గురువారం, జనవరి 21, 2021

నాలుగో ఎకరం

"వంకాయ బజ్జి పచ్చడిలో - తత్వాలు పాడేటప్పుడు తంబూరా శ్రుతిలా కొత్తిమీర ఉండాలి కానీ హద్దుమీరి అసలు విషయాన్ని మింగెయ్యకూడదు" అని తన కథానాయకుడు అప్పదాసు చేత 'మిథునం' కథలో చెప్పించారు శ్రీరమణ. ఆయనే రాసిన మరో పెద్దకథ 'నాలుగో ఎకరం.' సంపుటిలో ఒకటిగా కాక, చిరుపొత్తంగా అచ్చులో వచ్చింది, గిరిధర్ గౌడ్ కుంచె నుంచి వచ్చిన (వర్ణ) చిత్రాలతో సహా. బొమ్మలతో కలిపి అచ్చులో 71 పేజీలున్న ఈ కథ - పేరే చెబుతున్నట్టుగా - కూడా పల్లెటూరు నేపధ్యంగా సాగేదే. రెండు కుటుంబాల కథే, కానీ ఆ రెండు కుటుంబాల మధ్యా జరిగే కథ కాదు. ఓ కుటుంబంలో జరిగే కథని, రెండో కుటుంబంలో కథకుడు మాధవ స్వామి తన గొంతుతో చెబుతాడు. కథా స్థలం గుంటూరు జిల్లాలో ఓ పల్లెటూరు. 'పెదకాపు' గా పిలవబడే రాఘవయ్య కుటుంబం కథ ఇది. ఆ రాఘవయ్య కొడుకు సాంబశివరావుదీ, కూతురు చిట్టెమ్మదీ కూడా. 

ఒకప్పుడు పశువుల సాయంతో జరిగిన వ్యవసాయంలో కాల క్రమేణా యంత్రాలు ప్రవేశించడంతో రైతులకి పశువులతో అనుబంధం తగ్గుతూ రావడంతో మొదలు పెట్టి, ఒక్కసారిగా ఊపందుకున్న నగరీకరణ ఫలితంగా భూముల రేట్లు అనూహ్యంగా పెరిగిపోయి పంటపొలాలు రియలెస్టేట్ వెంచర్లుగా మారిపోడాన్ని నిశితంగా చిత్రించారు రచయిత. రాఘవయ్య తొమ్మిదెకరాల మాగాణానికి రైతు. కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, పశుపోషణలోనూ అందెవేసిన చేయి. ముఖ్యంగా ఎడ్లని పెంచడం, వాటిని పందేలకు తీసుకెళ్లి బహుమతులు గెలుచుకు రావడం వల్ల ఆయన పేరు ఆ చుట్టుపక్కల ఊళ్లలో మార్మోగిపోయింది. వ్యవసాయ అనుబంధ పనులన్నింటిలోనూ నైపుణ్యం ఉంది రాఘవయ్యకి. 

ఆ పెదకాపు రాఘవయ్య కొడుకు సాంబశివ రావు, తండ్రికి తగ్గ కొడుకే. పట్నంలో హాస్టల్లో ఉండి కాలేజీలో చదువుకుంటున్న వాడల్లా ఓ రాత్రి దుక్కిటెడ్లు కల్లోకి వచ్చాయని, మర్నాడు లేస్తూనే ఊరికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. చదువుకోమని బలవంతం చేయలేదు తండ్రి. రోజులెప్పుడూ ఒకేలా ఉండవు కదా, ఉన్నట్టుండి కరువు ప్రవేశించింది. అది ఏ ఒక్క రైతుకో వచ్చిన సమస్య కాదు, మొత్తం రైతాంగానిది. పంటలూ, పనులూ కూడా లేవు. ఒకరకమైన స్తబ్దత అలముకుంది ఊళ్లలో. ఆ స్తబ్దతని బద్దలుకొడుతూ ఊరి శివార్లలో వందెకరాల పంటపొలం, సువిశాలమైన కార్పొరేట్ కాలేజీగా మారిపోయింది. దాంతో ఉన్నట్టుండి భూముల విలువ ఒక్కసారిగా పెరిగిపోయింది. వ్యవసాయాన్ని ప్రాణంగా ప్రేమించే రాఘవయ్య పొలం రోడ్డుని ఆనుకునే ఉన్న ఏక ఖండం. అందులో మూడెకరాలు కూతురు చిట్టెమ్మకి పెళ్లినాడు స్త్రీధనంగా ఇచ్చినది. ఆ చిట్టెమ్మ ఇప్పుడు అమెరికాలో ఉంటోంది. 

ఈ కథని మనకి రాఘవయ్యో, సాంబశివరావో చెప్పరు. ఆ ఊరి కృష్ణాలయం పూజారి పెద్దస్వామి రాఘవయ్యకి స్నేహితుడైతే, ఆ పెద్దస్వామి కొడుకు, కాలేజీలో సాంబశివరావుకి లెక్చరర్ అయిన చిన్నస్వామి చెబుతాడు. ఈ చిన్నస్వామికి ఒకనాటి వ్యవసాయ విధానాలనీ, రైతు జీవితాలనే రికార్డు చేయాలని కోరిక. వీలు చిక్కినప్పుడల్లా పెదకాపుని కదిల్చి ఆ ముచ్చట్లు చెప్పిస్తూ ఉంటాడు. అప్పటివరకూ దూరంగా ఉన్న పట్నంలో లెక్చరర్ ఉద్యోగం చేస్తున్న వాడు కాస్తా, కార్పొరేట్ కాలేజీ పుణ్యమా అని ఉన్న ఊళ్ళోనే ఉద్యోగస్తుడవుతాడు. పెద్దగా ఎవరితోనూ మాట్లాడని సాంబశివ రావు నోరూ, మనసూ విప్పేది  ఈ చిన్నస్వామి ఎదుటే. సాంబశివరావు మాటల్లో ఈ చిన్న స్వామి గుళ్లో దేవుడి లాంటివాడు. ఏం చెప్పినా వింటాడే తప్ప, ఏమీ బదులు చెప్పడు. 

రాఘవయ్య నుంచి గతాన్నీ, సాంబశివరావు నుంచి వర్తమాన విషయాలనీ వింటూ ఉండే కృష్ణస్వామి ఆ కుటుంబానికి హితైషిగా ఉంటాడే తప్ప, ఎలాంటి సలహాలూ ఇవ్వడు. కేవలం ప్రేక్షక పాత్ర, అంతే. తొమ్మిదెకరాల భూమినీ అమ్మకానికి పెట్టినప్పుడు కూడా పెద్దగా స్పందించని రాఘవయ్య, కూతురొచ్చి "అయితే మరి నాలుగో ఎకరం మాటేంటి నాన్నా?" అన్నప్పుడు మాత్రం నిలువునా కదిలిపోతాడు. అప్పటివరకూ సాఫీగా సాగిన కథలో ఇదే కుదుపు. రాఘవయ్య, సాంబశివరావు ఇద్దరూ సహజంగానే -లేదా- అసహజంగానే ప్రవర్తించారా? ఒక్కరు మాత్రమే సహజంగా స్పందించారా అన్నది పాఠకులు ఎవరికీ వాళ్ళు ఆలోచించుకోవల్సిందే.  చిన్నస్వామి విషయం చెబుతాడే తప్ప, వ్యాఖ్యానించడు మరి. కథ మలుపుకి కారణమైన  చిట్టెమ్మ ప్రశ్న అసహజం అనిపించే అవకాశం లేదు. 

కథా స్థలాన్ని కాస్త స్పష్టంగానే చెప్పినా, కథా కాలం విషయంలో అస్పష్టతకి చోటిచ్చారు రచయిత. ఊరి చివర కార్పొరేట్ కాలేజీ వచ్చి ఎంట్రన్స్ పరీక్షలకి కోచింగు మొదలు పెట్టడానికీ, అమెరికా మనవరాలు తాతయ్య అమ్మమ్మలతో సెల్ఫీ దిగడానికీ మధ్య కాలం కొంత సుదీర్ఘమైనది. కథాగమనం కోసం దీనిని కురచ చేసేయడంతో కథాకాలం విషయంలో కొంత అయోమయం ఏర్పడింది. చాలా చిన్నదైన కథని చెప్పే క్రమంలో నాస్టాల్జియాని చాలా ఎక్కువగా చొప్పించారు రచయిత. సన్నివేశానికి అవసరమైన చోట ఆ పాత విషయాలు చెప్పించడం కాక, వాటిని వివరించడం కోసమే సన్నివేశాలని సృష్టించారు. ఒకప్పటి వ్యవసాయ, పశుపోషణ విధానాలు, అంతరించిపోయిన కొన్ని పదాలు, పదబంధాలకి మంచి రిఫరెన్స్ ఈ పుస్తకం. కథకి అలంకారం కావాల్సిన విశేషాలన్నీ, అసలు కథని మించిపోవడం వల్ల ఈ బజ్జి పచ్చడిలో కొత్తిమీర ఎక్కువయిందనే భావన కలిగింది. ('నాలుగో ఎకరం', వెల రూ. 100, అమెజాన్ ద్వారా లభిస్తోంది). 

2 వ్యాఖ్యలు:

 1. ఈ పుస్తకంలో ఫుట్ నోట్స్ మాత్రం మహ ఆసక్తిగా చదివానండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. కేఎన్వై పతంజలి మార్కు రివ్యూ చేశారుగా, ఒక్క ముక్కలో :) 
   ధన్యవాదాలు.. 

   తొలగించు