సోమవారం, సెప్టెంబర్ 22, 2014

దక్షిణ కాశీ

ఉన్నట్టుండి మబ్బు పట్టేసింది ఆకాశం. చల్లబడిపోయింది వాతావరణం. రోడ్డుకి రెండు పక్కలా పచ్చని పంటపొలాలు. కొంచం దూరంగా కొబ్బరిచెట్లు. అప్పుడోటీ అప్పుడోటీ కారో, బస్సో కనిపిస్తున్నాయి తప్ప పెద్దగా ట్రాఫిక్ లేదు రోడ్డుమీద. 'ద్రాక్షారామం-20 కిమీ' బోర్డు కనిపించింది. అవును, శ్రీరమణ 'మిథునం' బుచ్చిలక్ష్మికి సమ్మంధం తప్పిపోయిన దాక్షారమే!

దాటి వెడుతున్న ఊరిపేరు గొర్రిపూడి. ఒకప్పుడు మాంచి రుచికరమైన జామిపళ్ళకి ప్రసిద్ధి. 'గొర్రిపూడి గావా' అంటే మదరాసు మార్కెట్లో ఎగబడి కొనేవాళ్ళు వ్యాపారులు. అయితే అదంతా చరిత్ర. ఉన్నట్టుండి ఆ ఊళ్ళో జామిచెట్లకి ఏదో తెగులు సోకడం, ఎక్కడా జామిచెట్టన్నది మచ్చుకైనా కనిపించకపోవడం వర్తమానం. రోడ్డుకి, పొలాలకి మధ్య కాయగూరల తోటలు. అప్పుడే కోసి తెచ్చిన కూరలని రోడ్డుపక్కనే అమ్ముతున్నారు రైతులు. బెండకాయలు, ఆనపకాయలు కొరుక్కు తినేయాలనిపించేలా ఉన్నాయి.

గాలి వేగం పెరిగి, సుళ్ళు తిరుగుతోంది. ఆకులు, అలమలూ గాలితోపాటు చుట్టుతిరుగుతూ ఎగురుతున్నాయి రోడ్డు మీద. వాతావరణంలో వర్షం వాసన తెలుస్తోంది. ఏ క్షణానైనా కుంభవృష్టి మొదలవ్వొచ్చు. వచ్చేసింది దాక్షారం. రోడ్డు పక్కనే పైడా వారి సత్రాన్ని ఆనుకుని విశాలమైన పార్కింగ్. నాలుగంగల్లో భీమేశ్వరాలయం తాలూకు పందిరి మొదలు. పందిట్లో అడుగు పెట్టడంతోనే ఫోన్ మోగింది. ఫోన్ ఆన్సర్ చేస్తూండగానే వర్షం మొదలయ్యింది. గొంతు మాట్లాడుతోంది. మెదడు, మనసు మాత్రం గొంతుతో కాక, కళ్ళతో చెలిమి చేస్తున్నాయి.


అతి విశాలమైన ప్రాంగణం, చుట్టూ పురాతన ప్రాకారం. ఏ పక్క చూసినా ఎత్తైన గోపురాలు. కుడిపక్క దూరంగా సప్తగోదావరం. "ఏదో పనిలో ఉన్నట్టున్నారు.. మళ్ళీ చేస్తాను.." కాల్ కట్టవ్వడం, వర్షం ఆగిపోవడం ఒక్కసారే జరిగాయి. సప్త గోదావరం వైపు అప్రయత్నంగా పడ్డాయి అడుగులు. ఆకుపచ్చగా ఉన్నాయి నీళ్ళు. వెళ్ళడానికి బాగా అరిగిపోయిన రాతిమెట్లు. ఎందరు నడిచిన దారో కదా ఇది! వ్యాసుడి మొదలు శ్రీనాథుడి వరకూ.. ఎందరెందరి కథలో ముడిపడి ఉన్న క్షేత్రం కదూ మరి.


జాగ్రత్తగా మెట్లు దిగి, కాళ్ళు తడుపుకుంటూ ఉండగా ఖాళీ షాంపూ పేకెట్ నా కాళ్ళని దాటి వెళ్ళింది. నాకే ఎందుకు కనిపిస్తాయి ఇలాంటివి? చేతులు కడుక్కుని, కాసిన్ని నీళ్ళు తలమీద జల్లుకుని పైకి వస్తే ఓ పెద్ద రావి చెట్టు. చుట్టూ అనేకానేక నాగప్రతిమలు. దగ్గరలో ధ్వజస్థంభం, పక్కనే పెద్ద నంది విగ్రహం. గుళ్ళోకి వెళ్లేముందు చుట్టూ చూడాలి అనిపించింది. ప్రదక్షిణా పథం మీద నడవడం మొదలుపెట్టాను. అనేకానేక స్థంభాలతో అన్నదాన మండపం. భోజనాల వేళ కాకపోయినా ఆడామగా ఓ ఇరవైమంది ఉన్నారు. కొందరు పెద్దగా అరుస్తున్నారు. చెవిన పడిన వాటిని బట్టి తెలిసిందేమంటే అక్కడేదో కులపంచాయితీ జరుగుతోందని.


