శుక్రవారం, జులై 21, 2023

బతుకుబాటలో కొండగుర్తులు

ఆత్మకథ వేరు, దినచర్య (డైరీ) వేరు. ఒక వ్యక్తి జీవనగతిని, ఆలోచనలని, కృషిని, దృక్పథాన్ని వివరించేది ఆత్మకథ అయితే, ప్రతిరోజూ చేరిన పనుల తాలూకు రికార్డు దినచర్య. ఆత్మకథలుగా మొదలై డైరీలుగా మారిపోయిన ప్రముఖుల రచనలు కొన్ని ఇటీవల కాలంలో చదవడం తటస్థించింది. ఈ కోవలోకే వచ్చే రచన భాషావేత్త భద్రిరాజు కృష్ణమూర్తి 'బతుకుబాటలో కొండగుర్తులు.' గంభీరమైన శీర్షికతో, ఆసక్తికరమైన ఆరంభంతో ఆపకుండా చదివించే పుస్తకం అనే భావనని కలిగించినా, సగానికి వచ్చేసరికి ఈ భావన క్రమేణా పలచబడి ఆసక్తి స్థానంలో నిరాశ పెరగడం మొదలయ్యింది. ఇందుకు కారణం ఈ ఆత్మకథలో డైరీ ప్రవేశించి, కేవలం రోజువారీ కార్యకలాపాలు మాత్రమే క్లుప్తంగా ప్రస్తావించి (డైరీ నోట్స్) ఊరుకోవడమే. ఆత్మకథల మీద ఉన్న ఆసక్తి ఈ పుస్తకాన్ని కడదాకా చదివించింది.

ఒంగోలు పట్టణంలోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో మూడో సంతానంగా జన్మించిన కృష్ణమూర్తి బాల్యంలో చాలా సమస్యలనే చూశారు. తండ్రిని పోగొట్టుకుని, బంధువులు సాయంతో చదువు పూర్తి చేశారు. నిజానికి ఉన్నత విద్యకి బదులు, ఉద్యోగానికే వెళ్లాలని అనుకున్నారు కానీ, అనుకున్నట్టుగా ఉద్యోగం రాకపోవడంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు. అక్కడ తెలుగు సాహిత్యానికి బదులుగా, తెలుగు భాషా శాస్త్రాన్ని ఆప్షనల్ గా ఎంచుకోవడం కృష్ణమూర్తి జీవితంలో మొదటిమలుపు. ఈ మలుపు వెనుక ఉన్నవారు నాటి యూనివర్సిటీ లైబ్రేరియన్ అబ్బూరి రామకృష్ణారావు, అధ్యాపకులు గంటి జోగిసోమయాజి. చదువు పూర్తవుతూనే ఆంధ్ర విశ్వవిద్యాలయం లోనే ఉద్యోగం దొరకడంతో ఆర్ధిక సమస్యలు గట్టెక్కాయి. అటు తర్వాత, పెన్సెల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి భాషాశాస్త్రంలో పీహెచ్డీ చేసే అవకాశం రావడం జీవితంలో రెండో మలుపు.

చదువు పూర్తి చేసుకుని స్వదేశానికి తిరిగి వచ్చి ఆంధ్ర, శ్రీ వెంకటేశ్వర, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో భాషాశాస్త్ర బోధన చేపట్టడం, హైదరాబాద్ యూనివర్సిటీ కి వైస్-ఛాన్సలర్ గా పనిచేయడంతో పాటు అనేక ప్రపంచ దేశాలు పర్యటించి, భాషాశాస్త్ర సదస్సులో పాల్గొని, కొన్ని విదేశీ విశ్వవిద్యాలయాల్లో విజిటింగ్ ఫ్యాకల్టీగా పనిచేయడం మాత్రమే కాకుండా భాషా శాస్త్రానికి సంబంధించి పత్రాలు, పుస్తకాలెన్నింటినో రచించారు. చేకూరి రామారావు, బూదరాజు రాధాకృష్ణ లాంటి శిష్యులని తయారు చేశారు. ఉస్మానియాలో భాషాశాస్త్ర విభాగం ఏర్పాటు, విస్తరణకి ప్రత్యేక కృషి చేశారు. భాషకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అమలుపరిచిన విధానపరమైన నిర్ణయాల వెనుక (తెలుగు అకాడెమీ, తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు లాంటివి) ఉన్నారు. 

తెలుగులో భద్రిరాజు కృష్ణమూర్తి సంపాదకత్వం వహించి స్వరూప నిర్దేశం చేసిన మాండలిక వృత్తి పదకోశాలు భారతీయ భాషల్లోనే తొలి ప్రయత్నం. ప్రద ప్రయోగ కోశ నిర్మాణ పద్ధతులని రూపొందించారు. లింగ్విస్టిక్ సొసైటీ అఫ్ అమెరికా గౌరవ సభ్యత్వం, రాయల్ సొసైటీ అఫ్ ఎడింబరో విద్వత్ సభ్యత్వం లాంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గౌరవాలు అందుకున్నారు. ఆత్మకథలు అంటే ఉన్న ఇష్టంతో పాటు, ఈ ప్రొఫైల్ లో కొంత తెలిసి ఉండడం ఈ పుస్తకం కొనడానికి కారణమైతే, ఆరంభం కడు ఆకర్షణీయంగా ఉండి ఏకబిగిన చదవడానికి దోహదం చేసింది. ముందే చెప్పినట్టుగా, సగం పేజీలు తిరిగేసరికి ఆత్మకథ బదులు దినచర్య దర్శనమిచ్చింది. తేదీల వారీగా ఏరోజు ఏ దేశంలో ఏ కార్యక్రమం లో పాల్గొన్నారో, ఎవరెవరిని కలిశారో వివరాలు నమోదు చేశారు. భాషాశాస్త్ర అధ్యయనం, పరిశోధనకి సంబంధించిన లోతైన వివరాలు బొత్తిగా లేవు.

తన డైరీకి అక్కడక్కడా యూనివర్సిటీ రాజకీయాలు, కుటుంబ విషయాలు జోడించారే తప్ప, ఒక భాషా శాస్త్రవేత్త ఆత్మకథ నుంచి పాఠకులు ఏం ఆశిస్తారు అన్న కోణం బొత్తిగా ఆలోచించలేదేమో అనిపించింది. చివరి రెండు అధ్యాయాలు ఆయన చెబుతుండగా వేరే వారు రాసినవి. అక్కడ నుంచి కథనం ప్రధమ పురుషలోకి మారింది, వివరాలు మాత్రం మారలేదు. హైదరాబాద్ యూనివర్సిటీలో చేసిన అభివృద్ధి పనుల జాబితా దర్శనమిచ్చింది. పట్టి చూస్తే నాటి విద్యావిధానం, విదేశీ ప్రయాణాల తీరుతెన్నులు, దేశ-విదేశీ జీవన విధానాల లాంటి వాటిని గురించి కొన్ని పరిచయ వాక్యాలు కనిపిస్తాయి తప్ప లోతైన వివరణ దొరకదు. 'వాళ్ళతో సంభాషించాను' 'అక్కడ కూర్చుని రాసుకున్నాను' లాంటి వాక్యాలు లెక్కకు మిక్కిలి. ఆ సంభాషణలు, రచనల 'లోతు' తాలూకు ప్రస్తావన లేదెక్కడా.

పదేళ్ల క్రితం ఎమెస్కో ప్రచురించిన ఈ పుస్తకం మధ్యలో ఓ పద్దెనిమిది పేజీలని కేవలం ఫోటోలకి కేటాయించారు. పేపర్ క్వాలిటీ బొత్తిగా లేకపోవడం వల్ల ఆ ఫోటోలు బొత్తిగా అలుక్కుపోయి కనిపిస్తున్నాయి. రచయిత కుటుంబ సభ్యులైనా ఆ ఫోటోల్లో ఉన్నదెవరో గుర్తు పట్టగలరా అంటే సందేహమే. కాగితపు నాణ్యత పెంచడమో, ఫోటోల ప్రచురణ పరిహరించడమో చేసి ఉండాల్సింది. ఆ విధంగా రచనతో పాటు ముద్రణ కూడా నిరాశ పరిచింది. భద్రిరాజు కృష్ణమూర్తి కాలం, చేసిన కృషి, పొందిన అవకాశాలు వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకున్నప్పుడు నాటి సమాజం మొదలు, తెలుగులో భాషా శాస్త్ర అభివృద్ధి వరకూ చాలా విషయాలని వివరించే వీలున్న పుస్తకం ఇది. మరి ఈ 'స్కోప్' ని ఉపయోగించుకోక పోవడం వెనుక యేవో కారణాలు ఉండే ఉంటాయి. ('బతుకుబాటలో కొండగుర్తులు', పేజీలు 214, వెల రూ. 100).

4 కామెంట్‌లు:

  1. తెలుగు లో నిజంగానే భాషా శాస్త్ర అభివృద్ధి మీరు ప్రస్తావించిన వీరి కాలంలో గాని ప్రస్తుతంలో కాని జరిగిందనో జరుగుతోందనో మీరు భావిస్తున్నారా ?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజానికి ఇది చాలా పెద్ద టాపిక్ అండీ. యూనివర్సిటీల నుంచి ఏటా వస్తున్న వందలాది పీ హెచ్ డీల్లో ఎన్ని అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి? అన్నది ప్రధానమైన ప్రశ్న. ఈ దిశగా ప్రభుత్వం కూడా ఎలాంటి ప్రయత్నం చేసినట్టు లేదు. తన హయాంలో జరిగిన భాషాశాస్త్ర అభివృద్ధి ఇదీ అని వీరు కూడా ఇదమిద్దంగా ఏమీ చెప్పలేదు, ఇతర గ్రంధాలు (ఈయన రాసినవి) చదివితే ఏమన్నా ఓ అభిప్రాయానికి రావొచ్చు.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  2. మురళి గారూ, వందలాది కాదేమో, వేలాది యేమో నండీ. ఈమధ్య ఊరికో యూనివర్శిటి వచ్చేస్తోంది కదా. పిహెడీల సంఖ్య తామరతంపర కావటం విశేషం కాదు. గోపీచంద్ గారు పండితపరమేశ్వర శాస్త్రి వీలునామా అన్న పుస్తకంలో ఒక పండితుడి గురించి సజ్జలు అనే ప్రయోగం వాడతారు. కోళ్ళు సజ్జలను తిని సజ్జలను పెడతాయన్న నానుడిని ఉటంకించుతూ. ఈపిహెడీలు అనబడే పరిశోధకవీరులంతా ఆ సజ్జల కోవలోని వారే. దొరికినన్ని పుస్తకాలను ముందేసుకొని మరొక పుస్తకం తయారుచేసి ఆతరహాలోనే పెద్దలైపోయిన వారిచేత సెబాసూ అనిపించుకొని పట్టాతో గట్టెక్కేబాపతే కాని వాళ్ళు నిగ్గుతేల్చి ప్రపంచానికి అందించే కొత్తవిషయాలేమీ ఉండవు కాక ఉండవు. ఒక 0.001% శాతం మంది నికార్సైన పరిశోధన చేసినవారు ఉండవచ్చునేమో ఉంటే గింటే! అంతే నండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నిజవేనండి.. యూనివర్సిటీలు ఇబ్బడి ముబ్బడిగా పెరిగాయి కదా.. నేనింకా వందల దగ్గరే ఆగిపోయాను.. ఉపయోగం లేనివి ఎన్నైనా ఒకటే లెండి. 'సజ్జలు' భలేగా గుర్తు చేశారు, సరిగ్గా సరిపోతుంది కూడా.. ధన్యవాదాలు.. 

      తొలగించండి