బుధవారం, నవంబర్ 10, 2010

చిల్లరకొట్టు-సూపర్ బజారు

ఇప్పుడంటే 'షాపింగ్' అని ఒకింత స్టైలుగా చెప్పి బజారుకి బయలుదేరుతున్నాం కానీ, చిన్నప్పుడు ఇంట్లోకి ఏం కావాలన్నా చిల్లర కొట్టుకి పరిగెత్తే వాళ్ళం, కూసింత గర్వంగా. రెండు కొట్లు ఇంచుమించు ఎదురెదురుగా ఉండేవి. ఒకటి కొంచం పెద్దది. జనం ఎక్కువగా ఉంటారు. రెండోది మా సుబ్బమ్మ గారిది. చిన్న కొట్టే అయినా దొరకని వస్తువు దాదాపు ఉండదు. నా మొగ్గెప్పుడూ సుబ్బమ్మగారి కొట్టు వైపే ఉండేది. ఒకే ఒక్క సిగరెట్ కొన్నా (నాక్కాదు, నాన్నకి) నాలుగు బఠాణీలో చిన్న బెల్లంముక్కో 'కొసరు' ఇచ్చేవాళ్ళు. (ఇది మాత్రం అచ్చంగా నాకే, ఎవరికీ వాటా లేదు).

ఇంట్లో ఉన్నంతసేపూ కొట్టుమీదకి వెళ్ళే అవకాశం ఎప్పుడెప్పుడొస్తుందా అని ఆశగా ఎదురు చూసేవాణ్ణి. చిన్న వస్తువు కొనుక్కు రాడానికైనా, కొట్టు దగ్గర మనకి నచ్చినంత సేపు కూర్చోవచ్చు. నలుగురూ చేరతారు కాబట్టి ఊళ్ళో కబుర్లు వినొచ్చు. వస్తూ వస్తూ కొసరు చప్పరించొచ్చు. పైగా, కొట్టు దగ్గర ఉన్నంతసేపూ చదువు బాధ ఉండనే ఉండదు. కానీ ఏం లాభం, తరచుగా కొట్టుమీదకి వెళ్ళే అవకాశం ఉండేది కాదు. ఒకటో తారీఖునో, రెండో తారీఖునో నెల సరుకులన్నీ పొరుగూరి నుంచి బండి మీద వచ్చేసేవి.


అమ్మ రెండు రోజులు శ్రద్ధగా కూర్చుని చీటీ రాసినా, తప్పకుండా కొన్నయినా మర్చిపోతూ ఉండేది. వాటిని తేడానికీ, ఇంకా నాన్నకి సిగరెట్లు, అగ్గిపెట్టెలు తేడానికీ నా కొట్టు యాత్ర సాగుతూ ఉండేది. శ్రీరమణ కథ 'ధనలక్ష్మి' లో కథానాయిక ధనలక్ష్మి కిరాణా వ్యాపారం చేయడంలో సూక్ష్మాలని తన భర్త రామాంజనేయులుకి చెబుతూ అంటుంది కదా "మనం చిన్న వాళ్ళం. సెంటర్ లో పెద్ద షాపుల వాళ్ళతో పోటీ పడాలంటే ఒకటే చిట్కా. మన దగ్గర సమస్తం దొరుకుతాయని పేరు పడాల. పేరొస్తే బేరాలు వాటంతటవే వస్తాయ్.." ఏ ధనలక్ష్మీ వ్యాపార సూత్రం చెప్పకపోయినా మా ఊరి చిల్లరకొట్ల వారు ఈ ఫార్ములాని అమలు చేసేయడంవల్ల దొరకని వస్తువంటూ ఉండేది కాదు.

