగారూ అందుకే
    మనం ఈటీవీలోసుమన్‌బాబుని తప్ప బులితెరమీద మరొకర్ని చూడకూడదు. సమాజంలో ఒకవ్యక్తిగా మనబాద్యతల్ని ఆయన చూపినంత చక్కగా ఎవరు చూపగలరు? నేను చెప్పించి తప్పా?తప్పా?తప్పా?

    రిప్లయితొలగించండి
  9. :)

    >>మన లంగా వోణీలాగానే గాగ్రా చోళీ కూడా సెలెబ్రేషన్ డ్రెస్ <<

    లంగావోణి సెలెబ్రేషన్ డ్రెస్సులా !!!!???
    హ్మ్....కలికాలం

    రిప్లయితొలగించండి
  10. ఏంటో నవ్వాలో ఏడవాలో కూడా అర్థంకాకుండా ఉంది.. ఏం చెప్పమంటారు.. ఆఫీసుకి అప్పుడప్పుడు చీర కట్టుకొస్తూ ఉంటే, ఆరోజు స్పెషల్ ఏంటో చెప్పే వరకూ ప్రాణం తీస్తారు సహోద్యోగులు.. మామూలుగా చీర కట్టుకు రాకూడదా..!! అని నేను తెగ ఆశ్చర్యపడిపోతూ ఉంటాను..:(
    >>మన లంగా వోణీలాగానే గాగ్రా చోళీ కూడా సెలెబ్రేషన్ డ్రెస్ <<
    తిరుగు లేని వ్యాఖ్య.. :(((

    రిప్లయితొలగించండి
  11. బులుసు గారు నా మనసులో మాటని అలా చెప్పేసారు...నూటికీ నూరు శాతం నాదీ అదే మాట.

    రిప్లయితొలగించండి
  12. నాకింకో సామెత గుర్తోస్తోందండీ ఈ టీవీల వాళ్ళ గురించి చదివాక.. సరైన సందర్భమో లేదో తెలీదు మరి.. మీరే చెప్పాలి..
    దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఏంటి? :P

    రిప్లయితొలగించండి
  13. ఆ సామెతే ఎందుకు గుర్తొచ్చింది అంటే, వర్మతో చేసిన ఆ ప్రోగ్రామ్లో యాంకర్.. టీవీ 9 లాగా మీకు సామాజిక స్పృహ లేదా.. మీ సినిమాలు చూసి జనాలు నాశనమైపోతే ఎలా అని అడిగాడు కదా! :) దానికి వర్మ సమాధానం సూపర్ కదా.. మీకంతేనా అని తిరిగి ప్రశ్నించాడు. ;)
    మొత్తానికి మెరుగైన సమాజం కోసం ఏం చెయ్యాలో వెళ్ళని చూసే తెల్సుకోవాలి సుమీ! :D

    రిప్లయితొలగించండి
  14. మొన్నీమధ్య జరుపుకున్న మాత్రు భాషా దినోత్సవం రోజున నాకు ఈ క్రింది గ్రీటింగ్ వచ్చింది , పరికించండి
    Happy mother tongue day greetings to you

    అన్నీ బల్లులే కుడితి కుండలు చాలటం లేదు.

    ఈ సామెత ప్రతి రోజూ వాడుతూనే ఉంటాము.

    రిప్లయితొలగించండి
  15. @పరిమళం: ధన్యవాదాలండీ..
    @వాసు: ధన్యవాదాలండీ..
    @కొత్తపాళీ: అయ్యబాబోయ్.. సదరు ప్రోగ్రాం ని నేను మిస్సైపోయానండీ.. మీరు చెప్పారు కాబట్టి సరిపోయింది కానీ, లేకపోతె ఇంత బ్రహ్మాండమైన అభిప్రాయాన్ని మిస్సైపోయే వాడిని.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @భాను: నిజమనేనండీ.. మరో ప్రశ్నే లేనట్టు..అదే ప్రశ్న తిప్పి తిప్పి అడిగి విసిగించాడు.. ధన్యవాదాలు.
    @బులుసు సుబ్రహ్మణ్యం: విలువైన పాయింట్.. ఇక నేను గమనించింది ఏమిటంటే, ఈ మధ్య కాలంలో కుర్తా పైజమాలూ, షేర్వానీలూ తెలుగు పురుషుల సంప్రదాయ వస్త్ర విశేషాలు అయిపోయాయి.. అదండీ సంగతి.. ధన్యవాదాలు.
    @శిశిర: ఈ ప్రోగ్రాముల పరంపల ఇలా కొనసాగాల్సిందే అంటారా అయితే? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @జయ: "యెంతో సంప్రదాయ బద్ధంగా ఉండే మా అమ్మయిలు.." ..నమ్మమంటారా అండీ? లేక జోక్ చేస్తున్నారా?? ..ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: అబ్బో.. టీవీ వాళ్ళ తెలివి తేటల ముందు ఎవరూ సరిపోరు లెండి :-) :-) ..ధన్యవాదాలు.
    @కృష్ణప్రియ: చివరికి వాళ్ళలా నిర్ణయించారండీ మరి.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  18. @సుబ్రహ్మణ్య చైతన్య: లేదండీ.. సరైన సమయంలో సరైన విషయం చెప్పారు.. నేనే కొంచం ఆలస్యంగా స్పందిస్తున్నాను.. అన్నట్టు సుమన్ గారు 'శుభం' పలకబోతున్నారు.. ధన్యవాదాలు.
    @నాగార్జున: అలా అయిపోయిందండీ పరిస్థితి.. ధన్యవాదాలు.
    @మనసు పలికే: మన చుట్టూ మార్పులు యెంత వేగంగా జరుగుతున్నాయో అర్ధం అవుతూ ఉంటుందండీ ఇలాంటి సందర్భాలలో.. ధన్యవాదాలు.
    @ఆ.సౌమ్య: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  19. @సుమలత: ధన్యవాదాలండీ..
    @మధురవాణి: సామెత బాగుంది కానీ, మన టీవీ వాళ్ళు కేవలం 'దెయ్యాలు' మాత్రమే అంటే నాతో సహా చాలామంది ఒప్పుకోరండీ మరి.. :-) :-) ..ధన్యవాదాలు.
    @మధురలాలస: నిజమేనండీ కుండలు చాలడం లేదు.. :-) :-) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. ఎందుకండి మా అమ్మాయిల మీద మీకు అంత డౌట్. నేనొప్పుకోనంతే.

    రిప్లయితొలగించండి