బుధవారం, ఆగస్టు 18, 2010

పాటల ముసలయ్య

మా ముసలయ్య గారి ఇంటి పేరు 'పాటల' కాదు. కానీ అదేమిటో ఆయన్ని అందరూ పాటల ముసలయ్య అనే పిలిచేవాళ్ళు. తను ఘంటసాల అంతటి వాడినని మా ముసలయ్య గారు ఎప్పుడైనా అనుకున్నారో లేదో తెలీదు కానీ, మా ఊరి వాళ్ళు మాత్రం "మైకందుకున్నాడ్రా మన గంటసాల" అనే వాళ్ళు, మైకులో ఆయన పాట వినిపించగానే. ముసలయ్య గారికీ, మైకుకీ అవినాభావ సంబంధం మరి.

పండుగలు పబ్బాలకే కాదు, ఎవరింట్లో ఎలాంటి శుభకార్యం జరిగినా మైకుసెట్టు బిగించడం మా ఊళ్ళో ఆనవాయితీ. ఘంటసాల 'నమో వేంకటేశా..' అనడం ఆలస్యం. మా ముసలయ్య గారు మైకుసెట్టు దగ్గర వాలిపోయేవాళ్లు. "శవం కాడ గెద్ద కూడా అంత బేగా వాల్దు" అని కిట్టని వాళ్ళు అనుకున్నా ఆయన లెక్క చేసేవాళ్ళు కాదు. మైకందుకుని తన గొంతు విప్పే వాళ్ళు. చిన్ననాడు తను నేర్చుకున్న శతక పద్యాల మొదలు, భజన పాటలు, తాజా సినిమా పాటల వరకూ తన స్టైల్లో పాడేసేవాళ్ళు.

ముసలయ్య గారు మైకందుకున్నారంటే హీనపక్షం రెండు మూడు గంటలపాటు తన విద్యని ప్రదర్శించే వాళ్ళు. ఆయన మా ఊళ్ళో కుంచం పెద్దమనిషి మరియు సాధు స్వభావి అవ్వడం వల్ల ఊళ్ళో అందరికీ కొద్దో గొప్పో మొహమాటం ఉండేది. ఆ మొహమాటం చేత ఆయన మైకందుకున్నా ఎవరూ 'వద్దు' అనలేక పోయేవాళ్ళు. వెనకాల తిట్టుకోవడం మాత్రం మర్చిపోయేవాళ్ళు కాదు.

అప్పట్లో దేవుడి కల్యాణానికి మా ఊరి కుర్రాళ్ళంతా కలిసి ఒక నాటకం వేశారు. పొరుగూరి నుంచి హీరోయిన్ని తీసుకురాడానికి బడ్జెట్ ఒప్పుకోక పోవడంతో ముసలయ్య గారి చేత హీరోయిన్ వేషం వేయించేశారు. ఆయనది కుంచం కీచు గొంతు అవడం వల్లనూ, దానిని మరికొంచం కీచు చేసి ఆయన డైలాగులు చెప్పినందు వల్లనూ వేషం బాగానే పండింది. వీరోవిన్ వేషం కట్టింది ముసలయ్య గారని తెలిసిపోవడం వల్ల జనం కొంచం ఎక్కువగానే ఎంజాయ్ చేశారు.

ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందని పెద్దాళ్ళు ఊరికే అనలేదు కదా.. అలా ముసలయ్య గారి హీరోయిన్ వేషం మాకు కొత్త సమస్యలు తెచ్చి పెట్టింది. మైకందుకున్న ప్రతిసారీ పద్యాలు, పాటలు అనంతరం ఆయన మొత్తం నాటకం స్క్రిప్టు ని మైకులో చదివేసేవాళ్ళు. అంటే మొదట్లో పాడే 'వందే వందే కళామ తల్లీ' మొదలు చివర్లో పాడే 'జన గణ మన..' వరకూ (అప్పట్లో పాడే వాళ్ళు). అది కూడా ఆయా పాత్రలకి గొంతులు మార్చి మరీ వినిపించే వాళ్ళు.

మైకుసెట్టు కుర్రాడికి మాత్రం ఇది బాగా కలిసొచ్చింది. మైకు బిగించి, గొట్టాన్ని ముసలయ్యగారి చేతిలో పెట్టి తన పనులు చూసుకోడానికి వెళ్ళిపోయేవాడు. ఆయన అక్కడినుంచి కదలరు కాబట్టి సెట్టుకి కాపలా కాయక్కర్లా. రికార్డులు మార్చే పని అసలే లేదు. అలా ముసలయ్యగారి మైకు సెట్టు కుర్రాడిగా మారిపోయారు. కుర్రాడు వచ్చే వరకూ ఆయన మైకులో పాడుతూనో, మాట్లాడుతూనో ఉండేవాళ్ళు.

మైకుసెట్టు కోసం చకోర పక్షుల్లా ఎదురు చూసే నాలాంటి వాళ్ళ పాలిట మాత్రం ఇది పిడుగుపాటే. ఎందుకంటే నాటకం పుణ్యమా అని మైకు ముసలయ్యగారి చేతిలో ఒక పూటంతా ఉండిపోతోంది మరి. ఇదిలా ఉండగా మా ఊళ్ళో ఏడో తరగతి ఫెయిలై ఆ తర్వాత కరెంటు పని నేర్చుకున్న కుర్రాడొకడు సరికొత్త మైకుసెట్టు మరియు రికార్డులు కొన్నాడు. లోకల్ ఫీలింగ్ కొంత, కొత్త పాటల మీద అభిమానం కొంత పని చేసి మా ఊరి వాళ్ళు మైకు సెట్టుకి ఇతన్నే పిలవడం మొదలు పెట్టారు.

ఈ కొత్త మైకు సెట్టు కుర్రాడు మరెవరో కాదు, సాక్షాత్తూ మా పాలిట దేవుడు. ఎందుకంటే ముసలయ్యగారికి మైకు ఇవ్వనని మొదట్లోనే నిర్మొహమాటంగా చెప్పేశాడు. ఆయన మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తగు మాత్రం పెద్దమనుషులందరి దగ్గరా ఆయన ఆ విషయం చెప్పుకుని బాధ పడ్డారు కూడా. పెద్ద మనుషులంతా ఆయన దగ్గర మైకు సెట్టు కుర్రాడిని "ఎదవకి కుర్రతనం" అని తిట్టినా, అతన్ని పిలిచి ఏమిటని అడగలేదు, పిలవడం మానలేదు.

ఊళ్లోకి మైకు సెట్టు వస్తోంది, వెళ్తోంది.. ముసలయ్యగారి పాట మాత్రం వినిపించడం లేదు. ఆయన కూడా మైకు సెట్టు కుర్రాడి మీద కంప్లైంట్ చేయడం మానేశారు. రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు ఉన్నట్టుండి మైకులో ముసలయ్యగారి గొంతు ఖంగుమంది. ఊరు ఉలిక్కిపడింది. ఎప్పుడూ ఆయన పాడే 'సినిమా-భక్తి' గీతాలే. కానీ ఎక్కడో చిన్న తేడా.

కొంచం శ్రద్ధగా వింటే అర్ధమయ్యింది. ఆయన తన పాటల్లో ముక్కోటి దేవతలని స్తుతించడం లేదు. ప్రభువు మహిమల్ని కీర్తిస్తున్నారు. బాణీలు అవే అయినా సాహిత్యం మారింది. పల్లెటూళ్ళో ఏ వార్త అయినా ఓ చివరి నుంచి మరో చివరికి పాకడానికి పది నిమిషాలు చాలా ఎక్కువ. పదో నిమిషం గడవక ముందే తెలిసిన విషయం ఏమిటంటే మా ఊళ్ళో కొత్తగా ఒక చర్చి మొదలు పెట్టారు.

పూరి గుడిసెలో మొదలు పెట్టిన చర్చికి కొయిటా వారొకరు మైకుసెట్టు కానుకగా చదివించారు. ముసలయ్య గారు క్రైస్తవ భక్తి గీతాలు ఆలపిస్తాననగానే చర్చి పాస్టర్ గారు చాలా ఆనందంగా మైకు ఆయన చేతికి ఇచ్చారు. అయితే ఊరు ఊరుకోలేదు. మైకు సెట్టు కుర్రాడిని ఏమీ అన్ని పెద్దమనుషులు 'ఏటండీ మతం మారిపోతన్నారా?' అంటూ ముసలయ్య గారిని నిలదీశారు.

ముసలయ్యగారు అస్సలు ఆవేశ పడలేదు. "పాటకి మతవేటండీ.. మన గుడికాడ మైకెట్టించి పిలండి, మన పాటలు పాడకపోతే అడగండి" అనేశారు. పెద్ద మనుషులెవరూ అంత ధైర్యం చేయలేదు. చర్చి వాళ్ళు మర్యాద పూర్వకంగా 'వద్దు' అని చెప్పే వరకూ ముసలయ్యగారు అక్కడ పాటలు పాడుతూనే ఉన్నారు. ప్రభువు మమ్మల్ని రక్షించడానికి చాలా కాలమే పట్టింది.

21 కామెంట్‌లు:

  1. హ హ హ.
    ప్రభువు ఎక్కడ నొక్కాలో అక్కడే నొక్కాడన్నమాట!
    శెబాష్!
    Enjoyed it very much

    రిప్లయితొలగించండి
  2. ముసలయ్యా -- మైక్‌లో హిందూ పాటలు -- లోకల్ మైక్ దొరక్క కిరస్తానీ పాటలు
    హ్హా..హ్హ..హా..సూపరండీ...భలే నవ్వించారు టపాతో...ఈ కారెక్టర్‌ని ఏదైనా సినిమాలో కాపీ కొట్టేసి పెట్టేయగలరండీ...

    అన్నట్టు క్రితం సమాధానంలో రామలింగడు పిల్లి కథ అన్నారు కదా..అంటే పిల్లి..వేడిపాలు అదే కదా స్టోరీ...

    రిప్లయితొలగించండి
  3. entho marmagarbhanga undi musalayya gari udantham mana desham lo matha marpidiki punadi ekkada padindo cheppakane chepthunatlu .........
    mike settu mana sanathana acharalu mariyu gullu anukunte vati ki dooram unchabadina valla para matha praaveshame mee ru cheppina churchilo mic meeku abhinandanalu.

    రిప్లయితొలగించండి
  4. :) బాగుందండి. దాదాపు ఒక దశాబ్దం నుండి మా ఊళ్ళో మైకుల్లో భజనలు వినిపించడం తగ్గిపోయింది. ప్రభువు కీర్తనలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.

    రిప్లయితొలగించండి
  5. "వీరోవిన్ వేషం కట్టింది ముసలయ్య గారని తెలిసిపోవడం వల్ల జనం కొంచం ఎక్కువగానే ఎంజాయ్ చేశారు."

    బావుంది.

    రిప్లయితొలగించండి
  6. మురళి గారూ మొత్తానికి భలే మైకాసురుడ్నే పరిచయం చేసారు:)

    రిప్లయితొలగించండి
  7. పాపం...

    "ప్రభువు" కి కూడా ముసలయ్యగారి సంగీతం విన్నాక జవసత్వాలు పని చేయక పోవడం వలన మిమ్మల్ని రక్షించడానికి అంత (చాలా) కాలం పట్టి వుండవచ్చునండీ.