నగరజీవితంలో మొదట కిరాణా షాపులనీ, మినీ-సూపర్ బజార్లనీ ఆ తర్వాత్తర్వాత బడా సూపర్ బజార్లనీ చూశాన్నేను. చెప్పకపోవడం ఎందుకు, సూపర్ బజార్లో షాపింగ్ అంటే భలే ఇష్టం నాకు. షాపుల్లో పుస్తకాల షాపు తర్వాత నాకు నచ్చే రెండో షాపు సూపర్ బజారే. ఎన్నెన్ని వస్తువులు... ఎంత చక్కని అమరిక.. ఎన్ని రకాల పరిమళాలు. క్రమం తప్పకుండా పుస్తకాల షాపుకి వెళ్తే కొత్త పుస్తకాల గురించి తెలిసినట్టే, రెగ్యులర్గా సూపర్ బజారుకి వెళ్తే కొత్త వస్తువులు ఏం వచ్చాయో తెలిసిపోతుంది కదా. సూదిపిన్ను మొదలు సూపర్రిన్ వరకూ (అబ్బే, ప్రాస కోసం) దొరకని వస్తువంటూ ఉంటుందా? గేటు దాటి లోపలి వెళ్తే అదో కొత్త ప్రపంచం.


రెండుమూడేళ్ళ క్రితం, అప్పటివరకూ నేను రెగ్యులర్గా వెళ్ళిన ఒకానొక సూపర్ మార్కెట్ ఉన్నట్టుండి మూత పడింది. కారణం ఆర్ధిక మాంద్యం అని వినికిడి. ఆ షాపు నాకెంతగా పరిచయం అంటే.. ఏ వస్తువు ఏ రాక్ లో దొరుకుతుందో సేల్స్ వాళ్ళకన్నా నాకే బాగా తెలిసేది. కనిపించిన వాళ్ళందరికీ ఫలానా సూపర్ మార్కెట్లో సరుకులు కొనుక్కోమని చెప్పాను కూడా, అక్కడికి నేనేదో వాళ్ళకి మార్కెటింగ్ చేస్తున్నట్టు. నవ్విన వాళ్ళు నవ్వారు. నవ్విన నాపచేను పండలేదు కానీ, కొన్నాళ్ళకి ఆ సూపర్ మార్కెట్ మూతపడింది. అక్కడ ఆఖరి షాపింగ్ చేసిన రోజు నాకింకా బాగా జ్ఞాపకం. ఇప్పటికీ అక్కడ కొన్న కొన్ని వస్తువులు చూసినప్పుడు ఆ జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఆతర్వాత ఏ షాపుతోనూ అంతగా అనుబంధం బలపడలేదు.

సూపర్ బజార్ల వాళ్ళు రకరకాల స్కీములు పెడుతూ ఉంటారు. మిగిలిన షాపులకన్నా తమ దగ్గర ధరలు తక్కువ అని భ్రమ పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆవుని అమ్మడానికి వెళ్ళిన వాళ్ళ చేత గేదెను కొనిపించేందుకు ఏం చేయాలో అన్నీ చేయగలరు వాళ్ళు. మనమేమో అన్నీ కాకపోయినా కొన్ని తెలిసినా, అస్సలు ఏమీ తెలియనట్టు వాళ్ళు చెప్పేవి వింటూ నమ్మినట్టు నటిస్తూ ఉండాలి. తగుమాత్రం జాగ్రత్తలో ఉండకపోతే క్రెడిట్ కార్డు తాలూకూ లిమిట్ కూడా దాటిపోయే ప్రమాదం ఉంది. ఈమధ్య ఒక సూపర్ బజారుకి వెళ్ళినప్పుడు బిల్లుతో పాటు ఒక కార్డు కూడా ఇచ్చాడు కౌంటర్ అబ్బాయి. అక్కడ కొన్నప్పుడల్లా ఆ కార్డు చూపిస్తే భవిష్యత్తులో డిస్కౌంట్లు వస్తాయిట. కార్డు ఉచితమేనట.. నాకు మా సుబ్బమ్మగారు గుర్తొచ్చారు.

25 కామెంట్‌లు:

  1. Chala baga rasaru. Marosari balyamloki teesukellaru. Dhanyavadalu.

    Sheik Ahmad Vali...Visakhapatnam

    రిప్లయితొలగించండి
  2. మొదటి మూడు పేరాలు మటుకే చదివి అక్కడే ఉండిపోయా! మా నాంచారమ్మగారి కొట్టు, శ్రీలక్ష్మమ్మగారి కొట్టు గుర్తుకొచ్చినాయి....అందుకు...

    అదో కారణమైతే సూపరు బజారు అనగానే ఇక ఆ పైన చదివే ఇంటరెష్టు పోవడం కూడా ఇంకో కారణం... :)

    రిప్లయితొలగించండి
  3. బాగుందండి మురళి గారు. మా దగ్గిరైతే రెండు సూపర్ మార్కెట్లు, ఓ చిల్లర కొట్టు పక్కపక్కనే ఉన్నాయి. చాలా తొందర పని ఉంటే మాత్రం నేను చిల్లరకొట్టుకే పోతాను. ఎందుకంటే బిల్లింగ్ కోసం వైటింగ్ ప్రాబ్లం ఉండదు మరి:)

    రిప్లయితొలగించండి
  4. మురళీగారు, మీరు రాస్తుంటే సాధారణ విషయాలుగూడా అబ్బురమనిపిస్తుంటాయండి.

    చిన్నప్పుడు విజయవాడలో విజయకృష్ణ సూపర్‌‌బజార్ ప్రారంభించినప్పుడు నాన్న తీసుకెళ్ళినపుడు ఎగేసుకుంటూ వెళ్ళినా,
    నాకిప్పటికీ చిల్లరకొట్లే ఇష్టం.

    చిల్లరకొట్లో ఇంకో వసతి - పద్దులు (అప్పులు).

    రిప్లయితొలగించండి
  5. ivvaalhae anukunnaanu, blog open chaestoo eamToe? ee madhya nemalikannu loe postlu eamee kanapaDaTam laedu ani.raayaDam agginchinaTlunnaaru?

    రిప్లయితొలగించండి
  6. చిల్లరకొట్టు ..అదేనండీ సూపర్ బజార్ జిందాబాద్ అనాల్సిందే మరి :) :)

    రిప్లయితొలగించండి
  7. నిన్న మా ఊరెళ్ళా మురళిగారు. ఊళ్ళో సంత జరుగుతోంది. అది చూడగానే ఇలాగే అనిపించింది. చిన్నప్పటి సంత, కిరాణాకొట్లు, ఇప్పటి సూపర్ బజార్‌లు అన్నీ ఒక్కసారి కళ్ళముందు మెదిలాయి. బాగా రాశారండి.

    రిప్లయితొలగించండి
  8. >>ఇంట్లో ఉన్నంతసేపూ కొట్టుమీదకి వెళ్ళే అవకాశం
    ఈ మాట వినగానే మా అమ్మమ్మ గుర్తొచ్చిందండీ. "కొట్టు మీద" అని ఆవిడ వాడుతుంది.ఎంత నవ్వే వాళ్ళమో కొట్టు మీదకి ఎలా వెళ్తావు అమ్మమ్మా అని.

    సుబ్బమ్మ గారి కొట్లే మెల్లిగా సూపర్ మార్కెట్లయ్యి బెల్లం,జీడిల బదులు కొసరుగా డిస్కవుంట్ కూపన్లు ఇస్తున్నారు.

    సుబ్బమ్మ గారే నయం. ఆవిడ ఇచ్చింది ఎంజాయ్ చేసేవాళ్ళము. వీళ్ళిచే కూపన్లు అవసరమయినప్పుడు కనపడవు ఎక్స్పైర్ అయ్యాకా తప్ప.

    >> ఆవుని అమ్మడానికి వెళ్ళిన వాళ్ళ చేత గేదెను కొనిపించేందుకు
    ఈ వాక్య ప్రయోగం బావుంది

    రిప్లయితొలగించండి
  9. muraligaru, mi anni tapallonu patha nundi, kottavaraku bale gurthu chestharandi. mi shanigala masam kuda naku chala istam. naaku kuda chinnappudu ma thathamma school nundi raagane 5 pysalo, 10 pysala billo ichhedi(appatlo undevi 5,10). nenu alage maa pakkanunna dhukanam loki duripoyi oka paapadamoo, biscuit oo koni thinesedanni, atlage ma thathagaariki Cigarette kosam velthe kuda, aa dhukanam ammamma naku chinna biscuit ichhedi. oorlu maari, dhukanaalanundi, superbazar laki, vaati nundi, shoping malls ki cherukoni ippudanni visugesi, nenu malli chivariki chinna chinna dhukaanaalonni shoping chesthunnanu, offer lu, branded lu, discount lu anna golalu lekunda.mi gnyapakaalu bavunnay.

    రిప్లయితొలగించండి
  10. నాలాగే మీబాల్యంకూడా సిగరెట్లమోతతో గడిచిపోయిందా? బాలకార్మికులకు కూడా ఇలాంటీకష్టాలు ఉండవు. ఉన్నట్టుండి మాచ్ చూసేటప్పుడో, కారమ్సాడేటప్పుడో, చదువుకునేటప్పుడో (నిజ్జం!) పిలుస్తారు.
    ఇక చిల్లరకొట్టంటే మనకుతెలిసిన ఒకేఒక అంగడి నారాయణశెట్టిది. నోయిడాకి వెళ్ళేంతవరకు ఇంకెక్కడా నెలసరుకులు కొనాల్సిన అవసరంరాలేదు.
    శేట్టిగారు చాలామంచాయన. రెండుమూడునెలలు, మద్యలో కొంతకాలం ఆరేడునెలలు జమెయ్యకపోయినా ఎప్పుడూ అడిగిందిలేదు. నోయిడాలో స్టోర్ పద్దెనిమిది అనొకటుంది. కొలీగ్స్ అంతా బిగ్‌బజార్లకి వెళ్ళినా నేనుమాత్రం అక్కడేకొనేవాడిని. ఎందుకో బిగ్‌బజారోడు మాఊర్లో కూరగాయలసాయిబులాగా నన్నుమోసంచేస్తాడని అపనమ్మకం

    రిప్లయితొలగించండి
  11. మురళి గారు !మా చిన్నపుడు మా ఊళ్ళో కిరణా షాపు -"చిక్కాల కాంతమ్మ "గారిది.
    ఇంట్లోనే 'చిల్లర కొట్టు '.రాగి చెంబు ఆమె క్యాష్ కౌంటర్ .
    కొట్టు కి వెళ్ళిన ప్రతీ సారి చిన్న 'బెల్లం ముక్క 'కొసరు పెట్టేదావిడ.
    నా చిన్నప్పటి జ్ఞాపకాల్ని జ్ఞప్తికి తెచ్చారు .మీకు ధన్యవాదాలు .

    రిప్లయితొలగించండి
  12. మురళి గారు..!,

    హమ్మయ్యా! మీ టపాలు అన్నీ చదవడనికి నాకు దాదాపు 3 నెలలు పట్టింది. నిజ్జం గా మీరు ఒక విఙ్ఞానపు పుట్ట, ఎంత తోడినా ఏదో ఒక కొత్త విషయం వస్తూనే వుంటుంది. మీ పరిశీలన, చూసింది చూసినట్లు, చదివింది చదివినట్లు, విన్నది విన్నట్టూ చెప్పడం మీకు మాత్రమే ప్రత్యేకం. ఎంత చెప్పినా తక్కువే అవుతుందేమో!. మీరు చదివిన పుస్తకాలను బట్టి చుస్తే మీరు బాగా తలపండిన వారై వుండాలి అనిపిస్తుంది, కాని చాలా సంధర్భాలలో ఓ 35-40 సం|| వయసు వారేమో అనిపిస్తుంది. ఇక్కడ సమస్య మీ వయసు కాదండి బాబు, ఇంత తక్కువ సమయంలో అన్ని పుస్తకాలు ఎలా చదవగలిగారా అని.మా దురదృష్టం మా ఊరిలో ఒక పుస్తకాల దుకాణం కూడలేదు, ఉన్నవి కూడా "చదువు కొనే" వారికి ఉపయోగపడేవే. చదవాలి అనుకొనే వారికి ఉపయోగపడే పుస్తకాలు దొరకవు. కనీసం online లో తెప్పిద్దాం అనుకున్నా (విశాలాంద్ర) అది పని చేయడం లేదు. ఏంటో నా వ్యాక్యే ఒక పెద్ద టపా ల తయారైంది. తరచుగా వ్రాస్తూ వుండండి, ఈ సం|| వ్రాయడం ఎందుకనో తగ్గించి నట్లున్నారు.
    భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మీరు మరిన్ని పుస్తకాలు చదివి, మాచేత చదివించాలని కోరుకుంటూ....


    రఘురామ్

    రిప్లయితొలగించండి
  13. @అనార్కలి: ధన్యవాదాలండీ..

    @హరేకృష్ణ: ధన్యవాదాలండీ..

    @మాగంటి వంశీ మోహన్: నిజమేనండీ.. చిల్లర కొట్టుకి ఉన్న ఆకర్షణ సూపర్ బజార్ కి ఎక్కడిది? ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @జయ; నేనూ వెళ్తూనే ఉంటానండీ.. ఒకలాంటి 'పర్సనల్ టచ్' ఉంటుందక్కడ.. సూపర్ బజార్లలో దొరకదు.. ధన్యవాదాలు.

    @జేబీ: నిజమేనండీ.. అవసరానికి భలేగా ఆదుకుంటారు వాళ్ళు. ధన్యవాదాలు.

    @సునీత; రాయాలనే ఉంది కానీ, వీలు కావడం లేదండీ.. బహుశా ఇకపై కొంచం తరచుగా రాయొచ్చు :-) ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @పరిమళం: అనేద్దాం అండీ.. నేను రెడీ.. ధన్యవాదాలు.

    @శిశిర: 'సంత..' ఎక్కడికో తీసుకెళ్ళి వదిలేశారండీ నన్ను... ఎన్ని జ్ఞాపకాలో.. ఈసారెప్పుడైనా పంచుకుంటా.. ధన్యవాదాలు.

    @ఆవకాయ: మా చిన్నప్పుడు అలాగే అనేవాళ్ళం అండీ.. అనుకోకుండానే ఆమాట వాడేశాను.. మీరు రాశాకే గమనించాను.. నిజమేనండీ సుబ్బమ్మగారే నయం.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @స్ఫూర్తి: నా టపా మిమ్మల్ని కూడా బాల్యంలోకి తీసుకెళ్ళిందన్న మాట!! ..ధన్యవాదాలండీ..

    @మాలాకుమార్: ధన్యవాదాలండీ..

    @సుబ్రహ్మణ్య చైతన్య: అసలీ సిగరెట్లదే ఒక పెద్ద కథండీ.. తరచూ వాటి రేట్లు పెరిగేవి.. నేను యేవో కొనుక్కు తినేసి అబద్ధం చెబుతున్నానని ఇంట్లో డౌట్లు.. అంతకన్నా సీతమ్మ అగ్ని పరీక్ష నయం అనిపించే సందర్భాలు ఎన్నో (ఇప్పుడు తలచుకుంటుంటే..) ..ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  17. @రఘురామ్ : చాలా చాలా ధన్యవాదాలండీ.. నా పాత టపాలన్నీ శ్రద్ధగా చదివి మీరు రాసిన విశ్లేషణ నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.. ఇక మీ ప్రొఫైల్ చెబుతున్నట్టుగా మీరు చిత్తూరు వాసి అయినట్టయితే, తిరుపతి లో విశాలాంధ్ర, ప్రజాశక్తి లో చక్కని పుస్తకాలు దొరుకుతాయి మీకు. విశాలాంధ్ర వారి సంచార పుస్తకశాల అప్పుడప్పుడూ వస్తూనే ఉంటుంది మీ పట్టణానికి.. అనివార్య కారణాల వల్ల తరచుగా రాయలేక పోతున్నానండీ.. చదవడం తర్వాత ఈ రాయడం నాకు అంతగా సంతోషాన్ని కలిగిస్తోంది.. రాస్తూనే ఉంటాను..

    రిప్లయితొలగించండి
  18. చాలా బాగా వ్రాశారు
    నాకు మీలాగ కొసరు తీసుకునే అవకాశం రాలేదు :-(

    రిప్లయితొలగించండి
  19. మురళిగారు చాలా రోజుల తర్వాత మీ టపా చదువుతున్నాను. కాదేదీ బ్లాగింగుకనర్హం అన్నరీతిలో భలే సబ్జెక్ట్స్ ఎన్నుకుంటారు. చిల్లర కొట్టు కబుర్లు టపా ఎప్పటిలానే బ్రహ్మాండంగా ఉంది, బోలెడు అనుభూతుల్ని తట్టిలేపింది.

    రఘురామ్ గారు మదనపల్లి లో శివ బుక్ హౌస్ అండ్ కాలేజి బుక్ హౌస్ కూడా విశాలాంధ్ర స్టాకిస్టులండి ఆయా షాపుల్లో దొరకచ్చు. అలానే తిరుపతి విశాలాంధ్ర నంబరు : 2222475 అలానే నెట్లో avkf.org కూడా ప్రయత్నించండి. అలానే విశాలాంధ్ర లింక్ మీరు ప్రయత్నిస్తున్నది ఇదేనా.. http://www.visalaandhraph.com

    రిప్లయితొలగించండి
  20. @వేణు గారు ...
    అవునండి అదే లింక్ ను ఉపయోగిస్తున్నా, కానీ ప్రయోజనం కనిపించడం లేదు. :( .....ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  21. మురళి గారు
    కిరణా కొట్టు గురించి ఏమీ రాస్తే ఏమీ లాభం, మీ నాన్నగారు వీపు నిజం గానే చీరేస్తారనే భయం తో సుబ్బమ్మ గారి ఆవకాయ తిన లేక పోయారు.
    మీ ఆనాటి తపన చదువుతుంటే హంపి నుండి హరప్పా లో తిరుమల రామచంద్ర గారి ఉల్లి పకోడీ ల వ్యామోహం గుర్తుకు వచ్చింది.

    కొన్ని కోరికలు ఎవరికీ హాని కలిగించక పోతే తీర్చు కొనటమే నయం మరియు న్యాయం కూడా
    కాకా పోతే తీర్చేసుకొంటే బ్లాగ్స్ లో రాయటానికి మేత కొరత ఐ ఉండేది కదా
    మీ బ్లాగాభిమాని
    రవీంద్రనాథ్
    హైదరాబాద్

    రిప్లయితొలగించండి
  22. @పానీపూరీ: ధన్యవాదాలండీ..
    @వేణూ శ్రీకాంత్: నిజమేనండీ.. కాదేదీ బ్లాగుకనర్హం :-) ..ధన్యవాదాలు.
    @రవీంద్రనాథ్: నిజమేనండీ.. కొన్ని కోరికలు తీరకపోవడం కూడా బాగుంటుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  23. ఆన్లైన్ గ్రోసెరీ స్టోర్ హైదరాబాద్..

    http://goo.gl/jg0tTl

    రిప్లయితొలగించండి