"ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా..." పాట కూనిరాగం తీస్తూ శ్రీనిధి యెల్లల రాసిన 'అమెరికా అమ్మాయి' పుస్తకం చదవడం మొదలు పెట్టాను. ఎప్పుడైనా బాగా బరువైన పుస్తకం చదివినప్పుడు, తేలిక పడడం కోసం ఒక లైట్ రీడ్ పుస్తకాన్ని ఎంచుకోవడం అలవాటు. వజ్రాన్ని వజ్రంతోనే కోయడం లాగా. ఆమధ్య 'వలస' నవల చదివిన తర్వాత, అర్జెంటుగా ఒక సరదా రచన కావాలని అనిపించింది. "శ్రీనిధి రాసిన అమెరికా అమ్మాయి చదివారా? అచ్చంగా మన పక్కింటమ్మాయి అమెరికా వెళ్లొచ్చి ఆ కబుర్లు చెబుతున్నట్టు ఉంటుంది చదువుతుంటే.." కొన్నాళ్ల క్రితం మిత్రులొకరు చెప్పిన మాట గుర్తొచ్చింది. తీరా వెతికితే, ఈ పుస్తకం నేను కొనేసి చదవడం కోసమని పెట్టుకున్న బొత్తిలో కనిపించింది. సరదా కబుర్లని పేరైతే వచ్చేసింది కానీ, ఇందులో విషయాలు సీరియస్సే, కాకపోతే సుగర్ కోటెడ్, చిన్నప్పుడు ఇష్టంగా మింగిన హోమియోపతి మాత్రల్లాగా.
'కౌముది' ఆన్లైన్ మాసపత్రికలో రెండేళ్ల పాటు, అంటే ఇరవై నాలుగు నెలల పాటు 'కాలమ్' గా వచ్చిన రచనల కలబోత ఈ పుస్తకం. కాలమ్ లో పాఠకులు ముఖ్యంగా వెతికేది కాలక్షేపం. సంపాదకులు చూసేది చదివించే గుణం. ఒక సబ్జెక్టుకి కట్టుబడకుండా హాయిగా ఏ విషయాన్ని గురించైనా రాసేయగలగడం ఆయా కాలమిస్టులకి వరమూ, శాపమూ కూడా. కాలమ్ గా వచ్చిన రచన, ఆ తర్వాత పుస్తకంగా కూడా వచ్చిందంటే అందులో కేవలం కాలక్షేపం మాత్రమే కాక, కాల పరీక్షకి నిలబడేది ఏదో ఉందనే కదా అర్ధం. వైటూకే తర్వాతి తరం వారి అమెరికా వలస జీవితపు అనుభవాలని రికార్డు చేసిన రచనలివి.
మరీ ముఖ్యంగా, భారతదేశంలో శ్రమదమాదులకోర్చి పెద్ద చదువులు చదివి, కొన్నాళ్ళు ఉద్యోగాలు కూడా చేసి, అమెరికా వెళ్ళాక, కేవలం అక్కడి వీసా నిబంధనల కారణంగా గృహిణులుగా మాత్రమే మిగిలిపోయిన హెచ్ వన్ ల భార్యల కథలూ, కబుర్లూ, ఆలోచనలూ, అంతర్మధనాలూ విరివిగా కనిపిస్తాయి ఈ కాలమ్స్ లో. నిర్బంధపు గృహిణిత్వం మీద సెటైర్లు మాత్రమే కాదు. "ఇంత చదువూ చదివి..." అన్న ఆవేదనా కనిపిస్తుంది. పైకి కనిపించని పీర్ ప్రెజర్ సరేసరి. నలుగురు మనుషులు ఒకచోట కలిశారంటే వాళ్ళు రెండో మూడో గ్రూపులుగా మారిపోవడం పరిపాటి. అపార్ట్మెంట్ కాంప్లెక్సుల మొదలు అనేక చోట్ల కనిపించే ఈ తరహా 'గ్రూపిజం' గురించిన చురకలు కొన్నిచోట్ల పాఠకులని భుజాలు తడుముకునేలా చేస్తాయి.
బీనాదేవి 'ప్రి ఫేస్' కథలో ఒక అభిమాని ఆవిడని ('బీనాదేవి' లో రెండో సగం బాలా త్రిపురసుందరీ దేవిని) చూడవస్తాడు. "ఇంతలో మా కుక్క వచ్చి శ్రీరామచంద్రుడి దగ్గర హనుమంతుడిలా నా కాళ్ళ దగ్గర కూర్చుంది. అతనా కుక్కవైపు పరిశీలనగా చూస్తూ 'ఆమధ్య మీరు రాసిన కథలో కుక్క ఇదేనా' అన్నాడు, కథలో కుక్కకీ దీనికీ పోలిక వెతుకుతూ. నేను తుళ్ళి పడ్డాను. 'నయం! కథలో రాసిన మొగుడు ఇతనేనా అనలేదు మావార్ని చూపించి'. నేను కథలో రాసిన ప్రతి వస్తువూ, మనిషీ మా ఇంట్లో ఉండాలని నేననుకోలేదు." అంటూ సాగుతుంది. ఈ కాలమ్స్ లో ఒక భార్య, భర్త, ఒక పాప క్రమం తప్పకుండా కనిపించే పాత్రలు. కబుర్లన్నీ ఆ భార్య గొంతు నుంచి వినిపిస్తాయి. భర్త గురించీ, పాప గురించీ కొన్ని ముచ్చట్లు, మరికొన్ని కంప్లయింట్లు దొర్లుతూ ఉంటాయి. వీళ్ళు కాక చుట్టుపక్కల వాళ్ళు, ఇండియాలో బంధువులు సమయానుకూలంగా కనిపిస్తూ వుంటారు.
ఎక్కువ రెగ్యులర్ పాత్రలు, ఒక కాలమ్ నుంచి మరోదానికి కంటిన్యుటీ లేకపోవడం వల్ల పుస్తకాన్ని ఏ ఆర్డర్ లో అయినా చదువుకోవచ్చు. పుస్తకాల బొత్తిలో ఓ పక్కన పెట్టుకుని అప్పుడోటీ, ఇప్పుడోటీగా చదువుకున్నా అభ్యంతరం లేదు. కానైతే, రచనల్లో చదివించే గుణం పుష్కలంగా ఉండడం వల్ల ఒకసారి చదవడం మొదలు పెట్టాక మధ్యలో ఆపడం ఉండదు. మా మిత్రులు 'సరదా కబుర్లు' అన్నారు కానీ, బహుశా మా పక్కింట్లో ఇలాంటి అమ్మాయి లేకపోవడం వల్ల కాబోలు, నాకు పురాణం సీత 'ఇల్లాలి ముచ్చట్లు' గుర్తొచ్చాయి. అక్కడ ఉన్నట్టే ఇక్కడా రాజకీయాల మొదలు పర్యావరణం వరకూ అనేక విషయాల ప్రస్తావన వుంటుంది. కానైతే ఇక్కడ వినిపించేది అచ్చమైన స్త్రీగొంతు. 'వృధా' ని గురించి రాసిన కాలమ్, పెళ్లిళ్లు పేరంటాల లాంటి సందర్భాలలో దూరాభారం కారణంగా మిస్సవడాన్ని గురించి రాసిన కాలమ్ బాగా గుర్తుండి పోతాయి.
రచనలో నిజాయితీ, హాస్యం కోసం ప్రయాస పడకుండా వ్యంగ్యపు చెణుకులతో నవ్వించడం ఈ కాలమ్స్ ప్రత్యేకత. రాసిన వరసలో చదవడం వల్ల, ఈ రచన స్వీయ అస్థిత్వాన్ని గురించిన ప్రశ్నలతో మొదలై జవాబు వెతుక్కోవడంతో ముగిసినట్టు అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే దూరపు కొండల నునుపుని దగ్గరగా చూపించిన రచన. కథలైనా, కాలమ్స్ అయినా పుస్తకంగా వేసేప్పుడు మొదటి ప్రచురణ తాలూకు వివరం చివర్లో ఇస్తే (కనీసం తేదీ) రికార్డుగా ఉండడంతో పాటు, తర్వాత కాలంలో చదివే వాళ్లకి కాస్త అనువుగా వుంటుంది. రచనా కాలం ఫలానా అని తెలియడం వల్ల పాఠకుల అవగాహన పెరుగుతుంటే తప్ప తగ్గదు కదా. వి. ఆర్. రాసాని, శంకగిరి నారాయణస్వామి (కొత్తపాళీ) తమ ముందుమాటల్లో ఈ రచనని వాళ్ళదైన దృష్టికోణంలో చూశారు. (అస్త్ర బుక్స్ ప్రచురణ, పేజీలు 167, వెల రూ. 175).

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి