ఆదివారం, ఆగస్టు 22, 2010

రేచకుడు

"మిలటరీ కుర్చీలో కాళ్ళు బారజాపుకుని కూర్చుని ఉన్నాడు బత్తుల రేచకుడు. వాక్యం తప్పు: కాలు బారజాపుకుని కూర్చున్నాడు. ఒక కాలు మోకాలి వరకు లేకపోవడం స్పష్టంగా తెలుస్తోంది. నోట్లో రెండు వేళ్ళ మందాన చుట్ట వెలుగుతోంది.." ఇవీ రేచకుడిని గురించి గొల్లపూడి మారుతిరావు తన నవల 'సాయంకాలమైంది' లో రాసిన పరిచయ వాక్యాలు. ఈ నవలలో 'నవనీతం' తర్వాత నాకు అంత బాగా నచ్చిన మరో పాత్ర రేచకుడు.

నవలలో ఓ ప్రధాన పాత్ర తిరుమల అనబడే చిన్న తిరుమలాచార్యులు అమెరికా వెళ్ళిన మూడేళ్ళ తర్వాత తొలిసారి దేశానికి వచ్చిన సందర్భంలో, అమెరికా మిత్రుడు విష్ణుమూర్తి కోరిక మేరకు అతని తండ్రి రేచకుడిని చూడడానికి విశాఖపట్నం నుంచి గిరిగాం వెళ్తాడు. తిరుమల అలా తన ఇంటికి రావడం రేచకుడికి ఏమాత్రం ఇష్టం లేదు. ఆ అయిష్టతకి కారణం నెమ్మది నెమ్మదిగా బోధపడింది తిరుమలకి.

"ఆడెలా ఉన్నాడు బాబూ? పెద్ద ఉద్యోగం చేస్తున్నాడా? ఆడెలా ఉంటాడో కాస్త సెప్పు బాబూ! నీలాగా సూటేత్తాడా? నీలాగా నల్ల కళ్ళద్దాలెడతాడా?..." రేచకుడి ప్రతి ప్రశ్న వెనుకా ఆసక్తే కానీ ఆర్తి లేదు. ఉత్సాహమే కానీ ఉద్విగ్నత లేదు. అంత ఆనంద పడుతున్న తండ్రిని ఎప్పుడూ చూడలేదు తిరుమల. అతనికి బిడ్డల్ని చూడాలని బెంగ పెట్టుకునే తల్లిదండ్రులే తెలుసు. ఆలోచనల్లోనే ఆనందాన్ని జుర్రుకుంటున్న రేచకుడు కొత్తగా కనిపించాడు. "మీకు కాలు లేదని మీ అబ్బాయి నాకు చెప్పలేదే?" అన్నాడు ప్రశ్నార్ధకంగా.

"నాక్కాలు లేకపొతే ఆడికేమయింది బాబూ! గిరిగాం రైతు నాకొడుక్కి కాలుంటేనేం పోతేనేం? నా కొడుకు దొర. సీమలో పెద్ద ఉద్యోగం సేత్తున్నాడు. అది చాలు నాకు." ...కాలు ఎలా పోయిందో రేచకుడి మాటల్లోనే: "మనకి ఒంటి నిండా సక్కెరే బాబూ! తీపి తినక్కరలేదు. సిన్నప్పట్నుంచీ నేను ఇమాం పసందు అంటే పీక్కోసుకుంటాను. ఆరువేల పళ్ళు దింపుతాను. ఎండలు ముదిరి, తొలకరిదాకా ఎంత లేదన్నా రెండొందల పళ్ళు తింటాను. నీయవ్వ.. పోతే దొర బిడ్డలాగా పోవాలి కానీ, ఏడుత్తూ బతికితే ఏం లాభం?"

ఈ వార్త కొడుక్కి చెప్పక పోవడమే కాదు, అతనికి తల్లిదండ్రుల్ని మర్చిపోవడం కూడా అలవాటు చేస్తున్నాడు రేచకుడు. వీధి బడిలో ఆరో క్లాసు చదివిన పక్క రైతు తనని యెగతాళి చేస్తే, ఆ పంతంతో అతనికి బుద్ధి చెప్పడం కోసం కొడుకుని శ్రీకాకుళం లో పెట్టి చదివించాడు రేచకుడు. కొడుకు ఇంగ్లీష్ చదివితే పొంగిపోయాడు. వ్యవసాయం చేస్తానంటే వద్దన్నాడు. గొడవ పెట్టి అతన్ని అమెరికా పంపాడు. తర్వాతి ముప్ఫయ్యేళ్ళ కాలంలో కొడుకుని కేవలం ఆరుసార్లు చూశాడు రేచకుడు. చివరిసారి చూసింది ఆరేళ్ళ నాడు.

"సచ్చి కాటికెల్లేనాడు మనకెవడు దగ్గర బాబూ? మనకి సేవలు సేయ్యలేదని ఆళ్ళ బతుకెందుకు పాడుసెయ్యాల? ఆడు నాకెందుకు సేవ సెయ్యాల? ఆడి బతుకు ఆడు బతకాల" ఇదీ రేచకుడి సిద్ధాంతం. ముప్ఫయ్యేళ్ళుగా విష్ణుమూర్తి పంపిన వస్తువులన్నీ ఓ గది నిండా బొమ్మల కొలువులా తీర్చి దిద్దాడు రేచకుడు. గెంతుకుంటూ వెళ్లి ఓ శాలువా తీసి "ఈ సిల్కు గుడ్డ ఆల్లమ్మ కోసం పంపించాడు ఆరు నెలల కిందట!" అన్నాడు గర్వంగా. "మరి ఆవిడ వాడుకోలేదేం?" అన్న తిరుమల ప్రశ్న ఒక జోక్ లాగా అనిపించింది రేచకుడికి.

"ఎలా వాడుతాదయ్యా! ఈ లోకంలో ఉంటేగా వాడుకోడానికి! ...సచ్చిపోయి నాలుగేళ్లయింది. సచ్చిపోయిన తల్లిని నాలుగేళ్ళు ఆడి మనస్సులో బతికించాను. నేను గొప్పొన్నా, కాదా సెప్పు బాబూ!" ..."అమెరికా నుంచి వస్తే కాలుపోయిన నాన్ననీ, సచ్చిపోయిన తల్లినీ తల్చుకు ఏడుత్తాడని పూర్ణయ్య పంతులు గారితో చెప్పి అవాకులూ చెవాకులూ రాయిత్తాను. ఉత్తరాల్లో నేను రెండు సార్లు యాత్రలకెల్లాను. ఓసారి కాశీ ఎల్లాను. నిజానికి గిరిగాం దాటి ఎక్కడికీ పోలేదు.."

ఇంతటి రేచకుడూ భార్య చివరి క్షణాల్లో ఆమెకిచ్చిన మాటకోసం తనకెంతో ఇష్టమైన ఇమాం పసందు తినడం మానేశాడు. "తల్లి చావునే కొడుకు నుంచి దాచి మోసం చేస్తున్న మీరు మీ ఆవిడకిచ్చిన మాటని తప్పలేరా?" అన్న తిరుమల ప్రశ్నకి గిలగిల్లాడిపోయాడు రేచకుడు. "కొడుకుని మోసం సేసేది ఆడ్ని బాధపెట్టే హక్కు నాకు లేదని. నా పెళ్ళాన్ని మోసం సెయ్యనిది దాన్ని సుఖపెట్టే అవకాశం ఇంక రాదని" ఈ మాటలంటున్నప్పుడు రేచకుడి కనుకొలకులలో మంచిముత్యం లాంటి నీటిచుక్క తళుక్కుమంది.

చూసినదేదీ తన కొడుక్కి చెప్పొద్దని తిరుమలని కోరి, కారెక్కబోతున్న తిరుమల భుజం మీద చెయ్యివేసి ఆపి రేచకుడు అడిగిన ప్రశ్న: "వచ్చినప్పట్నుంచీ సూత్తున్నాను. నువ్వు తొడుక్కునే కోటు ఎంతుంటాది?" .."కనీసం మూడువేలు"... బొడ్డులోంచి మడతలు పడ్డ నోట్ల కట్టలోంచి మూడువేలు తీసి "ఈ రంగు మా బుల్లోడికి శానా బాగుంటాది. ఈ అయ్య కొనిచ్చాడని ఆడికి నువ్వు కొనియ్యి!" అన్నాడు రేచకుడు.

16 కామెంట్‌లు:

  1. "కొడుకుని మోసం సేసేది ఆడ్ని బాధపెట్టే హక్కు నాకు లేదని. నా పెళ్ళాన్ని మోసం సెయ్యనిది దాన్ని సుఖపెట్టే అవకాశం ఇంక రాదని".....గుండెని పిండేసింది. really heart touching.

    రిప్లయితొలగించండి
  2. అవును, ఆ నవల్లో మరిచిపోలేని ఘట్టం ఇది. హత్తుకునేలా ప్రత్య్కషం చేశారు

    రిప్లయితొలగించండి
  3. naenoo tappakunDaa chaduvutaanu.tanDri premaloe kotta koeNam. chaalaa baagundi ardhramgaa.

    రిప్లయితొలగించండి
  4. "కొడుకుని మోసం సేసేది ఆడ్ని బాధపెట్టే హక్కు నాకు లేదని. నా పెళ్ళాన్ని మోసం సెయ్యనిది దాన్ని సుఖపెట్టే అవకాశం ఇంక రాదని"

    నాకు కూడా ఈ వాక్యం భలే నచ్చింది. నిజంగా గుండెల్ని పిండేసింది.

    ఎప్పటికి చదువుతానో ఇవన్నీ. మీరు ఇలా రాసినప్పుడల్లా లిస్టు పెరుగుతోంది.

