సోమవారం, ఫిబ్రవరి 03, 2020

తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క

ఆమెని 'చీటీల బేబమ్మ' అంటారు అందరూ. నల్లని చెయ్యెత్తు మనిషి. ముప్ఫయ్ ఐదేళ్ల వయసు. కళ గల మొహం. కుడి కనుబొమ దగ్గర గాయం తాలూకు మచ్చ, పెదవులపైన, చేతి వేళ్ళ సందుల్లో, కనురెప్పల మాటున  ఉన్న తెల్లని మచ్చలు - ఆమెని పరిశీలనగా చూసిన వాళ్లకి మాత్రమే కనిపిస్తాయి. వాటిని చూసే "బొల్లి కాబోలు గుంటకి, అయినా బాగానే ఉంది," అనుకుంటాడు శివకోటి శాస్త్రి, మరో ఆరు నెలల్లో రిటైర్ కాబోతున్న సీబీసీఐడీ ఇన్స్పెక్టర్. బయట హోరున వర్షం కురుస్తూ ఉండగా, మెయిన్ రోడ్డు మీద బస్టాపుకి దగ్గరలో ఉన్న బేబీ భవంతిలో ఆమెకి ఎదురుగా సోఫాలో కూర్చుని చాలా  తాపీగా సంభాషణ ప్రారంభిస్తాడు శాస్త్రి. అతని తీరే అంత, ఏ పనైనా తాపీగా చేయడం, ఏమాటైనా  ఆచితూచి మాట్లాడడం ముప్ఫయి రెండేళ్ల సర్వీసు అతనికి నేర్పించింది. ఎంత జాగ్రత్తగా ఉంటేనేం, చిన్న ఏసీబీ కేసులో పట్టుబడిపోవడం వల్ల రెండేళ్లు వీఆర్ (వేకెన్సీ రిజర్వ్) లో ఉండాల్సి రావడంతో కేవలం ఇన్స్పెక్టర్ గా మాత్రమే రిటైర్ కాబోతున్నాడు. 

బేబమ్మ పూర్వాశ్రమంలో విశాఖపట్నం పూర్ణా మార్కెట్లో టీ స్టాలు నడిపేది. 'చీటీల బేబీ' అనేవాళ్ళు ఆమెని. జగదాంబ సెంటర్లో బెల్టులు అమ్మే దేవర సూర్యనారాయణతో ఆమెకి అక్కడే పరిచయం. బెల్టు సూరి అనేవాళ్ళు అతన్ని. జగదాంబ సెంటర్లో అతనో చిన్న సైజు ఆకు రౌడీ కూడా. ఇద్దరూ కలిసి, చీటీ డబ్బులు ఓ ఓ పది పదిహేను లక్షలతో విశాఖ నుంచి మాయమై మరో మహానగరంలో తేలారు.  కొన్నాళ్ళు పోయాక, ఇద్దరూ కలిసి 'పసిడి చిట్స్' ప్రారంభించారు. సూరి స్నేహితుడు రంగశాయిని కూడా పార్ట్నర్ గా కలుపుకున్నారు.  కొంత  కాలం బాగానే గడిచింది. అంతలోనే అనుకోని ఉపద్రవం. బెల్టు సూరి హత్యకి గురయ్యాడు. చీటీ బాకీలు వసూలు చేసుకుని  కార్ డ్రైవ్ చేసుకుని వస్తూండగా ఉన్నట్టుండి కారు తగలబడిపోయి పూర్తిగా కాలిపోయాడు. చీటీ డబ్బుల కోసం రంగశాయే సూరిని చంపేశాడని పోలీసులకి రిపోర్టు చేసింది బేబీ. 

వసూలు చేసిన డబ్బు దగ్గర దగ్గర  కోటి రూపాయలు ఉండడంతో కేసు సీబీసీఐడీ కి వెళ్ళింది.  అదుగో, ఆ కేసు నిమిత్తమే బేబమ్మ ని కలిశాడు శాస్త్రి.  తను వచ్చింది సూరి హత్య కేసు గురించి కాదనీ, సూరి చేసిన హత్య కేసుని గురించనీ మొదలు పెడతాడు. "ఇది డెల్టా కేర్ హాస్పిటల్, తిరుపతి వారిచ్చిన రిపోర్ట్. అలిపిరి దగ్గర జరిగిన యాక్సిడెంట్లో తీవ్రంగా గాయపడిన దేవర సూర్యనారాయణకి ప్రాధమిక చికిత్స, తదనంతరం ఎమర్జన్సీ చికిత్స తమ హాస్పిటల్లోనే జరిగిందని సర్టిఫై చేశారు. ఆ హాస్పిటల్ త్రాష్టులు అంతవరకే సర్టిఫికెట్ ఇచ్చి ఊరుకోలేదమ్మా. మీ ఆయన ఎడమ తొడకి మల్టి ఫ్రాక్చర్ అయిన విషయం కూడా రాశారు. బెల్టు సూరి పోస్టు మార్టం రిపోర్టులో ఎడమ తొడ దగ్గర ఉండాల్సిన స్టీలు రాడ్ కనిపించక పోగా, మామూలు ఎముకే కనిపిస్తోందమ్మా.. " 

శివకోటి శాస్త్రి మాటలు ఆమెకి నెమ్మదిగా అర్ధమయ్యాయి. అర్ధమయ్యే కొద్దీ క్రమంగా ఆమె ముఖం గట్టిగా బిగదీసుకున్నట్టుగా అయిపోయింది.  బేబీ ఐదోతనం  గట్టిదని శాస్త్రి నవ్వుతూ చెబితే, రంగశాయే తన భర్తని అన్యాయంగా చంపి  డబ్బుతో పారిపోయాడని వాదిస్తుంది బేబీ.  శవం మాత్రం రంగశాయిదంటాడు శాస్త్రి. "ఏంకాదు. ఆ రంగశాయి గాడే వాళ్లావిడతో ఈయనకి సంబంధం ఉందని కక్ష పెంచుకుని ఈన్ని కాలబెట్టాడు. మీరు చెప్పేవన్నీ అబద్ధాలు.." ఆవేశపడుతుంది బేబీ.  "మీ ఆయనకీ, రంగశాయి భార్య అని నువ్వు చెబుతున్న కాటం కుసుమ కుమారికి  పెళ్లి జరిగిన సాక్ష్యం "  అంటూ మేరేజ్ రిజిస్టర్ కాపీని ఆమెకి అందిస్తాడు శాస్త్రి. "తన రెండోపెళ్లానికి మొగుడిగా ఒకడిని నటింపజేసే ఏర్పాటు నీ బలవంతం మీదే మీ ఆయన చేశాడని నాకు తెలుసమ్మాయ్. నేనేం తప్పుబట్టనమ్మా. సంఘానికి భయపడి మనం కొన్నిసార్లు కొన్ని ఏర్పాట్లు చేసుకోక తప్పదు. కాకపోతే, లోకం కోసం ఏర్పాటు చేసుకున్న మొగుడు, అసలు మొగుడి మీద కక్ష పెంచుకోడం, చంపడం, పెద్దగా అతకవమ్మాయ్," గొంతులో మార్దవం ఏమాత్రం సడలకుండా చెబుతాడు శాస్త్రి. 

ఒళ్ళో పడ్డ మేరేజి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ని నిలువు గుడ్లేసుకుని చూస్తూ ఉండిపోతుంది బేబీ. "సరిగ్గా రెండు నెల్ల పదిహేను రోజుల క్రితం తన పేరు మీద ఉన్న ఆస్తులు నీ పేరుమీదకి మార్పించాడు. ఇక రంగశాయి మీ ఇంటి కుక్క. దాదాపు మీ ఆయన వయసే. అదే హైటూ. అవసరమూ, పరిస్థితీ కూడా అలా కలిసొచ్చాయి. శతకోటి దరిద్రాలకు  అనంత కోటి ఉపాయాలు. మీ కష్టానికి మీకు తోచిన మార్గం అదీ. ఏదో అనుకున్నారు, చేసేశారు, అయిపోయింది.."   శాస్త్రి గొంతులో అదే మార్దవం. "నమ్మకస్తుడు రంగశాయి అల్పాయుష్కుడయ్యాడన్న చిన్న బాధ తప్పితే మనుషులు శాశ్వతమా?  ఏది ఏమైనా చిట్ ఫండ్ వసూళ్లు మొత్తం మిగిలిపోయాయి.  కొంత కాలం ఆగి అంతా సర్దుకున్నాక నువ్వు నెమ్మదిగా బిచాణా ఎత్తేసి అల్లుడుగారి దగ్గరకే వెళ్లిపోవచ్చు.." జరగబోయేది  వివరిస్తాడు శాస్త్రి. 'అల్లుడుగారు' ఇంకెవరో కాదు, బెల్టు సూరి. "ఇంతకీ మీరెందుకొచ్చారు?" నిశ్చలంగా చూస్తూ అడుగుతుంది బేబీ. 

"నీకు ఇద్దరు చెల్లెళ్ళు అమ్మాయ్. పెద్దదాన్ని అమెరికాలో ఇచ్చాను.  రెండో దాన్ని కూడా అక్కడికే పంపితే, ఈ ముష్టి ఉద్యోగం ముగించుకుని, నేనూ మీ పిన్నీ కూడా అక్కడికే  చేరదాం అని నిర్ణయం. దీనికంతా ఓ యాభై లక్షలవుతుంది. నేను సగానికి తూగగలను. మిగతా సగం నీది. నీ పరిస్థితికి పిరమవ్వదు. ఆడపిల్ల సొమ్మును అవసరానికి మించి ఆశించే వాణ్ణి కాను నేను. తొందర లేదమ్మా, ఓ వారం టైం తీసుకో. నువ్వు బేరం ఆడాల్సిన మాట నేను అనలేదు..."  చెప్పడం ముగించి, ఎంత తాపీగా వచ్చాడో అంతే తాపీగా బయలుదేరతాడు శివకోటి శాస్త్రి. వర్షం ఇంకా కురుస్తూనే ఉంటుంది. వెళ్తున్న వాడల్లా కిటికీ లోంచి కనబడుతున్న తెల్లమచ్చల నల్ల క్రోటన్  మొక్కని చూసి "ఆ మొక్క ఎంత విచిత్రంగా ఉందమ్మాయ్? దాని పేరేవిటి?" అని అడుగుతాడు.  మొక్కవైపు చూస్తుంది బేబీ. "తెలీదండి, ఏదో వెరైటీ క్రోటన్" అని మాత్రమే జవాబిస్తుంది. నిజానికి, ఆ క్రోటన్ కి బేబీకి పోలిక ఉండడం మాత్రమే కాదు, ఆమెకి సంబంధించిన ఓ  ముఖ్యమైన విషయానికి ఆ క్రోటన్ మొక్కే సాక్ష్యం కూడా. అదేమిటో తెలియాలంటే, గంధం నాగరాజు రాసిన 'తెల్లమచ్చల నల్ల క్రోటన్ మొక్క' పెద్ద కథని చదవాల్సిందే. 'కథా సుగంధాలు' సంపుటిలో ఉందీ కథ. శివకోటి శాస్త్రి, బేబీలనే కాదు, ఆ క్రోటన్ మొక్కనీ ఓ పట్టాన మర్చిపోలేం. 

8 కామెంట్‌లు:

  1. ఒక పెద్ద కధకి ఒక చిన్న పరిచయం బాగుంది.

    రిప్లయితొలగించండి
  2. “కథా సుగంధాలు” లింక్ పనిచెయ్యడం లేదు మురళి గారు. “ఈ బ్లాగులో మీరు వెతుకుతున్న పేజీ లేదు “ అంటోంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. సరిచేశానండి.. ఇప్పుడు ఓపెన్ అవుతుంది. ధన్యవాదాలు. 

      తొలగించండి
  3. కథా సుగంధాలు. లింక్ ఇవ్వండి.

    రిప్లయితొలగించండి