కన్నడలో వచ్చిన పదిహేను కథలకి రంగనాథ రామచంద్ర రావు చేసిన తెలుగు అనువాదం తో వచ్చిన కథల సంపుటి 'నలుపు, తెలుపు, కొన్ని రంగులు...' ప్రత్యేకత ఏమిటంటే ఇవన్నీ రచయిత్రులు రాసిన కథలు. మూలకథలన్నీ 1932-2012 మధ్య కాలంలో తొలిసారి ప్రచురితమయ్యాయి. ఎనభయ్యేళ్ళ కాలంలో వచ్చిన కన్నడ సాహిత్యం నుంచి ఎంచిన పదిహేను కథలు కావడంతో వస్తు విస్తృతికి లోటు లేదు. పైగా, ఎంపికకి ప్రాతిపదిక 'కేవలం స్త్రీవాద కథలు మాత్రమే' కాకపోవడం విషయ విస్తృతికి దోహదం చేసింది. స్త్రీ పాత్రలతో పాటు, పురుష పాత్రలూ బలంగా ఉండడం, ఎక్కువ కథలు ఆశావహ దృక్పథంతో ముగియడం ఈ సంపుటి ప్రత్యేకతలుగా చెప్పవచ్చు.
తొలి కథ 'ఆహుతి' ని కొడిగిన గౌరమ్మ 1932 లో రాశారు. ఇతివృత్తం వరకట్న సమస్య. కథానాయకుడు వరకట్నాన్ని ఆశించడానికి బలమైన కారణాన్ని ఏర్పాటు చేశారు రచయిత్రి. ఇందువల్ల, ఇది వ్యక్తుల సమస్య కాదనీ వ్యవస్థకీ భాగం వుందనే ఆలోచన పాఠకుల్లో కలుగుతుంది. కట్నం ఇచ్చుకోలేని నాయిక నేపధ్యం సరేసరి. రెండవ కథ దేవాంగనా శాస్త్రి రాసిన 'వేణీ సంహారం', 1941లో వచ్చింది. ఇతివృత్తం బాల్యంలో వితంతువైన ఓ అమ్మాయికి ఆమె యవ్వనంలో అడుగు పెట్టాక శిరోముండనం చేయించే ఏర్పాట్లు చేయడం. ఆ నిర్ణయానికి వ్యతిరేకంగానూ, అనుకూలంగానూ జరిగే వాదోపవాదాలు. అమ్మాయి తండ్రికి కూడా ఇది ఇష్టంలేని క్రతువే. అయితే, జరిపించకపోతే, అతడు తన పౌరోహిత్య వృత్తిని వదులుకోవాల్సిన పరిస్థితి.
ఇక్కడి నుంచి ఒక్కసారిగా నలభై ఏళ్ళు గడిచిపోయి, మూడో కథ 1990 దశకం నాటిది కనిపిస్తుంది. అలాగే, ఇక్కడి నుంచి వచ్చే పదమూడు కథల తొలి ప్రచురణ తేదీలకి, ఈ పుస్తకంలో వాటి క్రమానికి సంబంధం వుండదు (ఇది కాస్త ఇబ్బంది పెట్టే విషయం, మరీ ముఖ్యంగా పుస్తకాన్ని ఒకే వరసలో ఏకబిగిన చదివేప్పుడు). వైదేహి రాసిన 'అక్కు' కథ, ఆమె కథలని చదివిన వాళ్ళని ఆశ్చర్య పరచదు కానీ, కొత్తగా చదివే వాళ్ళని ఆగి ఆలోచించేలా చేస్తుంది. అక్కు పాత్ర పట్ల పాఠకుల్లో జాలో, కరుణో కలిగించే ప్రత్యేక ప్రయత్నం ఏదీ రచయిత్రి చేయకపోవడం వల్ల, అక్కుతో పాటు, ఆమె వల్ల ఇబ్బందులు పడే కుటుంబ సభ్యులని గురించి కూడా ఆలోచిస్తారు పాఠకులు. డాక్టర్ వీణా శాంతేశ్వర రాసిన 'విముక్తి' నూరుశాతం స్త్రీవాద కథ. ఊహకు అందే కథనం, ముగింపు.
డాక్టర్ ఎల్.సి. సుమిత్రా రాసిన 'పిచ్చుకల వాగు సాక్షిగా' మిగిలిన కథల కన్నా ప్రత్యేకమైనది. కథలో ముఖ్యమైన పాత్ర పరిచయం చెప్పీ చెప్పకుండా చేయడం, ముగింపు పాఠకులకి వదిలివేయడంతో పాటు కథనం కూడా మిగిలిన కథలకి భిన్నంగా సాగింది. డాక్టర్ వినయా రాసిన 'ఒక వ్యక్తిగత పత్రం' చాలా ఆసక్తిగా సాగే కథ. అమాయకపు స్త్రీ-దుర్మార్గపు పురుషుడు కథే అయినప్పటికీ లేఖా రూపంలో సాగడం వల్ల ఆద్యంతమూ ఆసక్తిగా చదివిస్తుంది. డాక్టర్ కె. ఆర్. సంధ్యా రెడ్డి 'ఒక ఆత్మకథ' కి మన పి. సత్యవతి 'సూపర్ మామ్ సిండ్రోమ్' తో రేఖా మాత్రపు పోలిక కనిపిస్తుంది. సునంద ప్రకాశ కడమె కథ 'చిట్టి పాదాల గురుతు...' ఒక వృద్ధురాలి కథ. వృద్ధాప్య సమస్యలకి పరిష్కారాన్ని బాల్య జ్ఞాపకాల్లో కనుక్కుంటుంటుందామె.
సుమంగలా రాసిన 'అడుగుజాడలు' నోస్టాల్జియా కథ. నీట మునిగిన తన ఊరిలో చిన్ననాటి జ్ఞాపకాలని వెతుక్కునే నాయిక కథ. డాక్టర్ జయశ్రీ సి. కంబార రాసిన 'ముఖాముఖి'ని మేజిక్ రియలిజంతో నడిపించారు. ఒక రచయితకి-పాత్రకి నడుమ సంభాషణ. వర్షపు నేపధ్యం చక్కగా అమరింది ఈ కథకి. మాలతీ ముదకవి రాసిన 'గంధపతీ పృథ్వీ' కి శ్రీరమణ 'మిథునం' లో రేఖా మాత్రపు పోలిక తోచక మానదు. ఈ సంపుటి శీర్షిక కి దగ్గరగా ఉండే పేరు 'నలుపు, తెలుపు, కొన్ని రంగుల చిత్రాలు...' శుభదా అ. అమినభావి రాసిన ఒక మహిళా ఫోటోగ్రాఫర్ కథ. తాజ్ హోటల్ పేలుళ్లు నేపధ్యం. నాయిక తాతగారి ఫ్లాష్ బ్యాక్ లో స్వతంత్ర పోరాటాన్ని ప్రస్తావించడం ఈ కథ ప్రత్యేకత.
ఆద్యంతమూ ఆసక్తిగా సాగడమే కాక, ఆపై ఎప్పటికీ గుర్తుండిపోయే కథ సి. ఎస్. ముక్త రాసిన 'నాన్న'. భార్యని కెరీర్ వుమన్ గా కొనసాగనిచ్చి, తాను ఇంటి బాధ్యతలు నెరవేర్చిన విద్యావంతుడైన ఓ పురుషుడి కథ. వృద్ధుల కళ్ళ నుంచి ప్రపంచాన్ని చూసిన కథలు విజయా శంకర రాసిన 'అసహాయులు', లీలా ముణ్ణాల రాసిన 'మునిమాపు పక్షులు'. రెండూ ప్రత్యేకమైన ఇతివృత్తాలు, తెలుగు పాఠకులకి తెలిసినట్టుగా అనిపించే కథలు కూడా. "కథలు చెప్పిన విధానంలో ఎక్కడా అనవసర భేషజాలు, కృత్రిమ శిల్పాలు లేవు. హాయిగా చదివించే కథలు. దానికి ముఖ్య కారణం రంగనాథ రామచంద్ర రావు గారి అనువాదమనే చెప్పాలి" అన్నారు ఆచార్య సి. మృణాళిని తన ముందుమాటలో.
లక్ష్మీ ప్రచురణలు ప్రచురించిన ఈ 136 పేజీల పుస్తకం వెల రూ. 120. పుస్తకం చివర్లో మూల రచయిత్రులందరి క్లుప్త పరిచయం ఇవ్వడం బాగుంది.