సోమవారం, జనవరి 04, 2021

యారాడకొండ

ప్రతి ప్రాంతానికీ ఓ చరిత్ర ఉంటుంది. ఆ ప్రాంతాలు నగరాలు, మహా నగరాలూ అయినట్లయితే కళ్లెదుటే  చరిత్రలో పేజీలు చకచకా తిరిగిపోతాయి. కాలంతో పాటు వచ్చిన మార్పుల్ని అదే క్రమంలో ఒడిసి పట్టుకుని, కాలమాన పరిస్థితులకి తగ్గట్టుగా వాస్తవ జీవితాలనుంచి కల్పిత పాత్రల్ని తీసుకుని, 'నిజంగా జరిగిందేమో' అనిపించేలాంటి కథని సృష్టించడం కత్తిమీది సాము. ఆ సాముని అలవోకగా పూర్తిచేయడమే కాక, అమెరికా తెలుగు సంఘం (ఆటా) వారి నవలల పోటీలో బహుమతినీ అందుకున్నారు ఉణుదుర్తి సుధాకర్. కథకుడిగా తెలుగు సాహిత్యానికి పరిచయమైన సుధాకర్ రాసిన మొదటి నవల 'యారాడకొండ.' మహానగరం విశాఖ చరిత్రలో ఓ నలభై ఏళ్ళ కాలంలో జరిగిన మార్పుల్ని సునిశితంగా చిత్రించిన నవల ఇది. 

విశాఖపట్నం అంటే కేవలం జాలరిపేట, సోల్జరు పేట, చంగల్రావు పేట మాత్రమే ఉన్న కాలంలో మొదలయ్యే ఈ కథ ఆ చిన్న ఊరు పట్టణంగా, నగరంగా, మహా నగరంగా విస్తరించడాన్ని చిత్రించింది. విశాఖని తలచుకోగానే మొదట గుర్తొచ్చేది సముద్రమే, అలాగే ఈ నవల్లో ప్రధాన పాత్రల్లో అత్యధికం జాలరి కుటుంబ నేపధ్యం నుంచి వచ్చినవి. ఓ తుపాను రాత్రి ఐదుగురు మత్స్యకారులతో నడిసముద్రంలో దారితప్పిన ఓ నాటు పడవని, ఒక పెద్ద సముద్రపు ఓడ ఢీ కొట్టడంతో మొదలయ్యే కథ, ఊహించని మలుపులు తిరుగుతూ, ఆసాంతమూ ఊపిరి బిగపట్టి చదివిస్తుంది. ఆ మత్య్సకారులు కుటుంబాల జీవితాలనీ, ఓడ కెప్టెన్ జీవితాన్నీ సమాంతరంగా చిత్రిస్తూ సాగే కథనాన్ని 'యారాడకొండ' గొంతు నుంచి వినిపించారు రచయిత. 

ఔను, పడవ ప్రమాదానికి, దానికి ముందూ, వెనకా జరిగే సంఘటనలకీ ప్రత్యక్ష సాక్షి అయిన యారాడకొండే ఈ కథని పాఠకులకి చెబుతుంది. ప్రమాదానికి గురైన బోటు యజమాని గంగరాజు కుటుంబానికి ఆంగ్లో-ఇండియన్ అయిన ఓడ కెప్టెన్ కుటుంబం సాయపడడం కథలో మొదటి మలుపైతే, ప్రమాదం నుంచి బయటపడ్డ గంగరాజు టీనేజీ మేనల్లుడు నూకరాజు చేపల వేట నుంచి చదువు మీదకి దృష్టి మరల్చడం రెండో మలుపు. అటు గంగరాజు పిల్లలు వెంకటేశు, ఎల్లమ్మ, ఇటు నూకరాజు పై చదువులు చదవడం, కెరీరిస్టులుగా మారిపోకుండా తమ చుట్టూ జరుగుతున్న మార్పులని పట్టించుకుని, నమ్మిన సిద్ధాంతాల ఆచరణ కోసం ఎవరి స్థాయిలో వాళ్ళు చేసిన ప్రయత్నాల్ని, వాళ్ళ పిల్లల తరం వచ్చేసరికి విలువల్లో వచ్చిన మార్పునీ పాఠకులకి చెబుతుంది యారాడకొండ.


ఇది కేవలం మత్స్యకారులు, ఆంగ్లో-ఇండియన్ల కథ మాత్రమే కాదు. భూస్వామ్య బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి, నక్సల్ ఉద్యమం వైపు ఆకర్షితుడై తన బ్రాహ్మణ అస్థిత్వాన్ని చెరిపేసుకోడానికి తాపత్రయ పడే భాస్కర్, గుంటూరు ప్రాంత చౌదరి కుటుంబంలో పుట్టి, తమిళ దళితుడు సెల్వాన్ని పెళ్లి చేసుకున్న డాక్టర్ కమల, కోస్తాంధ్ర నుంచి విశాఖకు వ్యాపారం కోసం వచ్చి రాజకీయంగానూ చక్రం తిప్పిన శాంతమూర్తి, అతని బావమరిది రొయ్యలనాయుడు, తన విద్యార్థి నూకరాజు మీద అవ్యాజమైన అనురాగాన్ని చూపించే అధ్యాపకుడు కృష్ణారావు, తోటి విద్యార్థుల్ని నక్సల్బరీ ఉద్యమంలోకి ప్రోత్సహించి తను మాత్రం సౌకర్యవంతమైన జీవితాన్ని ఎంచుకున్న మలయాళీ గిరిధర్ నాయర్... ఇలా ఎందరెందరి కథలో ప్రధాన కథలో అంతర్భాగంగా కలగలిసిపోయాయి. 

కథాకాలంలో విశాఖ వేదికగా జరిగిన ప్రతి ఉద్యమానికీ నవల్లో చోటిచ్చారు  రచయిత. ప్రధాన పాత్రలు నూకరాజు, భాస్కర్ లకి వామపక్ష రాజకీయాలంటే అభిమానం. ఈ కారణంగా నవల వామపక్ష రాజకీయ దృష్టికోణాన్ని ప్రధానంగా చూపిస్తుంది. మిగిలిన రాజకీయ పార్టీల మీద, భావజాలాల మీదా సెటైర్లు కనిపిస్తాయి. అయితే ఎక్కడా సుదీర్ఘమైన ఉపన్యాసాలు లేకపోవడం పెద్ద రిలీఫ్. ఈ నవల నక్సల్బరీ ఉద్యమాన్ని, హింసనీ ప్రోత్సహించదు. వ్యాపారానికి-రాజకీయానికి మధ్య ఉన్న లంకెని వివరించడానికి, విశాఖ మీద పెరిగిపోతున్న 'బయటి వాళ్ళ' పెత్తనాన్ని ఆక్షేపించడానికీ ఈ రచన వెనుకాడలేదు. అదే సమయంలో స్థానికుల వెనుకబాటుకు కారణాలనీ విశ్లేషిస్తుంది. ఒక్కొక్కటీ పది పేజీలు మించని పద్దెనిమిది అధ్యాయాలుగా కథని విభజించడమే కాక, సంభాషణలు, సన్నివేశ చిత్రణలో ఆసాంతమూ క్లుప్తతని పాటించారు రచయిత. 

'ఉపోద్ఘాతం' పేరుతో మొదలయ్యే మొదటి అధ్యాయం మొదటిసారి చదివినప్పుడు జాగ్రఫీ పాఠాన్ని తలపిస్తుంది. మరీ ముఖ్యంగా విశాఖని గురించి ఏమాత్రం తెలియని పాఠకులకి ఈ ఇబ్బంది మరీ ఎక్కువ. మొత్తం నవలని పూర్తి చేశాక ఈ అధ్యాయాన్ని మరోసారి చదవాలి. 'తుపాను రాత్రి' అధ్యాయంలో కథ మొదలై, 'జమీలా' లో పరుగందుకుంటుంది. విశాఖతోనూ, గత శతాబ్దపు డెబ్భైల నుంచి నిన్న మొన్నటి వరకూ జరిగిన వామపక్ష ఉద్యమాలతోనూ రేఖామాత్రపు పరిచయం ఉన్నవాళ్ళు కూడా కల్పితమైన ప్రధాన పాత్రల చిత్రణకి స్ఫూర్తినిచ్చిన నిజ జీవితపు వ్యక్తులని పోల్చుకో గలుగుతారు. మొత్తం 206 పేజీలున్న ఈ నవల వెల రూ. 225. (ఇంత వెలపెట్టినందుకైనా ముద్రణలో మరికాస్త శ్రద్ధ తీసుకోవాల్సింది). అమెజాన్ ద్వారా లభిస్తోంది.

6 కామెంట్‌లు:

  1. చక్కటి పరిచయం. ధన్యవాదాలు. ముఖ పుస్తకంలో పంచుకొనేందుకు అనుమతించగలరు. ఉణుదుర్తి సుధాకర్

    రిప్లయితొలగించండి
  2. నాకెంతో నచ్చిన పుస్తకం. సమగ్రంగా సమీక్ష కూడా చేశాను

    రిప్లయితొలగించండి
  3. కొద్దిగా మాత్రమే తెలిసిన ఉద్యమ నేపధ్యంతో బాగా పరిచయమున్న ప్రాంత నేపధ్యం కలిసి ఆగకుండా చదివేలా చేసిందీ నవల. సెల్వన్ కమలని అన్న కొన్ని మాటలు విపరీతంగా బాధపెట్టాయి. మా ఉత్తరాంధ్ర వారిది తళుకుబెళుకులు అక్కర్లేని మప్పితమండీ అని తిరిగి చెప్పలేకే కదా అనుకున్నాను. మొత్తానికి మంచి నవల చదివిన అనుభూతి కలిగింది. సమగ్రంగా రాసారండీ. ఈ నవల గుర్తొచ్చినప్పుడు మీ సమీక్ష చదువుకుంటే అన్ని సంఘటనలూ కళ్ళముందు కట్టేస్తాయి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సెల్వం-కమల సన్నివేశాన్ని గురించి నేనూ ఆలోచించానండీ.. కమల విశాఖ వాస్తవ్యురాలైతే ఆ సీన్ మరోలా ఉండేదేమో అనిపించింది. నావరకూ, రెండో బహుమతిని మించిన నవల అనిపించింది. ధన్యవాదాలు.. 

      తొలగించండి