బుధవారం, ఫిబ్రవరి 12, 2014

సీత జడ

ఎడమ చేతను శివుని విల్లుని ఎత్తగల అవతార పురుషుడు కాదు జానకి రామారావు. ఎమ్మే పాసయ్యి, ఢిల్లీ లో ఉద్యోగం చేస్తూ, అమెరికా వెళ్లి పై చదువులు చదవాలని ఆశపడే మధ్యతరగతి మనిషి. కానీ అతగాడి పల్లెటూరి ఇల్లాలు సీతది మాత్రం అచ్చంగా సీత జడే. ఆ జడని చూస్తే అతగాడికి అప్పుడప్పుడూ సరసం, మిగిలినప్పుడంతా విరసమూను. 'దీని పొగరంతా దీని జడలో ఉంది' అని లోలోపలే పళ్ళు నూరుకుంటూ ఉంటాడా సగటు భర్త. రామాయణంలో సీతకి మల్లేనే ఈ సీతకి కూడా ప్రకృతంటే వల్లమాలిన అభిమానం.

రైలు ఆగీ ఆగడం, పుట్టింటి ఉత్సాహంతో తణుకు ప్లాట్ఫాం మీదికి బంతిలా గెంతిన సీత అప్పటినుంచీ మొగుడి మాట బొత్తిగా పట్టించుకోడం మానేస్తుంది. రైల్వే స్టేషన్ నుంచి బస్టాండుకి, అక్కడి నుంచి ఎర్ర బస్సెక్కి పల్లెటూరికి చేసిన ప్రయాణంలో జానకి రామారావుని ఏమాత్రం ఖాతరు చేయదామె. దానితో జానకి రామారావు పరిస్థితి గొప్పింటి స్త్రీని ప్రాణాలకి తెగించి అనుసరించి వెళ్ళే బానిస ప్రియుడిలా ఉంది తప్ప, అత్తారింటికి వెంట బెట్టుకుని వెళ్ళే హైక్లాసు పురుషుడిలా ఏమాత్రమూ లేదు.

ఇంతకీ అతనా పల్లెటూరికి వెళ్ళడం అదే మొదటిసారి. గురజాడ వారి గిరీశం లాగే పల్లెటూళ్ళో క్యాంపెయిన్ కి అవకాశం ఉండదు అనుకున్నాడు కానీ, గుమ్మంలో ఎదురొచ్చిన మరదలు సత్యవతిని చూసి కళ్ళు తిప్పుకోలేక పోతాడు జానకి రామారావు. సత్యవతి, సీతకి సయానా చెల్లెలు కాదు. పిన్ని కూతురు. చిన్నప్పుడే తల్లినీ, తండ్రినీ పోగొట్టుకున్న సీతని ఆమె పిన్ని వరలక్ష్మే పెంచి పెద్ద చేసి, పెళ్లి చేయడం మాత్రమే కాదు, ఆమెకున్న కొద్దిపాటి ఆస్తినీ జాగ్రత్తగా కాపాడుకుంటూ వచ్చింది. అదిగో, ఆ ఆస్తి అమ్మేసి, ఆ డబ్బుతో సీతని తీసుకుని అమెరికా వెళ్లిపోవాలి అన్నది జానకి రామారావు ఆలోచన. అందుకోసమే ఢిల్లీ నుంచి ఆ పల్లెటూరికి ప్రయాణం కట్టాడు.

మరదలు సత్యవతిని మొగుడు వదిలేశాడు అని తెలియగానే జానకి రామారావులో వంద ఆలోచనలు కలిగాయి. వాటిని ఇట్టే గ్రహించింది సత్యవతి. సీతా, వరలక్ష్మీ బయటికి వెళ్ళగా చూసి బావగారితో సరసం ఆడింది. అదే అదనుగా జానకి రామారావు 'అడ్వాన్సు' అవ్వబోయినప్పుడు, అతన్ని బయటికి పంపేసింది. ఆశ్చర్యంగా, ఆ రాత్రి సీతే స్వయంగా జానకి రామారావుని సత్యవతి గదిలోకి పంపి, బయటి నుంచి గడియ పెట్టి, వరలక్ష్మి పక్కలో చేరి భోరుమంది. పల్లెటూళ్ళో పుట్టి పెరిగి, ఢిల్లీ లో కాపురం చేసొచ్చి, చెట్టంత మగాడిని తన చెప్పుచేతల్లో పెట్టేసుకున్న ఆ జాణ, బేలగా ఎందుకు మారిపోయింది? సీత చేసిన ఆ పనికి పూర్వాపరాలు ఏమిటి? వీటికి సమాధానం ఆద్యంతం ఆసక్తికరంగా సాగే 'సీత జడ' కథలో దొరుకుతాయి.

పురాణం సీత పేరుతో 'ఇల్లాలి ముచ్చట్ల'ను తెలుగు ప్రజలకి వినిపించిన పురాణం సుబ్రహ్మణ్య శర్మ రాసిన 'సీత జడ' కథ మొదటి సగం 'ఇల్లాలి ముచ్చట్లు' పంథాలోనే సాగుతుంది. కథానాయిక సీత, చింతచిగురు పప్పు బ్రిలియంట్ గా వండగల సీతేనేమో అనిపిస్తూ ఉండగా కథాగమనం ఒక్కసారిగా మారిపోయి, పాఠకుడిని ఉక్కిరిబిక్కిరి చేసేన్ని మలుపులు తిరిగి, 'సీత జడ' ఏమయ్యిందో చెబుతూ ముగుస్తుంది. కించిత్ నాటకీయతని సర్దుకుంటే, ఆపకుండా చదివించే కథ. 'జెయింట్ వీల్' లాంటి కథలున్న 'పురాణం సుబ్రహ్మణ్య శర్మ కథలు' సంకలనంలో ఉందీ కథ.

'రచయితగా పురాణం రెండు భిన్న సంస్కారాలు కలగలిసి పోయిన వ్యక్తి. ఒకవైపున విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వం చాలా ఇష్టం. గురుభావం. మరోవైపు, శ్రీశ్రీ, కుటుంబరావు, చాసో, రావిశాస్త్రి అంటే ప్రాణమే. అసలు పురాణం స్వభావంలోనే ఒక తీవ్రత ఉంది,' అంటూ ఇంద్రగంటి శ్రీకాంత శర్మ చెప్పిన ముందుమాట లోని మర్మం అర్ధం కావాలంటే 'సీత జడ' కథ చదవాల్సిందే. ('పురాణం సుబ్రహ్మణ్య శర్మ కథలు,' నవోదయ బుక్ హౌస్ ప్రచురణ, పేజీలు 411, వెల రూ. 200, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు).

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి