ఆదివారం, ఫిబ్రవరి 09, 2014

అడవి శాంతిశ్రీ - అంశుమతి

చారిత్రిక నవలలు రాయడంలో అడివి బాపిరాజుది ప్రత్యేకమైన శైలి. ఎప్పుడో ఎక్కడో జరిగిన కథని పాఠకులకి తను వివరిస్తున్నట్టుగా కాకుండా, కథా స్థలంలో తను స్వయంగా నిలబడి పాత్రలని, సన్నివేశాల్నీ పరికించి చూస్తూ ఒక్కో వ్యక్తిని గురించీ, సంఘటనని గురించీ విపులంగా చెబుతున్నట్టుగా ఉంటాయవి. ఆంధ్ర పాలకుల చరిత్రలని అందమైన నవలలుగా మలచిన బాపిరాజు కలం నుంచి వెలువడిన రెండు నవలలు 'అడవి శాంతిశ్రీ' 'అంశుమతి.' బాపిరాజు సాహిత్యాన్ని నవతరం పాఠకుల కోసం మళ్ళీ ముద్రించి అందిస్తున్న 'విశాలాంధ్ర' ఆరో సంకలనంగా ఈ రెండు నవలల్నీ కలిపి విడుదల చేసింది.

ఆంధ్ర పాలకులు అనగానే మొదట గుర్తొచ్చేది శాతవాహనులే. తొలితరపు శాతవాహనుల పాలనా వైభవాన్ని 'హిమబిందు' నవలలో అందంగా చిత్రించిన బాపిరాజు, శాతవాహనుల అవసాన దశని ఇతివృత్తంగా తీసుకుని రాసిన నవల 'అడవి శాంతిశ్రీ.' శాతవాహనుల్లో బలవంతుడైన చివరి చక్రవర్తి యజ్ఞశ్రీ శాతకర్ణి పాలన కథా కాలం. యజ్ఞశ్రీ అల్లుడు, అతి బలవంతుడూ అయిన ఇక్ష్వాకు శాంతిమూల ప్రభువు, వృద్ధుడైన చక్రవర్తికి అండదండగా నిలబడి రాజ్యానికి కాపు కాస్తూ ఉంటాడు. శాంతిమూలుడికి అభిమాన పాత్రుడైన శాతవాహన సామంతుడు అడవి బ్రహ్మదత్త ప్రభువు.

తను సృష్టించే కథానాయక పాత్రల మీద అపరిమితమైన అభిమానాన్ని ఏమాత్రం దాచుకోని బాపిరాజు, అదే ధోరణి ని కొనసాగించారు ఈ నవలలో కూడా. 'అడవి బ్రహ్మదత్త ప్రభువు ఉత్తమ కవి, ఉత్తమ సేనాపతి, ఉత్తమ రాజనీతి విశారదుడు. అతనికి కవిత్వావేశం కలిగితే ఆంద్ర ప్రాకృతంలో, దేవభాషలో అనర్గళంగా గాధలు, కావ్యాలు సృష్టిస్తాడు. అటువంటి సమయాల్లో అతడు తన రాజనీతి సేనాపతిత్వాన్ని మరచిపోతాడు. ఆపస్తంబ సూత్రుడు, కృష్ణ యజుర్వేద శాఖాధ్యాయి' నవల ప్రధమ భాగంలో ప్రారంభ వాక్యాలు ఇవి. ఇంతటి ఉత్తముడైన బ్రహ్మదత్త ప్రభువుని తన అల్లుడిగా చేసుకోవాలన్నది ఇక్ష్వాకు శాంతి మూలుడి కోరిక.


శాంతిమూలుడికి పట్టమహిషి సారసికాదేవికి కలిగిన కుమార్తె శాంతిశ్రీ. సారసికా దేవి, బౌద్ధ మతావలంబకులైన మాఠరీ ప్రభువుల ఆడపడుచు. తండ్రి హైందవ ధర్మం ఆచరిస్తున్నా, తల్లి ప్రభావంతో బౌద్ధం మీద ఆరాధన పెంచుకున్న శాంతిశ్రీ ఐహిక బంధాలని విడిచిపెట్టి బౌద్ధ భిక్కుణి గా మారాలని తలపోస్తుంది. కుమార్తె మనసు మార్చడం ఎలా అన్నది శాంతిమూలుడిని వేధిస్తున్న సవాలు. బాగా ఆలోచించి, ఆమెని అవివాహితుదైన అడవి బ్రహ్మదత్తుడి దగ్గర శిష్యరికం చేయవలసిందిగా ఆదేశిస్తాడు. తొలిచూపులోనే శాంతిశ్రీతో ప్రేమలో పడతాడు బ్రహ్మదత్తుడు. గురువు యెడల భక్తితో మెలిగే శాంతిశ్రీలో ప్రేమ భావనలు ఏమాత్రం లేవు. ఈ విషయాన్ని గ్రహించ గలిగాడు బ్రహ్మదత్తుడు.