    రిప్లయితొలగించండి
  5. manasuki entagaano nacchindi...dhanyavaadalu parichayam chesinanduku.

    రిప్లయితొలగించండి
  6. సంతానానికి దూరమయితే అనుభవించే వేదన సామాన్యమైంది కాదు. ఆ వేదన దిగమింగి బిడ్డ క్షేమాన్నే కోరుకునే కన్నప్రేమను మించింది లేదని చాటిచెప్పే కథ ఇది. మురళిగారు, తప్పకుండా ఈ పుస్తకం చదువుతాను. ఇటువంటి జీవితాలు ఇంకా ఎన్ని ఉన్నాయో! ఇలాంటి పుస్తకాలు చదువుతున్నప్పుడు అది ఒక నవల లాగా అనిపించదు నాకు. ఒక జీవిత సత్యమే నా కళ్ళముందు కనిపించి మనసు బాధపడుతుంది.

    రిప్లయితొలగించండి
  7. "గొల్లపూడి ఒక సినీ నటుడు. అంతకుముందు ఏవో ఒకట్రెండు నాటకాలూ , ఏవో సినిమాలకు పాటలురాసాడు" అనే నా అపోహ ఇదిగో ఈ రేచకుడు తోటే పటాపంచలయింది కొన్నేళ్ళ క్రితం. నేను నవల చదవలేదు గాని, "కౌముది" పత్రికలో ఈ "రేచకుడు" చాప్టర్ ఒకదాన్నే ఒక కథలా చదువుకోవచ్చు అని ప్రచురించారు. ఆ లింక్ ఇక్కడ (http://www.koumudi.net/Monthly/2007/october/index.html .అందులో "అవీ-ఇవీ" శీర్షిక కింద ఈ కథ చదవవచ్చు.)

    మురళి గారు, ఆ కథ మళ్ళా చదివేలా చేసినందుకు థాంక్స్ :)

    రిప్లయితొలగించండి
  8. "రేచకుడు"..మా నాన్న ఇలాగే వుండే వారు అనిపిస్తుంది అమ్మచెప్పే వివరాలు వింటూ వుంటే..

    నాకు అత్యంత ప్రియమైన పుస్తకం.."సాయంకాలమైంది". రేచకుడి పాత్ర పరిచయం తో ఆ కధని మరోసారి గుర్తు చేసి ఆ అనుభూతుల్ని మళ్ళీ రిఫ్రెష్ చేశారు. థాంక్సండీ.

    రిప్లయితొలగించండి
  9. మీరు నాకు పడ్డ బాకీకి ఇంకోటి కలుపుకోండి.

    రిప్లయితొలగించండి
  10. @పద్మార్పిత: ధన్యవాదాలండీ..
    @కొత్తపాళీ: ధన్యవాదాలండీ...
    @సునీత: తప్పక చదవండి.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  11. @వాసు: తప్పకుండా చదువుతారండీ.. చిన్న పుస్తకమే.. మొదలు పెడితే వదిలిపెట్టలేరు.. ధన్యవాదాలు.
    @శ్రీ: ధన్యవాదాలండీ..
    @సుజాత: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  12. @జయ: తప్పక చదవండి.. మీరు మొదలుపెడితే చాలు.. పూర్తి చేసే బాధ్యత పుస్తకమే తీసుకుంటుంది.. ధన్యవాదాలు.
    @ఉమాశంకర్: వీలయితే మొత్తం నవల చదవండి.. మీకు నచ్చుతుందని నా నమ్మకం.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: ధన్యవాదాలండీ..
    @శ్రీనివాస్ పప్పు: చాలా సంతోషంగానండీ.. నేనిప్పటివరకూ ఎక్కువ కాపీలు బహూకరించిన పుస్తకం ఇదే.. "గొల్లపూడి కూడా అంతమందికి ఇచ్చి ఉండరు" అని మిత్రులు జోక్ చేస్తూ ఉంటారు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. చాలా బాగుందండి మనసు భారం ఐపోయింది. ఒక్కొక్కొళ్ళకు ఒక డెఫినిషన్ కదా పిల్లలను సంతోషపెట్టటం అంటే. బాగుంది కొనాల్సిన పుస్తకాల లిస్ట్ లో ఇంకో పుస్తకం. :-)

    రిప్లయితొలగించండి
  14. "కొడుకుని మోసం సేసేది ఆడ్ని బాధపెట్టే హక్కు నాకు లేదని. నా పెళ్ళాన్ని మోసం సెయ్యనిది దాన్ని సుఖపెట్టే అవకాశం ఇంక రాదని" అందరూ చెప్పిందే నేనూచెబుతున్నా...Heart touching మురళిగారూ!

    రిప్లయితొలగించండి
  15. @భావన: ఇంకా చదవలేదా మీరు?!! ఈసరికే చదివేసి ఉంటారని అనుకున్నానండీ.. తప్పక చదవండి.. ధన్యవాదాలు..
    @పరిమళం: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి