మేరీకమలకి తెలుపు రంగంటే ఇష్టం.. ఆకు సంపెంగలంటే ఇష్టం.. బిందెలకి బిందెలు నీళ్ళు ఎత్తి పోసుకోడం ఇష్టం.. పూరీలు, బంగాళాదుంపల కూరంటే ఇష్టం.. 'శారద' సినిమాలో "రేపల్లె వేచెనూ.." పాటంటే ఇష్టం. ఇన్ని ఇష్టాలున్న మేరీకమల అంటే నాకు చాలా ఇష్టం. ఇంతకీ తనెవరో చెప్పలేదు కదూ.. వంశీ 'మా పసలపూడి కథలు' లో ఒక కథలో ప్రధాన పాత్ర. ఆ కథ పేరు 'మేరీకమల.'
ఉత్తమ పురుషలో సాగే ఈ కథ ప్రారంభం అచ్చమైన వంశీ శైలికి ప్రతీక. "చింత చెట్టు కింద పడుకున్న సత్తీరెడ్డి గారి ఎడ్ల డెక్కలు సాపుగా చెక్కి నాడాలేస్తన్నాడు తూర్పు కంసాలి. చెరుకు తోట మధ్యలో ఉన్న అమ్మోరి గుడి మూలల్లో బాగా నాచు పట్టేస్తుంది. జబ్బు చేసిన కుక్క పచ్చ గడ్డి తింటుంది. గోదారి కాలవలో ఉన్న పడవని ఎదురు గాలి అవడం వల్ల ముగ్గురు మగోల్లు తాడేసి లాగుతుంటే పడవలో ఉన్న ఆడమనిషి ఓ పక్కన చుక్కాని చూసుకుంటూ కూరొండుతుంది. ఆరారా అన్నంలో కలుపుకు తినేద్దాం అన్నంత కమ్మని వాసన. తట్టంచేపా వంకాయ ఇగురు.."
పసలపూడి పక్కనే ఉండే రాంపురంలో శంకరనారాయణ గారి హాస్పిటల్లో నర్సు మేరీకమల. పెద్ద పెద్ద కళ్ళతో నల్లగా ఉండే మేరీకమల.. సుతిమెత్తని అడుగులతో ఈ ప్రపంచంలో ఎవర్నీ నొప్పించని మేరీకమల.. "మూగమనసులు సినిమాలో సావిత్రీ, కొత్త దేవదాసు సినిమాలో జయంతీ, అవేకళ్ళు సినిమాలో వెన్నిరాడై నిర్మలా ఈ ముగ్గురి ఫోటోలు కలగలిపితే మేరీ కమల అవుద్ది. వయసులో నాకంటే పెద్దది మేరీకమల" అంటాడు రచయిత.
కష్టపడి పనిచేసే మేరీకమలకి ఎక్కువగా నైట్ డ్యూటీలే వేసేవాళ్ళు హాస్పిటల్ వాళ్ళు. రాత్రి పదింటికి డ్యూటీకి వెళ్తే తెల్లవారి ఆరింటికి తన గదికి తిరిగి వచ్చేది. "నేను ఏడు గంటలకి వెళ్లి కమలా అని పిల్చేవాడ్ని. ఆమె నవ్వుతా తలుపులు తీసేది.." ఆమె స్వస్థలం కోటిపల్లి పక్కన గోదారి గట్టు దిగువలో ఉన్న కోట. ఈలి వాడపల్లి గారి హాస్టల్లో చదువుకున్నప్పుడు క్రిష్టియన్ మతం పుచ్చుకుంది. హాస్టల్లో ఉండగానే కారు డ్రైవర్ చందర్రావుని లవ్ చేసి పెళ్లి చేసుకుంది.
చందర్రావుని తను భరించలేదని అర్ధమయ్యాక నర్సు ట్రైనింగ్ అయ్యి హాస్పిటల్లో చేరింది మేరీకమల. సోమేశ్వరం గుళ్ళో ఈవో గా పని చేస్తున్న బడుగు కృష్ణారావు ఆమెని ఇష్టపడి రెండో పెళ్లి చేసుకున్నాడు. అతనికి భార్యా, పిల్లలూ ఉన్నారు. ఈ పెళ్లి సంగతి ఇంట్లో చెప్పలేదు. "రెండు సార్లు పెళ్లి చేసుకున్న ఆ మనిషి వెనకాల బడడం కరెక్టా అని చాలాసార్లు అనుకున్నాను. కాదు అని ఓ పక్క అనిపిస్తున్నా తిరిగి మళ్ళా ఆ మనిషే కావాలనిపిస్తుంది. ఆ నవ్వూ, పలకరింపూ కావాలనిపిస్తున్నాయి."
"ప్రతిరోజూ పూరీల పొట్లం పట్టుకెళ్ళి ఇస్తుంటే సగం నిద్రోతూనే తినేది. రేపల్లి వీచెనో పాట పాడ్తుంటే ఎక్కడ నోచ్చుకుంటానో అని ఇబ్బంది పడతా వినేది. నీకు తెలుపంటే ఇష్టం గదా నీకు పండక్కి తెల్లచీర కొని తెస్తాను అని నేనంటే నా మోచేతిమీద చెయ్యేసి 'ఆడోల్లు చీర ముడేసి మూడునాలుగుసార్లు చుట్టి కుచ్చెళ్లు దోపుకుంటారు గదా.. నేను మట్టుకు ముడేసాకా చుట్టుకోకుండా నేనే గిరగిరా తిరుగుతాను తెల్సా' అంది. 'ప్రతి రోజూ అంతేనా?' అన్నాను. 'చీర కట్టుకోడం మొదలెట్టినప్పట్నించీ' అంది"
రోజూ పూరీలు తెచ్చిచ్చి, పాటలు పాడి వెళ్ళే కుర్రాడితో తన స్నేహాన్ని గురించి కృష్ణారావుకి తెలిస్తే బాగోదేమో అని సందేహిస్తుంది మేరీకమల. అందుకే అతన్ని ఇంటికి వచ్చి మాట్లాడడం కన్నా ఉత్తరాలు రాయమని ప్రోత్సహించింది. "నువ్వు నా ముందు మాట్లాడ్డం కంటే నువ్వు రాసే ఉత్తరాలే బాగుంటాయి మర్చిపోకేం" అంటూ సాగనంపింది. "నేను రాసే ఉత్తరాలు చీర మడతల్లో కలరా ఉండలు మధ్య పెట్టి, జాగ్రత్తగా దాచుకునేది." ఆమె విచిత్రమైన చీరకట్టు, అతను ఆమెకి రాసిన ఉత్తరాలు ఆమె కథని ఏదరికి చేర్చాయన్నదే 'మేరీకమల' కథ ముగింపు.