    రిప్లయితొలగించండి
  8. హ హ పాటల ముసలయ్య కబుర్లు భలే ఉన్నాయండీ, మీ ప్రజంటేషన్ వైవిధ్యంగా ఉంది :)

    రిప్లయితొలగించండి
  9. హ్హహ్హహ్హ పాట ముఖ్యం కానీ మతం కాదు అని కూత పెట్టి మరీ సెప్పాడన్నమాట ముసలయ్య.
    ద్వారం తెరిచియే యున్నది,ప్రభువు మిమ్ము కాపాడుగాక,ఆమెన్.

    రిప్లయితొలగించండి
  10. మాకూ ఓ పాటల ముసలయ్య లాంటివారున్నారండోయ్ :) ఆయన మరెవరో కాదు మా నాన్నగారే :) మైకు వరకూ రాలేదుకాని ఎప్పుడో డ్రామాలు చూసే రోజుల్లో గుర్తున్న రామాంజనేయ యుద్ధం , హరిశ్చంద్ర పద్యాలను ఖూనీ చేసేస్తూ పాడుతూ ఉంటారు . శ్రోతలేవరూ అనుకుంటున్నారా మేమే పండుగలకో , ప్రత్యెక సందర్భాల్లోనో అందరం కలుస్తామా ఇక అంతే !అమ్మ శుభమా అని పండగపూట కాటి పద్యాలేవిటని అరిచినా ప్చ్ ...ఉపయోగం ఉండదు...పైగా ఈమధ్య మా అన్నయ్యల్ని సెల్ ఫోనుల్లో రికార్డు చేసుకొండిరా పద్యాలు అంతరించిపోతున్నాయి తర్వాత మీకు కావాలన్నా దొరకవు అంటూ పద్యాలు , వాటి పుట్టుపూర్వోత్తరాలూ గురించి చెప్పేస్తూ ఉంటారు :) :)

    రిప్లయితొలగించండి
  11. "....ప్రభువు మమ్మల్ని రక్షించడానికి చాలా కాలమే పట్టింది....." Quite humorous.

    రిప్లయితొలగించండి
  12. @కొత్తపాళీ: అవునండీ :-) ..ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: వేడిపాల కథేనండీ.. ధన్యవాదాలు.
    @రాజేంద్రకుమార్ దేవరపల్లి: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  13. @ఆత్రేయ: తెలుగులో రాయడానికి http://www.google.com/transliterate/ సాయం తీసుకోవచ్చండీ.. lekhini.org ద్వారా కూడా రాయొచ్చు.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @రాధిక (నాని): ధన్యవాదాలు..
    @శిశిర: నిజమేనండీ. చాలలా ఊళ్లలో పరిస్థితి అదే.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @వాసు: ధన్యవాదాలండీ..
    @జయ: ధన్యవాదాలండీ..
    @ప్రణీత స్వాతి: మంచి పాయింటేనండీ.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  15. @వేణూ శ్రీకాంత్: ధన్యవాదాలండీ..
    @విశ్వామిత్ర: ఇది జరిగి చాలా ఏళ్ళయ్యిందండీ.. ధన్యవాదాలు.
    @పరిమళం: కొంచం వివరంగా ఒక టపా రాయండి, వీలు చూసుకుని... ధన్యవాదాలు.
    @శివ: ధన్యవాదాలండీ.

    రిప్లయితొలగించండి
  16. మరి తిరిగే కాలూ, వాగే నోరూ ఖాళీగా ఉండవు కదండి.

    రిప్లయితొలగించండి
  17. అబ్బ అదిరింది గా గంటసాల గారి పద్య పటిమ.. నవ్వి నవ్వి కళ్ళేంబడీ నీళ్ళొచ్చొయాండి బాబు. పాపం ముసలాయన గారు.

    రిప్లయితొలగించండి
  18. @బోనగిరి: నిజమేనండీ.. ధన్యవాదాలు..
    @భావన: 'పాపం మేము' అండీ.. :-) ..ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి