సోమవారం, జనవరి 31, 2022

మా అమ్మ కనకమ్మ

'ప్రతి మగవాడి విజయం వెనుకా ఓ స్త్రీ ఉంటుంది..' ..ఏళ్ళ తరబడి వినీ వినీ ఈ మాట బాగా క్లిషేడ్ గా వినిపిస్తోంది కానీ, కొన్ని కొన్ని చరిత్రలు చదివినప్పుడు తప్పక గుర్తొస్తోంది. తాజాగా చరిత్రలో ఆ మగవాడు 'సరస్వతీ పుత్ర' పుట్టపర్తి నారాయణాచార్యులు - శివతాండవ కవి. ఆ మహిళ అయన భార్య కనకమ్మగా అందరికీ తెలిసిన కనకవల్లి. చదివిన ఆ చరిత్ర పేరు 'మా అమ్మ కనకమ్మ'. అక్షరబద్ధం చేసింది ఆ దంపతుల కుమార్తె పుట్టపర్తి నాగ పద్మిని. 'ఓ విదుషీమణి జీవిత గాధ' ఆంటూ వీవీఐటీ ప్రచురణలు ప్రచురించిన ఈ పుస్తకం పుట్టపర్తి నారాయణాచార్యులు కుటుంబాన్ని గురించి, మరీ ముఖ్యంగా అయన ఇల్లాలు కనకమ్మ గురించి అనేక ఆసక్తికరమైన విషయాలు చెబుతుంది. ఆసాంతమూ ఆపకుండా చదివిస్తుంది. 

"మీరేమైనా చెప్పండి. అయ్య వల్ల, వారి నిర్ణయాల వల్ల, ఆమ్మ, మీరు, కుటుంబం ఎంత కష్టపడ్డారు అన్నది చరిత్రలో నిలవదు. నిలిచేదల్లా అయ్య చేసిన సాహిత్యోపాసన మాత్రమే.." తన తల్లిని, తోబుట్టువులని ఉద్దేశించి 1982లో ఓ వేసవి మధ్యాహ్నపు వేళ నాగపద్మిని అన్న ఈ మాటలతో పుస్తకం మొదలవుతుంది. "ఆ మాటలకి ఆందరూ నన్ను చేష్టలుడిగి చూస్తున్నారు. వాళ్ళ కళ్ళలో నాపట్ల ఒక ఏవగింపు భావం చాలా స్పష్టంగా కనిపిస్తుంది.." అన్న కొనసాగింపు పాఠకుల వేళ్ళకి పుస్తకాన్ని ఆంటుకుపోయేలా చేస్తుంది.  అక్కడినుంచి కుటుంబ సభ్యులని, తండ్రి ప్రియ శిష్యులని, తల్లి చేసే విశేష పూజలనీ పరిచయం చేస్తూ, తల్లి మరణంతో తొలి అధ్యాయాన్ని ముగించారు రచయిత్రి. తల్లిదండ్రుల బాల్య విశేషాలతో మొదలయ్యే రెండో అధ్యాయం నుంచి అసలు కథ మొదలవుతుంది. 

కాశీ పండితులు శ్రీమాన్ ధన్నవాడ కిడాంబి రాఘవాచార్యులు కుమార్తె కనకమ్మ చిన్ననాడే తండ్రి ఒడిలో కూర్చుని సంస్కృతాంధ్ర పంచకావ్యాలని పఠించారు. పద్నాలుగో ఏట అత్తవారింట అడుగుపెట్టే నాటికే ఆమెకి సంస్కృతాంధ్రాల్లో పాండిత్యం ఉంది. వరుడు నారాయణాచార్యులు అప్పటికే 'పెనుగొండ లక్ష్మి' 'షాజీ' కావ్యాలని ప్రకటించి ఉన్నారు. తొలిగురువు తండ్రి కాగా, భర్త రెండో గురువు అయ్యి మిగిలిన చదువు చెప్పారామెకి. భర్త శిష్యులచేత సంస్కృత పాఠాలు పునశ్చరణ చేయించడం మొదలు, నారాయణాచార్యులు ఆశువుగా చెప్పుకుపోయే కావ్యాలని అదే వేగాన్ని అందుకుంటూ రాసి పెట్టడం వరకూ ఆమె చేసిన విద్యా, సాహిత్య సంబంధ కృత్యాలెన్నో. ఇవన్నీ, గృహిణిగా ఆమె నిర్వర్తించిన బాధ్యతలకు అదనంగా నెత్తికెత్తుకున్నవి (మోపబడినవి) మాత్రమే. 

కాపురానికి వచ్చిన తొలిరోజుల్లో తనకి ఊహలు తోచి, తీరిక చిక్కినప్పుడల్లా కవిత్వం రాసుకున్న కనకమ్మ ఆ రాతల్ని భర్తకి కూడా చూపకుండా తన ట్రంకు పెట్టెలో దాచిపెట్టడం, తర్వాతి కాలంలో వాటిని  చూసిన నారాయణాచార్యులు తానే పూనుకుని తన కవిత్వంతో పాటు ప్రచురింపజేయడంతో ఆమె కవయిత్రిగా లోకానికి తెలిశారు. ఒకే వేదిక పైనుంచి ఈ దంపతుల్లో ఒకరు నన్నయ శైలిని గురించీ, మరొకరు తిక్కన కవితా రీతుల గురించి ప్రసంగించిన సందర్భాలూ ఉన్నాయి. పుట్టపర్తి, విశ్వనాథల మధ్య ఎడతెగకుండా సాగిన సాహితీ వాదోపవాదాలని ఆమె మధ్యవర్తిగా ఉండి పరిష్కరించిన అరుదైన సందర్భమూ ఉంది. రేడియోకి, పత్రికలకి రచనలు చేశారు, పురస్కారాలనీ అందుకున్నారు. 

ఇవన్నీ చదువుతుంటే ఒక సాహితీవేత్తగా ఆమెకి రావాల్సినంత పేరు రాలేదని మనకి అనిపించడం సహజం. రచయిత్రి నాగ పద్మిని అభిప్రాయమూ అదే. ఇందుకు గల కారణాలని తన తల్లితండ్రుల జీవితాల నుంచి అన్వేషించారు ఆమె. పుట్టపర్తి నారాయణచార్యులు స్థిరంగా ఒక చోట ఉండి ఉద్యోగం చేసింది తక్కువ. అయన ఊళ్లు తిరుగుతూ ఉంటే, బాహుకుటుంబాన్ని నిర్వచించాల్సిన బాధ్యత ఆమెది. అంతేకాదు, ఆయన రాసిన గ్రంధాలన్నీ ఆవిడ తొలుత డిక్టేషన్ తీసుకుని, ఆపైన ఫెయిర్ కాపీ చేసినవే. సంసారం బాధ్యతల్లో సాహిత్య సృజనకు సమయం దొరక్క పోవడం, దొరికిన సమయంలో ఎక్కువ భాగాన్ని ఆయన రచనలకోసమే వెచ్చించాల్సి రావడంతో పాటు మరి కొన్ని కారణాలనీ చెప్పుకొచ్చారీ పుస్తకంలో. ఆశ్చర్యం కలిగించేవి, ఓ పట్టాన నమ్మలేనివీ అయిన విశేషాలని పొందుపరిచారు. 

"అదేమిటో, ఆడబిడ్డకు అమ్మ ఎంత ప్రియమైనా, అయ్య మీద ప్రేమ ఒకింత ఎక్కువగానే ఉండడం జగత్సత్యం. అందునా ఇక్కడ అయ్య ఎవరు? సాక్షాత్తూ సరస్వతీ దేవి ముద్దుల పట్టి. యావత్భారత కీర్తి గన్న పుట్టపర్తి. అలాటప్పుడు ఇంటి చిన్నబిడ్డకు అమిత వీరారాధన ఏర్పడడంలో ఆశ్చర్యమేముంది? ఆమ్మకథ అయినా, అయ్యమీద ఆరాధనే ఇందులో ఒక్క పిసరు ఎక్కువ కథనమయ్యిందంటే ఆశ్చర్యం లేదు. లేకుంటే కనకమ్మ గారి సాహిత్య వివేచనకు మరికొద్ది  ఎక్కువచోటు దక్కి ఉండేది.." అన్న గంగిశెట్టి లక్ష్మీ నారాయణ ముందు మాటతో మనమూ ఏకీభవిస్తాం, పుస్తకం పూర్తిచేశాక. నూట యాభై పేజీల ఈ పుస్తకం వెల రూ. 100. అన్ని ప్రముఖ పుస్తకాల షాపుల్లోనూ, ఆన్లైన్ ద్వారానూ లభిస్తోంది. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి