సోమవారం, ఫిబ్రవరి 10, 2020

వడ్లగింజలు

"వెంటనే వింజామర చేత పుచ్చుకుని అలివేణి కూడా ఏనుగెక్కేసింది అనే వాక్యంతో కథ ముగిస్తారు శ్రీపాద వారు. నేనిప్పుడు అలివేణిని.." అంటూ  ఓ పుస్తకానికి ముందుమాటని ముగించారు శ్రీరమణ. చాలారోజుల క్రితం చదివిన ముచ్చట ఇది. అప్పటికే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి 'వడ్లగింజలు' కథని చాలాసార్లే చదివినా, దృష్టి అంతా మొదట్లో కథానాయకుడు తంగిరాల శంకరప్ప మీద, పోను పోను పేదరాశి పెద్దమ్మ మొదలుగా రంగనాయిక వరకూ మిగిలిన అన్ని పాత్రలమీదకీ వెళ్ళింది, ఒక్క అలివేణి మీదకి తప్ప! శ్రీరమణ పుణ్యమా అని, వెంటనే కథ తీసి అలివేణి దృష్టికోణం నుంచి చదవడం మాత్రమే కాదు, తర్వాతెప్పుడు చదివినా ఆ పాత్రని కూడా దృష్టిలో ఉంచుకోవడం మర్చిపోలేదు. అలివేణి గురించి చెప్పాలంటే, 'వడ్లగింజలు' కథని గుర్తుచేయాలి. 

పేద బ్రాహ్మణుడు తంగిరాల శంకరప్ప కులవృత్తిలో కన్నా, చదరంగంలో నిష్ణాతుడు. ఊరికే చదరంగం ఆడుతూ కూర్చుంటే పూట గడిచేదెలా? రాజుని ఆశ్రయించి, తన విద్యని ప్రదర్శిస్తే, అతగాడు మెచ్చి ఆదరిస్తాడని ఓ నమ్మకం కుదిరింది. రాజుకి కూడా చదరంగం అభిమాన క్రీడ కావడమే ఈ నమ్మకానికి ఆధారం. కానీ గోచిపాత రాయడు శంకరప్పకి మహారాజు దర్శనం లభించడం అంటే మాటలా? రాజు ఎంత కళా పోషకుడు అయితేనేమి, చుట్టూ ఉన్నవాళ్లు కావొద్దూ? ఆ కంచెలన్నీ దాటుకుని రాజు సమ్ముఖానికి చేరుకునే ఓర్పూ,  లేకపోయాయి శంకరప్పకి. ఫలితంగా, కావలి వాళ్ళచేత  'పిచ్చివాడు' అని ముద్ర వేయించుకున్నాడు. వాళ్ళ చేతుల్లో అతని అంగవస్త్రం చిరిగిపోయింది, యజ్నోపవీతం తెగిపోయింది. అవమానంతో కుతకుత ఉడికిపోయాడు శంకరప్ప. పేదవాడి కోపం పెదవికి చేటు కదా. 

రసపట్టుకి వచ్చిన కథ నుంచి కాస్త బయటికి రావడం కష్టమే కానీ, ఇక్కడ చెప్పుకోవాల్సిన కబురొకటి ఉంది. శ్రీపాద వారి కథల్లో రాజు కానీ, అధికారి కానీ - నలుగురికి  పెట్టే స్థానంలో ఉన్నవాళ్లు ఎప్పుడూ మంచివాళ్ళే అయి ఉంటారు. కానీ, వాళ్ళ దగ్గర సలహాదారులుగా చేరే వాళ్ళు మాత్రం సహాయం ఆశించి వచ్చే వాళ్ళని చిన్నచూపు చూసే వాళ్ళు, వాళ్ళ పని జరగకుండా ఉండేందుకు ప్రయత్నించే వాళ్ళూ అయి ఉంటారు. 'కలుపుమొక్కలు' నుంచి 'గులాబీ అత్తరు' వరకూ ఏ కథ తీసుకున్నా ఇదే ధోరణి చూడొచ్చు. విద్యార్థిగా ఉన్న రోజుల్లో ఒకానొక ప్రముఖ జమీందారీలో దివాన్ చేతిలో తనకి జరిగిన అవమానం ఆయనలో బలంగా నాటుకుపోయిందనీ, కాలక్రమంలో అది అధికారులని అంటిపెట్టుకుని ఉండేవారి పట్ల తీవ్రమైన వ్యతిరేకతగా పరిణమించిందనీ కర్ణాకర్ణిగా విన్నాను. కథల్లో ఈ ధోరణి చూసిన తర్వాత, విన్నది నిజమే అయి ఉండొచ్చు అనిపించింది. 

మళ్ళీ కథలోకి వచ్చేస్తే, అవమాన భారంతో ఉన్న శంకరప్ప పూటకూళ్ళ ఇల్లు నడుపుకునే పేదరాశి పెద్దమ్మ ఇంటికి వచ్చి పడతాడు. పెద్దమ్మ లౌక్యురాలు. మనుషుల్ని, పరిస్థితులని కూడా చిటికెలో అంచనా వేయగలదు. శంకరప్ప పూర్తిగా చెప్పక మునుపే ఆమెకి అంతా అర్ధమయ్యింది. కర్తవ్యం కూడా కట్టెదుట కనిపించింది. "ఇప్పటిదాకా రాజ దర్శనానికి నువ్వు తిప్పలు పడ్డావు. ఇక నీ దర్శనం కోసం రాజే తిప్పలు పడాలి" అంటూ చెయ్యాల్సిందేమిటో చెప్పింది. పెద్దమ్మ సలహాని అనుసరించి, మొదట ఊళ్ళో తగుమాత్రం చదరంగం ఆటగాళ్లతో ఆడి గెలుస్తాడు శంకరప్ప. శాస్త్రి, యాజులు అనే ఇద్దరు ఆటగాళ్ళని అనుయాయుల్ని చేసేసుకుంటాడు. అక్కడినుంచి మొదలవుతుంది శంకరప్ప జైత్రయాత్ర. అతడికి ఆటలో సమఉజ్జీలని వెతికే బాధ్యతని వాళ్లిద్దరూ ఆనందంగా తీసేసుకుంటారు. వాళ్ళ వెంట వెళ్లి, వాళ్ళు చెప్పిన వాళ్లతో చదరంగం ఆడడమే శంకరప్ప పని. 

ఓ సాయంత్రం వేళ.. మామూలుగా కాక అక్కడ వెన్నెల సురభిళం గానూ, పిల్లగాలి మధురంగానూ ఉండే వీధికి శంకరప్పని తీసుకెళ్తారు శాస్త్రి, యాజులు. ఒక మేడ ముందు నుంచి ఒక మధ్యానాయిక వీళ్ళకి అడ్డం వచ్చి "శంకరప్పగారి పాదాలు కొలుచుకుంటాను" అనగా, "ఈమె పేరు అలివేణి. రాజసభలో ప్రముఖురాలైన నర్తకి. విశేషించి చదరంగంలో నిధి. ఒకమాటు 'ఆటకట్టు' అన్నంత చాతుర్యం చూపించగా మెచ్చి, మహారాజులుంగారీమెకి రత్నాంగుళీయకమూ,  బంగారు జెడా, దుశ్శాలువలూ, దంతపు బలగమూ బహూకరించారు," అంటూ పరిచయం చేసి, "ఒకమారు పాదాలివ్వండి" అని సూచిస్తాడు శాస్త్రి. "నా పాదాలు ధూళి ధూసరితాలు కదా" అని శంకరప్ప సంకోచించగా, "మహాత్ముల పాదధూళి నా శిరమున దాల్తు" నంటూ శంకరప్ప పాదాలు పట్టి కళ్ళకద్దుకుంటుంది అలివేణి.  

ఆ వేశ్యావాటిక నుంచి, మహారాజు అనుయాయుల దగ్గరికీ, మహారాజు దగ్గరికీ ఒకేసారి పాకుతుంది శంకరప్ప ప్రతిభ. అతిత్వరలోనే మహారాజు నుంచి కబురొస్తుంది. ఇద్దరూ ఆటకి కూర్చుంటారు. మహారాజు కూడా మామూలు ఆటగాడేమీ కాదు. రోజుల తరబడి ఉత్కంఠభరితంగా సాగుతుంది వాళ్ళిద్దరిమధ్యా చదరంగం ఆట. సాగి సాగి ఒక చోట నిలిచిపోతుంది. తదుపరి ఎత్తు మహారాజు వెయ్యాల్సి ఉంది. ఏ ఎత్తు వేసినా గెలుపు శంకరప్పదే. చూస్తున్న అందరికీ ఆ విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కానీ, రాజుకి ఎదురుచెప్పగలవారెవరు? తన ఓటమిని, శంకరప్ప విజయాన్నీ అంగీకరించడానికి మహారాజుకి సమయం పడుతుంది.  కానుకగా తన సింహాసనం ఇచ్చేయడానికి సిద్దపడగా, కాదని 'వడ్లగింజలు' చాలంటాడు శంకరప్ప. 

మహారాజతన్ని అగ్రహారీకుణ్ణి చేస్తాడు. ఆనాటి సభలో ఒళ్ళు మరచి నాట్యం చేస్తుంది అలివేణి. శంకరప్ప మెప్పు చూపులతో లజ్జిత అయి ముఖం వంచేసుకుంటుంది. దగ్గర ఉండి మహారాజు శంకరప్పని గజారోహణం చేయించడమూ, వెంటనే వింజామర చేత పుచ్చుకుని, అలివేణి కూడా యేనుగెక్కేయడమూ జరిగిపోతాయి. మళ్ళీ ఓసారి 'వడ్లగింజలు' చదవండి, అలివేణిని మీరూ మర్చిపోలేరు. 

8 వ్యాఖ్యలు:

 1. ఈ పోస్టుకి "అలివేణి" అనే పేరు ఇంకా బావుండేదండి . ఓ మాంఛి కథని మరొక్కసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు .

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రాజుకన్నా సలహాదారులెపుడూ మిన్నయే! దేవుడికన్నా పూజారి వరమెక్కువ కదా ? అలివేణి సహాయంతో శంకరప్ప రాజుని చేరుకున్నట్లే, సామాన్యులు స్వయంప్రతిభతో ప్రయత్నించాలేమో ?

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. అలివేణి కన్నా రంగనాయకి ఎక్కువ సాయం చేసిందండీ శంకరప్పకి. అలివేణిది మూగప్రేమ.. ధన్యవాదాలు. 

   తొలగించు
 3. కథా పరిచయాలు పుస్తక పరిచయాలు ఒక ఎత్తైతే ఇలా పాత్రల పరిచయాలు మీకే ప్రత్యేకం. అడుగుకు వెళ్ళిపోయిన పుస్తకాన్ని మళ్ళీ ఓ సారి తీసి చదవాలనిపించేలా రాశారు.. థాంక్స్ మురళి గారు..

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. శ్రీపాద వారి కథల్లో ( ఆ మాటకొస్తే అన్ని క్లాసిక్స్ లోనూ) ఇలాంటి న్యూయాన్సెస్ ఎన్నో ఉంటాయండి. అవి దొరికినప్పుడు అదోలాంటి సంతోషం కలుగుతూ ఉంటుంది. ధన్యవాదాలు. 

   తొలగించు
  2. శ్రీపాద వారి అనుభవాలు జ్ఞాపకాలు నేను చదివిన రచనలలో అత్యుత్తమమైనది.
   తెలుగు జాతికి దొరికిన ఆణిముత్యం శ్రీపాదవారు.

   తొలగించు
  3. నిజమేనండీ.. ధన్యవాదాలు.. 

   తొలగించు