శనివారం, ఆగస్టు 06, 2022

సీతారామం

అది 1964వ సంవత్సరం. అనాధ అయిన రామ్ (దుల్కర్ సల్మాన్) భారతీయ సైన్యంలో పనిచేస్తున్నాడు. సరిహద్దులో రామ్ ఆధ్వర్యంలో సైన్యం జరిపిన ఓ సాహస కృత్యం అనంతరం, ఆ బృందాన్ని ఇంటర్యూ చేయడానికి ఆకాశవాణి తరపున వెళ్లిన విజయలక్ష్మి రామ్ ని ఇంకెప్పుడూ అనాధ అనుకోవద్దని చెబుతుంది. అంతే కాదు, అదే విషయాన్ని రేడియోలో ప్రకటించి, రామ్ కి మేమున్నామంటూ ఉత్తరాలు రాయాల్సిందిగా శ్రోతల్ని ప్రోత్సహిస్తుంది. అది మొదలు రామ్ కి గుట్టలు గుట్టలుగా ఉత్తరాలు రావడం మొదలవుతాయి. అన్న, తమ్ముడు, పిన్ని, బాబాయ్, అక్క, చెల్లి.. ఇలా ఎంతోమంది కొత్త బంధువుల నుంచి వచ్చే ఉత్తరాలవి. ఒక్క ఉత్తరాలు మాత్రమే కాదు, అరిసెల్లాంటి తినుబండారాలు, కష్టసుఖాల కలబోతలూ కూడా పోస్టులో వెల్లువెత్తుతూ ఉంటాయి. 

వాళ్ళందరి ప్రేమలోనూ తడిసి ముద్దవుతున్న రామ్ కి ఆ గుట్టలో కనిపించిన ఓ ఉత్తరం మొదట ఉలికిపాటుకి గురిచేస్తుంది, అటుపైన ఫ్రమ్ అడ్రస్ ఉండని ఆ ఉత్తరాల కోసం ఎదురు చూసేలా చేస్తుంది. ప్రతి ఉత్తరం చివరా ఉండే 'ఇట్లు మీ భార్య సీతామహాలక్ష్మి' అనే సంతకం సీతతో (మృణాల్ ఠాకూర్) ప్రేమలో పడేలా చేస్తుంది. సీతామహాలక్ష్మి ఉత్తరాల ప్రకారం, రామ్ ఆమెని పెళ్లి చేసుకుని, చాలా కొద్దిసమయం మాత్రమే ఆమెతో గడుపుతూ, ఎక్కువ సమయం ఉద్యోగంలోనే గడుపుతున్నాడు. అతను చేసిన చిలిపి పనుల మొదలు, అలకలు, కోపాల మీదుగా, నెరవేర్చాల్సిన బాధ్యతల్ని గుర్తు చేయడం వరకూ ఆ ఉత్తరాలు చెప్పని కబురు ఉండదు. రాను రానూ, మిగిలిన ఉత్తరాలు తగ్గుముఖం పట్టినా, సీత నుంచి మాత్రం క్రమం తప్పకుండా ఉత్తరాలు వస్తూనే ఉంటాయి. 

ఊహల్లో మెరిసే, ఉత్తరాల్లో మాత్రమే కనిపించే సీతకి ఎప్పటికప్పుడు జవాబులు రాస్తూ ఉంటాడు రామ్. కానీ, వాటిని సీతకి పంపే వీలేది? అందుకే ఆ ఉత్తరాలన్నీ తన దగ్గరే జాగ్రత్తగా దాచుకుంటాడు. ఎలాగైనా సీతని కలవాలన్న పట్టుదల హెచ్చుతుంది రామ్ లో. సైనికుడు కదా, బుద్ధికి పదును పెడతాడు. ఆమె ఉత్తరాల ఆధారంగానే ఆమె జాడ కనిపెడతాడు. తాను రాసిన జవాబులన్నీ ఆమె ముందు కుప్పపోస్తాడు. రామ్ సీతని మనస్ఫూర్తిగా ప్రేమించాడు. మరి సీత? ఎక్కడో కాశ్మీర్ లో ఉద్యోగం చేస్తున్న రామ్ కి భార్యనంటూ ఉత్తరాలు రాయడం వెనుక కారణం ఏమిటి? ఆకతాయి తనమా లేక నిజమైన ప్రేమేనా? ఉత్తరాలతో మొదలైన వాళ్ళ కథ ఏ తీరం చేరింది? ఈ ప్రశ్నలకి జవాబు, హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతి మూవీస్ నిర్మించిన 'సీతారామం' సినిమా. 

కాశ్మీర్ నేపధ్యంగా ప్రేమకథ అనగానే మణిరత్నం 'రోజా' గుర్తు రావడం సహజం. అసలే, హను మొదటి సినిమా 'అందాల రాక్షసి' మీద మణిరత్నం ముద్ర అపారం. 'రోజా,' 'చెలియా' మొదలు క్రిష్ 'కంచె' వరకూ చాలా సినిమాలూ, పుస్తకాలు చదివే వాళ్ళకి యండమూరి 'వెన్నెల్లో ఆడపిల్ల' మల్లాది 'నివాళి' మొదలుకొని అనేక నవలలూ, కథలూ గుర్తొస్తూనే ఉంటాయి, సినిమా చూస్తున్నంతసేపూ. అలాగని, నిడివిలో మూడు గంటలకి పావు గంట మాత్రమే తక్కువున్న ఈ సినిమా ఎక్కడా బోర్ కొట్టదు. ఎక్కడా భారీ బిల్డప్పులు, ఎలివేషన్ల జోలికి పోకుండా, ఆసాంతమూ తగుమాత్రం నాటకీయతతో నడిపారు కథనాన్ని. భారీ తారాగణం, అందరికీ తగిన పాత్రలూ ఉన్నప్పటికీ, సినిమా పూర్తయ్యేసరికి గుర్తుండేది నాయికా నాయకులిద్దరే  - స్పష్టంగా చెప్పాలంటే నాయిక మాత్రమే. అలాగని ఇదేమీ హీరోయిన్-ఓరియెంటెడ్ కథ కాదు. 

టైటిల్స్ తర్వాత, లండన్ లో 1985 లో రష్మిక మందన్న విస్కీ బాటిల్ కొనడం తో మొదలయ్యే సినిమా అనేక ఫ్లాష్ బ్యాకులతో సాగి ఢిల్లీ లో ముగుస్తుంది. ఈ ఫ్లాష్ బ్యాకులన్నీ ఎక్కడా కన్ఫ్యూజన్ కి వీలు లేకుండా, కథలో సస్పెన్స్ పోని విధంగా గుదిగుచ్చినందుకు దర్శకుడితో పాటు ఎడిటర్ (కోటగిరి వెంకటేశ్వర రావు) నీ అభినందించాల్సిందే. సీత పాత్రని ప్రవేశపెట్టడానికి ముందు ఆమె పట్ల ప్రేక్షకుల్లో కుతూహలాన్ని కలిగించడం, ఆమెకి సంబంధించిన ఒక్కో విషయాన్నీ ఒక్కో ఫ్లాష్ బ్యాక్లో చెప్పుకుంటూ వెళ్లి, రామ్ ఉత్తరం సీతకి చేరేసరికి సీతతో పాటు, ప్రేక్షకులు కూడా ఉత్కంఠగా ఎదురు చూసేలా చేయడం బాగా నచ్చిన విషయాలు.  నేపధ్య సంగీతం బాగుంది కానీ, పాటలు గుర్తుండిపోయేలా లేవు. చిత్రీకరణ కి మాత్రం వంక పెట్టలేం. బిట్ సాంగ్స్ చేసి ఉంటే సినిమా నిడివి కొంత తగ్గేదేమో. 

అనాధగా ఎస్టాబ్లిష్ అయిన హీరోకి అవసరార్ధం వెన్నెల కిషోర్ రూపంలో బాల్య స్నేహితుడిని సృష్టించడం లాంటివి సరిపెట్టేసుకోవచ్చు. ప్రధానమైన లాజిక్ ని మిస్సవ్వడాన్ని మాత్రం సరిపెట్టుకోలేం. రామ్ పాత్రకి దుల్కర్ ని, బాలాజీ పాత్రకి తరుణ్ భాస్కర్ ('పెళ్లిచూపులు' దర్శకుడు)నీ ఎంచుకోడం మొదలు, సుమంత్ పాత్రకి 'విష్ణు శర్మ' అనే పేరు పెట్టడం వరకూ అన్నీ వ్యూహాత్మకంగానే జరిగాయనిపించింది. దాదాపు మూడేళ్ళ విరామం తర్వాత థియేటర్ లో కూర్చుని సినిమా చూడగలనా అని సందేహిస్తూ వెళ్ళాను కానీ, మూడు గంటలు తెలియకుండా గడిచిపోయాయి. కథనం 'మహానటి' ని గుర్తు చేసింది. అశ్వినీదత్ కన్నా వాళ్ళమ్మాయిలే అభిరుచి ఉన్న సినిమాలు తీస్తున్నారనిపించింది. అవసరమైన మేరకు బాగా ఖర్చు చేయడమే కాదు, ఆ ఖర్చు తెరమీద కనిపించేలా చేశారు కూడా. రొటీన్ ని భిన్నమైన సినిమాలు ఇష్టపడే వాళ్లకు నచ్చే సినిమా ఇది.  

11 కామెంట్‌లు:

  1. chala baaga rasaaru.. cinima chudali anentaga ...really after a long time manchi cinima... ee sandharbamlo venu srikanth garu gurtocharu....ayana unte ela cheppevaro..ani

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేనూ ఆయన్ని చాలాసార్లు గుర్తు చేసుకున్నానండీ.. ధన్యవాదాలు..

      తొలగించండి
    2. Mee review chaala bagundi. Eppati la chadivi vellipoboyanu, kaani ee comment choosi aagipoyanu. Venu Srikanth gaaru kshemame kada

      తొలగించండి
  2. nijam. Swapna Dutta and Priyanka dutt are producing quality cinema compared to Aswini Dutt. I think one thing that strikes me in their movies - not too much focus on the commercial elements, their sensibilities and sensitivity.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అవునండీ.. 'బాణం' నుంచీ గమనిస్తున్నా.. కమర్షియల్ ఎలెమెంట్స్ ఉంటాయి కానీ బాగా బేలన్స్ చేస్తున్నారు.. ధన్యవాదాలు..

      తొలగించండి
  3. కథా-కథనాల పరంగా నిర్మాణ విలువల పరంగా ఏ విషయంలోనూ ఏమాత్రం వంక పెట్టలేని సినిమా ఇది. మీరన్నట్టుగా థియేటర్లో దాదాపు మూడుగంటల సమయం ఎలా గడిచిపోయిందో అస్సలు తెలియలేదు. గడియారం ( అనగా ఫోన్ ) వంక ఒక్కసారికూడా చూడలేదంటే నమ్మండి. : )

    పాటలు వినగా వినగా చాలా నచ్చేసాయి నాకు. పాటల్లోని సాహిత్యమే ఇంకాస్త మెరుగ్గా ఉంటే బావుండనిపించింది.

    ఈ బ్యానర్లో "ఎవడే సుబ్రహ్మణ్యం?" తరువాత నాకు బాగా నచ్చిన సినిమా ఇదే. మూసలోకి జారిపోకుండా వీళ్ళు ఇదే పంధా కొనసాగిస్తారని ఆశిద్దాం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఇదే పంధా కొనసాగితే బాగుంటుందండీ.. డబ్బు కూడా బాగానే వస్తోంది కాబట్టి కొనసాగిస్తారని ఆశిద్దాం.. ధన్యవాదాలు

      తొలగించండి
  4. ఒక వర్గానికి చెందిన హీరోని ప్రమోట్ చేస్తూ, 'శర్మ' పాత్రధారి ని విలన్ ని చేస్తూ, పరమ శాంతియుత వర్గానికి చెందిన హీరోయిన్ ని ఎలివేట్ చేస్తూ చాలా తెలివిగా వండిన పొలిటికల్ పథార్థమనిపించింది. 'ఫీల్ గుడ్' అని ఓ తాత్కాలిక మానసిక భావోద్వేగాన్ని రంగుల అద్దంలో చూసి తన్మయాన్ని పొందే పసితనాన్ని దాటేసాను. ఫీల్ గుడ్ హృదయాల్ని నా వ్యాఖ్య బాధిస్తే క్షమించండి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Agree with you. Even though Sita ramam is a well made movie, naming villain character as Vishnu Sharma seems to be deliberately done.
      Also, the kind of monkey balancing done to show Indian army in poor light is also is not palatable.

      Usual tropes of showing Kashmiris helping army etc. Done to appear secular.

      I heard that even in bimbisara movie the negative character is named as shastry. Some moviemakers seem to get sadistic pleasure by portraying Brahmins in poor light.

      తొలగించండి
    2. నేను బింబిసార చిత్రాన్ని చూడలేదు. కాబట్టి వ్యాఖ్య చేయలేను. ఇక్కడ సమస్య బ్రాహ్మలో లేక కాపులో కాదు అని నేను అనుకుంటున్నాను. ఓ దేశ సంస్కృతీ సంప్రదాయాలను టార్గెట్ చేసి కొన్ని వ్యవస్థలు చేస్తున్న సున్నితమైన బ్రెయిన్ వాష్. సినిమా ద్వారానే ఎందుకు? ఎందుకంటే సినిమా చాలా శక్తివంతమైన మాధ్యమం. ముఖ్యంగా మన యువత మీద. మనం ఈ రోజు, కళలను హాయిగా ఆస్వాదించడానికి కారణము మన సమాజ, కుటుంబ వ్యవస్థ ఇస్తున్న భద్రత. ఓ దేశ సంస్కృతీ మీద సమాజ వ్యవస్థ ఆధారపడి ఉంటుంది. దాని పై దాడి చేయాలన్న కొన్ని అంతర్జాతీయ వ్యవస్థల ప్రణాళికలు ఇవి. ఇంకా చాలా చెప్పొచ్చు కానీ రచయిత పోస్టు కంటెంట్ కి ఆఫ్ టాపిక్ అవుతాయని ఊరుకుంటున్నాను.

      తొలగించండి
    3. @Nagaleela: I partially agree with you and I mentioned 'వ్యూహాత్మకం' in my post. However, I don't think this film was part of an international coup. ధన్యవాదాలు.. 
      @బుచికి: మీరు గమనించిన ట్రెండ్ కొత్తగా వచ్చింది కాదు, మొదటి నుంచీ ఉన్నదే. అయితే, 'రంగస్థలం' సినిమా నుంచీ రూపు మార్చుకుని 'సీతారామం' వరకూ వచ్చింది. ధన్యవాదాలు.. 

      తొలగించండి