చక్రవర్తి యజ్ఞశ్రీ మరణించడంతో, అతని కుమారుడు విజయశ్రీ ధాన్యకటక సింహాసనం అధిష్టించడం, కొన్నాళ్ళకే అతడు మరణించడంతో, అతని కుమారుడు, అయోగ్యుడు అయిన చంద్రశ్రీ ని సింహాసనం పై నిలిపి పాలన భారం మొత్తం తనే వహిస్తూ ఉంటాడు శాతిమూలుడు. అడవి బ్రహ్మదత్తుడు ఆ మహారాజుకి కుడి భుజం. శాతవాహన వంశం అంతరించాక, ధాన్యకటకం ఎవరి ఏలుబడిలోకి వచ్చింది? వివాహాన్ని గురించీ, ఆర్ష ధర్మాన్ని గురించీ శాంతిశ్రీ ఆలోచనల్లో మార్పు వచ్చిందా? ఇత్యాది ప్రశ్నలకి సమాధానాలు ఇస్తూ ముగుస్తుందీ నవల. బాపిరాజు మిగిలిన నవలల్లాగే, మొదటి ఇరవై పేజీలని ఓపికగా చదివితే అటుపై జవనాశ్వంలా పరిగెత్తే కథనం ఆపకుండా చదివిస్తుంది మిగిలిన పేజీలని. మొత్తం 226 పేజీలున్న ఈ నవలలో అనేక సన్నివేశాలు 'హిమబిందు' నవలని పదేపదే గుర్తు చేశాయి.

విష్ణు కుండినులలో చివరి వాడైన మాచర భట్టారకుని ఏకైక కుమార్తె అంశుమతీదేవి ప్రేమకథ 'అంశుమతి' నవలిక. యాభైమూడు పేజీల ఈ నవలికని తన అర్ధాంగి సుభద్రకి అంకితం ఇచ్చారు బాపిరాజు. సౌందర్యవతి అయిన అంశుమతి ని వివాహం చేసుకుంటామంటూ ఎందరో రాకుమారులు వర్తమానం పంపుతున్నారు మాచన భట్టారకుడికి. అందాలరాశి అంశుమతితో పాటు, మహారాజుకి పుత్ర సంతానం లేని కారణాన వేంగీ సామ్రాజ్యం కూడా తమ వశమవుతుందన్నది వారిలో చాలామంది ఆలోచన. యువరాణి అంగీకారం కోసం ఎదురుచూస్తున్న రాకుమారుల్లో దుర్మార్గుడైన కళింగ యువరాజు కూడా ఉన్నాడు.

పృధ్వీ వల్లభ వాతాపి నగర చక్రవర్తి చిన్నతమ్ముడు విష్ణు వర్ధనుడు. వాతాపి నగర చాళుక్య చక్రవర్తులు అందరూ ఆరడుగుల పొడవు వారు. కానీ, విష్ణు వర్ధనుడి ఎత్తు మాత్రం కేవలం నాలుగడుగుల పదకొండు అంగుళాలు. ఈ కారణానికి ఇష్టులు అతన్ని 'కుబ్జ విష్ణు వర్ధనుడు' అనీ, శత్రువులు 'పొట్టి చాళుక్యుడు' అనీ అంటూ ఉంటారు. ఏ ఆడపిల్లా తక్కువ ఎత్తున్నతనని ప్రేమించ లేదు అనే సందేహంతో అవివాహితుడిగా ఉండిపోయి, రాజ్యవిస్తరణ చేస్తూ ఉంటాడు విష్ణువర్ధనుడు. కళింగ యువరాజు కారణంగా ఒకరికి ఒకరు తారస పడతారు అంశుమతి, విష్ణువర్ధనుడు. ఇద్దరికీ ఒకరి గురించి ఒకరికి తెలియదు. కానీ చిత్రంగా ఇద్దరికీ ప్రేమ భావనలు అంకురిస్తాయి. వారి ప్రేమకథ ఏ మలుపు తిరిగింది అన్నదే 'అంశుమతి' నవలిక ముగింపు. 'గోన గన్నారెడ్డి' నవలని గుర్తు తెచ్చే కథనం. ఆంధ్ర పాలకులందరి కథల్నీ బాపిరాజు నవలలుగా మలచి ఉంటే బావుండేది కదా.. (అడవి శాంతిశ్రీ - అంశుమతి, విశాలాంధ్ర ప్రచురణ, పేజీలు 284, వెల రూ. 160, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

2 వ్యాఖ్యలు:

  1. మురళీగారు,
    నేను ఈరోజే శ్రీ విశ్వనాథవారి నవల ధర్మచక్రం చదివాను. అది కూడా ఇదే నేపథ్యంతో రాసిన నవల. ఇందులో శాంతిమూలుడు గురించి చెప్పినప్పుడు అతని సోదరి అని శాంతిశ్రీ అనే పాత్రను వర్ణించారు. శాంతిమూలుడుకి ఆమె అక్కగారు. అతనికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆమె పేరు కూడా శాంతిశ్రీ. ఇరువురికీ భేదం చూపించడానికి వారు ఈ శాంతిమూలుని పుత్రిక యైన శాంతిశ్రీని అడవి శాంతిశ్రీ అని పిలుచుకునేవారు అని రచయిత చెప్పారు. ఈమె భర్త ధనకరాష్ట్ర అధిపతి యైన .యజ్ఞశ్రీ కుమారుడు స్కంధ విశాఖ నాగుడు అని చెప్పారు. శాంతిమూలుని సోదరి భర్తపేరు మహాస్కంధుడు- పూగీ రాష్ట్రం (నేటి ఒంగోలు అట)అధిపతి. నిజానికి నవల అంతా ఆ సోదరి శాంతిశ్రీ ని చిత్రించిన ఈ ధర్మచక్రం నవలకు, మీరు చెప్పిన అడవి శాంతిశ్రీ నవలకు ఇన్ని బేధాలున్నాయేం......ఇద్దరు శాంతిశ్రీలు ఉన్నారని విశ్వనాథవారు చెప్పినవిషయం బాపిరాజు గారు ఎందుకు చెప్పలేదంటారూ. అలాగే శాంతిమూలుడి భార్యపేరు సారసికాదేవి అని మీరు రాసారు. విశ్వనాథవారు మాఠరీదేవి గా ఆమెపేరు తెలిపారు. శాంతిమూలుడికి కుడిభుజంగా ఉన్న పూగీయ స్కంధుడు బాపిరాజుగారి నవలలో బ్రహ్మదత్తుడుగా కనిపిస్తున్నాడు. ఒకే నేపథ్యం ఒకే కుటుంబం మరి రెండు నవలలూ ఒకేసారి వచ్చాయి.(నేను చదవినది 1947లో ప్రచురించబడిన నవల) ఈ భేదాలేమిటో. ఆర్షధర్మం పాటించే వంశంలో బౌద్ధమతానికి ఆకర్షితురాలయిన శాంతిశ్రీ విశ్వనాధవారి ప్రకారం అడవి శాంతిశ్రీ మాత్రం కాదు.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. @సుధ: విశ్వనాథ వారి 'ధర్మచక్రం' నేను చదవలేదండీ. శాంతమూలుడి సోదరి పేరు కూడా శాంతిశ్రీనే. ఆమె భర్త పూంగీయ స్కంద సాగర నాగ ప్రభువు. ఈ నవల అంతా శాంతిమూలుడి కుమార్తె శాంతిశ్రీ గురించి. ఆమె తల్లి పూర్తి పేరు శ్రీమాఠరీ సారసికాదేవి. విశ్వనాథ వారు మాఠరీదేవి అని రాశారన్నమాట. ఈమె పుట్టింటి వారు బౌద్ధ మతావలంబకులు. ఈమె ద్వారా కుమార్తె శాంతిశ్రీ బౌద్ధం వైపు ఆకర్షితురాలు అయ్యింది. "యజ్ఞశ్రీ శాతవాహన సార్వభౌముని తమ్ముని మనుమడైన పులమావి ప్రభువు (అడవి) శాంతిశ్రీ అందము విని ఆ బాలిక తనకు మహారాణి కావాలని వాంఛిస్తున్నాడు" అంటారు బాపిరాజు. ఈ శాంతిశ్రీ యువరాణి కథానాయకుడు అడవి బ్రహ్మదత్తుడు.. కాబట్టి ఈమె 'అడవి శాంతిశ్రీ' అయ్యిందన్నమాట! నేను 'ధర్మచక్రం' మీరు 'అడవి శాంతిశ్రీ' చదవాలిప్పుడు :) .. విశదంగా వ్యాఖ్య రాసి, 'ధర్మచక్రం' చదివించబోతున్నందుకు ధన్యవాదాలండీ..

    ప్రత్యుత్తరంతొలగించు