గురువారం, డిసెంబర్ 18, 2025

వలస

వర్తమాన తెలుగు నవల సమకాలీన జీవితాల నుంచి కాస్త దూరం జరుగుతోందా? అని సందేహ పడుతున్న తరుణంలో వచ్చిన నవల 'వలస'. బ్లాగర్ గా ప్రారంభించి, రచయిత్రిగా ఎదిగిన 'కొత్తావకాయ' సుస్మిత రాశారీ నవలని. బహుజనపల్లి సీతారామాచార్యులు, జి.ఎన్. రెడ్డి, వావిళ్ళ వారూ కూడా "రాజోపద్రవాదులచే దేశము విడిచి పరదేశమునకుఁ బోవుట" అనే అర్ధం ఇచ్చారు 'వలస' అనే మాటకి. ఆధునిక నిఘంటువు "(మెరుగైన జీవనం కోసం) అధిక సంఖ్యలో ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలి వెళ్ళటం"అని అర్ధం చెబుతోంది. ఇవాళ్టి రోజున వలసలు లేని జీవితాలు అరుదు. బతుకుతెరువు కోసం పుట్టి పెరిగిన ఊరి పొలిమేర దాటి ఎక్కడికి వెళ్లినా అది వలసే. ఈ వలస వేల మైళ్ళ దూరాన ఉన్న పొరుగు దేశానికి అయినప్పుడు, ఆ ప్రభావం కుటుంబాల మీద ఎలా ఉంటుందో చిత్రించారీ నవలలో. 

పదేళ్ళ వయసున్న ఓ వైజాగ్ కుర్రాడు, ఇంట్లో తండ్రి నుంచి అకారణంగా ఎదురవుతున్న వివక్ష నుంచి చాలా దూరంగా అమెరికాకి వెళ్లిపోవాలనే లక్ష్యాన్ని నిర్ణయించుకోవడం ఈ నవల ప్రారంభ సన్నివేశం. కథ సాగే క్రమంలో మరో ముగ్గురు పిల్లలు ఎదురవుతారు. వీళ్ళు విదేశంలో అల్లారు ముద్దుగా పెరుగుతున్న వాళ్ళు. ఏ సమస్యా లేని వాళ్ళు. వీళ్ళ పెంపకమే తల్లిదండ్రులకి పెను సవాలుగా పరిణమించడం ఈ నవలలో కనిపించే పారడాక్స్. భారత దేశానికీ, అమెరికాకి మధ్య నడిచే కథలో వలసలన్నీ ఈ రెండు దేశాల మధ్యనే జరుగుతాయి. వలసల కారణంగా నవలలో పాత్రలు  అందిపుచ్చుకున్న అవకాశాలు,  సాధించుకున్న మెరుగైన జీవితం, కొత్త చోట కుదురుకుని నిలదొక్కుకోవడంలో ఎదురయ్యే సవాళ్లు - ఇది మాత్రమే ఇతివృత్తమా అంటే, కానేకాదు. స్థూలంగా ఇవన్నీ కనిపించినా, సూక్ష్మంగా చూసినప్పుడు 'వలస' చర్చకి పెట్టింది పరాయి నేల మీద పిల్లల పెంపకాన్ని గురించి. 

రాజాంలో పుట్టి పెరిగిన కల్యాణికి బంధువుల కుర్రాడు బాబ్జీతో పెళ్లవుతుంది. ప్రయివేటు కంపెనీలో పని చేసే బాబ్జీకి జీవితంలో మరో మెట్టు ఎక్కాలనే కోరిక బలీయం. అతడు మొదట బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం సంపాదించుకుంటాడు. అటుపై, భార్యా సమేతుడై అమెరికాలో అడుగు పెట్టడంతో కథనం వేగం పుంజుకుంటుంది. రాజాం అనే చెరువులో మొదలైన కళ్యాణి జీవితంలో, బెంగళూరు అనే నది మీదుగా అమెరికా అనే సముద్రాన్ని చేరాక సంభవించిన పెనుమార్పుల వెంట పాఠకులూ ప్రయాణిస్తారు.   కథాక్రమంలో శ్యామ్, స్వామి, శేషగిరి, ఉష, కవిత  పాత్రలు పరిచయమవుతాయి. ఒక్కో పాత్రదీ ఒక్కో కథ. ఒక్కొక్కరి వలస వెనుకా ఒక్కో కారణం. 'ఎక్కడో మొదలైన కథ ఎటెటో వెళ్ళిపోతోందే' అనిపించే లోగానే ఈ పాత్రల మధ్య ఉన్న కనెక్ట్ బయటపడి, నవలని ముందుకి తీసుకెళ్తుంది. 

తొలితరం వలసదారుల జంట శేషగిరి-రుక్మిణి. వలస జీవితం వీళ్ళకి విసిరిన సవాలు పిల్లల పెళ్లిళ్లు. విదేశీయులని కుటుంబ సభ్యులుగా అంగీకరించాల్సి రావడం. రెండో తరం జంట స్వామి-గోమతి. వీళ్ళ సమస్య పూర్తిగా విదేశీ (గ్లోబల్ అనడం సబబేమో) సంస్కృతిని వంటపట్టించుకున్న కూతుర్ని కాసుకోవడం. కూతురి నిర్ణయాన్ని ఒప్పుకోలేకా, అడ్డు చెప్పలేకా సతమతమయ్యే జంట. వీళ్ళ తర్వాత జంట రిషి-కవిత. హేట్ క్రైమ్ కారణంగా కాళ్ళకింద నేల కదిలిపోయాక, ఆ హేటర్స్ మీద ద్వేషం పెంచుకున్న కొడుకుని దారిలోకి తెచ్చుకోడానికి కవిత ఎంచుకున్న దారి ఆసక్తికరం. 'కొడుకు విషయంలో ఈమె కష్టం ఫలించి, సమస్య పరిష్కారం అయితే బాగుండు' అనిపిస్తుంది చదువుతున్నంతసేపూ. కవిత పాత్రకి ఇచ్చిన ముగింపు మాత్రం మల్లాది 'స్రవంతి' ని గుర్తు చేసింది! తర్వాతి తరం వలసదారులు బాబ్జీ-కళ్యాణి తమ సంతానం ద్వారా ఎదుర్కోబోయే సవాళ్ళని రేఖామాత్రంగా చూపించి నవలని ముగించారు. 

'అల్లసాని వారి అల్లిక జిగిబిగి' అని చదువుకోవడమే తప్ప, ఆయన కావ్యాలని చదువుకునే భాగ్యం కలగలేదు. అయితే, అల్లిక జిగిబిగి పోలిక ఈ 'వలస' కి కూడా వర్తిస్తుంది అనిపించింది నవల చదువుతున్నంతసేపూ. మొదటగా చెప్పుకోవాల్సింది అనేక పాత్రలు, భిన్న స్థలకాలాదులూ వున్నా చదువుతున్నప్పుడు ఎక్కడా ఎలాంటి  సందేహమూ కలగలేదు. పఠనానికి బ్రేక్ పడలేదు. కథ మొత్తాన్నీ చిన్నచిన్న సంభాషణలు,క్లుప్తమైన వర్ణనలతోనే చెప్పినా వ్యంగ్యంతో మెరుపులు మెరిపించారు, "మర్యాద ప్రకారం తమకి రైడ్ ఇచ్చిన స్నేహితులకి (సూపర్ మార్కెట్) క్యూలో ముందు చోటిచ్చి వెనుక బాబ్జీ, కల్యాణి నిలబడ్డారు" లాంటివి ఎన్నో. ఇక బిగి విషయానికి వస్తే, ఎక్కడా అనవసరమైన వాక్యమూ, వర్ణనా లేవు. నిజానికి, కథని చెప్పాల్సిన కన్నా పొదుపుగా చెప్పారేమో అనిపించింది కొన్ని చోట్ల. లానా, కోకిల, శంకర్, డాక్టర్ అమీనీ లాంటి చిన్నవిగా కనిపించే పాత్రలు కూడా కథకి ముఖ్యమైనవే కావడం బిగికి ఒక చిన్న ఉదాహరణ. 

"గింజకి జీవశక్తి ఉంటే ఎక్కడ పడేసిన పోదనే శ్రీరమణ చెప్పిన మాట నన్ను దారి తప్పకుండా కాపాడుతూ ఉంటుంది" అన్నారు ఈ రచయిత్రి ఒక ఇంటర్యూలో. 'మిథునం' కథ వచ్చిన ఏడాది, ఒకానొక కథా వార్షిక నిర్వాహకులు తమ సంపుటిలో ఆ కథని చేర్చకుండా,  తర్వాతెప్పుడో నాలిక్కరుచుకున్న సందర్భంలో శ్రీరమణ అన్న మాట అది. అయినా, మిథునానికి వచ్చిన లోటేముంది? 'వలస' విషయానికి వస్తే, జీవశక్తి వున్న రచన అనిపించింది. ఇందులో చర్చించిన అంశాలు మరింతగా సమకాలీనం కాబోవడం ఒక విషాదం. కొన్ని ముఖ్య పాత్రలు కన్నడసీమకి చెందినవి. కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకునేది కూడా బెంగళూరులో. సాఫ్ట్వేర్ రంగంలో భారతదేశం అభివృద్ధిని సాధిస్తున్న దశలో, సంప్రదాయం నుంచి ఆధునికతవైపు ఒక్కసారిగా మారే క్రమంలో ఆ నగర ప్రజలు ఎదుర్కొన్న ఒత్తిడుల ప్రస్తావన అంతర్లీనంగా కనిపిస్తుంది.  ఈ నవలని కన్నడ లోకి అనువదింపజేస్తే అక్కడి పాఠకులకి చేరువయ్యే అవకాశం ఉందనిపించింది. రచయిత్రి మూడేళ్ళ కృషికి ఫలితంగా వెలుగు చూసిన ఈ నవల, విడుదలై రెండు నెలలు తిరగకుండానే రెండో ముద్రణ జరగడం ముదావహం. (అక్షమాల ప్రచురణలు, పేజీలు 234, వెల రూ. 250, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు, అమెజాన్ ద్వారా లభ్యం).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి