"అసలు నేను ఎన్ని టపాలు రాయగలను? మహా ఐతే ఓ పాతికో ముప్ఫయ్యో.. ఇందుకోసం ఓ బ్లాగు మొదలు పెట్టడం అవసరమా?" ఓ బ్లాగు వాడిని అవ్వాలన్న పురుగు నా బుర్రలో ప్రవేశించినప్పుడు దానిని తరమడం కోసం నేను వెతుక్కున్న అనేకానేక కారణాలలో ఇదీ ఒకటి. ఇది జనవరి మూడో వారంలో జరిగిన ముచ్చట. చివరికి ఆ పురుగు గెలవడం నేను బ్లాగడం మొదలు పెట్టడం జరిగింది.
ప్రారంభంలో అన్నీ సందేహాలే.. ఏం రాయాలి? ఎలా రాయాలి? అన్న విషయంలో కాదు.. ఎలా పోస్టు చేయాలి? సెట్టింగులలో ఏ మార్పులు చేసుకోవాలి? కూడలి, జల్లెడలకి లంకె వేయడం ఎలా? సలహా చెప్పే వాళ్ళెవరూ లేరు. నా మిత్రులెవరికీ బ్లాగుల గురించి తెలియదు.. అప్పటికే కొన్ని బ్లాగులు చదివినా ఆ బ్లాగర్లతో ఎలాంటి పరిచయం లేదు. 'ముందు మొదలు పెడదాం..అన్నీ అవే అర్ధమవుతాయి' అనుకున్నా.
గ్రీక్ అండ్ లాటిన్ లా అనిపించిన బ్లాగర్ గైడ్ నాలుగైదు సార్లు చదివి, అప్పటికే ఉన్న జిమెయిల్ ఐడీ సాయంతో బ్లాగు మొదలు పెట్టేశా..జల్లెడ, కూడలి తెలుసు కాబట్టి వాటిల్లో బ్లాగుని లంకె వేయమన్న చోట లంకె వేశా.. తదుపరి కర్తవ్యం? ...వీవెన్ గారినుంచి మెయిల్ వచ్చింది, బ్లాగుని స్వీకరిస్తున్నట్టు. నీళ్ళలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డిపోచ దొరికిన ఫీలింగ్. ఇక ఆయన్ని మెయిళ్ళతో విసిగించడం మొదలు పెట్టాను.
ప్రతి టపాకీ లంకె వేయాలా? వేరే వెబ్సైట్ల లంకెలు ఇవ్వడం ఎలా? ఇలాంటి సందేహాలు. ఆయన చాలా ఓపిగ్గా స్పందించారు. ధన్యవాదాలు వీవెన్ గారూ.. నా రాతలతో జనాల తలరాతలు మార్చెయ్యాలి లాంటి అజెండాలు ఏవీ లేవు కాబట్టి ఫలానా విషయాలు మాత్రమే రాయాలి అని అనుకోలేదు. ఇది నా డైరీ.. కాకపొతే మరికొందరు చదివేందుకు అందుబాటులో ఉంచుతున్నాను.. వాళ్ళని నొప్పించకుండా ఉంటే చాలు.. అప్పుడూ ఇప్పుడూ నా అభిప్రాయం ఇదే.
బ్లాగు లోకం యావత్తూ నా బ్లాగు ముందు క్యూలు కట్టాలని కోరుకోలేదు కానీ, అసలు ఎవరైనా నా బ్లాగు చూస్తున్నారా అన్న కుతూహలం.. ఒకరిద్దరితో మొదలైన స్పందన నెమ్మదిగా పెరిగింది. టెక్నికల్ విషయాలకి సంబంధించి బ్లాగరు 'మధురవాణి' కొన్ని సూచనలు చేశారు. అప్పుడప్పుడూ వ్యాఖ్యలతో పలకరించేవారు. తర్వాత 'అనంతం' ఉమాశంకర్ గారు, 'కొత్తపాళీ' గారు పరిచయమయ్యారు. 'మృచ్చకటికం' సంస్కృత నాటకం చదవగలిగానంటే అది బ్లాగు వల్లే.
నీళ్ళు లేక ఎండిపోతున్న మా గోదారిని తల్చుకుని నేను రాసిన టపా 'చీకట్లో గోదారి.' ఇలా మొదలు పెట్టాలి, ఇలా ముగించాలి లాంటివి ఏమీ అనుకోకుండా అలా అలా రాసుకుంటూ వెళ్ళిపోయాను..పావు గంటలో రాయడం పూర్తయ్యింది. ఇప్పటికీ ఆశ్చర్యమే.. ఇది నేనే రాశానా? అని. 'మీలో చాలా భావుకత ఉంది' అని వ్యాఖ్య రాశారు 'మనసులో మాట' సుజాత గారు. నేను నాకు కొత్తగా పరిచయం అయ్యాను..బ్లాగు వల్ల.
'పరిమళం' గారు 'పద్మార్పిత' గారు 'హిమబిందువులు' చిన్ని గారు ఇలా ఒక్కొక్కరే పలకరించడం మొదలు పెట్టారు. బ్లాగు ద్వారానే 'నిషిగంధ' ఆవిడ కవిత్వం ఇంకా 'కౌముది' అలాగే 'స్నేహమా' రాధిక గారి కవితలూ పరిచయమయ్యాయి. 'పర్ణశాల' కత్తి మహేష్ కుమార్, 'విశ్వామిత్ర' శ్రీనివాస్ పప్పు, 'నాన్న' భాస్కర్ రామరాజు, 'హృదయస్పందనల చిరు సవ్వడి' భాస్కర్ రామి రెడ్డి, 'ఏటిగట్టు' శేఖర్ పెద్దగోపు, 'జాజిపూలు' నేస్తం, 'సరిగమలు' సిరిసిరిమువ్వ, 'చైతన్యం' చైతన్య 'నాబ్లాగు' సునీత, 'మరువం' ఉష, 'కృష్ణ పక్షం' భావన, 'నేను-లక్ష్మి' లక్ష్మి గార్లు అప్పుడపుడూ పలకరించే అతిధులు.
కొన్నాళ్ళకి 'చిన్నమాట' భవాని, 'నాలోనేను' మేధ, 'అరుణమ్' అరుణ పప్పు, 'నాతోనేను నాగురించి' వేణూ శ్రీకాంత్ 'అక్షరాపేక్ష' మెహర్ గార్లూ ఇంకా మరికొందరు బ్లాగర్లూ, బ్లాగు పాఠకులూ ఓ లుక్కేయ్యడం మొదలుపెట్టారు. నా స్నేహితుల్లో నేనో బ్లాగు రాస్తానని తెలిసిన వాళ్ళు కేవలం నలుగురు. వారిలో ఒకరు ఇప్పటివరకూ నా బ్లాగుని చూడలేదు. మిగిలిన ముగ్గురిలో ఇద్దరు మాత్రం క్రమం తప్పకుండా చదువుతూ అభిప్రాయాలు చెబుతున్నారు.. గడిచిన ఐదు నెలల కాలంలో అనేకమంది బ్లాగ్మిత్రులని సంపాదించుకోవడం చెప్పలేనంత సంతోషాన్ని ఇస్తోంది.
నా బాల్యం, నేను చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, అప్పుడప్పుడు నన్ను వెంటాడే ఆలోచనలు ఇవన్నీ పదిమందితో పంచుకోడానికి, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకొడానికి వేదిక కల్పించింది నా బ్లాగు. చాలా రోజుల క్రితం చదివి దాచుకున్న పుస్తకాలూ, చాలా ఏళ్ళ క్రితం చదివిన కథలూ బ్లాగు కోసం మళ్ళీ చదవడంలో ఆనందాన్ని అనుభవించాను. 'అమ్మ చెప్పిన కబుర్ల'ని గుర్తు చేసుకున్నాను. బ్లాగ్మిత్రుల ద్వారా చదవాల్సిన పుస్తకాల గురించి, చూడాల్సిన సినిమాలగురించితెలుసుకున్నాను. 'నవతరంగం' నాకు బ్లాగుల్ని పరిచయం చేస్తే, బ్లాగు నన్ను 'పుస్తకం' కి పరిచయం చేసింది.
ఓ రోజు ఉదయాన్నే నా బ్లాగుని గురించి పరిచయ వ్యాసం ప్రచురించింది 'ఈనాడు.' ఆ పత్రిక చదివే వాళ్ళలో బ్లాగుల గురించి తెలిసిన వాళ్ళందరి దృష్టికీ వెళ్ళింది నా బ్లాగు. అతిధులూ, మిత్రులూ ఒక్కసారిగా పెరిగారు. ఏ బ్లాగరికైనా ఇది సంతోషం కలిగించే పరిణామమే..ఇలాంటివి అస్సలు ఊహించని నాకు ఇదో పెద్ద సర్ప్రైజ్. మిత్రులు తమ బ్లాగుల్లోనూ, నా బ్లాగులోనూ అభినందనలు కురిపించారు. సర్వదా కృతజ్ఞుడిని. కొత్తగా పరిచయమైన బ్లాగ్మిత్రులు పాత టపాలు చదివి అభిప్రాయాలు చెబుతున్నారు. బ్లాగు చదువుతున్న, అభిప్రాయాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికీ పేరు పేరునా వందనాలు.
నేను ఎలాంటి ప్రణాళికా లేకుండా మొదలు పెట్టానీ బ్లాగుని.. నాకు ఏ విషయాన్ని గురించి రాసుకోవాలనిపిస్తే ఆ విషయాన్ని రాస్తూ ఇప్పటికి వంద టపాలు పూర్తి చేశాను. ఇది నా గమ్యం కాదు, ఒక మజిలీ. నా అక్షరాలు ప్రజా శక్తులవహించే విజయ ఐరావతాలు కాదు..వెన్నెల్లో ఆడుకునే అందమైన ఆడపిల్లలూ కాదు.. అయినా ఇవంటే నాకు ఇష్టం.. ఎందుకంటే ఇవి 'నా' అక్షరాలు కాబట్టి. ఇంకా ఎన్ని టపాలు రాస్తాను అన్న సందేహం ఇప్పుడు నాకు లేదు.. ఎందుకంటే రాయాలనిపించి నన్నాళ్ళు, పంచుకునేందుకు కబుర్లు ఉన్నన్నాళ్ళు రాస్తూనే ఉంటాను. ప్రస్తుతానికి మాత్రం ఒక చిన్న విరామం.. అతి త్వరలోనే మళ్ళీ కలుస్తాను.