ఉత్తరాంధ్ర కథకులు, నవలా రచయిత అట్టాడ అప్పల నాయుడు. ఈయన కథల్లో 'సూతకం కబురు' కథంటే నాకు ప్రత్యేకమైన ఇష్టం. నాయుడుగారబ్బాయి సృజన్ అట్టాడ దర్శకత్వంలో వచ్చిన సినిమా 'కన్యాకుమారి'. ఈ సినిమాకి కథ, మాటలు, పాటలు, స్క్రీన్ప్లే అందించడంతో పాటు, నిర్మాణాన్నీ భుజాన వేసుకున్నారు సృజన్. గత నెలలో థియేటర్లలో విడుదలైన 'కన్యాకుమారి' ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ ద్వారా స్ట్రీమింగ్ అవుతోంది. శ్రీకాకుళం జిల్లా పెంటపాడు కుర్రాడు తిరుపతి (శ్రీచరణ్ రాచకొండ), అదే ఊరి అమ్మాయి కన్యాకుమారి (గీతా సైనీ) ల ప్రేమకథ ఇది. చూడచక్కని విజువల్స్, ఇంపైన నేపధ్య సంగీతం, ఆసక్తిగా సాగే కథనం కారణంగా 135 నిముషాలు అప్పుడే అయిపోయేయా అనిపించింది, ఎండ్ టైటిల్స్ పడుతుంటే.
హైస్కూల్ లోనే కన్యాకుమారి కి ప్రపోజ్ చేసి భంగ పడతాడు తిరుపతి. కన్యాకుమారి లక్ష్యం సాఫ్త్వేర్ ఇంజనీర్ కావాలని. తిరుపతి కేమో రైతు కావాలని కోరిక. ఊళ్ళో పొలం ఉండడంతో పాటు, కొడుకు కోరికకి అడ్డుచెప్పని తండ్రి కావడంతో, తిరుపతి హైస్కూల్ లోనే చదువు మానేసి వ్యవసాయంలో స్థిరపడి పోతాడు. కన్యాకుమారి చదువులో ముందున్నా, ఎంసెట్ లో మంచి రేంక్ తెచ్చుకున్నా, ప్రభుత్వ కళాశాలలో బీకామ్ లో చేరాల్సి వస్తుంది, ఇంట్లో మద్దతు లేకపోవడం వల్ల. శ్రీకాకుళంలో బట్టల షాపులో సేల్స్ గర్ల్ గా చేరినా తన సాఫ్ట్వేర్ ఆశల్ని చంపేసుకోదు. రైతు అయిన కారణానికి తిరుపతికి పెళ్లి సంబంధాలు కుదరవు. అప్పుడే అనుకోకుండా కన్యాకుమారి అతని జీవితంలోకి మళ్ళీ వస్తుంది.
నాయికా నాయకులు కనుక సహజంగానే కన్యాకుమారీ, తిరుపతీ ప్రేమలో పడతారు. సాఫ్ట్ వేర్ రెక్కలు కట్టుకుని ఎగిరిపోవాలి అనుకునే కన్యాకుమారికీ, మట్టిని విడిచి, ఊరిని వదిలి బయటకి వెళ్లలేని తిరుపతికీ మధ్య ప్రేమ, పెళ్లి వరకూ వెళ్లాలంటే ఎవరో ఒకరు తమ కలల్ని 'త్యాగం' చేయాలి. అటు చూస్తే ఆడపిల్ల చదువు, కలలు, ఇటు చూస్తే వ్యవసాయం, గ్రామీణ జీవితం. చక్కని చిక్కుముడి. వాళ్ళ ప్రేమ త్యాగాన్ని కోరదు కానీ, ఓ ఆసక్తికరమైన తీరాన్ని చేరుతుంది. అదేమిటో అమెజాన్ ప్రైమ్ లోనే చూడండి. సినిమా మొదటి నుంచి చివరి వరకూ ఆకట్టుకున్నది నేటివిటీ. ఎక్కడా శ్రీకాకుళం, పరిసర గ్రామాలు దాటి వెళ్ళలేదు కెమెరా. ప్రతి సన్నివేశం కంటికి ఇంపుగా వుంది.
సంభాషణలు పూర్తి మాండలికంలో లేవు. నిజానికి గ్రామాల్లో కూడా మాండలికం నెమ్మదిగా కనుమరుగవుతోంది, టీవీ చానళ్ల ప్రభావంతో. మెజారిటీ తారాగణం ఆ ప్రాంతం వాళ్ళే. మేకప్పులు, కాస్ట్యూమ్స్ లాంటి పటాటోపాలు ఏవీ లేవు. స్థానికతని చూపించడంలో లోటుగా అనిపించిన విషయం మాత్రం ఆ ప్రాంతానికే ప్రత్యేకమైన పండుగలు, పబ్బాలు, జాతరలు లాంటివి ఏవీ కథలో భాగం కాకపోవడం. వరి కోతలప్పుడు చేసే పూజని మాత్రమే చూపించారు. నిజానికి ఆ ప్రాంతపు ప్రత్యేక సంప్రదాయాలని కథలో భాగం చేసే అవకాశం వుంది, సన్నివేశాల నేపధ్యం మార్చుకోవచ్చు. ఎందుకో దృష్టి పెట్టలేదు. గుర్తుండిపోయే ఒక పాటో, హాంటింగ్ గా ఉండే నేపధ్యపు సంగీతపు బిట్టో వుండి వుంటే ప్రేమ సన్నివేశాలకి మరింత బలం చేకూరి ఉండేది.
మరింత బాగా ఉండవచ్చునని బాగా అనిపించిన విభాగం ఎడిటింగ్. సినిమా నిడివి మరీ పెద్దది కాకపోయినా కొన్ని సన్నివేశాల నిడివి ఎక్కువగా ఉండడం (ముఖ్యంగా ప్రథమార్ధంలో), కీలక సన్నివేశాలని మరీ క్లుప్తంగా చూపడం లేదా వాయిస్ ఓవర్ తో సరిపెట్టేయడం (ద్వితీయార్ధంలో) కాస్త అసంతృప్తిగా అనిపించింది. అయితే, జామకాయని కథలో భాగం చేయడం లాంటి సూక్ష్మ విషయాలు నచ్చేశాయి. నాయికా నాయకులు మాత్రమే కాదు, నటీనటులందరూ వంక పెట్టలేని విధంగా నటించారు. ముఖ్యంగా రెండు నిశ్చితార్ధం సన్నివేశాలు, వాటిలో కాంట్రాస్టు బాగా గుర్తుండిపోతాయి. అలాగే వెంకాయమ్మ పాత్రధారిణి, ఆవిడ కనిపించే రెండు మూడు సన్నివేశాలు కూడా. డ్రీమ్ సాంగ్స్, ఐటెం సాంగ్స్, ఫైట్స్ లాంటివి ఏవీ ఇరికించకుండా హాయిగా అనిపించేలా తీశారు సినిమాని.
సినిమా టైటిల్స్ మొదట్లో 'విప్లవ్ పిక్చర్స్' అని చూసి, ఆర్. నారాయణమూర్తి తరహా ఎర్ర సినిమా చూడడానికి సిద్ధ పడిపోయాను. కానైతే, ప్రేమకథతో ఆశ్చర్య పరిచింది చిత్రబృందం. ఓటీటీలో మలయాళం సినిమాలని ఇష్టపడే తెలుగు ప్రేక్షకులకి నచ్చే సినిమా ఇది. ఇక, అప్పలనాయుడు గారి 'సూతకం కబురు' కథానాయిక పరిస్థితులకి లొంగిపోతుంది. జీవితం తనని దెబ్బ మీద దెబ్బ కొట్టినప్పుడు, వాటిని తట్టుకునే శక్తిని కోల్పోతుంది. కానీ, సృజన్ సృష్టించిన 'కన్యాకుమారి' మాత్రం పరిస్థితులకి ఎదురీదుతుంది. తన కలల్ని చంపుకోదు. ఆత్మవిశ్వాసాన్ని కోల్పోదు. అలాగని, తన కలల సాధన కోసం ప్రేమని పణం గానూ పెట్టదు. అవును, ఆమె ఈతరం అమ్మాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి