ఆదివారం, జనవరి 02, 2022

శ్రీ సీతారాముల కళ్యాణం ...

 "చూసింది చూసింది సీతమ్మ కన్ను 
చూపులే నమ్మని మన్నులో మిన్ను..." 

సినిమా పాటలకి సంబంధించి, లేదా కేవలం వేటూరి పాటలకి సంబంధించి చూసినా ఇది విశేషం కాకపోవచ్చు. ఇలాంటి పాటలు ఇంకా ఉండే ఉండొచ్చు. మరి, ప్రత్యేకంగా ఈపాటనే ప్రస్తావించడం ఎందుకూ అంటే ఇది నాకు బాగా నచ్చింది కాబట్టి, ఇవాళ్టి వరకూ ఈ పాటకి ఉన్న యూట్యూబ్ హిట్లతో దాదాపు సగం నా నుంచి వెళ్ళినవే కాబట్టీను. కూచిపూడి భాగవతుల డేన్స్ డ్రామాగా మొదలయ్యే ఈ పాటలో రెండో చరణం మొత్తం సంస్కృతంలోనే ఉంటుంది. అలాగని మరీ అర్ధం కానీ సంక్లిష్ట సమాసాలుండవు. భావం బోధ పడుతుంది, వినడానికి బాగుంటుంది. ప్రత్యేకించి ట్యూన్ మనసుకి పట్టేస్తుంది. 

పాట గురించి చెప్పుకోడానికి ముందు, సినిమా గురించి కొన్ని సంగతులు. 'జేగంటలు' సినిమా 1981 లో విడుదలయ్యింది. 'యువచిత్ర' కాట్రగడ్డ మురారి, విజయ బాపినీడు కలిసి నిర్మించిన ఈ సినిమాకి సింగీతం శ్రీనివాసరావు దర్శకుడు. పాటల్ని (మాత్రమే) నమ్ముకుని, వాటిచుట్టూ అల్లుకున్న కథతో, నూతన తారలతో  తీసిన ఈ సినిమా ఆడలేదు కానీ, పాటలు మాత్రం నిరాశ పరచలేదు. 'ఈ సినిమా ఇంత పేలవంగా ఎందుకుంది?' 'సింగీతం ఎప్పుడూ ఈ సినిమా గురించి ఎందుకు మాట్లాడలేదు?' అనే ప్రశ్నలు చాన్నాళ్లుగా పీడించేవి. వాటికి జవాబులు మురారి ఆత్మకథ 'నవ్విపోదురుగాక' లో దొరికాయి. కథ మీద దృష్టి పెట్టకుండా, పాటల చుట్టూ కథ అల్లేసుకున్నామనీ, 'స్టార్ట్' చెప్పిన సింగీతం తన వైపు చూస్తూ తాను చెప్పాకే 'కట్' చెప్పేవేరనీ రాసుకున్నారు మురారి. 

వేటూరి సింగిల్ కార్డు సినిమా ఇది. 'వందనాలు వందనాలు' 'ఎవరమ్మా ఈ కొమ్మ' 'తెలుసులే తెలుసులే' 'ఇది ఆమని సాగే చైత్ర రథం' లాంటి పాటల మెరుపుల మధ్య, ఈ సీతారాముల కళ్యాణం పాట పెద్దగా జనంలోకి వెళ్ళలేదు. ఆకాశవాణి కూడా ఎందుకో తెలీదు కానీ ఈ పాట మీద శీత కన్నేసింది అప్పట్లో. 



"శ్రీ సీతారాముల కళ్యాణం.. శ్రీ సీతారాముల కళ్యాణం 
శివ ధనువు విరిచి నవ వధువు జానకిని 
వరుడు రఘువరుడు పరిణయమాడిన 
శ్రీ సీతారాముల కళ్యాణం... " 

బృందగానంతో పాట మొదలవుతుంది. సీతారామకళ్యాణ మహోత్సవంలో భాగంగా కూచిపూడి భాగవతులు ప్రదర్శన ఇవ్వడం సందర్భం. 

"అంతట సీతా స్వయంవరంబునకు నీలమేఘ శ్యాముడు, రవికులాంబుధి సోముడు శ్రీరాముడు వేంచేయు సమయంబున ప్రియసఖులు జానకిని అలంకరించు విధంబెట్టిదనిన..."  

...అన్న సూత్రధారుడి వ్యాఖ్యానం తర్వాత మొదటి చరణం మొదలవుతుంది. సినిమా గ్రామర్ ని అనుసరించి, నాయికా నాయకుల పరిచయానికి వాడుకున్నారీ చరణాన్ని. 

"వేగుచుక్కే తెల్లవారంగ దిగివచ్చి 
చెలియ చెక్కిట తాను చుక్కాయెనే  
తన ఇంటి కోడలౌ తరుణీ లలామకు  
ఉదయభారవి నుదుట బొట్టాయెనే 
ఇరులన్నితెలవారి  కురులైన వేళ 
విరులన్ని సీతమ్మ సిరులాయెనే.." 

సీతమ్మకి వేగుచుక్క బుగ్గన చుక్క అయ్యింది. శ్రీరాముడు ఇనకుల తిలకుడు, అంటే సూర్యవంశంలో ఉద్భవించిన వాడు. ఆ వంశపు మూల పురుషుడు సాక్షాతూ సూర్యుడే. ఆ లెక్కన సూర్యుడికి సీత కాబోయే కోడలి వరస. తన ఇంటి కోడలు కాబోతున్న సీతకి సాక్షాత్తూ ఉదయభానుడే నుదుట బొట్టుగా మారాడు. తెల్లవారుతూనే అప్పటివరకూ దట్టంగా ఉన్న చీకట్లన్నీ సీతకి కురులుగా మారిపోగా, పువ్వులన్నీ సీత జడలో సిరులుగా అమరిపోయాయి.  

"హంసనడిగే నడక ఒక ఇంత నడచి 
హృదయపు గవాక్షమ్ము చెలి కొంత తెరచి 
చూపులోపల మరుని తూపులే పరచి 
చూసింది చూసింది సీతమ్మ కన్ను 
చూపులే నమ్మని మన్నులో మిన్ను.."

హంసని అడిగి పుచ్చుకున్న నడకతో స్వయంవర మండపానికి వచ్చిన సీత, గుండె తలుపుని కొంచం తెరిచి, తన చూపుల్లో మన్మధుడి బాణాలు గుప్పించి, నమ్మశక్యం కాని విధంగా కనిపించిన ఆకాశాన్ని (నీలమేఘ శ్యాముడు) చూసింది. 

ఇక రెండో చరణం నాయికానాయకుల డ్రీమ్ సీక్వెన్సు. పల్లవి, తొలి చరణానికి  ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాంలతో పాటు ఎస్పీ శైలజ, జి. ఆనంద్ గొంతు కలపగా, రెండో చరణం కేవలం బాలూ, వాణీ జయరాం మాత్రమే పాడారు. భావం సీతా రాముల పరస్పర పరిచయాలు, గ్రీటింగ్సు చెప్పుకోవడమే కానీ, పదాల పోహళింపు, ట్యూను, సంగీతం కలిపి మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేశాయి. 

"ధన్యోస్మి ప్రభు శ్రీరామా 
ధరణిజ గగన ఘనశ్యామా 

ధన్యోస్మి ప్రియే  శ్రీరామే 
ధరణిజ చంద్ర కళోద్ధామే 

ధీర సమీర దృగంచల కంపిత గుంఫిత ముగ్ధ తనూలతికే 
అవనత ముఖ కమలే అమలే దర్శిత దరహసితే సీతే 
ధన్యోస్మి ప్రియే  శ్రీరామే 

కౌశిక ధర్మ విచారణ చారణ చరణా రవికుల నవ కిరణా 
అవనిజ నిజ శిరసా మనసా వందిత గుణధామా రామా..
ధన్యోస్మి ప్రభు శ్రీరామా

'దృగంచల'  దగ్గర బాలూ కాస్త తడబడినా 'మామ' మహాహేవన్ టేక్ ఒకే చేసేశారు. 

"సీతారాముల కళ్యాణం ఇలలో ప్రణయానికి ప్రాణం 
సిరికీ హరికీ కళ్యాణం ధరలో జేగంటల నాదం.."  

...అన్న బృందగానంతో ముగుస్తుంది పాట. సినిమా టైటిల్ 'జేగంటలు' ని జాగ్రత్తగా అమర్చారు సాహిత్యంలో. నటీనటుల విషయానికి వస్తే కథానాయిక ముచ్చెర్ల అరుణకిది మొదటి సినిమా, నాయకుడు రాంజీ కి రెండో సినిమా.  ఈ పాటలోనే కాదు, సినిమా మొత్తం ఇద్దరూ కెమెరాని భయం భయంగా చూస్తూనే నటించేశారు. దర్శకత్వం తదితరాల గురించి ముందే చెప్పేసుకున్నాం కదా.  వేటూరి సాహిత్యం, వాణీ జయరాం గొంతు మాత్రం అలా గుర్తుండిపోతాయీ పాటలో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి