గగనమంతా నిండి, పొగలాగు క్రమ్మి
బహుళ పంచమి జ్యోత్స్న భయపెట్టు నన్ను!
నవల చదవడం మొదలు పెట్టిన కాసేపటికే ఇది 'ఆత్మకథాత్మకం' ఏమోనని సందేహం కలుగుతుంది. కావచ్చు, కాకపోవచ్చు. కానీ, కథనం మాత్రం ఆపకుండా చదివించింది. ఇంత నవలని రెండే అధ్యాయాలుగా విభజించారు రచయిత. ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ ని విరివిగా ఉపయోగించినా, అనేకానేక పాత్రలు, స్థలకాలాదున్న నవలని చదవడంలో, కథలో లీనమవడంలో ఎలాంటి ఇబ్బందీ కలగలేదు. కథని ఒక క్రమంలో చెప్పుకోవాలంటే పెద నారాయుడు గంగువాడ లో స్థిరపడడంతో మొదలై, అతడి మునిమనవడు రాధేయ, తన మనవడిని తీసుకుని గంగువాడలో జరిగే 'పెదనారాయుడి సంబరాలు' రావడంతో ముగుస్తుంది.
పెదనారాయడు, అతడి మనవడు (కూతురి కొడుకు) చిననారాయుడు, అతడి కొడుకు రాధేయ ఈ నవలలో అత్యంత ప్రధాన పాత్రలు. నాయుళ్ళ వంశీకుడు పెదనారాయుడు స్వయం శక్తితో ఎదుగుతాడు. పెద్ద రైతుగా గంగువాడలో స్థిరపడతాడు. కరువు కాలంలో పన్నుల కోసం పీడిస్తున్న రాచరికంతో తలపడి, హత్యకి గురవుతాడు. తిరుగుబాటుని ఏ పాలన మాత్రం అంగీకరిస్తుంది? గంగువాడ ప్రజలు పెదనారాయుడిని తమ గుండెల్లో పెట్టుకున్నారు. అతడి సమాధిని పూజాస్థలం చేసి, ఏడాదికోసారి సంబరాలు చేయడానికి శ్రీకారం చుట్టారు. అలా జరిగే సంబరాలకి యువకుడైన చిననారాయుడు గంగువాడ రావడం నవలాప్రారంభం.
ఆ సంబరాల్లో గొల్లల సింహాద్రప్పయ్య బృందం ప్రదర్శించిన తప్పెటగుళ్ళ ప్రదర్శన చిన్ననారాయుడిని ఎంతగా ఆకర్షిస్తుందంటే, ఇక గంగువాడలోనే వుండిపోయి, అప్పయ్య శిష్యుడిగా చేరిపోతాడు. విద్య నేర్చుకోవడం ముగిసేనాటికి అప్పయ్య కూతురు బంగారమ్మతో పీకల్లోతు ప్రేమలో పడతాడు చిననారాయుడు. పెద్దలు ఒప్పుకోరు కనుక, ఆ జంట భిలాయికి పారిపోయి పెళ్ళిచేసుకుని, రాధేయకి జన్మనిస్తుంది. బతుకుతెరువు వెతుకులాట వాళ్ళ ముగ్గురినీ గంగువాడకే చేరుస్తుంది. ఇటు, పెదనారాయుడి కొడుకు మునసబు నాయుడు, పేరే చెబుతున్నట్టుగా ఆ ఊరి మునసబు. అతడి కొడుకు కనకం నాయుడు, చిననారాయుడి ఈడువాడు, దగ్గరివాడు కూడా. అతడు ప్రత్యక్ష రాజకీయాల్లో ప్రవేశించి గంగువాడ సర్పంచిగా గెలుస్తాడు.
పేరుకి ప్రజాస్వామ్యమే అయినా, అధికారం మొత్తం దివాణం జమీందారు దగ్గర కేంద్రీకృతం కావడం, న్యాయమైన సమస్యలకి కూడా తన పదవి ద్వారా పరిష్కారం దొరకకపోవడంతో కనకం నాయుడు క్రమంగా వామపక్ష రాజకీయాల వైపు ఆకర్షితుడవుతాడు. కార్మిక జీవితం వదిలి రైతుగా స్థిరపడిన చిననారాయుడిని వ్యవసాయ సంక్షోభం కుంగదీస్తుంది. అంతర్ముఖుడైన రాధేయ విద్యార్థి దశలోనే వామపక్ష రాజకీయాలవైపు ఆకర్షితుడవుతాడు. అతడి సహచరి సంధ్యది నక్సల్బరీ నేపధ్యం కావడంతో రెండో భాగం మొత్తం వామపక్ష పోరాటాలు, నక్సల్ ఉద్యమం, అణచివేతలు ప్రధానంగా సాగుతుంది. తన మనవడితో కలిసి పెదనారాయుడి సంబరాలకి గంగువాడ వెళ్లిన రాధేయ, పోలీసుల చేత 'అర్బన్ నక్సల్' అని ముద్ర వేయించుకోవడం నవల ముగింపు.
వాస్తవ జీవితాన్ని కల్పిత పాత్రల సాయంతో చిత్రించిన కథలా అనిపించే ఈ నవలలో, వెంపటావు సత్యం, ఆదిభట్ల కైలాసం వంటి వాటి ప్రస్తావన సందర్భానుసారంగా కనిపిస్తుంది. ఆ ఇద్దరి ఎన్ కౌంటర్ యువకుడైన రాధేయ మీద చెరగని ముద్ర వేస్తుంది. నవల చదివే పాఠకులని కూడా ఆ సన్నివేశం ఓ పట్టాన విడిచిపెట్టదు. అదే భూమితో ఒకప్పుడు వైభవంగా బతికిన రైతులు కాలక్రమంలో ఎందుకు చితికిపోయారు అనే ప్రశ్నని గంగువాడ జీవితాలు మిగిలిస్తే, దినదిన గండం లాంటి రహస్య జీవితం, ఆయుధం పట్టి అడవుల నుంచి చేసిన పోరాటం ఏయే మలుపులు తిరిగింది, చివరికి ఎవరికి ప్రయోజనం చేకూర్చింది అన్నది సంధ్య కథ చెబుతుంది.
అటు చిననారాయుడు, ఇటు రాధేయ కూడా 'పాసివ్' పాత్రలు అవ్వడం వల్ల, సంఘటనలు, ఇతర పాత్రలు తీసుకునే నిర్ణయాలు మాత్రమే కథని ముందుకి నడిపించాయి. బంగారమ్మ పాత్ర చిత్రణలోనూ, ఆ పాత్రకి ఇచ్చిన ముగింపు లోనూ కనిపించే నాటకీయతని మినహాయించుకంటే, మిగిలిన కథ, పాత్రలు, సన్నివేశాలు సహజంగానే అనిపించాయి. సన్నివేశాల నిడివి విషయంలో రచయిత తీసుకున్న శ్రద్ధ ప్రత్యేకంగా కనిపిస్తుంది. అలాగే సంభాషణలు కేవలం సంభాషణల్లాగే (ఉపన్యాసాల్లా కాకుండా) వుండడం చాలా పెద్ద రిలీఫ్. హాస్యం కన్నా వ్యంగ్యమే ఎక్కువగా వినిపించింది. కారా మేష్టారికీ, కేఎన్వై పతంజలికీ నివాళిగా అనిపించే సన్నివేశాలు అక్కడక్కడా మెరిశాయి. బరువైన పుస్తకం, బరువైన కథ అయినప్పటికీ, రీడబిలిటీ విషయంలో కష్టపెట్టలేదు.
శివారెడ్డి, ఏకే ప్రభాకర్, గంటేడ గౌరునాయుడుల సవివరమైన ముందుమాటలతో శ్రీకాకుళ సాహితి ప్రచురించిన ఈ 467 పేజీల 'బహుళ' నవల వెల రూ. 300. నవోదయ బుక్ హౌస్, కాచిగూడ, విశాలాంధ్ర అన్ని శాఖలతో పాటు ఆన్లైన్లోనూ కొనుక్కోవచ్చు. రచయిత తన గురువు కారామేష్టారికి అంకితం ఇచ్చారీ నవలని.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి