సోమవారం, సెప్టెంబర్ 04, 2023

శృంగేరి-1

"ఒక్కొక్కరికి రూములు ఇవ్వం.. కనీసం ఇద్దరుండాలి..." మధ్వ సంప్రదాయపు పంచెకట్టు, బొట్టు, గుండు, పిలకతో కంప్యూటర్ ముందు కూర్చున్న బలమైన రిసెప్షనిస్టు కన్నడ-ఇంగ్లిషుల కలగలుపుతో గద్దిస్తూ ఉంటే, ఓ క్షణం పాటు తక్షణ కర్తవ్యం బోధ పడలేదు నాకు. అప్పటికే ఆ గద్దింపు భరించి, ఏం చెయ్యాలో తోచక నిలబడ్డ కుర్రాడి మీద పడింది నా దృష్టి. "మనం రూమ్ షేర్ చేసుకుందామా?" చొరవగా అడిగాను ఇంగ్లిష్లో. నన్నోసారి పరకాయించి చూసి, సరే అన్నట్టు తలూపాడు. "ఇదివరకే ఫ్రెండ్స్ అయితే సరే.. కానీ ఇక్కడ కలిసి రూమ్ తీసుకున్న వాళ్ళు, తర్వాత వచ్చి ఏ కంప్లైంట్ చేసినా నేను రెస్పాన్సిబుల్ కాదు" అడక్కపోయినా చెప్పేశాడు రిసెప్షనిస్టు. ఇద్దరి వివరాలూ క్షుణ్ణంగా టైపు చేసి, మూడొందలు కట్టమన్నాడు. కుర్రాడు వాలెట్ తెరిచేలోగా, ఐదొందల నోటు తీసి ఇచ్చాను. నేను చిల్లర అందుకునే లోగా, తన నూటేభై నా బ్యాక్ పాక్ లో పెట్టేశాడు బెంగళూరు నుంచి వచ్చిన నా రూమ్మేట్. అలా నా శృంగేరి యాత్రలో రూమ్ తీసుకొనుట అనే తొలిఘట్టం పూర్తయ్యింది. 

ఊరింకా పూర్తిగా తెల్లవారలేదు. బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటోంది, మాలాగే. 'యాత్రి నివాస్' లో మా రూముకి చేరాం. రెండు పెద్ద మంచాలు, వాష్ రూములు, ఛేంజింగ్ రూము.. మొత్తం కలిపి ఓ సింగల్ బెడ్ రూమ్ ఫ్లాట్ అంత ఉంది. "మీరు స్నానం చేసేయండి, నేను తర్వాత చేస్తాను" మంచి ఇంగ్లిష్లో చెప్పి ఫోన్లో తల దూర్చాడు రూమ్మేట్. ఫార్మల్ పరిచయాలు రిసెప్షనిస్టు సమక్షంలోనే అయిపోయాయి కదా. చలిగా, వర్షం వచ్చేలా ఉంది బయట వాతావరణం. హాయిగా వేడినీళ్ల స్నానం. రెడీ అయి బయటికి వచ్చిన నన్ను చూసి ఫోన్ పక్కన పెట్టాడు. "రిసెప్షన్ బిల్డింగు దాటి కొంచం ముందుకు వెళ్తే కుడివైపు మారుతి టిఫిన్ సెంటర్ అని ఉంటుంది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయండి, బాగుంటుంది" చెప్పాడు. "గుడికి వెళ్లొచ్చాక బ్రేక్ఫాస్ట్ కదా" అన్నాన్నేను.  "ఒకసారి లోపలికి వెళ్తే భోజనం చేసే బయటికి వస్తాం. ఇక్కడ అందరూ బ్రేక్ఫాస్ట్ చేసే గుడికి వెళ్తారు. నేను బహుశా స్వామీజీ దర్శనం దగ్గర మిమ్మల్ని కలుస్తాను" ఈ 'స్వామీజీ దర్శనం' ఏవిటో అర్ధం కాక అయోమయంగా తలూపాను. 

కష్టపడక్కర్లేకుండానే మారుతి టిఫిన్ సెంటర్ అడ్రస్ దొరికేసింది. బయట కొందరు తమవంతు కోసం ఎదురు చూస్తూ నిలబడ్డారు. అక్కడున్న చిన్న ట్యాప్ దగ్గర కాళ్ళు, చేతులు కడుక్కుని నేనూ వరుసలో నిలబడ్డా. లోపలి నుంచి మా అందరికీ పిలుపొచ్చింది. బాగా పాతకాలపు ఇంట్లో ఓ చివరి వాటా. సన్నని, పొడవాటి హాలు. గచ్చు నేల మీద రెండు వైపులా చాపలు పరిచి ఉన్నాయి. తగు చోటు చూసుకుని కూర్చున్నా. ఉత్తరీయాన్ని నడుముకి కట్టుకున్న మధ్వాచార్యులు ఒకాయన వచ్చి అందరి ముందూ అరిటాకులు పరిచి వెళ్లారు. వెనుకే మరో ఆయన మంచి నీళ్ల గ్లాసులతో వచ్చారు. ఆకు శుభ్రం చేసుకునే లోగా, మొదటి ఆయన వేడి వేడి ఇడ్డెన్లతోనూ, రెండో ఆయన చట్నీతోనూ ప్రత్యక్షం. అటు పైన చిక్కటి సాంబారు, వడలు, పూరీలు, కూర ఒకదాని వెంట మరొకటి వచ్చాయి. కావలిస్తే వేయించుకోవడం, వద్దనుకుంటే చేయి అడ్డం పెట్టడం తప్ప మాటలేవీ లేవు. తినడానికి తప్ప నోరు తెరవడం లేదు ఎవ్వరూ. ఏదో నందికేశుడి నోముకి వచ్చినట్టు ఉంది తప్ప, ఎక్కడా హోటల్ లో టిఫిన్ తింటున్నట్టు లేదు. 

వడ్డించిన టిఫిన్ల వేడికి అరిటాకు కమిలి పోయింది. వంటకాల రుచి, నాణ్యత ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. "కాఫీ? టీ?" ఆకులేసిన ఆయన అందరినీ అడిగాడు. మొత్తం మీద ఓ పాతిక మందిమి ఉన్నాం. పూరీ పూర్తి చేసేలోగా పొగలు కక్కే కాఫీ వచ్చింది. తాపీగా తాగుతూ ఉండగా అప్పుడొచ్చాడు మూడో మనిషి, చేతిలో పుస్తకం, పెన్నుతో. ఏమేం తిన్నామో చెబితే బిల్లు వేసి ఇస్తాడన్నమాట. ఏవి ఎన్నేసి తిన్నామో గుర్తు చేసుకోవడం కాస్త కష్టమైన వ్యవహారమే. ఎవర్నీ ఆకులు మడవనివ్వలేదు. ఆకులు వేసినాయనే ఓ బుట్టతో వచ్చి అన్నీ తీశాడు, ఆ వెనుకే రెండో ఆయన తడి బట్టతో గచ్చు తుడిచేశాడు.   బిల్లు అందుకుని నేరుగా ముందుకి వెళ్తే (వన్ వే) కిచెన్ లో ఉన్నాయన డబ్బు తీసుకున్నాడు. అటు నుంచి పెరట్లోకి వెళ్లి చెయ్యి కడుక్కుని, సందు గుండా వీధిలోకి రావాలి. దాదాపు వందేళ్ల నుంచి అదే ఇంట్లో అదే పద్ధతిలో నడుస్తోందిట ఆ చిన్న హోటల్. బయటికి వచ్చేసరికి తర్వాతి బ్యాచి వాళ్ళు వాళ్ళ వంతు కోసం ఎదురు చూస్తూ నిలబడి ఉన్నారు. 

ఎండ వేడి చురుక్కుమంటూండగా విశాలమైన ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టాను. కుడి వైపున వరుసగా ఆలయాలు, ఎడమవైపున వరుసగా పెద్ద పెద్ద హాళ్లు - ఆధ్యాత్మిక సమావేశాల మొదలు అక్షరాభ్యాసాల వరకూ అనేక కార్యక్రమాలు సామూహికంగా నిర్వహించుకోడానికి వీలుగా. మొదట శారదాంబ ఆలయం. హారతి అవుతోంది. భక్తుల రద్దీ మరీ ఎక్కువగా లేదు. బారికేడ్స్ ఉన్నా, ప్రదక్షిణకి వీలుగా ఉంది ఏర్పాటు. ప్రదక్షిణ పథంలో చిన్న చిన్న ఉపాలయాలున్నాయి. హారతి చాలాసేపు జరగడంతో, కాసేపు సన్నిధిలో నిలబడే వీలు చిక్కింది. బయటికి వచ్చేసరికి ఆకాశంలో మబ్బులు. 'అరే' అనిపించింది. వరుసలో తర్వాత ఉన్నది విద్యా శంకర ఆలయం. హోయసాల, విజయనగర ఆర్కిటెక్చర్ల కలగలుపుగా కనిపించే ఈ ఆలయం ప్రత్యేకత లోపల మహా మండపంలో ఉండే పన్నెండు స్థంభాలు. ఒక్కో స్థంభం ఒక్కో రాశికి ప్రతీక. సూర్యుడు ఏ నెలలో ఏ రాశిలో ఉంటాడో ఆ స్థంభం మీద మాత్రమే సూర్యకిరణాలు పడతాయి. ఆ అద్భుతాన్ని కళ్లారా చూడడానికి వీలు లేకుండా శ్రావణ మాసపు కరిబ్బులు అడ్డం పడ్డాయి. 

దశావతారాల మొదలు యక్షిణులు వరకూ అనేక శిల్పాలను పరిశీలిస్తూ ప్రదక్షిణ చేస్తున్నా. ఫోటోల వాళ్ళతో పాటు, వ్లాగర్లు, రీల్స్ వారు, వాట్సాప్ లైవ్ వారు... ఇలా అందరినీ దాటుకుంటూ, కొందరికి అడ్డు తప్పుకుంటూ, మరికొందరికి అడ్డుపడుతూ ప్రదక్షిణ పూర్తి చేసి లోపలికి అడుగుపెట్టేసరికి అక్కడ ఇంకో కోలాహలం. ఏదో ప్రత్యేక పూజ జరుగుతోంది. భక్తులు చాలామంది ఉండడంతో స్థంభాలని బాగా చూడడం వీలవ్వలేదు. దర్శనం పూర్తి చేసుకుని బయటికి వచ్చి, ఒకరిద్దరికి ఫోటోలు తీసి పెట్టి ముందుకు వెళ్తే మరో రెండు ఉపాలయాలు కనిపించాయి. అవి చూసుకుని తుంగ నది దగ్గరకు చేరేసరికి మబ్బులు మరికాస్త చిక్కబడ్డాయి. స్నానానికి అనుమతించరు కానీ తుంగలో పాద ప్రక్షాళనకి వీలుంది. పెద్ద పెద్ద రాతి మెట్లు జాగ్రత్తగా దిగుతూ ఉంటే మోకాళ్ళు కలుక్కుమన్నాయి. 

తీరా కాళ్ళు కడుక్కునే వేళకి భారీ చేపలు కాళ్ళ మధ్య అడ్డం పడడం  మొదలెట్టాయి. ఆకారానికి మొసలి పిల్లల్లా ఉన్నాయవి. చాలామంది భక్తులు అక్కడే కొన్న మరమరాలు వాటికి ఆహారంగా పెడుతున్నారు. డైట్ లో కార్బ్స్ మరీ ఎక్కువైతే జరిగే పరిణామం ఏవిటో వాటి పరిమాణం చెబుతోంది. పక్కనెవరో భక్తులు ఒక్కో చేపనీ ఎంతమందికి వండి పెట్టొచ్చో అంచనా వేస్తున్నారు (ఆ రేవులో వేట నిషిద్ధం). కాస్త కష్టపడి మెట్లెక్కి పైకి వస్తే తుంగ మీద ఒక వంతెన ఉంది. అవతల పక్క ఏముందో చెప్పే బోర్డు కన్నడలో ఉంది. కొందరు భక్తులు వెళ్తున్నారు. నేనూ బయల్దేరాను. బ్రిడ్జి మధ్యలో నిలబడితే తుంగ అలలతో పాటు, చేపలూ (చేప  పిల్లలు అనలేం) బాగా కనిపిస్తున్నాయి. 'చెలి పయ్యెదలో తుంగ అల పొంగాలీవేళ..' వేటూరి గుర్తొచ్చారు. కేవలం ఏముందో చూసొద్దాం అనే కుతూహలం ముందుకు నడిపించింది. 

అడుగు పెట్టగానే తెలిసింది అది లంక అని. సారవంతమైన నేల, ఆపై వర్ష ఋతువు కావడంతో పచ్చగా హరిత ద్వీపంలా ఉంది. కానైతే, పూలమొక్కలు, పళ్ళ చెట్లు మొదలు పచ్చిక వరకూ అన్నీ క్రమశిక్షణతో పెరుగుతున్నాయక్కడ. ఫెన్స్ కి ఆవల రెండు జింక పిల్లలు ఓ లేగ దూడ పచ్చిక మేస్తూ కనిపించాయి. బొమ్మలేమో అనుకున్నా ఒక్క క్షణం. కదులుతున్నాయి. బలమైన గజరాజు, బక్కపలచటి మావటి ఎదురొచ్చారు. మావటిని చూడగానే 'వేలాయుధం' గుర్తొచ్చేశాడు.  శంకరాచార్యుల సందేశాలని కన్నడ, ఇంగ్లీష్ భాషల్లో రాసిన బోర్డులున్నాయి అక్కడక్కడా. వాటిని చదువుకుంటూ ముందుకు వెళ్తే 'ప్రయివేట్ సెక్రటరీ'స్ ఆఫీస్' అని బోర్డున్న ఓ చిన్న బిల్డింగు, ఆ వెనుకే గెస్టు హౌసు, కాస్త ముందుకెళ్తే ఓ ఆలయం, యాగశాల, గురు నివాసం కనిపించాయి. ఒక్కొక్కటీ చూసుకుంటూ గురు నివాసం చేరేసరికి చినుకులు మొదలయ్యాయి. అప్రయత్నంగానే గురు నివాసానికి వెళ్లాను. వెళ్లాకే తెలిసింది, అది శృంగేరి పీఠానికి కాబోయే జగద్గురువు విదుశేఖర భారతీ స్వామి భక్తులకి దర్శనం ఇచ్చే చోటు అని. 

విశాలమైన పెద్ద హాలు. ఎదురుగా వేదిక. గుడి కన్నా చిన్నది, పూజా మందిరం కన్నా పెద్దది అయిన దేవుని మండపం. వేదికకి ఎదురుగా హాలు మధ్యలో కూర్చున్నా. నాకు ఎడమవైపున 'పాదపూజ' అని బోర్డు, అక్కడి నుంచి వేదికపై ఓ ప్రత్యేకమైన బారికేడ్ కనిపించాయి. కుడివైపున మరో బారికేడ్ ఉంది. వేదికని ఆనుకుని కుడి వైపున భారీ గాజుపెట్టెలో ఒక వీణ ఉంది. అది ప్రపంచంలోనే అతి పెద్ద వీణ అట. స్వామీజీ అంతేవాసులు, బహుశా పరిచారకులు అంటారనుకుంటా, కొందరు మండపంలో పూజలు చేస్తుంటే మరి కొందరు తీర్ధ ప్రసాదాలు ఏర్పాటు చేస్తూ హడావిడి పడుతున్నారు. ఏక్షణంలో అయినా స్వామీజీ లోపలి నుంచి బయటికి రావచ్చు అన్నట్టుగా ఉంది వాతావరణం. పరిచారకుల హడావిడి చూస్తుంటే 'బంగారు మురుగు' కథలో బామ్మ గుర్తొచ్చింది. బుర్రలో తిరుగుతున్న ఆ ఛానల్ ని బలవంతంగా ఆపి చుట్టూ చూస్తే హాల్లో జనం పలచగా ఉన్నారు. కొందరు ధ్యానం చేసుకుంటున్నారు. నేనూ ప్రయత్నించాను కానీ అంత కుదురెక్కడిది? 

(ఇంకావుంది) 

11 కామెంట్‌లు:

 1. మురళి గారు,
  ఇదేదో ఈ మధ్యన అంటుకున్న ధోరణి అనుకుంటాను. దాదాపు అన్ని క్షేత్రాలకు పాకింది.
  నా స్వీయ అనుభవం చెబుతాను. ఆమధ్య మహానంది వెళ్లాను. దర్శనం ఆలస్యమయింది. తిరుగు బస్సు ఎప్పటికోగానీ లేదన్నారు. సరే, అర్జెంటుగా వెనక్కి వెళ్ళి చేసేదేమీలేదు గనక ఆ రాత్రికి అక్కడే ఉందామనుకున్నాను. చుట్టూ చూస్తే టి.టి.డి. వారి సత్రం కనిపించింది. అక్కడకు వెళ్ళి ఆ మేనేజర్ గారిని నేనొక్కడినే, నాకు రూమ్ కావాలి అవి అడిగాను. ఒక్కరే గనక అయితే రూమ్ దొరకదు అన్నాడు. అదేమిటన్నాను, అదంతే అన్నాడు. ఒక వ్యక్తి ఒక్కడూ పుణ్యక్షేత్రాల దర్శనానికి రాకూడదా, వస్తే వసతి కూడా దొరక్కుండా అడ్డు పడడం ఏమిటి అన్నాను. ఇది మా రూలు అన్నాడు. రూంమేట్ కోసం ఎక్కడని వెతకను? దాంతో విసుగొచ్చి సెంటర్ కు వచ్చి మూడు వందల రూపాయలకు బేరమాడుకుని (నిజానికి బేరమేమీ లేదు, వాడెంత డిమాండ్ చేస్తే అంతే) ఓ ఆటో ఎక్కి 20 కి.మీ. దూరంలో ఉన్న నంద్యాల టౌన్ కి వచ్చి పడ్జాను.

  చాలా క్షేత్రాలకు ఫోన్లు చేసి అడిగాను / లేదా వారి వెబ్సైట్ లో చూసాను - ద్వారకా తిరుమల, శ్రీశైలం, పుట్టపర్తి వగైరాలు. అందరూ ఇదే మాట సింగిల్ వ్యక్తికి గది ఇవ్వము అని. నాకు విచిత్రంగా అనిపిస్తోంది. వాళ్ళ భయమేమిటో నాకిప్పటికీ అర్థం కావడం లేదు 😒.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. సరైన కారణం నాకూ తెలియలేదు కానండీ, నా ఊహ ఇదీ: గత కొన్నేళ్లుగా అన్ని (ప్రముఖ) ఆలయాలకీ భక్తుల తాకిడి పెరిగింది. ఆదాయం, రవాణా సౌకర్యాలు పెరగడం, ప్రత్యేకించి భక్తి చానళ్ళ ప్రచారం లాంటివి కారణాలు. ఇలా తాకిడి పెరిగినప్పుడు ఒక్కొక్కరికి ఒక గది ఇవ్వడం వల్ల ఎక్కువమంది భక్తులని అకామడేట్ చేయలేమని (అదే గదిని ఓ కుటుంబానికి ఇస్తే ఇద్దరు లేదా నలుగురు భక్తులకి బస ఇచ్చినట్టు అవుతుంది కదా) 'పై స్థాయి' లో ఎవరో నిర్ణయం తీసుకుని ఉంటారు. కింద వాళ్ళకి ఆ నిర్ణయాన్ని అమలు చేయడమే తప్ప 'సందర్భానుసారం' అనే ఆలోచన రాదు. నిజంగా రద్దీ ఉన్నప్పుడు తిరస్కరించినా, గదులు ఖాళీ ఉన్నప్పుడు ఒక్కొక్కరుగా ఉన్న వాళ్ళని కన్సిడర్ చేయచ్చు (పెరిగిన భక్తులు అనేది దృష్టిలో ఉంచుకుని 'అద్దె అదే అయినప్పుడు ఎందరుంటే ఎందుకు?' అనే విషయంలో మనం సర్దుకుని). కానైతే అలా జరగడం లేదు. ఇది ఎక్కడో ఎందుకో మొదలయ్యింది, అందరూ గుడ్డిగా అమలు చేసుకుంటూ పోతున్నారు. బహుశా ఆ నిర్ణయం తీసుకున్న వాళ్ళు కూడా ఎందుకు తీసుకున్నారో ఇప్పుడు మర్చిపోయి ఉంటారు. అసలైన కారణం అంటూ వేరే ఏదైనా ఉందేమో వెతకడానికి నేనూ ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు..

   తొలగించండి
  2. నాకు తెలిసి ఒకప్పుడు, ఒంటరిగా గది తీసుకుని కొంతమంది ఆత్మహత్యలు చేసుకునేవారు. ఇలా చాలా సార్లు జరగడంతో, ఒక్కరికి గది ఇవ్వడం ఆపేసారు.
   తిరుమలలో ప్రైవేటు సత్రాల్లో తెలిసిన వాళ్ళు ఉంటే, ఒక్కరికి కూడా గది ఇస్తారు.

   తొలగించండి
  3. బోనగిరి గారు, థాంక్స్. మీరు చెప్పినది కూడా జరిగే ఆస్కారం లేకపోలేదు. కానీ ఆ కారణంగా దేవాలయాల వాళ్ళు అటువంటి నిర్ణయం తీసుకోవడం సరైన పని కాదని నా అభిప్రాయం. ఆ నిర్ణయం ఉద్దేశం తమకొచ్చే తలనొప్పులు తప్పించుకోవడమా లేక ఆత్మహత్యలను నివారించడమా?

   రెండవ కారణం గనక అయితే …. ఆత్మహత్య చేసుకోదలచిన వ్యక్తి దేవాలయ సత్రంలో గది ఇవ్వక పోతే ఏదైనా హోటల్ లో గది తీసుకుని దాంట్లో ఆత్మహత్య చేసుకుంటాడు.
   ఏదీ ఆగదు.

   మధ్యలో అసలైన యాత్రీకుల “చావు” కొచ్చినట్లు అవుతోంది 🙂.

   తొలగించండి
 2. కానీ అంత కుదురెక్కడిదీ ?


  మీ ఈ హానెస్టీ కి జేజేలు :)  జిలేబి

  రిప్లయితొలగించండి
 3. చక్కగా వివరించారు. చక్కని తెలుగులో. ఎవరన్నా మంచి తెలుగులో వ్రాస్తే ప్రాణానికి చాలా సుఖంగా అనిపిస్తుంది. తదుపరిభాగం కోసం ఎదురుచూస్తాను.

  రిప్లయితొలగించండి
 4. శ్రీశైలం లో కూడా అక్టోబర్ 2023 లో వెళ్తే ఏ సత్రంలో ఒంటరి వ్యక్తికి ఇవ్వము అన్నారు. బస్సు స్టాండ్ డార్మిటరీ లో పడుకోవాల్సి వచ్చింది. ఆ కొండా మీద ప్రైవేట్ హోటల్స్ ఉండవు . తర్వాత రోజు మహానంది లో తెలిసిన వారి ద్వారా ఫోన్ చేయిస్తే రూమ్ దొరికింది. పైన ఒకరు చెప్పినట్టు ఆత్మహత్యలు చేసుకుంటారని భయం అని ఇవ్వట్లేదు అన్నారు.

  రిప్లయితొలగించండి