గురువారం, సెప్టెంబర్ 18, 2014

బీరకాయ పచ్చడి

రాస్తూ రాస్తూ ఉండగా బ్లాగు రాయడం కాస్త వచ్చినట్టుగా, చేస్తూ చేస్తూ ఉండగా వంట కూడా పర్వాలేదు అనిపిస్తోంది. వంటింట్లో ప్రవేశించే అవకాశం వచ్చినప్పుడల్లా రొటీన్ వంటలు కాకుండా కొంచం కొత్తవి (అనగా నేను ఎప్పుడూ ప్రయత్నం చేయనివి) వీలైనంత షార్ట్ కట్ లో చేసే ప్రయత్నం చేస్తూ ఉండడంతో ఫలితాలు కూడా పర్వాలేదనిపిస్తున్నాయి. ఈ క్రమంలో చేసిన తాజా వంటకం బీరకాయ పచ్చడి. చాలా అంటే చాలా సింపుల్ గా అయిపోయే వంటకం. పైగా అన్నంలోకీ, టిఫిన్లలోకీ కూడా పనికొచ్చేస్తుంది ఉభయతారకంగా.


బీరకాయ పచ్చడిని రెండుమూడు రకాలుగా చేసుకోవచ్చు. పధ్ధతి దాదాపుగా ఒక్కటే, చిన్న చిన్న మార్పులు మినహాయించుకుని. బీరకాయని బట్టి పచ్చడి అన్నమాట. కాయ లేతగా ఉండి, పెచ్చు కూడా పచ్చడికి పనికొస్తుందా లేక పెచ్చు తీసేసి కేవలం కాయతో మాత్రమే పచ్చడి చేసుకోవాలా అన్నది ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవలసిన విషయం. బీరకాయతోపాటు టమాటాలు మాత్రమే వేసీ, టమాటాలు, ఉల్లిపాయలు కలిపి వేసీ చేసేసుకోవచ్చు పచ్చడిని.

ముందుగా బాండీలో నూనె పోసి కొంచం వేడెక్కగానే శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేగనిచ్చి మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి. ఈలోగానే బీరకాయలు కడుక్కుని, చేదు చూసుకుని, పెచ్చుతోనో లేకుండానో ముక్కలు కోసి పెట్టేసుకోవాలి. ఖాళీ అయిన బాండీలో బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి. ముక్కల్ని బట్టి రెండో మూడో టమాటాలు తరిగి పెట్టుకుని, బీరకాయ ముక్కలు కొంచం మెత్తబడ్డాక టమాటా ముక్కలు వేసి, పసుపు జల్లి మళ్ళీ మూత పెట్టేయాలి.

కాస్సేపాగి స్టవ్ కట్టేసి, బాండీలో ముక్కల్ని బాగా చల్లారనివ్వాలి. మిక్సీ జార్ లో ఉన్న మిరపకాయలు వగయిరా ఈపాటికి చల్లారి ఉంటాయి కదా. మిక్సీ ఓ తిప్పు తిప్పేస్తే కారం సిద్ధం అయిపోతుంది. చల్లారిన ముక్కలు జార్లో వేసి, తగుమాత్రం ఉప్పు వేసి రెండు తిప్పులు తిప్పేస్తే పచ్చడి దాదాపుగా సిద్ధం అయిపోయినట్టే. దాదాపు ఏవిటీ అంటే, బాండీలో కొంచం నూనె వేసి వేడెక్కుతూ ఉండగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు వేసి బాగా వేగనిచ్చి (డీప్ ఫ్రై) పచ్చట్లోకి బదలాయించేస్తే పచ్చడి సిద్ధం!


బీరకాయ చెక్కు తీసేస్తే పచ్చడి ఎర్రగా, గరిటెజారుగా వస్తుంది. దోశల్లోకి బహుచక్కని కాంబినేషన్. అదే చెక్కుతో అయితే కొంచం ముదురు రంగులో గట్టిగా వస్తుంది.అన్నంలోకి కూడా బాగుంటుంది. చెక్కు ఉంచాలనుకున్నా బీరకాయ మీదుండే పొడవు చారల్ని పీలర్తో తీసేయాలి. ఉల్లిపాయ చేర్చాలి అనుకుంటే, బీరకాయ-టమాటా ముక్కలు వేగాక, అప్పుడు బాండీలో కొంచం నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయించి మిక్సీలో బీర-టమాటా మిశ్రమం రెండో తిప్పు తిప్పేప్పుడు చేర్చుకుంటే సరిపోతుంది. ఉల్లి వేసి చేసిన పచ్చడి టిఫిన్ కన్నా వేడన్నంలోనే ఎక్కువ బాగుంటుంది. ఇవీ బీరకాయ పచ్చడి మేడీజీ కబుర్లు!!

4 వ్యాఖ్యలు:

 1. బాగుందండీ :-) బీరకాయ పచ్చడితో నాకో చిన్న జ్ఞాపకం ఉంది త్వరలో పంచుకుంటాను :)
  అన్నట్లు మీ బ్లాగ్ లో ఈ వంటల పోస్టులకు పెట్టిన లేబుల్ కూడా సరదాగా ఉందండి ఇపుడే గమనించాను :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. @వేణూ శ్రీకాంత్: హహహా.. గమనించారన్నమాట! అసలెవరైనా చూస్తారా అనుకున్నా లేబుల్ చేస్తూ.. మీ జ్ఞాపకం కోసం ఎదురు చూస్తూ.. ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @నారాయణ స్వామి: దేశవాళీ టమాటా కదండీ, ఆ పులుపు సరిపోతుంది.. ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు