ఆదివారం, నవంబర్ 29, 2009

బ్లాగులు-కొత్తపాళీ

"ఈయనెవరో తాపీ ధర్మారావు గారి అభిమాని అనుకుంటా.." ఈ సంవత్సరం మొదట్లో 'కొత్తపాళీ' బ్లాగు మొదటి సారి చూసినప్పుడు ఆ బ్లాగర్ గురించి నాకు అనిపించిందిది. తాపీ వారి రచనల్లో 'కొత్తపాళీ' ఒకటి. అప్పట్లో బ్లాగు లోకంలో దాదాపు ప్రతిరోజూ ప్రముఖంగా కనిపించిన పేర్లలో 'కొత్తపాళీ' ఒకటి.. ఆరకంగా బ్లాగులు చదివే తొలి రోజుల్లోనే కొత్తపాళీ గారి బ్లాగుతో పరిచయమయ్యింది. చాలా బ్లాగుల్లో ఆయన వ్యాఖ్యలు కనిపించేవి.. అభిప్రాయాలు, సలహాలు, సూచనలు.. ఇలా..

బ్లాగుల్లో మాత్రమే కాకుండా 'నవతరంగం' వ్యాఖ్యల్లోనూ అప్పుడప్పుడూ ఈ పేరు కనిపించేది. అడపా దడపా వ్యాసాలూ వచ్చేవి. 'కొత్తపాళీ' బ్లాగులో నేను చదివిన మొదటి టపా నాకు బాగా జ్ఞాపకం.. 'చిగిర్చే చెట్టు' ఆ టపా పేరు. అప్పుడే బ్లాగుల్లోకి వచ్చిన నాకు ఇక్కడి పోకడలు అర్ధం చేసుకోడానికి ఎంతగానో సాయపడిన టపా అది. బ్లాగర్లకి రాడానికి అవకాశం ఉన్న ఇబ్బందులు, వాటిని ఎదుర్కోవలసిన పద్ధతులు ఇవన్నీ తెలుసుకోగలిగాను.

వేదం, వేదాంత సారం మొదలు ,రాజకీయాలు సైన్సు సంగతుల వరకు, తెలుగు కథ మొదలు ప్రపంచ సాహిత్యం వరకు, శాస్త్రీయ సంగీతం, భరత నాట్యం మొదలు నుంచి జాజ్, రాక డేన్స్ వరకు, పాత సినిమాల నుంచి నేటి సినిమాల వరకూ...ప్రతి అంశం మీదా దాదాపు సాధికారంగా మాట్లాడగల వ్యక్తి రాసే బ్లాగులో ఆయా అంశాలన్నింటి గురించీ ప్రస్తావనలు ఉండడం సహజమైన విషయమే కదా. కేవలం తెలుగు సినిమాల గురించే కాదు విదేశీ సినిమాల కబుర్లూ చదవొచ్చు ఇక్కడ. పేరడీ రాసినా, సమీక్ష రాసినా, విమర్శ రాసినా 'సమగ్రత' మిస్సవకుండా చూస్తారన్నది నా చిన్న పరిశీలన.

ఏ అంశాన్ని ఎన్నుకున్నా, ఆ సబ్జక్టు గురించి ఏమాత్రం అవగాహన లేని వాళ్లకి సైతం అర్ధమయ్యేలా రాయడం బ్లాగర్ కొత్తపాళీ గారి ప్రత్యేకత. బాపట్ల జ్ఞాపకాలు, ఆటవా విశేషాలు లాంటి సరదా విషయాలు మొదలు, 'గట్టు తెగిన చెరువు' లాంటి సీరియస్ కథల పుస్తకం మీద సమీక్ష వరకూ అందరిచేతా చదివించేలా రాయడం అంత ఆషామాషీ విషయం ఏమీ కాదు. కథ రాయమని బ్లాగర్లని ప్రోత్సహించడం మొదలు వారం వారం కబుర్లు చెప్పడం వరకూ బ్లాగులో ఆయన చేసిన ప్రయోగాలు అనేకం. కొత్త టపాలతో పాటు పాత ముత్యాలూ దొరుకుతాయి ఈ బ్లాగులో.

