సోమవారం, మార్చి 09, 2026

బహుళ

గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి 
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను! 


అట్టాడ అప్పల్నాయుడు తాజా నవల 'బహుళ' ని చేతిలోకి తీసుకోగానే శ్రీశ్రీ 'మహా ప్రస్థానం' లో 'ఒక రాత్రి' గుర్తుకు రావడం యాదృచ్చికం కాదేమో. వామపక్ష ఉద్యమాలతో పెనవేసుకున్న జీవితం నాయుడు గారిది. శ్రీకాకుళోద్యమం పట్ల  ఆరాధన వారి కథల్లో కనిపిస్తుంది. విస్తారమైన కేన్వాసుతో రాసిన 'బహుళ' నవల గంగువాడ గ్రామం లోని ఐదారు తరాల రైతు జీవితాలని కళ్ళముందు వుంచుతుంది. అన్ని విధాలా వెనుకబడిన ఆ రైతులలో కనిపించే పట్టువిడవని తనం, పోరాట స్ఫూర్తి మొదటగా ఆకర్షిస్తుంది. వందేళ్ల పైచిలుకు కాలాన్ని నాలుగొందలముప్పైపేజీల్లో బంధించిన అప్పలనాయుడు రచనా శైలి ఆశ్చర్య పరుస్తుంది. 

నవల చదవడం మొదలు పెట్టిన కాసేపటికే ఇది 'ఆత్మకథాత్మకం' ఏమోనని సందేహం కలుగుతుంది. కావచ్చు, కాకపోవచ్చు. కానీ, కథనం మాత్రం ఆపకుండా చదివించింది. ఇంత నవలని రెండే అధ్యాయాలుగా విభజించారు రచయిత. ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని విరివిగా ఉపయోగించినా, అనేకానేక పాత్రలు, స్థలకాలాదున్న నవలని చదవడంలో, కథలో లీనమవడంలో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. కథని ఒక క్రమంలో చెప్పుకోవాలంటే పెద నారాయుడు గంగువాడ లో స్థిరపడడంతో మొదలై, అతడి మునిమనవడు రాధేయ, తన మనవడిని తీసుకుని గంగువాడలో జరిగే 'పెదనారాయుడి సంబరాలు' రావడంతో ముగుస్తుంది. 

పెదనారాయడు, అతడి మనవడు (కూతురి కొడుకు) చిననారాయుడు, అతడి కొడుకు రాధేయ ఈ నవలలో అత్యంత ప్రధాన పాత్రలు. నాయుళ్ళ వంశీకుడు పెదనారాయుడు స్వయం శక్తితో ఎదుగుతాడు. పెద్ద రైతుగా గంగువాడలో స్థిరపడతాడు. కరువు కాలంలో పన్నుల కోసం పీడిస్తున్న రాచరికంతో తలపడి, హత్యకి గురవుతాడు. తిరుగుబాటుని ఏ పాలన మాత్రం అంగీకరిస్తుంది? గంగువాడ ప్రజలు పెదనారాయుడిని తమ గుండెల్లో పెట్టుకున్నారు. అతడి సమాధిని పూజాస్థలం చేసి, ఏడాదికోసారి సంబరాలు చేయడానికి శ్రీకారం చుట్టారు. అలా జరిగే సంబరాలకి యువకుడైన చిననారాయుడు గంగువాడ రావడం నవలాప్రారంభం. 

ఆ సంబరాల్లో గొల్లల సింహాద్రప్పయ్య బృందం ప్రదర్శించిన తప్పెటగుళ్ళ ప్రదర్శన చిన్ననారాయుడిని ఎంతగా ఆకర్షిస్తుందంటే, ఇక గంగువాడలోనే వుండిపోయి, అప్పయ్య  శిష్యుడిగా చేరిపోతాడు. విద్య నేర్చుకోవడం ముగిసేనాటికి అప్పయ్య కూతురు బంగారమ్మతో పీకల్లోతు ప్రేమలో పడతాడు చిననారాయుడు. పెద్దలు ఒప్పుకోరు కనుక, ఆ జంట భిలాయికి పారిపోయి పెళ్ళిచేసుకుని, రాధేయకి జన్మనిస్తుంది. బతుకుతెరువు వెతుకులాట వాళ్ళ ముగ్గురినీ గంగువాడకే చేరుస్తుంది. ఇటు, పెదనారాయుడి కొడుకు మునసబు నాయుడు, పేరే చెబుతున్నట్టుగా ఆ ఊరి మునసబు. అతడి కొడుకు కనకం నాయుడు, చిననారాయుడి ఈడువాడు, దగ్గరివాడు కూడా. అతడు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి గంగువాడ సర్పంచిగా గెలుస్తాడు. 

పేరుకి ప్రజాస్వామ్యమే అయినా, అధికారం మొత్తం దివాణం జమీందారు దగ్గర కేంద్రీకృతం కావడం, న్యాయమైన సమస్యలకి కూడా తన పదవి ద్వారా పరిష్కారం దొరకకపోవడంతో కనకం నాయుడు క్రమంగా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడవుతాడు. కార్మిక జీవితం వదిలి రైతుగా స్థిరపడిన చిననారాయుడిని  వ్యవసాయ సంక్షోభం కుంగదీస్తుంది. అంతర్ముఖుడైన రాధేయ విద్యార్థి దశలోనే వామపక్ష రాజకీయాలవైపు ఆకర్షితుడవుతాడు. అతడి సహచరి సంధ్యది నక్సల్బరీ నేపధ్యం కావడంతో రెండో భాగం మొత్తం వామపక్ష పోరాటాలు, నక్సల్ ఉద్యమం, అణచివేతలు  ప్రధానంగా సాగుతుంది. తన మనవడితో కలిసి పెదనారాయుడి సంబరాలకి గంగువాడ వెళ్లిన రాధేయ, పోలీసుల చేత 'అర్బన్ నక్సల్' అని ముద్ర వేయించుకోవడం నవల ముగింపు. 

వాస్తవ జీవితాన్ని కల్పిత పాత్రల సాయంతో చిత్రించిన కథలా అనిపించే ఈ నవలలో, వెంపటావు సత్యం, ఆదిభట్ల కైలాసం వంటి వాటి ప్రస్తావన సందర్భానుసారంగా కనిపిస్తుంది. ఆ ఇద్దరి ఎన్ కౌంటర్ యువకుడైన రాధేయ మీద చెరగని ముద్ర వేస్తుంది. నవల చదివే పాఠకులని కూడా ఆ సన్నివేశం ఓ పట్టాన విడిచిపెట్టదు. అదే భూమితో ఒకప్పుడు వైభవంగా బతికిన రైతులు కాలక్రమంలో ఎందుకు చితికిపోయారు అనే ప్రశ్నని గంగువాడ జీవితాలు మిగిలిస్తే, దినదిన గండం లాంటి రహస్య జీవితం, ఆయుధం పట్టి అడవుల నుంచి చేసిన పోరాటం ఏయే మలుపులు తిరిగింది, చివరికి ఎవరికి ప్రయోజనం చేకూర్చింది అన్నది సంధ్య కథ చెబుతుంది. 

అటు చిననారాయుడు, ఇటు రాధేయ కూడా 'పాసివ్' పాత్రలు అవ్వడం వల్ల,  సంఘటనలు, ఇతర పాత్రలు తీసుకునే నిర్ణయాలు మాత్రమే కథని ముందుకి నడిపించాయి. బంగారమ్మ పాత్ర చిత్రణలోనూ, ఆ పాత్రకి ఇచ్చిన ముగింపు లోనూ కనిపించే నాటకీయతని మినహాయించుకంటే, మిగిలిన కథ, పాత్రలు, సన్నివేశాలు సహజంగానే అనిపించాయి. సన్నివేశాల నిడివి విషయంలో రచయిత తీసుకున్న శ్రద్ధ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే సంభాషణలు కేవలం సంభాషణల్లాగే (ఉపన్యాసాల్లా కాకుండా) వుండడం చాలా పెద్ద రిలీఫ్. హాస్యం కన్నా వ్యంగ్యమే ఎక్కువగా వినిపించింది. కారా మేష్టారికీ, కేఎన్వై పతంజలికీ నివాళిగా అనిపించే సన్నివేశాలు అక్కడక్కడా మెరిశాయి. బరువైన పుస్తకం, బరువైన కథ అయినప్పటికీ, రీడబిలిటీ విషయంలో కష్టపెట్టలేదు. 

శివారెడ్డి, ఏకే ప్రభాకర్, గంటేడ గౌరునాయుడుల సవివరమైన ముందుమాటలతో శ్రీకాకుళ సాహితి ప్రచురించిన ఈ 467 పేజీల 'బహుళ' నవల వెల రూ. 300. నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, విశాలాంధ్ర అన్ని శాఖలతో పాటు ఆన్లైన్లోనూ కొనుక్కోవచ్చు. రచయిత తన గురువు కారామేష్టారికి అంకితం ఇచ్చారీ నవలని. 

శుక్రవారం, ఫిబ్రవరి 06, 2026

అమెరికా అమ్మాయి

"ఒక వేణువు వినిపించెను అనురాగ గీతికా..." పాట కూనిరాగం తీస్తూ శ్రీనిధి యెల్లల రాసిన 'అమెరికా అమ్మాయి' పుస్తకం చదవడం మొదలు పెట్టాను. ఎప్పుడైనా బాగా బరువైన పుస్తకం చదివినప్పుడు, తేలిక పడడం కోసం ఒక లైట్ రీడ్ పుస్తకాన్ని ఎంచుకోవడం అలవాటు. వజ్రాన్ని వజ్రంతోనే కోయడం లాగా. ఆమధ్య 'వలస' నవల చదివిన తర్వాత, అర్జెంటుగా ఒక సరదా రచన కావాలని అనిపించింది. "శ్రీనిధి రాసిన అమెరికా అమ్మాయి చదివారా? అచ్చంగా మన పక్కింటమ్మాయి అమెరికా వెళ్లొచ్చి ఆ కబుర్లు చెబుతున్నట్టు ఉంటుంది చదువుతుంటే.." కొన్నాళ్ల క్రితం మిత్రులొకరు చెప్పిన మాట గుర్తొచ్చింది. తీరా వెతికితే, ఈ పుస్తకం  నేను కొనేసి చదవడం కోసమని పెట్టుకున్న బొత్తిలో కనిపించింది. సరదా కబుర్లని పేరైతే వచ్చేసింది కానీ, ఇందులో విషయాలు సీరియస్సే, కాకపోతే సుగర్ కోటెడ్, చిన్నప్పుడు ఇష్టంగా మింగిన హోమియోపతి మాత్రల్లాగా. 

'కౌముది' ఆన్లైన్ మాసపత్రికలో రెండేళ్ల పాటు, అంటే ఇరవై నాలుగు నెలల పాటు 'కాలమ్' గా వచ్చిన రచనల కలబోత ఈ పుస్తకం. కాలమ్ లో పాఠకులు ముఖ్యంగా వెతికేది కాలక్షేపం. సంపాదకులు చూసేది చదివించే గుణం. ఒక సబ్జెక్టుకి కట్టుబడకుండా హాయిగా ఏ విషయాన్ని గురించైనా రాసేయగలగడం ఆయా కాలమిస్టులకి వరమూ, శాపమూ కూడా. కాలమ్ గా వచ్చిన రచన, ఆ తర్వాత పుస్తకంగా కూడా వచ్చిందంటే అందులో కేవలం కాలక్షేపం మాత్రమే కాక, కాల పరీక్షకి నిలబడేది ఏదో ఉందనే కదా అర్ధం. వైటూకే తర్వాతి తరం వారి అమెరికా వలస జీవితపు అనుభవాలని రికార్డు చేసిన రచనలివి. 

మరీ ముఖ్యంగా, భారతదేశంలో శ్రమదమాదులకోర్చి పెద్ద చదువులు చదివి, కొన్నాళ్ళు ఉద్యోగాలు కూడా చేసి, అమెరికా వెళ్ళాక, కేవలం అక్కడి వీసా నిబంధనల కారణంగా గృహిణులుగా మాత్రమే మిగిలిపోయిన హెచ్ వన్ ల భార్యల కథలూ, కబుర్లూ, ఆలోచనలూ, అంతర్మధనాలూ విరివిగా కనిపిస్తాయి ఈ కాలమ్స్ లో. నిర్బంధపు గృహిణిత్వం మీద సెటైర్లు మాత్రమే కాదు. "ఇంత చదువూ చదివి..." అన్న ఆవేదనా కనిపిస్తుంది. పైకి కనిపించని పీర్ ప్రెజర్  సరేసరి. నలుగురు మనుషులు ఒకచోట కలిశారంటే వాళ్ళు రెండో మూడో గ్రూపులుగా మారిపోవడం పరిపాటి. అపార్ట్మెంట్ కాంప్లెక్సుల మొదలు అనేక చోట్ల కనిపించే ఈ తరహా 'గ్రూపిజం' గురించిన చురకలు కొన్నిచోట్ల పాఠకులని భుజాలు తడుముకునేలా చేస్తాయి. 

బీనాదేవి 'ప్రి ఫేస్' కథలో ఒక అభిమాని ఆవిడని ('బీనాదేవి' లో రెండో సగం బాలా త్రిపురసుందరీ దేవిని) చూడవస్తాడు. "ఇంతలో మా కుక్క వచ్చి శ్రీరామచంద్రుడి దగ్గర హనుమంతుడిలా నా కాళ్ళ దగ్గర కూర్చుంది. అతనా కుక్కవైపు పరిశీలనగా చూస్తూ 'ఆమధ్య మీరు రాసిన కథలో కుక్క ఇదేనా' అన్నాడు, కథలో కుక్కకీ దీనికీ పోలిక వెతుకుతూ. నేను తుళ్ళి పడ్డాను. 'నయం! కథలో రాసిన మొగుడు ఇతనేనా అనలేదు మావార్ని చూపించి'. నేను కథలో రాసిన ప్రతి వస్తువూ, మనిషీ మా ఇంట్లో ఉండాలని నేననుకోలేదు." అంటూ సాగుతుంది.  ఈ కాలమ్స్ లో ఒక భార్య, భర్త, ఒక పాప క్రమం తప్పకుండా కనిపించే పాత్రలు. కబుర్లన్నీ ఆ భార్య గొంతు నుంచి వినిపిస్తాయి. భర్త గురించీ, పాప గురించీ కొన్ని ముచ్చట్లు, మరికొన్ని కంప్లయింట్లు దొర్లుతూ ఉంటాయి. వీళ్ళు  కాక చుట్టుపక్కల వాళ్ళు, ఇండియాలో బంధువులు సమయానుకూలంగా కనిపిస్తూ వుంటారు. 

ఎక్కువ రెగ్యులర్ పాత్రలు, ఒక కాలమ్ నుంచి మరోదానికి కంటిన్యుటీ, లేకపోవడం వల్ల పుస్తకాన్ని ఏ ఆర్డర్ లో అయినా చదువుకోవచ్చు. పుస్తకాల బొత్తిలో ఓ పక్కన పెట్టుకుని అప్పుడోటీ, ఇప్పుడోటీగా చదువుకున్నా అభ్యంతరం లేదు. కానైతే, రచనల్లో చదివించే గుణం పుష్కలంగా ఉండడం వల్ల ఒకసారి చదవడం మొదలు పెట్టాక మధ్యలో ఆపడం ఉండదు. మా మిత్రులు 'సరదా కబుర్లు' అన్నారు కానీ, బహుశా మా పక్కింట్లో ఇలాంటి అమ్మాయి లేకపోవడం వల్ల కాబోలు, నాకు పురాణం సీత 'ఇల్లాలి ముచ్చట్లు' గుర్తొచ్చాయి. అక్కడ ఉన్నట్టే ఇక్కడా రాజకీయాల మొదలు పర్యావరణం వరకూ అనేక విషయాల ప్రస్తావన వుంటుంది. కానైతే ఇక్కడ వినిపించేది అచ్చమైన స్త్రీగొంతు. 'వృధా' ని గురించి రాసిన కాలమ్, పెళ్లిళ్లు పేరంటాల లాంటి సందర్భాలలో దూరాభారం కారణంగా మిస్సవడాన్ని గురించి రాసిన కాలమ్ బాగా గుర్తుండి పోతాయి. 

రచనలో నిజాయితీ, హాస్యం కోసం ప్రయాస పడకుండా వ్యంగ్యపు చెణుకులతో నవ్వించడం, ఈ కాలమ్స్ ప్రత్యేకత. రాసిన వరసలో చదవడం వల్ల, ఈ రచన స్వీయ అస్థిత్వాన్ని గురించిన ప్రశ్నలతో మొదలై జవాబు వెతుక్కోవడంతో ముగిసినట్టు అనిపించింది. ఒక్కమాటలో చెప్పాలంటే దూరపు కొండల నునుపుని దగ్గరగా చూపించిన రచన.  కథలైనా, కాలమ్స్ అయినా పుస్తకంగా వేసేప్పుడు మొదటి ప్రచురణ తాలూకు వివరం చివర్లో ఇస్తే (కనీసం తేదీ) రికార్డుగా ఉండడంతో పాటు, తర్వాత కాలంలో చదివే వాళ్లకి కాస్త అనువుగా వుంటుంది. రచనా కాలం ఫలానా అని తెలియడం వల్ల పాఠకుల అవగాహన పెరుగుతుందే తప్ప తగ్గదు కదా. వి. ఆర్. రాసాని, శంకగిరి నారాయణస్వామి (కొత్తపాళీ) తమ ముందుమాటల్లో ఈ రచనని వాళ్ళదైన దృష్టికోణంలో చూశారు. (అస్త్ర బుక్స్ ప్రచురణ, పేజీలు 167, వెల రూ. 175). 

శనివారం, జనవరి 24, 2026

పదిహేడు ...

 

(Google Image)