గురువారం, ఫిబ్రవరి 27, 2020

హంపీ యాత్ర - 4

(మూడో భాగం తర్వాత)

"ఆ రాణీ ప్రేమ పురాణం, ఆ ముట్టడికైన ఖర్చులు.." చరిత్ర సారం కాదని మహాకవి శ్రీశ్రీ అంటే అని ఉండొచ్చుగాక, శ్రీకృష్ణదేవరాయలు తన దేవేరులని ఎంతగా ప్రేమించాడో తెలియాలంటే మాత్రం వాళ్ళు నివసించిన అంతఃపురం తాలూకు అవశేషాలని సందర్శించాల్సిందే. ఒక్కమాటలో చెప్పాలంటే రక్షణ, సౌకర్యం, సౌందర్యాల కలగలుపు ఆ అంతఃపురం. రక్షణ అనగానే 'రాణుల్ని వేరే రాజెవరో ఎత్తుకుపోకుండా' అనే ఆలోచన వచ్చెయ్యక ముందే ఇంకో విషయం చెప్పేసుకోవాలి. అంతఃపురంలో ఓ వైపున ఉన్న శిధిలాలు 'ఖజానా' భవనానివి అంటోంది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్. అయితే, ఆ ఖజానా విజయనగర సామ్రాజ్యం మొత్తానిదా, లేక కేవలం రాణులది మాత్రమేనా అనే విషయంలో స్పష్టత లేదు. (విజయనగర రాణులు స్వయంగా ఖజానా నిర్వహించుకున్నారన్న వాదన ఒకటి ఉంది, పుట్టింటి ఆరణాలో లేక చీటికీ మాటికీ చెయ్యి చాపే అవసరం లేకుండా మహారాజు చేసిన ఏర్పాటో మరి). 

స్థానికంగా 'జనానా' అని పిలుచుకునే ప్రాంగణం ముందు ఆటో దిగి, లోపలి అడుగుపెడుతూ ఉండగానే ఎస్. వరలక్ష్మి, దేవిక, ఎల్. విజయలక్ష్మితో కలిసి జమిలిగా గుర్తొచ్చారు 'తిరుమల తిరుపతి వెంకటేశ్వరా..' పాడుకుంటూ. చుట్టూ ఎత్తైన ప్రహరీ ఉన్న సువిశాలమైన ప్రాంగణంలో ఎడమ చేతివైపు చివర ఒక మ్యూజియం ఉందని చెప్పింది ఆర్కియాలజీ వారి మేప్. మ్యూజియంకి ముందే ఖజానా తాలూకు శిధిలాలు, వాటికి పార్లల్ గా అంతఃపురం తాలూకు శిధిలాలు (కేవలం పునాది మాత్రమే మిగిలింది), అంతఃపురం ఎదురుగా చిన్న కొలను, ఆ కొలను ఒడ్డున లోటస్ మహల్ అని పిలవబడే పద్మ మందిరం, ప్రాంగణం రెండో చివర సైనికుల విశ్రాంతి మందిరం, ఏనుగుల మహాలూ ఉన్నాయి. ప్రహరీ దాటి బయటికి వెళ్తే వరుసగా హిందూ, జైన ఆలయాలు. ఖజానా పునాదుల్లో చూసేందుకు ఏమీ లేదు కనుక, మ్యూజియం వైపు వెళ్తే అంతఃపురంలో  వాడిన వస్తువుల తాలూకు శకలాలు కనిపించాయి. ఒకప్పుడు అది అంతఃపురం తాలూకు కొట్టుగది అనీ, కిరాణా సరుకులు నిల్వ చేసేవారని చెప్పింది, అక్కడ పనిచేస్తున్నావిడ. 

పద్మ మందిరం 

అంతఃపురపు పునాది దిబ్బ చుట్టూ ప్రదక్షణ చేసినా, ఆనాటి అత్తరు వాసనలేవీ నా నాసికని తాకలేదు. నీళ్లు లేని కొలనులో పెరిగిపోయిన గడ్డిని కోస్తున్నారు ఆర్కియాలజీ వారు ఏర్పాటు చేసిన మెయింటెనెన్స్ వర్కర్స్. పద్మ మందిరం కేవలం ఆకారాన్ని మిగుల్చుకుంటే, ఏనుగుల మహాలూ, సైనికుల విశ్రాంతి మందిరమూ కాల పరీక్షలని తట్టుకుని మరీ ఠీవిగా నిలబడ్డాయి. రంగులోనూ, రూపులోనూ కలువపువ్వుని గుర్తు చేసే పద్మ మందిరం నిర్మాణం మరో ఇంజినీరింగ్  అద్భుతం. వేసవిలో రాణిగారి శీతల విడిది ఆ చిన్న భవనం. బయటి అన్నివైపులా నుంచీ నిరంతరం పరిచారికలు భవనాన్ని నీళ్లతో తడుపుతూ ఉంటే, లోపల విశ్రాంతి తీసుకుంటున్న రాణీకి సహజసిద్ధమైన ఏసీ ఏర్పాటయ్యేదట! మిగిలిన కాలాల్లో సంగీత, నృత్య ప్రదర్శనాల్లాంటి వినోదాలు జరిగేవట అక్కడ. నాటి శిల్పుల సౌందర్య దృష్టికీ, పనితనానికీ మరో ఉదాహరణ ఈ మందిరం. 

పెద్ద పెద్ద బండరాళ్లతో నిర్మించిన ఏనుగుల మహల్ ఎంత ముద్దుగా అనిపించిందంటే, చూసినకొద్దీ చూడాలనిపించింది. సైజుల వారీగా ఏనుగుల కోసం గదులు, మేత, నీళ్లు అందించే ఏర్పాట్లు, ఒక్క మాటలో చెప్పాలంటే ఏనుగుల మనస్తత్వాన్ని, అవసరాలని కాచి వడబోసి అప్పుడు ప్లాన్ చేసి ఉంటారు ఈ నిర్మాణాన్ని. అంతేకాదు, కావలి వాళ్ళు రాత్రి వేళల్లో ఆ భవనం పైనుంచి పహారా కాసేందుకు వీలుగా మెట్లు కూడా ఉన్నాయి. సైనికుడు అనగానే ఎత్తుగా, బలంగా ఉండే రూపం గుర్తొచ్చినట్టే, ఆ సైనికుల విశ్రాంతి కోసం నిర్మించిన భవనం కూడా బాగా ఎత్తుగానూ, బలంగానూ ఉంది. కనీసం యాభై మంది సైనికులు ఒకేసారి విశ్రాంతి తీసుకుందుకు సరిపోయేట్టుగా ఉంది. వెనుక ద్వారం నుంచి బయటికి వెళ్తే వరసగా ఆలయాలు. కేవలం రాణి కోసం నిర్మించినట్టుగానే ఉన్నాయి. జైనాలయం వాస్తు మిగిలిన వాటికన్నా ప్రత్యేకంగా ఉంది. రథంలోనో, మేనాలోనో క్వీన్స్ బాత్ కి వెళ్లొచ్చి, ఈ ఆలయాలన్నీ వరసగా దర్శించుకునేసరికి రాణికి రోజు గడిచిపోయేదేమో అనిపించింది. పక్కలో బల్లెంలా శతృభయం వెంటాడుతూనే ఉంటుంది కదా పాపం. 

ఏనుగుల మహల్ 

హోటల్లో చెకవుట్ చేసి, హోస్పేట రైల్వేస్టేషన్ కి ప్రయాణం, ఆటోలో. డ్రైవరు ఉత్సాహవంతుడైన యువకుడు, కొత్తగా ఆటో కొనుక్కున్న వాడూను. దారిలో రెండు మూడు స్థానిక ఆలయాల దగ్గర ఆపాడు. టైం ఉండడంతో హోస్పేట డామ్ కూడా చూపించాడు. చెప్పకపోడమేం, అవన్నీ కూడా 'హంపిని చూసిన కళ్ళతో...' అనిపించాయి. నేను చూడాలనుకున్న ఆనెగొంది కోట మాత్రం చూడలేక పోయాను, అది ప్రయివేటు ప్రాపర్టీ అన్నాడు డ్రైవరు. దారంతా రాయల సామ్రాజ్యాన్ని పరికించి చూస్తే, అప్పుడు ఎలా ఉండేవో కానీ ఇప్పుడు తుంగభద్ర కాల్వల పుణ్యమా అని మాగాణులుగా మారిన నేలలు, వాటికి అంచులుగా కొండలు, గుట్టలు. అప్పటి గుర్తులుగా రోడ్డు పక్కన అక్కడక్కడా బాటసారుల కోసం రాళ్లతో కట్టిన సత్రవులు. వాటిని చూస్తూనే నాలుగు రోజులుగా చుట్టి వచ్చిన నిర్మాణాలన్నీ ఒక్కసారి కళ్ళముందు కదిలాయి. ఎందుకు కట్టించి ఉంటారు అన్నేసి గుడులూ, గోపురాలూ? కేవలం దైవభక్తి, కళాభిరుచి మాత్రమేనా, ఇంకా ఏమైనా కారణం ఉండి ఉంటుందా? అన్న ఆలోచన వచ్చింది. 

రాజ్యంలో శాంతిభద్రతలు కాపాడడం రాజు విధి. ప్రజలందరికీ చేతినిండా పనులున్నప్పుడు మాత్రమే కొట్లాడుకోకుండా, సామరస్యంగా ఉంటారు. కేవలం వ్యవసాయం తప్ప పరిశ్రమలేవీ లేని ఆ రోజుల్లో పెద్ద ఎత్తున ఉపాధి చూపించాలి, అది కూడా స్థానిక వనరులతో అంటే, రాతి నిర్మాణాలని మించిన ప్రత్యామ్నాయం దొరికి ఉండదు. ఖజానాలో ఎంత డబ్బున్నా, ప్రజలకి ఊరికే పంచడం అనే పధ్ధతి ఆనాటికి అమల్లోకి రాలేదు కదా. రాజు తల్చుకుంటే దెబ్బలకే కాదు, నిర్మాణాలకీ కొదవ ఉండదు. ఇప్పటి కాలేజీలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లని ఉత్పత్తి చేస్తున్నట్టుగా, అప్పటి గురుకులాలు శిల్పులని తయారు చేసి ఉంటాయి బహుశా. ఇప్పుడు "మావాడు సాఫ్ట్వేర్" అని చెప్పుకున్నట్టే, అప్పటి తల్లిదండ్రులు "మావాడు శిల్పి" అని గర్వంగా చెప్పుకుని ఉంటారు.  నిర్మాణాలు పెంచమని రాజాజ్ఞ అయినప్పుడు, అందులో వైవిధ్యం చూపించడం భృత్యుల బాధ్యత కదా. స్థానికంగా దొరికే రాయితో పాటు, ఓరుగల్లు రాజ్యం నుంచి నల్లరాతినీ తెప్పించి ఉంటారు. 

సైనికుల విశ్రాంతి మందిరం 

చూసిన నిర్మాణాలని ఈ ఆలోచనతో లంకె వేసినప్పుడు, ఎన్నివేల మంది శిల్పులకి, పనివాళ్లకి ఎన్నేళ్లపాటు గౌరవప్రదమైన ఉపాధి దొరికి ఉంటుందో కదా అనిపించింది. వేలల్లో కాకపోయినా, ఇప్పటికీ నిత్యం వందల మందికి ఉపాధి ఇస్తున్నాయి హంపీ శిధిలాలు. టూరిస్టు బస్సులు, క్యాబ్లు, ఆటో డ్రైవర్లు, హోటళ్ల వాళ్ళు మొదలు టూరిస్టు గైడ్లు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా కాంట్రాక్ట్ ఉద్యోగాలు పొందిన సెక్యూరిటీ గార్డులు, మెయింటెనెన్స్ సిబ్బంది వరకూ అనేకమంది ప్రత్యక్షంగా జీవనోపాధి పొందుతున్నారు. పరోక్షంగా ఆదాయం పొందుతున్న వాళ్ళ వివరాల్లోకి వెళ్తే ఈ సంఖ్య మరింత పెరుగుతుందే తప్ప తగ్గదు. పర్యాటకుల విషయానికి వస్తే, భారతీయుల సంఖ్యకి సమంగా (కొన్నిచోట్ల ఎక్కువగా) విదేశీయులు కనిపించారు. 

కానీ సౌకర్యాలని చూస్తే నిరాశ కలిగింది. చాలా సైట్లకి కనుచూపు మేరలో టాయిలెట్ సౌకర్యం లేదు కనీసం. అయితే, రోడ్లు, నడక దారులూ కూడా బాగున్నాయి. మిగిలిన పర్యాటక ప్రాంతాలతో పోల్చినప్పుడు స్థానికులు మంచి వాళ్ళుగా, సహాయం చేసేవాళ్లుగా అనిపించారు. మొత్తం ప్రయాణంలో ఒకరిద్దరు మినహా మిగిలిన ఆటోడ్రైవర్లు రీజనబుల్ ఫేర్లే అడిగారు. నాలుగురోజుల హంపీ ట్రిప్ అంటే "అన్నాళ్ళు ఎందుకు?" అన్నవాళ్లున్నారు. కానీ, నాకేమో చూడాల్సినవి, మళ్ళీ మళ్ళీ చూడాల్సినవి ఎన్నో మిగిలే ఉన్నాయి అనిపించింది. నా సింహావలోకనంలో నేనుండగానే రైల్వే స్టేషన్ వచ్చేసింది. "మేము హోమ్ స్టే కూడా పెడుతున్నాం. ఈసారి మా దగ్గరే ఉందురుగాని. నా ఫోన్ నెంబర్ రాసుకోండి సార్..." ఆటోడ్రైవర్ మాటల్ని రైలుకూత మింగేసింది. 

(అయిపోయింది) 

ఎన్నాళ్ళుగానో వాయిదా పడుతూ వస్తున్న హంపీయాత్ర మరో వాయిదా పడకుండా కార్యరూపం దాల్చేందుకు దోహదం చేసిన కొత్తావకాయ గారికి కృతజ్ఞతలు... 

9 కామెంట్‌లు:

  1. సరిగ్గా నెలరోజుల్లో హంపి యాత్ర చూడడం, వ్రాయడం అయిపోయాయన్నమాట! ప్రజలకు ఉపాధి కల్పించేటందుకే ఈ శిల్పాలు చెక్కి ఉంటారని నేను అనుకుంటున్నాను. చైనాలో లాగా ప్లాస్టిక్ ఉత్పత్తుల తయారీ కంటే ఇదే నయం కదా ? ఉచిత వరాలకన్నా ఇటువంటి చేతివృత్తులను ప్రోత్సహిస్తే మేలు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. క్యూలో నిలబడి రిజర్వేషన్ టిక్కెట్లు కొనుక్కోడం, టెలిఫోన్ డైరెక్టరీ ముందేసుకుని హోటల్స్ కి ఫోన్లు చేయడం నుంచి ఆన్లైన్ రిజర్వేషన్లకు వచ్చేశాం కదండీ, నెల కూడా ఎక్కువే నిజానికి. మీక్కూడా శిల్పాలు ఉపాధి కల్పనకే అనిపించినందుకు సంతోషంగా ఉంది. ఉచితాల గురించి ఇంకోసారి వివరంగా మాట్లాడుకుందాం.. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  2. మీ అంత లెక్కగా రాయలేము కానీ హంపీ యాత్ర మాత్రం కొంచం వివరంగానే చూసాం. మళ్ళీ అవన్నీ తిరగేయ్యాలి ఓసారి. మీ పుణ్యమా అని "మాధవి" ని మళ్ళీ చదివేశానండోయ్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. రాసే ప్రయత్నమన్నా చేయకుండా అలా అనేయడం బాలేదండీ.. 'మరో ప్రపంచానికి' మళ్ళీ ఆహ్వానించండి మమ్మల్ని మరి.. ...ధన్యవాదాలు. 

      తొలగించండి
  3. వర్చువల్ టూర్ సమగ్రంగా, ఆసక్తికరంగా ఉందండీ. యాత్రాకాంక్ష ఉండాలేకానీ దోహదానిదేముంది. మీ పాఠకులకి మంచి పోస్టులు దక్కినందుకు మీకు పునర్దర్శనప్రాప్తి కలగాలి. :)

    రిప్లయితొలగించండి
  4. చిన్నప్పుడు ఎప్పుడో చూసిన హంపీని మళ్ళీ ఇంకోసారి చూడాలనుకోవడమే కానీ అదెప్పటికి కుదురుతుందో! ఇప్పటికి ఇలా మీ బ్లాగులో మీ మాటల్లో చూడడం బావుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. తప్పక చూడండి. కాకపోతే, మరీ ఫిబ్రవరి కాకుండా నవంబర్-జనవరి మధ్యలో అయితే మరికొంచం సౌకర్యంగా ఉంటుంది వాతావరణం. ధన్యవాదాలు.. 

      తొలగించండి
  5. చాలా వివరంగా వ్రాసారు మురళి గారు. నేను కర్నాటకలో చాలా ఏళ్ళ నుంచి ఉంటున్నా హంపి వెళ్ళడం ఇంకా కుదరలేదు. నేను వెళ్ళినప్పుడు మీ టపాలు గైడులా ఉపయోగపడతాయి.

    రిప్లయితొలగించండి