కొత్తపాళీ గారి అసలు పేరు నారాయణ స్వామి అనీ, అమెరికా లో ఉంటారనీ, అక్కడ కొందరు ఆయన్ని 'నాసీ' అని పిలుస్తారానీ కాలక్రమంలో తెలిసింది. 'బ్లాగులందు తెలుగు బ్లాగులు మేలయా' అన్నది కొత్తపాళీ బ్లాగు ట్యాగ్ లైన్. తను గురించి తను చెప్పుకున్నది ఒకటే వాక్యం 'రాయాలని ఆశ..' అందుకేనేమో పాఠకులకి ఈ బ్లాగు 'చదవాలని ఆశ' కలుగుతూ ఉంటుంది. కేలండర్ ప్రకారం కచ్చితంగా టపాలు రాయడం బ్లాగుల్లో అంతగా ఆచరణ సాధమైన విషయం కాకపోయినా, ప్రతి సోమ, గురు వారాల్లో కొత్త టపాలు వెలువరిస్తూ ఉంటారు కొత్తపాళీ, అప్పుడప్పుడూ మినహాయింపులు ఉన్నప్పటికీ.

ఆయన బ్లాగు ప్రొఫైల్ కొత్తపాళీ అక్టోబర్ 2006 నుంచి బ్లాగ్లోకం లో ఉన్నారని సూచిస్తోంది. అయితే 'కొత్తపాళీ' బ్లాగు మొదలయ్యింది ఫిబ్రవరి 2007 లో. ఈ బ్లాగర్ కి మరో మూడు బ్లాగులున్నాయి మరి. ఈ బ్లాగర్ కథారచయిత, కవి, సాహితీ, సిని విమర్శకుడు కూడా. జాల పత్రికల్లో ప్రచురితమైన ఆయన కథలు కొన్ని చదవ గలిగాను నేను. వాటిని పుస్తక రూపం లోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నట్టు వినికిడి. భాష మీద ఈయనకి ఎంత అభిమానం అంటే, బ్లాగుల్లో ఎక్కడైనా భాషా, వ్యాకరణ దోషాలు కనబడితే సరి చేయకుండా వదలరు. ఈ బ్లాగులో తరచూ కనిపించే 'కాల్చేసి' (కాల్ చేసి) అనే పదం మాత్రం ఎప్పుడూ కొంత అయోమయ పరుస్తూ ఉంటుంది నన్ను.

కొత్తబ్లాగర్లని ప్రోత్సహించడం, రాయడానికి బద్ధకిస్తున్న వాళ్లకి రాయమని గుర్తు చేయడం మాత్రమే కాదు, ఒక విషయం మీద భిన్నాభిప్రాయాలు వచ్చినప్పుడు తను చెప్పింది మాత్రమే సరైనది అని కాకుండా ఎదుటి వాళ్ళ అభిప్రాయాలని గౌరవించే లక్షణం కూడా కొత్తపాళీ గారిని చాలా మంది బ్లాగర్లు 'గురువు గారు' అని పిలుచుకునేలా చేసిందన్నది నా అభిప్రాయం. పోలిక సరికాదేమో కానీ, ఎంకి గురించి నాయుడు బావ 'కన్నెత్తితే సాలు కనకాభిసేకాలు' అనుకున్నట్టుగా మన బ్లాగ్మిత్రులు చాలా మంది కొత్తపాళీ గారు 'కామెంటితే చాలు..' అని వ్యాఖ్యల్లో రాయడం చూశాన్నేను.

గత నెలలోనే పుట్టిన రోజు జరుపుకున్న కొత్తపాళీ గారికి (ఎన్నో పుట్టిన రోజని నన్నడగొద్దు.. ఆయన్నే అడగండి) బ్లాగ్లోకం తరపున మన కృష్ణపక్షం భావన గారు ఒక అందమైన కానుక ఇచ్చారు. నిజానికి ఆ కానుక బ్లాగు పాఠకుల కోసమే.. అది మరేమిటో కాదు..కొత్తపాళీ గారి టపాల సంకలనం. తీరిక చిక్కినప్పుడల్లా తిరగేయాల్సిన సంకలనం. కొత్తపాళీగారు సెలవులివ్వకుండా బ్లాగు రాయాలనీ, ఇతర కళా, సాహితీ ప్రక్రియలనీ కొనసాగించాలనీ కోరుకుంటున్నాను.

29 కామెంట్‌లు:

 1. మురళీ గారు,

  కొత్తపాళి గారి బ్లాగ్ గురించి మీ అభిమానాన్ని చెప్తూనే నిష్కర్ష గా మీకు నచ్చనివి కూడా రాయటం బావుంది. ఇలా సం యమనంతో రాసే వారు ఈ మధ్య అరుదు గా కనిపిస్తున్నారు. వూరికే పొగడటం, లేదా వూరికే తెగడటం మనకు ఎక్కువగా ఈ రెండే కనిపిస్తుంటాయి.

  కల్పనారెంటాల

  రిప్లయితొలగించు
 2. అభినందన మందారమాల బాగుంది

  రిప్లయితొలగించు
 3. బ్లాగ్లోకంలో ఏ పరిచయం అవసరం లేని వ్యక్తి కొత్తపాళి గారు, కొత్తా పాతా తేడా లేకుండా అందరినీ తన కామెంట్స్ ద్వారా ప్రోత్సహిస్తూ "గురువుగారు" అని పిలిచే పిలుపుకి సార్ధకత చేకూర్చే వ్యక్తి. వారి బ్లాగుని మీరు పరిచయం చెయ్యటం అభినందనీయం, బాగుంది పరిచయం.

  రిప్లయితొలగించు
 4. నిజమే నండీ అందరూ గురువు గారిగా భావించే కొత్తపాళీ గారు కామెంట్ చేసినపుడు నా బ్లాగు గుర్తింపు పొందినదిగా భావించాను.

  రిప్లయితొలగించు
 5. కొత్తవారిని ప్రోత్సహించడంలో కొత్తపాళీగారు ఎప్పుడూ ముందుంటారు. అలాగే తగిన సూచనలూ, సలహాలూ ఇస్తుంటారు. ఈ' గురువు గారు ' భావం నాకూ వుంది అందుకే వీరి బ్లాగు లో కామెంటాలంటే కొంచెం జంకుతాను.ఈ మధ్య ధైర్యం చేసి ఒకటి రెండు కామెంట్లు వేసేసా లెండి .

  రిప్లయితొలగించు
 6. when i entered blog world two years back, i first saw kottapaalii gaari blog. i was spellbound with the content.

  he is one of the best bloggers we have. i respect/love him for his authority as well as warmthness.

  బ్లాగుల్లో నేను చేసిన మొదటి కామెంటు కొత్తపాళీగారికి ( అప్పటికి ఆయనంటే ఏమిటో నాకు తెలియదు. కానీ ఎలా కామెంటేసానో చూడండి)

  http://kottapali.blogspot.com/2007/11/blog-post.html?showComment=1209318360001#c8731716313856100698

  this post is a good intro to a great personality.

  thank you

  bollojubaba

  రిప్లయితొలగించు
 7. కొత్తపాళీగారు సెలవులివ్వకుండా బ్లాగు రాయాలనీ, ఇతర కళా, సాహితీ ప్రక్రియలనీ కొనసాగించాలనీ నేనూ
  కోరుకుంటున్నాను.

  రిప్లయితొలగించు
 8. కొత్తపాళీ గారి గురించి చక్కగా చెప్పారు మురళి గారు. కొత్తపాళీ గారి పేరు నాకు సవ్యసాచి కి మారుపేరు లాగా అనిపిస్తుంది. వారి పోస్టులు ఎన్నో చదివాను. అంత ఆక్టివ్ గా, అన్ని విషయాల అవగాహన తోటి, అందరికీ టైంలీ హెల్ప్ తోటి, తలలో నాలుకలా ఉంటారు.

  రిప్లయితొలగించు
 9. చక్కని బ్లాగుకి అతి చక్కని పరిచయం.. ధన్యవాదాలు మురళి.. స్వదేశం, ప్రస్తుత నివాస దేశంలోని కళలు, సాహిత్యం, రాజకీయాలతో సహా ఎన్నో వివిధ అంశాలను స్పృశించే బ్లాగు కొత్తపాళీ! ఆయన వ్యాఖ్య నా టపాకు ప్రత్యేక గుర్తింపుగా భావిస్తాను!
  ఆయన మిగతా బ్లాగులను కూడా నామమాత్రంగా ప్రస్తావిస్తే బావుండేదేమో కదా :-)

  రిప్లయితొలగించు
 10. బాగా రాసారండీ...నా బ్లాగ్ ను కూడలికి లంకె వేసిన మొదటి రోజు నేను రాసిన టపాకు మొదలు మొన్న మొన్నటి "విశాల నేత్రాలు" టపా వరకూ కొత్తపాళీగారు వ్యాఖ్యల రూపంలో అందించిన ప్రోత్సాహం నాకు ఇంకా ఇంకా బాగా రాయాలనే ఉత్సాహాన్ని పెంచాయి.... ఆయన వ్యాఖ్య వచ్చినప్పుడల్లా I feel honoured....!!కొత్త బ్లాగర్లకు ఆయన ఇచ్చే ప్రోత్సాహం అపూర్వం.

  రిప్లయితొలగించు
 11. కొత్తపాళీ గారి బ్లాగ్ గురించి బాగా చెప్పారండి .

  రిప్లయితొలగించు
 12. బ్లాగులను పరిచయం చేయడం మీరు మొదలుపెట్టినప్పుడు 'మీరు రాస్తారు‌' అని నేనూహించిన బ్లాగుల్లో ఇది మొదటిది. ఈమద్యన మొదటిటపానుంచి మొదలుపెట్టి రోజూ కొన్నిటపాలు చదువుతున్నానండీ. ప్రస్తుతానికి 2007 ఏప్రిల్‌కి చేరాను. ఇంతలో మీరు రాశారు.
  " ఈబ్లాగును చదవడానికి ఖర్చుపెట్టిన ఏక్షణం వృధాకాదు. నిజానికి మనసమయాన్ని ఒకగొప్పపనికి పెట్టుబడి పెట్టినట్టు భావించొచ్చు." ఇదినా అభిప్రాయం.

  రిప్లయితొలగించు
 13. చాలా బాగా చెప్పేరు మురళి. నా బ్లాగ్ కు కూడా మొదటీ కామెంట్ ఆయనదే. మొదటి లో ఎవరు చదువుతారో కూడా తెలియకుండా అయోమయం గా వుండేది. చిన్ని చిన్ని సవరణలే కాదు పడి కట్టు పదాలు ఎక్కువ అవుతున్నాయని మందలించినా ఆయన కే చెల్లు. ఇంక మొదటి లో ఆయన బ్లాగ్, మీది, పరిమళం గారిది పూర్తి చేసేను నేను వెనుక నుంచి ముందుకు. ఆయన ఖచ్చితం గా గురు సమానులే.

  రిప్లయితొలగించు
 14. well said మురళి గారు. ఓ అద్భుతమైన బ్లాగరి గురించి అంతే అద్భుతమైన పరిచయం.

  రిప్లయితొలగించు
 15. @జయ: నిజమేనండీ.. సవ్యసాచి నిజమైన పదం.. ధన్యవాదాలు.
  @పరిమళం: నా కోరికా అదేనండీ.. ధన్యవాదాలు.
  @బొల్లోజు బాబా: బాగుందండీ మీ వ్యాఖ్య.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 16. @లలిత: ఆయన బ్లాగులో మీ వ్యాఖ్యలు నేనూ చూశానండి.. ధన్యవాదాలు.
  @రవిచంద్ర: చాలామంది బ్లాగర్లది అదే భావన అండీ.. ధన్యవాదాలు.
  @లక్ష్మి: నిజం.. ఆయన తెలియని వారు అరుదండీ ఇక్కడ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 17. @kvrn: ధన్యవాదాలండీ..
  @కల్పనా రెంటాల: సుమారు పది పదిహేనేళ్ళ క్రితం రేడియో వార్తల్లో విన్న గొంతు మీదేనేమో అనిపిస్తోంది మీ పేరు చూసినప్పుడల్లా.. వ్యాఖ్యకి ధన్యవాదాలు.
  @తృష్ణ: అన్ని విషయాల మీదా అవగాహన ఉన్నవాళ్ళు అరుదుగా కనిపిస్తారండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 18. @నిషిగంధ: నామమాత్రంగా ప్రస్తావించి ఊరుకోడం చేతకాకేనండీ :):) ..ధన్యవాదాలు.
  @మాలాకుమార్: ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 19. @సుబ్రహ్మణ్య చైతన్య: " ఈబ్లాగును చదవడానికి ఖర్చుపెట్టిన ఏక్షణం వృధాకాదు. నిజానికి మనసమయాన్ని ఒకగొప్పపనికి పెట్టుబడి పెట్టినట్టు భావించొచ్చు." ..అక్షరాలా అంతేనండీ..ధన్యవాదాలు
  @భావన: కొత్తపాళీ గారు వ్యాఖ్యలు రాయని బ్లాగులు ఉంటాయా అనిపిస్తూ ఉంటుందండీ నాకు.. ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: తెలుగు లో రాసిన మొదటి సగంతో పూర్తిగా ఏకీ భావిస్తానండి.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 20. మంచి పరిచయం..ఆయన టపాల గురించి ఇంకాస్త వ్రాసి ఉండవచ్చు అనిపించింది.

  'కాల్చేసి'..నిజమే ఆయన టపాల్లో ఈ పదం చూసినప్పుడల్లా నాకూ మీలానే ఉంటుంది!

  బాపట్లపరంగా కూడా మేము బంధువులమే!

  రిప్లయితొలగించు
 21. మురళీ గారు,

  అవును. మీరు విన్న ఆ స్వరం నాదే. ఆ మధుర క్షణాలు మళ్ళీ గుర్తు చేసుకున్నా ఎంతో సంతోషం గా వుంటుంది.

  కల్పనా రెంటాల

  రిప్లయితొలగించు
 22. @సిరి సిరి మువ్వ: నేను మరో ఇంత టపా రాసినా మీరు ఇదే మాట అని ఉండేవారండీ.. ఎందుకంటె యెంత రాసినా తక్కువే అనిపిస్తుంది 'కొత్తపాళీ' బ్లాగు గురించి.. అన్నట్టు మీ బాపట్ల బంధుత్వం గురించి, మిరపకాయ బజ్జీల గురించీ కూడా బ్లాగులో చదివానండీ :):) ..ధన్యవాదాలు.
  @కల్పనా రెంటాల: అవునో కాదో అని సందేహిస్తూనే అడిగాను.. మిమ్మల్నిలా కలవడం చాలా సంతోషంగా ఉందండీ..

  రిప్లయితొలగించు
 23. "జగమెరిగిన బ్రాహ్మణునికి జందెమేల" అన్నారు.
  (క్షమించాలి. కులం ప్రస్తావన కావాలని తీసుకురాలేదు సామెతకోసం మాత్రమే)

  కొత్తపాళీ తెలియని తెలుగు బ్లాగరేల?

  మనందరం కలిసి ఆయనకి బ్లాగ్ లీడర్ (BLOG LEADER)అని బిరుదు ఇద్దామా?

  ఇంతకీ పెళ్ళికొడుకు గారు ఎక్కడ? ఇంకా కామెంటలేదు.

  రిప్లయితొలగించు
 24. @నేస్తం: :):) ..ధన్యవాదాలు.
  @బోనగిరి: బిరుదు బాగుందండీ.. పెళ్ళికొడుకు విజయవాడలో ఉన్నారుట.. రేపు ఆయన కథల సంపుటి ఆవిష్కరణ సభ ఉందిట.. ఆయన బ్లాగులో రాశారు.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 25. మంచి పరిచయం. ఆయన నాకూ అక్షరాలు సరిదిద్దిన గురువుగారే. పుస్తకావిష్కరణ సభ ఆదివారం కదా. మురళిగారు, కొత్తపాళీగారి టపాలు చదివేటప్పుడు ఈ విషయం గుర్తించలేదేమో.. ఆయన పి.హెచ్.డి చేసారు.ఎందులో అంటే ఆయనే చెప్పాలి. లేదా టపాలలోనే ఈ వివరం ఉంది. వారాంతంలో వెతకండి. దొరుకుతుందేమో !!!

  రిప్లయితొలగించు
 26. @జ్యోతి: 'రేపు ఆదివారం' అని రాస్తే.. ఆదివారాన్ని కామెంట్ బాక్స్ మింగేసిందండీ.. ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 27. నేను బ్లాగు మొదలుపెట్టిన టైములో ఇన్ని తెలుగు బ్లాగులున్నాయని, కూడలి ఉందని, బ్లాగరుల గుంపు ఉందని...ఏమీ తెలీదు నాకు.
  కొత్తపాళీ గారు నా బ్లాగులోకొచ్చి కామెంటు పెట్టడం వల్లనే నాకు కూడలి, జల్లెడ...ఆ తరవాత మెల్లగా అందరి బ్లాగులూ పరిచయం అయ్యాయి.
  గురువుగారికీ జై.!
  మీరు చాలా బాగా రాసారండీ 'కొత్తపాళీ' బ్లాగు గురించి :)

  రిప్లయితొలగించు