(తొలి ప్రచురణ: 'నవతరంగం' వెబ్సైట్, డిసెంబర్ 9, 2008)
అనగనగా ఓ కామేశ్వరరావు.. రైల్లో కాశీ వెళ్తూ దారిలో ఓ చోట సుబ్బలక్ష్మిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. అనుకోకుండా ఓ రెండు రోజులు వాళ్ళిద్దరూ కలిసి ఓ అడవిలో గడపాల్సి వస్తుంది.. అంతే అనుకోకుండా విడిపోవాల్సి వస్తుంది. సుబ్బలక్ష్మి అమెరికాలో ఉంటుందన్న విషయం తప్ప ఆమె గురించి మరే వివరాలూ తెలియవు కామేశ్వర రావుకి. చివరికి వాళ్ళిద్దరూ కలుసుకున్నారా, లేదా? అన్నదే 'ఒకరికి ఒకరు' సినిమా. నాయికా నాయకుల పేర్లు, కాశీ ప్రయాణం చూసి 'ఇదేదో అరవయ్యో పడిలో ఉన్నవాళ్ళ కథ' అనుకుంటే పొరబడినట్టే. ఎందుకంటే, సదరు కామేశ్వర రావు, సుబ్బలక్ష్మి ఇరవైలలో ఉన్నవాళ్ళే. అసలు కథ అంతా వాళ్ల పేర్లవెనుకే ఉంది.
కెమెరామన్ రసూల్ ఎల్లోర్ ను దర్శకుడి గా పరిచయం చేస్తూ ఆనంది ఆర్ట్స్ బ్యానర్ పై 'జెమిని' కిరణ్ నిర్మించిన 'ఒకరికి ఒకరు' 2003 లో విడుదలైంది. కామేశ్వరరావు గా తెలుగు, తమిళ నటుడు శ్రీరామ్ (తెలుగు వాడే, తమిళంలో 'శ్రీకాంత్' పేరుతో నటిస్తున్నాడు) సుబ్బలక్ష్మి గా ఉత్తరాది నటి ఆర్తి చాబ్రియా నటించారు. రసూల్ దర్శకత్వం తో పాటు, కీరవాణి సంగీతం, కోన వెంకట్ మాటలు, సునీల్, రాజాల ఫోటోగ్రఫీ ఈ సినిమా ను 'చూడదగ్గ సినిమా' చేశాయి. కామేశ్వరరావు బాలసారె తో (బారసాల అని వాడుక) కథ ప్రారంభం అవుతుంది. నాయకుడే తన కథను చెబుతూ ఉంటాడు.
చచ్చి స్వర్గాన ఉన్నతన భర్త పేరునే మనవడికి పెట్టాలని పట్టుబట్టిన బామ్మ మల్లీశ్వరి (రాధాకుమారి) తన కొడుకు, కోడలిచేత (తనికెళ్ళ భరణి, హేమ) చంటి కుర్రాడికి 'కామేశ్వర రావు' అని పేరుపెట్టించడం సినిమా ఓపెనింగ్ సీన్. తరువాతి సీన్లలో కామేశ్వర రావు కుటుంబం, అతని స్నేహితుల పరిచయం ఉంటుంది. మనవాడు ఇంజనీరింగ్ ఫస్ట్ క్లాస్ లో పాస్ కావడం తో అసలు కథ మొదలవుతుంది. మనవడు ఇంజనీరింగ్ పాస్ ఐతే కాశీ తీసుకెళ్తానని బామ్మ మొక్కుకుంటుంది, తులసి చెట్టు దగ్గర నిరాహార దీక్ష చేసి మరీ తన పట్టు సాధించుకుంటుంది. కామేశం స్నేహితుడు పుచ్చు(విజయ్) కూడా వీళ్ళతో చేరతాడు.
ఈ మనవళ్ళనిద్దరిని గదమాయిస్తూ, రైల్లో అందరిని పలకరిస్తూ బామ్మగారు చేసే హడావిడి తో కథ నడుస్తూ ఉండగా, ఓ స్టేషన్ లో రైలు ఆగడం, అక్కడ ఓ అమ్మాయిని చూసి - మమూలుగా అమ్మాయిలకి ఆమడ దూరంలో ఉండే - కామేశ్వర రావు తొలిచూపులోనే మనసు పారేసుకోడం జరుగుతాయి. కట్ చేస్తే, తుఫాన్.. ఓ అడవిలో రైలు ఆగిపోతుంది. స్టేషన్ లో అమ్మాయి అక్కడ కనిపించడంతో ఎగిరి గంతేసిన కామేశం, తన పేరు ఆ అమ్మాయికి నచ్చదేమో అనే భయంతో తనని 'రాహుల్' అని పరిచయం చేసుకుంటాడు. ఇతను వెంటబడడం నచ్చని ఆ అమ్మాయి తన అసలు పేరు 'స్వప్న రావు' అని చెప్పకుండా తన నాయనమ్మ పేరైన సుబ్బలక్ష్మే తనపేరని చెబుతుంది.
రైల్వే ట్రాక్ పాడవ్వడంతో వీళ్ళిద్దరూ, బామ్మ, పుచ్చు, స్వప్న తాతయ్య (బాలయ్య) కలిసి అడవిలో ఉండే ఓ రిటైర్డ్ ఆంగ్లో ఇండియన్ ఆఫీసర్ ఇంట్లో నాలుగైదు రోజులు ఉండాల్సి వస్తుంది. ఓ రాత్రి అడవిలో తప్పిపోయి ఒంటరిగా గడుపుతారు కూడా. ఒకరిపై ఒకరికి ప్రేమ ఉన్నా, దానిని వ్యక్తం చేసుకునే లోగానే విడిపోవాల్సి వస్తుంది. ఇది సినిమా మొదటి సగం. తన ఇంజనీరింగ్ డిగ్రీ సాయంతో అమెరికాలో ఉద్యోగం సంపాదించుకున్న కామేశ్వర రావు, అక్కడ సుబ్బలక్ష్మిని వెతికే ప్రయత్నాలు, మరోపక్క అమెరికాలో స్వప్న రాహుల్ ని వెతకడం కోసం ఇండియా వచ్చి వెళ్ళడం, పెద్ద వాళ్లు చేస్తున్న తన పెళ్లి ప్రయత్నాలను వాయిదా వేయడం వంటి సీన్లతో రెండో సగం నడుస్తుంది. నాటకీయ పరిణామాల మధ్య వాళ్ళిద్దరూ కలుసుకోవడమే సినిమా ముగింపు.
ఈ సినిమా లో మొదట చెప్పుకోవాల్సింది ఫోటోగ్రఫీ. దర్శకుడు స్వతహాగా కెమెరామాన్ కావడం తో సినిమా ని దృశ్య కావ్యం గా తీర్చిదిద్దాడు. 'వెళ్ళిపోతే ఎలా..' పాట చిత్రీకరణ ఒక్కటి చాలు, దర్శకుడి అభిరుచి తెలుసుకోడానికి. అలాగే 'నాదిర్ దిన..' పాట చిత్రీకరణ కుడా. అడవి సన్నివేశాల చిత్రీకరణ చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక సంగీతం.. కీరవాణి 'అద్భుతమైన' సంగీతం అందించిన సినిమాలలో ఇది ఒకటి. పాటలతో పాటు, నేపధ్య సంగీతమూ అందంగా కుదిరింది. సీతారామశాస్త్రి, చంద్రబోస్ లు పాటలకి 'తెలుగు' సాహిత్యం అందించారు. ఒక్క 'ఎక్కడున్నావమ్మా..' పాటలో మాత్రం అక్కడక్కడ ఇంగ్లీష్ పదాలు వినిపిస్తాయి. చంద్రబోస్ 33 ఇంటిపేర్లతో రాసిన ఈ పాట ఓ ప్రయోగం.
'నువ్వే నా శ్వాస..' 'ఘాటు ఘాటు ప్రేమ..' 'అల్లో నేరెల్లో..' పాటలు కూడా వేటికవే ప్రత్యేకం. 'అల్లో నేరేల్లో..' పాటలో హీరో మాసిన గడ్డం కంటిన్యుటి దెబ్బ తినడం ఎడిటింగ్ శాఖలో జరిగిన పొరబాటు. బస్ లో ప్రయాణిస్తున్న హీరో గడ్డం కాసేపు మాసి, కాసేపు క్లీన్ షేవ్, మళ్ళి మాసి కనిపిస్తుంది. సినిమా రెండో సగంలో బిగి సడలినట్టు అనిపిస్తుంది. కొంతవరకు ఎడిటింగ్ లోపమే. క్లీన్ కామెడీ ఈ సినిమాకున్న ప్లస్ పాయింట్లలో ఒకటి. ఎక్కడ అశ్లీలం, అసభ్యత కనిపించవు, వినిపించవు. 'మరచెంబు' సీన్ లో 'శంకరాభరణం,' అడవి సీన్ లలో మరో రెండు మూడు సినిమాలు గుర్తొచ్చినా అవేవీ ఈ సినిమాని ఎంజాయ్ చేయడానికి అడ్డంకి కాదు.
బామ్మ గా సీనియర్ నటి రాధాకుమారి, హీరో తండ్రి గా తనికెళ్ళ మంచి నటనని ప్రదర్శించారు. కొడుక్కి తన ప్రేమకథ చెప్పే సీన్ లో భరణి నటన గుర్తుండిపోతుంది. అలాగే, అమెరికా నుంచి కామేశ్వరరావు ఫోన్ చేసే సన్నివేశం కూడా. అమ్మాయిలకి సైట్ కొట్టి ఎదురుదెబ్బలు తినే 'పుచ్చు' పాత్రలో విజయ్ నటననీ మర్చిపోలేము. అమెరికా లో కామేశ్వర రావు ఫ్రెండ్స్ గా చేసిన కుర్రాళ్ళు సినిమా రెండో సగంలో హాస్యాన్ని అందించారు. ఇక శ్రీరామ్ అమాయకమైన కామేశ్వర రావు పాత్రలో ఒదిగిపోయాడు. ఇతనికి సంగీత దర్శకుడు శ్రీ చెప్పిన డబ్బింగ్ బాగా కుదిరింది. హీరోయిన్ పాత్రకి గాయని సునీత గాత్రం అందించింది. చలాకీ అమ్మాయి గా, సిన్సియర్ ప్రేమికురాలిగా ఆర్తి నటన బాగుంది, తెలుగు అమ్మాయి ఐతే ఇంకా బాగుండేది కదా అనిపించినప్పటికీ.
హీరో, హీరోయిన్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ సృష్టించిన విధానమే కథలో పెద్ద మైనస్. సుబ్బలక్ష్మి అడవిలో తప్పిపోయిన రాత్రి తన ఫోటో వెనుక తన అసలు పేరు, అడ్రస్ రాసి కామేశ్వర రావు చూడకుండా అతని పర్స్ లో పెడుతుంది. అదే పర్స్ వాడుతున్నప్పటికీ రెండేళ్ళ తర్వాత కూడా కామేశ్వర రావు ఆ ఫోటో చూడడు. కథకి కీలకమైన ఈ పాయింట్ చాలా అసహజంగా అనిపించింది. ఈ పాయింట్ విషయంలో మరికొంచెం శ్రద్ధ వహించి ఉంటే మరింత బాగుండేది. చివరిగా ఒక్క విషయం. ఈ సినిమా చూసి, తెలుగు తెరకి ఓ మంచి దర్శకుడు దొరికాడని చాలా సంతోష పడ్డా. ఐతే రసూల్ ఆ తర్వాత తీసిన 'భగీరధ' 'సంగమం' సినిమాలు నిరాశ పరిచాయి. 'ఒకిరికి ఒకరు' స్థాయి లో అతని నుంచి మరో సినిమా వస్తుందేమో అని ఎదురు చూస్తున్నా.
భగీరధ సినిమా నాకు చాలా ఇష్టం.టీవీలో ఎపుడు వేసినా చూస్తాను.క్లైమాక్స్ సీన్ అద్భుతం.
రిప్లయితొలగించండి'భగీరథ' లో హీరో ఎలివేషన్ మరీ అతిగా అనిపించిందండి నాకు. మార్కెట్లో మిగిలిన సినిమాలతో పోలిస్తే మామూలే కానీ, రసూల్ నుంచి నేను ఊహించక పోవడం వల్ల నిరాశ కలిగినట్టుంది. ..ధన్యవాదాలు.
తొలగించండిసినిమా ఎవరు తీశారు, ఎలా తీశారు అన్నది పెద్దగా పట్టించుకోను. కథ ఏమిటి అన్నది నాకు ముఖ్యం, చేసిన వాగ్దానం మర్చిపోతే దానిని నెరవేర్చడమే కాకుండా,తనే చేసానని చెప్పుకోకుండా అటు తండ్రినీ,ఇటు ప్రకాష్ రాజ్ నీ, ఊరి ప్రజలనీ సంతోషపెడతాడు హీరో. ఎవరి నేటివిటీకి దగ్గరగా ఉంటే ఆ సినిమా వాళ్ళకి నచ్చుతుందేమో...మా ఊరు శ్రీకాకుళం దగ్గర వారధి కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు,ఎన్నో ఏళ్ళుగా పెండింగ్ లో ఉంది. ఈ సినిమాలో హీరో వారధి కట్టేసాడు కదా, వాస్తవం కన్నా ఫాంటసీలు కొన్నిసార్లు నచ్చుతాయి.
తొలగించండి"మా ఊరు శ్రీకాకుళం" అన్నప్పుడు శ్రీకాకుళం పేరు ప్రక్కనే బ్రాకెట్లో "కృష్ణా జిల్లా" అని కూడా వ్రాస్తుండండి, నీహారిక గారు, "క్లారిటీ" కోసం.
తొలగించండిమురళిగారికి తెలుసు అని వ్రాయలేదండీ.
తొలగించండి"సినిమా ఎవరు తీశారు ఎలా తీశారు అన్నది పట్టించుకోను" నిజంగా ఇది చాలా మంచి విషయం అండీ. ఓ సినిమా చూసి అందులో పనిచేసిన వాళ్ళని అదే మూసలో ఊహించుకోవడం మంచిది కాదేమో..
తొలగించండిపులిగడ్డ-పెనుమూడి వంతెనకే చాలా ఏళ్ళు పట్టిందని విన్నాను. శ్రీకాకుళం వారధి త్వరగా నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాను..
నరసింహరావు గారి ఉద్దేశం, బ్లాగు చూసే మిగిలిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారని అయిఉంటుందండి..
విన్నకోటవారికోసం,
తొలగించండిమాఊరు, మానేల, మాగాలి,మా నీరు, మా ఇల్లు కూడా..
https://ramyamgakutirana.blogspot.com/2020/04/blog-post.html?m=1
మీరు మీ బ్లాగులో పోస్ట్ చేసిన మీ ఊరి గురించిన విడియో చూశానండి, నీహారిక గారు. బాగుంది 👌. నా కామెంట్ మీ బ్లాగులో పెట్టాను.
తొలగించండివిడియోలో మీ ఊరిపేరు ప్రక్కన బ్రాకెట్లో కృష్ణాజిల్లా అని కూడా వ్రాసారే 😊. మంచి పని చేసారు, వేరే జిల్లా అయిన శ్రీకాకుళంతో confusion కు ఆస్కారం లేకుండా.
మీ విడియో లింక్ ఇచ్చినందుకు థాంక్స్. ప్రసిద్ధమైన గుడి, చరిత్ర ఉన్న మీ ఊరును కనీసం విడియోలోనైనా చూడగలిగాను.
ఈ సినిమాకి ప్రేరణ Serendipity అనే ఇంగ్లీష్ చిత్రం మురళి గారు :)
రిప్లయితొలగించండిఆ సినిమా చూడలేదు కానీ, మీ వ్యాఖ్య చూశాక రివ్యూలు చదివానండి. పోలిక రేఖామాత్రమే అనిపించింది నాకు. వాళ్ళు కావాలని విడిపోతూ ఉంటారు. వీళ్ళు విడిపోవడం యాక్సిడెంటల్ అన్నట్టుగా చూపించారు. పూర్తిగా కాపీ అనిపించడం లేదు. బహుశా ఆ సినిమా చూడకుండా కంక్లూజన్ కి వచ్ఛేయకూడదేమో నేను. ..ధన్యవాదాలు.
తొలగించండి