(ఇది నా మొదటి ఆన్లైన్ రచన. 'నవతరంగం' అనే వెబ్సైట్ లో అక్టోబర్ 30, 2008 న ప్రచురితం అయింది. ఇప్పుడా వెబ్సైట్ పనిచేయడం లేదు. తవ్వకాల్లో దొరికిన ఈ పోస్టులో కేవలం అచ్చుతప్పుల్ని మాత్రం సవరించి ప్రచురిస్తున్నాను. పుష్కర కాలంలో నా రాతల్లో ఏమన్నా మార్పు వచ్చిందా అన్నది మీరే చెప్పాలి)
అందరికి నమస్కారం. నవతరంగం చదవడం ఈ మధ్యనే మొదలు పెట్టాను. పాత సంచికలతో సహా చదువుతున్నాను. ఎనభయ్యో దశకంలో విడుదలై ఎన్నో అవార్డులు, ప్రేక్షకుల రివార్డులు గెలుచుకున్న 'సితార' సినిమా గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఈ ప్రయత్నం. 'మంచు పల్లకీ' సినిమా ద్వారా తెలుగు తెరకి దర్శకుడిగా పరిచయమైన వంశీ రెండో సినిమా ఇది. భానుప్రియ ఈ సినిమా ద్వారానే నాయికగా పరిచయమైంది. వంశీ తానే రాసుకున్న 'మహల్ లో కోకిల' అనే నవలను కొద్దిపాటి మార్పులతో రూపొందించిన 'సితార' సినిమా 1984 లో విడుదలై ప్రాంతీయ ఉత్తమ చిత్రం గా కేంద్ర ప్రభుత్వ అవార్డు ను అందుకుంది. 'వెన్నెల్లో గోదారి అందం' పాటకు గాను గాయని ఎస్ జానకి కి జాతీయ అవార్డు లభించింది.
కథ విషయానికి వస్తే, ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ దేవదాసు (శుభలేఖ సుధాకర్) రైలులో ప్రయాణం చేస్తూ, టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నఓ అమ్మాయి (భానుప్రియ) కి సహాయం చేయడం కోసం టికెట్ కలెక్టర్ కి ఆమెని తన భార్య సితార గా పరిచయం చేస్తాడు. ఆమెకి ఎవరూ లేరని తెలుసుకుని తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడంతో పాటు మోడలింగ్ అవకాశాలు ఇప్పిస్తాడు. తన గతాన్ని గురించి అడగకూడదనే కండిషన్ పై అతనితో కలిసి పని చేస్తుంటుంది సితార. ఆమెకు సినిమా అవకాశాలు రావడంతో తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్ గా మారుతుంది. డబ్బు, కీర్తి ప్రతిష్టలు సంపాదించినా, తన గతాన్ని తల్చుకుని బాధపడే సితార కి ఆ బాధని తనతో పంచుకోమని సలహా ఇస్తాడు దేవదాసు.
గోదావరి తీరంలోని ఓ పల్లెటూళ్ళో 'రాజుగారు' గా పిలవబడే చందర్ (శరత్ బాబు) చెల్లెలు కోకిల. పాడుబడ్డ భవంతిలో ఆ అన్నాచెల్లెళ్లు మాత్రమే ఉంటూ ఉంటారు. ఆస్తులు పోయినా, పరువు కి ప్రాణం ఇచ్చే చందర్, ఓ కోర్ట్ కేసును గెలవడం ద్వారా పోయిన ఆస్తులు తిరిగి సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. రాణివాసం లో ఉండే కోకిలకి బయటి ప్రపంచం తెలీదు. చిన్నప్పుడు నేర్చుకున్న సంగీతం, నాట్యాలతో కాలక్షేపం చేస్తూ ఉంటుంది. కోర్ట్ కేసు నిమిత్తం చందర్ ఓ పది రోజులు కోట విడిచి వెళ్తాడు. అదే సమయంలో ఊళ్లోకి వచ్చిన పగటి వేషగాళ్ళ నృత్యాలను కోటలోంచి రహస్యంగా చూస్తూ ఉంటుంది కోకిల. ఆ బృందం లో రాజు (సుమన్) ని ఇష్టపడుతుంది. రాజుతో ఆమె పరిచయం, ఊరి జాతరకి రహస్యంగా అతనితో కలిసి వెళ్ళడం వరకూ వస్తుంది.
కోర్ట్ కేసు ఓడిపోవడంతో కోటకి తిరిగి వచ్చిన చందర్ కి కోకిల ప్రేమ కథ తెలియడంతో, రాజుని చంపించి, తను ఆత్మహత్య చేసుకుంటాడు. తన పుట్టు పూర్వోత్తరాలు రహస్యంగా ఉంచమని కోకిలనుంచి మాట తీసుకుంటాడు చందర్. దేవదాసుకి సితార తన గతాన్ని చెప్పడం విన్న దేవదాసు స్నేహితుడైన ఓ జర్నలిస్టు (ఏడిద శ్రీరామ్) ఆమె కథని ఓ పుస్తకంగా ప్రచురిస్తాడు. తన గతం అందరికీ తెలియడానికి దేవదాసే కారణమని నమ్మిన సితార అతన్ని ద్వేషిస్తుంది. ఐతే ఆ పుస్తకం కారణంగానే రాజు బ్రతికే ఉన్నాడన్న నిజం దేవదాసుకి తెలుస్తుంది. జర్నలిస్టు సహాయంతో అతను రాజుని వెతికి, ఆత్మహత్య చేసుకోబోతున్న సితారతో కలిపి, ఆమెని రక్షించడం తో సినిమా ముగుస్తుంది.
వంశీ దర్శకత్వ ప్రతిభతో పాటు, ఇళయరాజా సంగీతం, భానుప్రియ నటన ఈ సినిమాని ఓ మాస్టర్ పీస్ గా మలిచాయి. సితార/కోకిల గా భానుప్రియ అసమాన నటనని ప్రదర్శించింది. పాడుబడిన కోటలో ఒంటరితనంతో బాధపడే కోకిలగా, తన గతం అందరికి తెలిసిన తర్వాతి సన్నివేశాలలోనూ ఆమె ప్రదర్శించే నటన ఎన్న దగినది. ఇళయరాజా సంగీతంలో పాటలన్నీ ఈనాటికీ వినబడుతూనే ఉంటాయి. 'కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి' పాటను మొదట 'సాగర సంగమం' సినిమా కోసం రికార్డు చేసారు. ఆ సినిమా లో ఉపయోగించలేక పోవడంతో అదే సంస్థ నిర్మించిన 'సితార' లో ఆ పాటను ఉపయోగించారు.
ఈ సినిమా లో నాకు ఇష్టమైన పాట 'కు కు కు.' ఈ పాట చిత్రీకరణ లో చివరి నిమిషంలో మార్పులు చేశారట వంశీ. ఇందుకు కారణం పాటలో నర్తించే జూనియర్ ఆర్టిస్ట్ లు కొంచం వయసు మళ్ళిన వాళ్ళు కావడమే. షూటింగ్ ఆపటం ఇష్టం లేక, వారి ముఖాలు చూపకుండా కేవలం చేతులు మాత్రం చూపుతూ పాటని చిత్రీకరించారు. ఈ పాటలో వచ్చే 'నువ్వేలే రాజ్యం ఉంది ఈ నాలుగు దిక్కులలో' అనే బిట్ నాకు చాలా నచ్చుతుంది. ఇక 'వెన్నెల్లో గోదారి అందం' పాట గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతవరకు సాఫీ గా సాగిన కథ, క్లైమాక్స్ కి వచ్చేసరికి బాగా వేగం అందుకుంటుంది. క్లైమాక్స్ కొంచం సాగదీసినట్టు ఉంటుంది. ఐతే, వంశీ ఇతర సినిమాలతో పోలిస్తే ఈ సినిమా abrupt ending అనిపించదు.
నవలలను సినిమాలుగా తీసినప్పుడు, ఎన్ని జాగ్రత్తలూ తీసుకున్నప్పటికీ నవల చదివిన పాఠకులకి సినిమా పట్ల అసంతృప్తి కలగడం సహజం. 'సితార' ను ఇందుకు మినహాయింపుగా చెప్పొచ్చు. నవల రాసిన రచయితే సినిమా దర్శకుడు కావడం ఇక్కడి సౌలభ్యం. 'మహల్ లో కోకిల' (ఇటీవలే పునర్ముద్రణ పొందింది) ని 'సితార' గా మార్చడం లో వంశీ చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. కొన్ని పాత్రలను తగ్గించడంతో మెలోడ్రామా ను కూడా కొంతవరకూ తగ్గించాడు. కథనం, ముగింపులో ఉన్న వ్యత్యాసాల కారణంగా నవల, సినిమా వేటికవే భిన్నంగా కనబడతాయి. ఈ సినిమా తీసేనాటికి దర్శకుడి వయసు పాతికేళ్ళ లోపే అంటే ఆశ్చర్యం కలుగుతుంది.
గోదావరి పట్ల వంశీ కి ఉన్నమక్కువ టైటిల్స్ నుంచి చాలాచోట్ల కనిపిస్తుంది. అలాగే పాటల చిత్రీకరణ లో వంశీ మార్కును చూడవచ్చు. 'కోకిల' ని పంజరంలో చిలుకలా చూపే symbolic షాట్స్, చందర్ అసహాయతను చూపే సన్నివేశాలు, సినీతార గతం పట్ల జనానికి ఉండే ఆసక్తిని చూపించే షాట్స్.. ఇలా ఎన్నో. గడిచిన పాతికేళ్ళలో కేవలం 22 సినిమాలు (కొన్ని మంచివి, మరి కొన్ని చెత్తవి) మాత్రమే తీసిన వంశీకి, తనకంటూ చాలమంది అభిమానులు ఉన్నారు.
ఇప్పటి మీ పోస్టుల్లో మొదటి లైను నుండే పాఠకుడిని కట్టిపడేసే లక్షణం ఉంటుంది. పన్నెండేళ్ల క్రితం మొదటి లైనుకి ఆ లక్షణం కొన్ని మైక్రాన్స్ తక్కువ ఉండేదని అనిపించింది నాకు. ఈ విషయంలో నా అభిప్రాయం చెప్పటం అన్నది "సాగరసంగమం"లో శైలజ, బాలు నాట్యంని కామెంట్ చేయటం లాంటిదని తెలుసు.అయినా డేర్ చేసేసా!
రిప్లయితొలగించండిఅబ్బే, 'సాగర సంగమం' శైలజ-బాలు కాదండి, 'శంకరాభరణం' లో 'శారదా' అనే శంకర శాస్త్రి!! జోక్స్ అపార్ట్, నాకైతే చాలా తేడా కనిపిస్తోందండి.. కొన్నాళ్ళు పోయాక వెనక్కి చూసుకుంటే ఇప్పుడు రాస్తున్నవీ అప్పుడు అలాగే అనిపిస్తాయేమో.. ధన్యవాదాలు..
తొలగించండి