దగ్గరలోనే ఓ గోపురం. ఊరికే ఉండక అటు వెళ్లాను. బయటికి దారి ఉంది. ఆ గోపురంలో బాటసారులు కొందరు కూర్చుని ఉన్నారు. అప్పుడే వాన వెలిసిన వాతావరణం కదూ. వాళ్ళలో ఒకతను చుట్ట వెలిగించాడు. ఘాటైన లంకపొగాకు. అతగాడు గుప్పుగుప్పున పొగ వదులుతూ ఉంటే, "కోవిల్లో చుట్ట కాల్చవచ్చునా?" అన్న వెంకటేశం అమాయకపు ప్రశ్నా, "కాలిస్తే కోవిల్లోనే కాల్చాలోయి. దీని పొగ ముందు సాంబ్రాణీ, గుగ్గిలం యేమూల?" అన్న గిరీశం సమాధానమూ గుర్తొచ్చేశాయి.


గుడిలోపలికి అడుగుపెట్టాను. గర్భాలయం చుట్టూ విశాలమైన రెండతస్తుల రాతి మండపం. ఆ మండపంలోనే ఉపాలయాలు. పదమూడు వందల ఏళ్ళనాటి నిర్మాణం! ఎంత శ్రద్ధగా మలిచారు ఒక్కో స్థంభాన్నీ!! ఈ నిర్మాణం నాకు తెలుసునా? నా కళ్ళముందే జరిగిందా?? పురాతన కట్టడం ఏదైనా చిరపరిచితంగానే అనిపించేస్తుంది అదేమిటో. నా మనసు వశం తప్పుతోందా లేక చాళుక్య ప్రభువుల ఆత్మలు అక్కడే సూక్ష్మ రూపంలో తిరుగాడు తున్నాయా? హేతువుకి అందనిదేదో జరుగుతోంది మొత్తానికి.


చల్లటి వాతావరణం, చూడ్డానికి రెండు కళ్ళూ సరిపోనంతగా కళా కౌశలాన్ని సొంతం చేసుకున్న నిర్మాణం. కదలాలని అనిపించడం లేదు. కానీ, తప్పదు. పెద్దగా జనం లేరు ఆలయంలో. గర్భాలయం రెండు అంతస్తులు. అవును మరి, శివలింగం ఎత్తు సుమారు పద్నాలుగు అడుగులు. ముందుగా పీఠ దర్శనం చేసుకుని, పై అంతస్తుకి వెడితే, అక్కడ మళ్ళీ కళ్ళు చెదిరే చెక్కడం పనితో ఉన్న రాతిస్థంభాలు. ప్రదక్షిణ పూర్తయ్యింది. అయ్యవారు మొబైల్ ఫోన్లో మాట్లాడడం అయ్యింది అప్పుడే.


పళ్ళెంలో దక్షిణ చూసి "గోత్రనామాలు చెప్పండి" అన్నారు హుషారుగా. పాతికేళ్ళు ఉంటాయేమో. జంధ్యప్పోగు, బ్రహ్మచారని చెబుతోంది. పచ్చని మెళ్ళో బంగారు గొలుసు మెరుస్తోంది. "ధర్మపత్నీ సమేతస్య.." పేరు చెప్పమన్నట్టుగా చూశారు. ధర్మపత్ని పేరు చదవడం తప్పనిసరి చేసేసినట్టున్నారు అన్ని గుళ్ళలోనూ. పూజ పూర్తయ్యింది. "అటు నుంచి జాగ్రత్తగా దిగి వెళ్ళండి" సూచన వినిపించింది వెనుకనుంచి.

మళ్ళీ ఓసారి ఆలయం అంతా తిరిగి చూసి, అమ్మవారు మాణిక్యాంబ దగ్గర కూడా సెలవు తీసుకుని బయటికి వచ్చేసరికి తల పగిలిపోతుందా అన్నంత నొప్పి. అప్పటివరకూ కనీస సూచన కూడా లేదు, అదేమిటో. సప్తగోదావరం మీదనుంచి వీస్తున్న చల్లగాలి ఓ పక్కా, రోడ్డు మీద వాహనాల రణగొణ ధ్వని మరోపక్కా. ఫ్లాస్కులో టీ ఓచేత, కాగితం కప్పులు మరో చేతా పట్టుకు తిరుగుతూ కనిపించాడో కుర్రాడు, సంజీవిని తెస్తున్న హనుమంతుడిలా. టీని మించిన దివ్యౌషధం ఏముంది, తలనొప్పిని తగ్గించడానికి? మబ్బులు మూసుకొస్తూ ఉండగా మళ్ళీ ప్రయాణం మొదలయ్యింది.

15 వ్యాఖ్యలు:

 1. బావున్నాయనండి మీ ద్రాక్షారం కబుర్లు...ఎప్పుడొ చిన్నప్పుడు కాకినాడనుంచీ రాజోలు తాతగారింటికి వెల్తూ మధ్యఓ ఆగాం ద్రాక్షారామంలో... ఇప్పుడు పెద్దగా గుర్తులేదు..మధ్యలో ఏదొ రేవు కూడా దాటినట్లు గుర్తు... బహుశా కోటిపల్లి అనుకుంటా

  ప్రత్యుత్తరంతొలగించు
 2. వెళ్ళి వెంటనే చూడాలనిపించించేలా వర్ణించారు..
  అక్కడ ఉన్న details గురించి కాకుండా..మీ అనుభూతిని వర్ణించడం చాలా నచ్చింది..:)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. Excellent.....కళ్ళకు కట్టినట్లుగా వర్ణించారు మురళి గారు. ధన్యవాదములు

  ప్రత్యుత్తరంతొలగించు
 4. హేతువుకు అందనిదేదో.... అద్గదీ మాట... మీరూ పడిపోడిపోయారూ మాయలో... :)

  ప్రత్యుత్తరంతొలగించు

 5. ఇది ఆంధ్రా లో ఉందా, లేక తెలంగాణా లో ఉందాం డీ ??

  జిలేబి

  ప్రత్యుత్తరంతొలగించు
 6. యాత్రా విశేషాలు చక్కగా వ్రాసారు. నేను వెళ్ళి పదేళ్ళయ్యింది.
  అన్నట్టు కాకినాడ కోటిపల్లి రైల్‌కార్ ఎక్కారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 7. చాలా బాగున్నాయండీ దాక్షారం కబుర్లు... :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @నాగ శ్రీనివాస: మధ్యలో దాటే రేవు కోటిపల్లేనండీ.. ధన్యవాదాలు.
  @ధాత్రి: అక్కడికి ఎవరూ కూడా ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్ళరటండీ.. అందరూ అప్పటికప్పుడు అనుకునో, అనుకోకుండానో వెళ్తారట.. ..ధన్యవాదాలు.
  @మానసవీణ: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @పురాణపండ ఫణి: మామూలు మాయటండీ మరీ :) ..ధన్యవాదాలు
  @శర్మ: ధన్యవాదాలండీ..
  @జిలేబి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లాలో ఉందండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. @బోనగిరి: రైల్ కార్ ప్రయాణం గురించి చాన్నాళ్ళ క్రితం వంశీ రాసిన ఆర్టికల్ చదివి, దాచుకుని, అప్పటినుంచీ అనుకుంటూ ఉన్నానండీ.. వెళ్లి రావాలి.. ..ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: అవునండీ దాక్షారమే మరీ :) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. జీవితంలో సాహిత్యం పెనవేసుకుపోతే.. ఎక్కడికి వెళ్ళినా సుకవులూ, వారు పుట్టించిన పాత్రలూ ఔపడతాయనుకుంటా! :) బావుందండీ.. 'పునర్దర్శనప్రాప్తిరస్తూ..!' అన్నారా మరి మొబైల్ ఫోన్ అయ్యవారు? :)

  గొర్రిపూడి జామ.. షాంపూ కవరు.. ప్చ్

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఈ దాక్షారంలో ఏదో ఆకర్షణ ఉందండీ.. ఎప్పుడూ మనసు కాళ్ళని అటువేపు లాక్కెళ్ళి పోతూ ఉంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. ఎప్పుడో! పదేళ్ళ వయసులో చూసిన దాక్షారం.సరిగ్గా గుర్తేలేదు. మళ్ళీ కళ్ళముందునిలిపారు మురళి గారు. థాంక్సండి.
  ఫొటోలు మీరు తీసినవేనాండి.బావున్నాయి.
  ఫ్లాస్క్ లో టీ....మా అటెండర్ అబ్బాయిని గుర్తుచేసారండి:)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @కొత్తావకాయ: హహహా.. పెనవేసుకుపోవడం ఏమీ లేదండీ.. గుర్తురావడం యాదృచ్చికం అంతే.. అయ్యవారు అనే ఉంటారండీ, నాకు వినిపించలేదు :) ..ధన్యవాదాలు.
  @శిశిర: అవునండీ.. ఈ గుడీ, సామర్లకోట గుడీ దాదాపు ఒకేలా ఉంటాయి కూడా.. కాకపొతే అక్కడ సప్తగోదావరం బదులు కోనేరు ఉంటుంది.. ధన్యవాదాలు.
  @జయ: అవునండీ, ఫోటోలు నా ప్రతిభే :) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు