'కామ్రేడ్ మోహనరావు అమర్ రహే..' తళతళలాడుతున్న నల్లని వినైల్ ఫ్లెక్సి మీద తెల్లని అక్షరాలు మెరుస్తున్నాయి. పక్కనే గంభీరంగా ఉన్న మోహనరావు ఫోటో. మూడుగదుల అద్దింటి వాటా ముందు వేసిన టెంట్ కి ఫిక్స్ చేశారా ఫ్లెక్సీని. టెంట్ కింద రెండు టేబుళ్లు కలిపి చేసిన వేదిక మీద నిద్రపోతున్నాడేమో అనిపించేలా ఉంది నలభయ్యారేళ్ళ మోహనరావు పార్ధివ దేహం. టెంట్ కర్రలకి పార్టీ జెండాలు అమర్చారు కార్యకర్తలు.
కొద్ది రోజుల క్రితమే మొదలైన ఎన్నికల కోలాహలం ఆ బస్తీకి కూడా పాకింది. రకరకాల పార్టీల జెండాలు, బ్యానర్లు, నాయకుల అభిమానులు ఏర్పాటు చేసిన చిన్నా పెద్దా హోర్డింగులు, వీటి మధ్య పట్టి పట్టి చూస్తే తప్ప మోహనరావు మరణ వార్తని చెప్పే చిన్న ఫ్లెక్సి కనిపించడం లేదు. టెంట్ హౌస్ నుంచి వచ్చిన పది కుర్చీలని టెంట్ కింద ఒక వరుసలో అమరుస్తున్నారు కార్యకర్తలు.
మోహనరావు మరణ వార్త అప్పుడప్పుడే ఆ బస్తీలో పాకుతోంది. అతని వల్ల చిన్నదో, పెద్దదో ఉపకారం పొందినవాళ్ళంతా ఒకరొకరుగా వస్తున్నారు. ఒట్టి చేతులతో కాదు, పూల దండలతో. తను జీవించి ఉన్నంతకాలం మెడలో పూల దండ వేయించుకోడాన్నితీవ్రంగా వ్యతిరేకించాడు మోహనరావు. చివరిసారిగా అతని మెడలో దండ పడింది ఇరవై ఏళ్ళ క్రితం - ఇప్పుడు సరళమ్మ/ సరళక్కగా మారిన - సరళరేఖని సంతకాల పెళ్లి చేసుకున్నప్పుడు.
మధ్యగదిలో కూర్చుని జరుగుతున్న తతంగాన్ని నిశ్శబ్దంగా గమనిస్తోంది సరళ. తమ ఇద్దరి సంభాషణల్లో మృత్యువు ప్రసక్తి వచ్చినప్పుడల్లా తన అంతిమయాత్ర ఎలా ఉండాలో మోహనరావు చెప్పిన విషయాలు ఒక్కొక్కటిగా గుర్తొస్తున్నాయి ఆమెకి. 'పోయాక కూడా ఇష్టాలు సాగాలనుకుంటే ఎలా?' అనిపించి నిర్లిప్తంగా నవ్వుకుంది. అర్ధరాత్రి దాటాక, స్టీలుగ్లాసు గచ్చు నేల మీద పడ్డ శబ్దానికి ఉలిక్కిపడి నిద్ర లేచింది సరళ. మోహనరావు ఛాతీ పట్టుకుని ఆయాస పడుతున్నాడు. ఆమె దగ్గరికి వెళ్లి ఛాతీ మీద రాయడం మొదలు పెట్టగానే ఏదో చెప్పడానికి నోరు తెరిచాడు అంతే.. అతని ప్రాణం పోయిందన్న నిజం అర్ధం కావడానికి పదినిమిషాలు పట్టింది ఆమెకి.
ఇంటర్ చదువుతున్న కూతురూ, పదో తరగతి చదువుతున్న కొడుకూ ఆసరికే నిద్ర లేచారు. ఎవరూ బావురుమనలేదు. నిశ్శబ్దంగానే రోదించారు ముగ్గురూ. తెల్లవారుతుండగానే తెలిసిన వాళ్ళు ఒక్కొక్కరుగా ఇంటికి రావడం మొదలు పెట్టారు. వాళ్ళ ముగ్గురి ప్రమేయం పెద్దగా లేకుండానే అంతిమ యాత్రకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. కొందరు ఆడవాళ్ళు సరళని, పిల్లల్ని ఓదార్చే బాధ్యత తీసుకున్నారు.
* * *
పార్టీ ఆఫీసులో ముఖ్య నాయకుల అత్యవసర సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మోహనరావు మరణానంతరం మారబోతున్న సమీకరణాలను గురించి చర్చించడం ఆ సమావేశం ముఖ్య అజెండా. అతను ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్ నుంచి కార్పొరేటర్ అభ్యర్ధి ఎంపిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పార్టీ మరో పార్టీతో 'పొత్తు' పెట్టుకుంది. సీట్ల కేటాయింపులో ఆ డివిజన్ సీటు పార్టీకి వచ్చింది.
అవతలి పార్టీలో ఇద్దరు నాయకులు ఆ సీటు కోసం పోటీ పడడం, ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా మరొకరు టిక్కెట్ ఇచ్చిన అభ్యర్ధిని ఓడించడానికి సిద్ధంగా ఉండడంతో అవతలి పార్టీ ఆ సీటుని తెలివిగా వీరికి కేటాయించిందన్నది బహిరంగ రహస్యం. ఎక్కువ డివిజన్లలో తమ అభ్యర్ధులని గెలిపించుకోవడం ద్వారా, భవిష్యత్తులో జరిగే మేయర్ ఎన్నికల్లో చక్రం తిప్పాలన్నది నాయకుల ఆలోచన. ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోడానికి సిద్ధంగా లేరు వీళ్ళు. సమావేశంలో పాల్గొన బోయే అరడజను మంది నాయకుల సెల్ ఫోన్లూ నిరంతరాయంగా మోగుతున్నాయి. పార్టీలో వాళ్లకి 'దగ్గరి వాళ్ళు' అడక్కపోయినా ఉచిత సలహాలు ఇస్తున్నారు. నాయకులు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు. జరగబోయే సమావేశం ఏరకంగా చూసినా ముఖ్యమైనదే.
* * *
మోహనరావు దేహం మీద ఒక్కొక్కటిగా పూలదండలు పడుతున్నాయి. పిల్లలు టెంట్ కింద కూర్చున్నారు. ఒక్కొక్కరుగా పలకరించడానికి వస్తుండడంతో సరళ మధ్య గదిలోనుంచి ముందు గదిలోకి వచ్చింది. అది మోహనరావు గది. గదిలో ఓ పక్క దీవాన్. మరో పక్క గోడకి ఆన్చి పెట్టిన నిలువెత్తు చెక్క బీరువా నిండా తెలుగువీ, ఇంగ్లీషువీ పుస్తకాలు, ఓ అరలో అతనివే నాలుగైదు జతల బట్టలు. ఎప్పుడూ అతను భుజాన తగిలించుకునే రంగు వెలిసిన యెర్ర సంచీ..
సరళకి మోహనరావుతో పాతికేళ్ళ సాహచర్యం. మొదటి ఐదేళ్ళు స్నేహం.. తర్వాతి ఇరవైయేళ్ళు సహజీవనం. గడిచిన పాతికేళ్ళలోనూ అతని జీవన విధానంలో ఎలాంటి మార్పూ లేదు. అతను సంపాదించిన ఆస్తి అంటూ ఏమైనా ఉంటే ఆ పుస్తకాలే. దీవాన్ పక్కనే ఉన్న యాష్ ట్రే నిండా కిక్కిరిసిన సిగరెట్ పీకలు, మోహనరావు ఇక లేడనే సత్యాన్ని పరిహసిస్తున్నాయి. పక్కనే చిన్న స్టూలు మీద టీ ఫ్లాస్కు, కప్పు. పక్కనే గత కొన్నాళ్ళుగా మోహనరావు మళ్ళీ మళ్ళీ చదివిన పుస్తకం - చలసాని ప్రసాద రావు రాసిన 'ఇలా మిగిలేం.'
తన ఎదురుగా నిలబడ్డ చిన్ననాటి స్నేహితురాలు వనజని చూడగానే కన్నీళ్లు ఉబికి వచ్చాయి సరళ కి. వనజ భుజం మీద తల ఆన్చి ఒక్కసారి భోరుమంది. ఏం మాట్లాడాలో తెలియని స్థితిలో, సరళ భుజం తడుతూ ఉండిపోయింది వనజ. మోహనరావుతో ఆమెదీ సుదీర్ఘ పరిచయమే. అతని హఠాన్మరణాన్ని వనజ కూడా జీర్ణించుకోలేక పోతోంది. మరోపక్క స్నేహితురాలికి వచ్చిన కష్టం... సరళ కి తను ఎలా సాయపడగలనా అని ఆలోచిస్తోంది వనజ.
* * *
ఓ స్కూలు మేష్టారి మూడో కూతురు సరళ. తండ్రి ఏ విప్లవ పార్టీలోనూ సభ్యుడు కాకపోయినా, విప్లవ పోరాటాలంటే యెంతో ఆసక్తి కనబరిచేవాడు. "పతితులార, భ్రష్టులార, బాధా సర్ప ద్రష్టులార.." అంటూ ఆయన శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని గొంతెత్తి చదువుతుంటే అప్రయత్నంగానే కళ్ళు తడిసేవి ఆమెకి. అక్కలిద్దరికీ కట్నాలిచ్చి పెళ్ళిళ్ళు చేయడం కోసం తండ్రి పడ్డ అవస్థలు, ఆ తర్వాత ఆ పెళ్ళిళ్ళలో ఇమడలేక, బయటికి రాలేక అక్కలు ఎదుర్కొన్న సమస్యలు చూసిన సరళ కి పెళ్లి మీద సదభిప్రాయం ఏర్పడలేదు అప్పట్లో. అందుకే పట్టు పట్టి కాలేజీలో చేరింది.
కాలేజీలో చేరిన పది రోజులకి సరళని విద్యార్ధి యూనియన్ సమావేశానికి తీసుకెళ్ళింది వనజ . అక్కడే మొదటిసారిగా మోహనరావుని చూసింది సరళ. శ్రీకాకుళ ఉద్యమంలో తన వాళ్ళని కోల్పోయిన కుటుంబ నేపధ్యం అతనిది. ఆకర్షణీయమైన రూపం కాకపోయినా, అతను మంచి వక్త. పార్టీ సిద్ధాంతం మీద అతనికున్న గౌరవాన్ని ప్రతి అక్షరంలోనూ ప్రతిబింబిస్తూ యెంతో సిన్సియర్ గా అతను ఇచ్చిన ఉపన్యాసం సరళ అతన్ని ప్రత్యేకంగా గుర్తు పెట్టుకునేలా చేశాయి. సరళ విద్యార్ధి సంఘంలో చేరడాన్ని అభినందించాడు ఆమె తండ్రి. త్వరలోనే ఆమెకి మోహనరావుతో స్నేహం కుదిరింది. అతని ప్రోత్సాహంతో విద్యార్ధినుల విభాగం మొదలు పెట్టి, కొంత కాలానికే ఆ బాధ్యతల్లో తల మునకలయ్యింది.
చదువు పూర్తవ్వగానే మోహనరావు ని పెళ్లి చేసుకుంది సరళ. పార్టీ పెద్దలతో పాటు వనజ కూడా సాక్షి సంతకం చేసింది. అప్పటికే మోహనరావు పార్టీ ఫుల్ టైం వర్కర్. పెళ్లి తర్వాత జీవితం పూల పానుపు కాలేదు సరళ కి. అసలు మోహన రావు ఇంట్లో పానుపే లేదు. ఓ చింకి చాప, మాసిన దిండు, అతి కొద్ది వంట పాత్రలు.. ఇదీ అతని ఇల్లు. మోహనరావు మీద ప్రేమ, పార్టీ మీద అభిమానంతో పెళ్ళైన కొన్నాళ్ళకే సరళ కూడా పార్టీ ఫుల్ టైం వర్కరై, మహిళా సమస్యల మీద పోరాటం మొదలు పెట్టింది.
మొదట్లో ఆ జీవితం అద్భుతంగా అనిపించింది సరళ కి. తన పెళ్లి తండ్రికి భారం కానందుకు గర్వ పడింది. అక్కల సంసారాల్లా కాకుండా, తన కాపురం అందరికీ ఆదర్శం కావాలనుకుంది. అయితే రోజులు గడిచే కొద్దీ అసంతృప్తి మొదలయ్యింది. ముఖ్యంగా ఇద్దరు పిల్లలు బయలుదేరాక, వాళ్ళకోసమైనా ఒక్కొక్కటిగా కనీస సౌకర్యాలు అమర్చుకోవాలని కోరుకుంది. అయితే మోహనరావు ఆలోచనలు వేరు. అతని దృష్టిలో వాళ్ళ జీవితం చాలా మంది జీవితాలకన్నా సౌకర్యవంతంగా ఉంది. చిన్నప్పటి నుంచే పిల్లలకి కష్టపడడం నేర్పాలన్నది అతని పాలసీ.
వనజ కాలేజీ లెక్చరరై, తన తోటి లెక్చరర్ ని పెళ్లి చేసుకుంది. ఆమె ఇంటినీ, తన ఇంటినీ పోల్చి చూసుకుని సరళ లో అసంతృప్తి పెరిగేది. పార్టీ మీటింగులు, ఉద్యమాలు, పోరాటాలు, అరెస్టులు, పోలీసు కేసులు.. జీవితం మరీ యాంత్రికంగా గడిచిపోతోందన్న భావన. కానీ ఆ అసంతృప్తి కన్నా మోహనరావు మీద ఆమెకి ఉన్న ప్రేమే ఎక్కువ కావడంతో రాజీ పడడం నేర్చుకుంది.
* * *
పార్టీ ఆఫీసులో సమావేశ మందిరం తలుపులు మూసుకున్నాయి. ముఖ్య నాయకులు అరడజను మంది మూసిన తలుపుల వెనుక తర్జనభర్జనలు పడుతున్నారు. మధ్య మధ్యలో పార్టీ రాష్ట్ర నాయకులతో ఫోన్లో సంభాషణలు సాగిస్తున్నారు. గత కొంత కాలంగా మోహనరావు పార్టీ వ్యవహారాలకి దూరంగా ఉండడం, ప్రైవేటు సంభాషణల్లో అతడు తమకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్టు నాయకత్వానికి ఉప్పందడం లాంటి విషయాలన్నీ ఒక్కొక్కటిగా చర్చకి వస్తున్నాయి.
నిజానికి మోహనరావుకి పార్టీ జిల్లా నాయకత్వంతో కన్నా, రాష్ట్ర నాయకత్వంతోనే దగ్గరి సంబంధాలు ఉన్నాయి. దాదాపు మూడు దశాబ్దాలు పార్టీలో పని చేసినా, ఏ పదవినీ ఆశించలేదతను. అసలు పదవులంటే లక్ష్యం లేనట్టే వ్యవహరించాడు. "పదవి తీసుకుంటే ప్రజలకి దూరమైపోతాం సరళా" అనేవాడు. ఏం చెప్పాలో అర్ధం కాక మౌనం వహించేది సరళ.
ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ప్రతిసారీ, మోహనరావు నుంచి సిద్ధాంత పరమైన సలహాలు తీసుకోడం ఒక సంప్రదాయంగా మారింది పార్టీ నాయకత్వానికి. పార్టీ సిద్ధాంతానికి ఎంత దగ్గరగా ఉన్నాడో, ప్రజలకీ అంతే దగ్గరగా ఉన్నాడు మోహనరావు. గత కొంత కాలంగా పార్టీ అతని సలహాలు బుట్ట దాఖలు చేయడమే కాకుండా, సిద్ధాంతాలకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోడం గాయ పరిచింది మోహనరావుని. సాధారణ ఎన్నికల సమయంలో పొత్తుల విషయంలో వచ్చిన అభిప్రాయ భేదాల కారణంగా, పార్టీకి దూరంగా జరిగాడు. "సరళ సేవలని వినియోగించుకోవాలా? లేక ఆమెని కూడా పక్కకి పెట్టాలా?" అన్న విషయంలో పార్టీ ఎలాంటి నిర్ణయమూ తీసుకోక ముందే, మోహనరావు హఠాత్తుగా మరణించాడు.
సమావేశంలో ఉన్న నాయకులందరికీ మోహనరావు ఎంత బాగా తెలుసునో, సరళ కూడా అంత బాగానూ తెలుసును. ఇప్పుడు 'సమస్య' సరళే కావడంతో ఆమె గురించి కొంచం ఎక్కువగానే చర్చ జరిగింది. "సమయం మించి పోకముందే నిర్ణయం తీసుకుంటే బాగుంటుంద" ని తొందర పెట్టాడొక నాయకుడు. మరికొంత చర్చ తర్వాత, వాళ్ళో నిర్ణయం తీసుకోడం, దానిని అమలు చేసే బాధ్యతని ఇద్దరు నాయకుల మీద పెట్టడం, అదే విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి తెలియజేయడం పూర్తయ్యింది. అత్యవసర సమావేశం ముగియడంతో మూసిన సమావేశ మందిరం తలుపులు తెరుచుకున్నాయి.
* * *
"దూరం నుంచి రావాల్సిన బంధువులెవరన్నా ఉన్నారా సరళమ్మా?" గది గుమ్మం బయట తలొంచుకుని నిలబడి, ఓ కార్యకర్త అడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయట పడింది సరళ. "ఎవరున్నారు రావాల్సిన వాళ్ళు? సర్వం పార్టీనే అనుకున్నాం.. ఇప్పుడా పార్టీకి మేము కావాలో అక్కర్లేదో తెలియడం లేదు.." అనుకుంది సరళ. అతను అడుగుతున్నది అంతిమ యాత్ర ఏర్పాట్లను గురించి కొంచం ఆలస్యంగా అర్ధమయ్యింది. ఎవరూ లేరన్నట్టుగా అడ్డంగా తలూపింది. దీవాన్ మీద తనపక్కనే దట్టమైన సిగరెట్ పొగ మేఘాల మధ్య కూర్చుని మోహనరావు పుస్తకం చదువుకుంటున్నట్టుగా అనిపించింది ఆమెకి. కళ్ళు చికిలించి చూస్తే గదిలో వనజ, మరి కొందరు స్త్రీలు కనిపించారు.
"నా ఇల్లు..నా పిల్లలు.. అనే స్వార్ధం నుంచి కొంచమైనా బయట పడాలి సరళా.. అన్నీ తెలిసిన వాళ్ళం మనం.. ఏమీ తెలియని వాళ్లకి, అమాయకంగా కష్టపడే వాళ్లకి యెంతో కొంత సాయపడాలి.." వాళ్ళిద్దరి మధ్యా డబ్బు ప్రస్తావన వచ్చినప్పుడల్లా మోహనరావు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి సరళకి. నిజానికి అతని సంపాదనని ఇంటి ఖర్చు కోసం వాడిన సందర్భాలు అరుదు. సాయం కోసం వచ్చిన వాళ్లకి తన డబ్బులు ఖర్చు పెట్టే తత్వం మోహనరావుది. వీధిలోకి చూసిన సరళ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. మోహనరావు పార్థివ దేహం పక్కనున్న పూల దండల రాశి దాదాపుగా టెంట్ ని తాకుతోంది. ఆ పక్కనే తన ఇద్దరు పిల్లలూ.. ప్రశ్నార్ధకంగా కనిపిస్తున్న వాళ్ళ భవిష్యత్తు..
* * *
పార్టీ నాయకులు రెండు వీధుల అవతలే రోడ్డు మీద కారు వదిలేసి నడుచుకుంటూ రావాల్సి వచ్చింది మోహనరావు ఇంటికి. వీధులన్నీ జనంతో నిండిపోయి ఉన్నాయి. ఆ చుట్టుపక్కల బస్తీల్లో ఎవరూ ఆ పూట పనికి వెళ్ళలేదు. రోడ్ల పక్కన గుంపులుగా చేరి మోహనరావుని తలచుకుంటున్నారు. అప్పటివరకూ నిశ్శబ్దంగా ఉన్న కార్యకర్తలు నాయకులని చూడగానే 'కామ్రేడ్ మోహనరావు అమర్ రహే..' అంటూ నినాదాలు చేశారు. అక్కడి జనాన్ని చూసిన నాయకులు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. తాము తీసుకున్న నిర్ణయం సరైనదే అని రుజువైంది వాళ్లకి. అదే సమయంలో ఆ నిర్ణయాన్ని ఎంతవరకూ అమలు పరచగలం? అన్న ప్రశ్న మరోసారి తలెత్తింది వాళ్ళలో.
మోహనరావు కి నివాళులు అర్పించి, పిల్లలని ఓదార్చి, సరళ వైపు దారి తీశారు నాయకులు. వాళ్ళని చూడగానే, ఇంట్లో ఉన్న స్త్రీలంతా మర్యాద పూర్వకంగా బయటికి నడిచారు. బయటికి వెళ్ళబోతున్న వనజని చెయ్యి పట్టి ఆపింది సరళ. పరామర్శలయ్యాక, పార్టీ నిర్ణయాన్ని సరళ చెవిన వేశారు నాయకులు. "నిజానికి ఈ విషయం మాట్లాడడానికి ఇది సమయం కాదు. మోహనరావు ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది. ఆలోచించుకుని నీ నిర్ణయం చెప్పు. సమయం ఎక్కువ లేదు.." తాము చెప్పదల్చుకున్నది చెప్పి బయటికి నడిచారు నాయకులు. వారి ఆధ్వర్యంలోనే మోహనరావు అంతిమయాత్ర ప్రారంభమయ్యింది.
కొడుకు తండ్రి శవం వెంట వెళ్ళాడు. తన స్నేహితులతో మాట్లాడుతోంది కూతురు. గదిలో సరళ, వనజ మాత్రమే మిగిలారు. ఇద్దరి మధ్యా నిశ్శబ్దం. "బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో సరళా.. ఎన్నో ఏళ్ళుగా మీ ఇద్దరూ తెలిసిన దానిగా ఇంతకన్నా ఏమీ చెప్పలేకపోతున్నాను" అంది వనజ, ఇంటికి బయలుదేరే ముందు. "పిల్లలతో చర్చించాలా?" అని ఆలోచించలేదు సరళ. ఆమె దృష్టిలో వాళ్లింకా చిన్న పిల్లలే. ఏమీ తెలియని వాళ్ళే. "మోహనరావు ఉంటే పరిస్థితి మరోవిధంగా ఉండేది.." నాయకుల మాటలు గుర్తొచ్చాయి సరళ కి. పరిస్థితి ఎలా ఉండేదో ఆమెకి తెలియనిది కాదు. అందుకే నిర్ణయం తను మాత్రమే తీసుకోవాలని నిశ్చయించుకుంది.
* * *
మోహనరావు చనిపోయిన ఐదోరోజు.. వీధి వీధంతా సందడిగా ఉంది. ఆవేళ మోహనరావు స్మారక అన్నదానం, పార్టీ ఆధ్వర్యంలో. టెంట్ హౌస్ నుంచి కుర్చీలు, బల్లలు వచ్చాయి. వీధిలో ఒక చివర వంటలు జరుగుతున్నాయి. బస్తీలో నిలువెత్తు కటౌట్లు వెలిశాయి. పార్టీ జెండా పట్టుకుని నడుస్తున్న మోహన రావు, అతని అడుగు జాడల్లో ఎర్రంచు తెల్ల వాయిల్ చీరలో, మెడలో పార్టీ పతాకంతో, జనానికి అభివాదం చేస్తూ నడుస్తున్న సరళ. "కామ్రేడ్ మోహనరావు అమర్ రహే" ఎర్ర రంగులో మెరుస్తున్న పెద్ద అక్షరాలు.
"కామ్రేడ్ మోహనరావు తన చివరి క్షణం వరకూ ప్రజలకోసమే పనిచేశారు. ఆయన ఆశయాలు కొనసాగించడం ఆయన సహచరిగా నా విధి. అందుకే, ప్రజలకి సేవ చేయడం కోసమే నగర పాలక సంస్థ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను. పార్టీ నా మీద ఉంచిన బాధ్యత కూడా ఇదే" పత్రికల వాళ్లకి చెప్పింది సరళ. తమ కూటమి అధికారంలోకి వస్తే తనకి మేయర్ పదవి ఇవ్వాల్సిందిగా పార్టీ మీద ఒత్తిడి తెచ్చి, నాయకుల నుంచి మాట తీసుకున్నాక మాత్రమే పోటీకి అంగీకరించిన విషయం ఆమె చెప్పలేదు. నాయకులు మినహా, ఆ సంగతి తెలిసిన మరోవ్యక్తి వనజ ఆవేల్టి కార్యక్రమానికి హాజరు కాలేదు.
* * *
(మృత్యువు నేపధ్యంగా వచ్చే రచనలంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. నేనూ అలాంటి రచన ఎందుకు ప్రయత్నించకూడదు అన్న ఆలోచన ఫలితమే నా నాలుగో కథ 'సహచరుడు')