శుక్రవారం, సెప్టెంబర్ 16, 2011

నా రక్తంతో నడుపుతాను రిక్షానూ..

రిక్షా ఎక్కడం అంటే భలే సరదాగా ఉండేది చిన్నప్పుడు. దర్జాగా, చాలా గొప్పగా అనిపించేది. ఏం లాభం, ఎప్పుడు పడితే అప్పుడు రిక్షా ఎక్కడానికి ఉండేది కాదు. 'చక్కగా రెండెడ్ల బండి ఇంట్లో పెట్టుకుని, రిక్షా ఎందుకూ?' అనేవాళ్ళు ఇంట్లో. దాంతో పొరుగూళ్లలో గుళ్ళకీ, ఎప్పుడన్నా సినిమాలకీ ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళడానికి బస్సెక్కడానికీ మా బండిలోనే వెళ్ళాల్సి వచ్చేది. బండికూడా సరదాగానే ఉంటుంది, రిక్షా దర్జా వేరు.

నెమ్మదిగా నాకో విషయం అర్ధమయ్యింది. ఎప్పుడన్నా మేం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు, బస్సు దిగ్గానే మా బండి కనిపించక పోతే రిక్షా బేరం చేసేది అమ్మ. "కిట్టదండమ్మా..ఆ ఊరికి రోడ్రే లేదు.. ఎంతిచ్చినా మేం రాలేం" అని నిష్కర్షగా చెప్పేసేవాళ్ళు రిక్షావాళ్ళు. కొన్నాళ్ళకి మా ఊరికి రోడ్డు లాంటిది రావడం, మా బండి వెళ్లిపోవడంతో అప్పుడప్పుడూ రిక్షా ఎక్కే అదృష్టం దొరికింది. ఇరుక్కుని, ఓ మూల కూర్చోవాల్సి వస్తేనేమి? మయూర సింహాసనం మీద కూర్చున్న షాజహాన్ కూడా అంతటి ఆనందం అనుభవించి ఉండడు.

"మీ ఊళ్ళో రిక్షాలు భలేగా ఉంటాయిరా.. ఎంచక్కా సింహాసనం మీద కూర్చున్నట్టు ఉంటుంది" అని హైదరాబాదులో ఉండే అత్తయ్యల పిల్లలు చెబుతుంటే, మా రిక్షాల ప్రత్యేకత తెలిసేది కాదు. ఓసారి హైదరాబాదు వెళ్ళినప్పుడు చూశాను కదా. అబ్బే, నేల టిక్కట్లో కూర్చుని సినిమా చూసినట్టుగా కింద కూర్చోవాలి. గూనిగా నడుం ఒంచాలేమో, బయట రోడ్డుమీద ఏం చూడడానికీ ఉండదు. అదే మా రిక్షాలైతే, కుర్చీ టిక్కట్లో కూర్చుని సినిమా చూసినట్టే. పైన టాపు కావాలంటే ఉంచుకోవచ్చు, వద్దంటే తీసేయమనొచ్చు.


రిక్షా ఇంకా గొప్పదన్న విషయం మరికొంచం పెద్దై సినిమాలు చూడ్డం అలవాటయ్యాక అర్ధమయ్యింది. డబ్బు అవసరం వస్తే చాలు, హీరోలు రాత్రుళ్ళు రిక్షాలు తొక్కి బోల్డు బోల్డు డబ్బులు సంపాదించడం చూసి, నేను కూడా పెద్దయ్యాక రాత్రిళ్ళు రిక్షా తొక్కాలని నిర్ణయించేసుకున్నాను. ఉద్యోగం కోసం ఊరు విడిచి పెట్టేటప్పుడు అమ్మ జాగ్రత్తలు చెబుతూ "డబ్బులు జాగ్రత్తగా ఖర్చుపెట్టుకో బాబూ," అని చెబితే, "అవసరమైతే రాత్రుళ్ళు రిక్షా తొక్కుతాలే అమ్మా," అని వాతావరణం తేలిక చేశాను. తర్వాతెప్పుడో అమ్మ మర్చిపోకుండా అడిగింది, "రిక్షా తొక్కుతున్నావా?" అని.

చూస్తుండగానే రిక్షాలు నెమ్మది నెమ్మదిగా అదృశ్యం అయిపోతున్నాయి. రిక్షాల స్థానంలో ఆటో రిక్షాలు చిన్న చిన్న పల్లెటూళ్ళలో కూడా కనిపిస్తున్నాయి. పట్టణాలలో అక్కడక్కడా రిక్షాలు కనిపిస్తున్నా వాటిని ఆదరించే వాళ్ళు కనిపించడం లేదు. రిక్షా కన్నా ఆటో వేగంగా వెళ్ళడం ఒక కారణం అయితే, మన బరువు మరో మనిషి మీద మోపడం ఏమిటన్న సెన్సిబిలిటీ మరో కారణం. రిక్షా నాగరీకం కాదన్న వాదన కూడా ఉంది. చివరికి స్కూలు రిక్షాల స్థానంలో కూడా స్కూల్ ఆటోలు వచ్చేశాయి.

రిక్షా మీద నాకున్న ప్రత్యేకమైన అభిమానం వల్ల అనుకుంటాను, ఆర్. నారాయణ మూర్తి 'ఒరేయ్! రిక్షా' సినిమా తీసినప్పుడు దాన్ని నావంతుగా ఆదరించాను - నేనెప్పుడూ ఏ రిక్షానీ 'ఒరేయ్' అని పిలవకపోయినా సరే. ఆ సినిమాలో నాకు బాగా నచ్చిన రెండు పాటల్లో ఒకటి "నా రక్తంతో నడుపుతాను రిక్షానూ.. నా రక్తమే నా రిక్షకు పెట్రోలూ...పెట్రోల్ ధర పెరిగిందీ...డీజిల్ ధర పెరిగిందీ.. నా రక్తం ధర ఏమో రోజు రోజు తగ్గబట్టి ..ఏయ్.. " అప్పటినుంచీ తరచూ పాడుకుంటూ ఉంటాను. మరీ ముఖ్యంగా పెట్రోల్ ధరలు పెరిగినప్పుడల్లా ఈ పాట అప్రయత్నంగా నా నోటెంట వచ్చేస్తుంది. ఇవాళ పొద్దున్నుంచీ ఇదే పాట పాడుకుంటున్నానని వేరే చెప్పక్కర్లేదు కదా.

16 కామెంట్‌లు:

  1. పెరుగుతున్న పెట్రోల్ ధరలు చూస్తుంటే.. మళ్ళీ రిక్షా రోజులు వస్తాయనిపిస్తుంది మురళి గారు...

    రిప్లయితొలగించండి
  2. భలే రాసారు మురళీ గారు
    రిక్షా fever వెర్ బ్లాగుల్లో మొదలయ్యింది :)

    చిన్నప్పుడు రిక్షా మీద సినిమాకి వెళ్ళడం :)) అన్నీ మధుర జ్ఞాపకాలు అంటే :)
    పొల్యూషన్ ఫ్రీ కాంపస్ దయవల్ల సైకిల్ రిక్షాల్లో రెండేళ్ళు గడిపేసాం :)
    వాళ్ళు మండుటెండను సైతం లెక్కచేయకుండా పడే కష్టానికి సలామ్!

    రిప్లయితొలగించండి
  3. కెవ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్వ్ నాకూ నచ్చవు ఆ హైద్రాబాద్ నేలటిక్కట్టు రిక్షాలు.పెట్రోల్ ధరతో సంబంధం లేకుండా నేను పాడుకుంటూ ఉంటా ఆ పాట.(ఇంకా కలకత్తా లో ఉన్నాయనుకుంటా ఇలాంటి రిక్షాలు కాకపోయినా లాగుడు బళ్ళు)

    రిప్లయితొలగించండి
  4. రిక్షా ఎక్కాలంటే మీరు మా విజయవాడ రావాల్సిందే.నాకు అవి పూల రధంలా అనిపిస్తాయి.

    రిప్లయితొలగించండి
  5. మొదటిసారి హైదరాబాదులో రిక్షాలు చూసినప్పుడు అసలు వాటిల్లో ఎలా కూర్చుంటారా అనుకున్నా.

    రిక్షా అంటే మా బాపట్ల చెక్క రిక్షాలే! అంటే గూడు లేని ఓపెన్ రిక్షాలన్నమాట! వాటి మీద ఎక్కి బాపట్ల పురవీధుల్లో తిరుగుతుంటే మహా సంబరంగా ఉండేది.

    రిప్లయితొలగించండి
  6. బాపట్ల చెక్కబల్ల రిక్షాలు - హహాహా ఓహో!!
    బాగుంది మీ రిక్షానుబంధం. మీకు రిక్షాతొక్కి డబ్బుసంపాయించడం ఆశయమైతే, నాకు - బేరమాడకుండా రిక్షాఅతను అడిగినంతా ఇచ్చేసి రిక్షా ఎక్కగలిగేంత డబ్బు సంపాయించాలని ఆశయంగా ఉండేది. తీరా ఆ మాత్రం సంపాయించి మళ్ళి విజయవాడ వెళ్ళే సమయానికి రిక్షాలు కనుమరుగైపోయాయి.

    రిప్లయితొలగించండి
  7. @పప్పు గారు,
    మా ఊరు ఏలూరులో రిక్షాలు ఉన్నాయి. ఎక్క దలుచుకుంటే వచ్చెయండి.

    మురళి గారు ఎప్పుడైనా రిక్షా ఎక్కాలంటే పరుగు పందెం లో గెలవాలి. ఎప్పుడూ ఎక్కాలంటే బాక్సింగ్ పోటీ నెగ్గి తీరాల్సిందే. ప్రాక్టీస్ మొదలు పెట్టండి. జయమ్ము నిశ్చయమ్ము రా ఆయాసం మనదిరా అంటూ నేపధ్య సంగీతానికి నేనున్నాను.

    రిప్లయితొలగించండి
  8. రిక్షా అంటే నాకు గుర్తొచ్చేది పడమటి సంధ్యా రాగం సినిమా. అది చూడడానికి వెళ్తూ రిక్షా లోంచి పడి(మొత్తం ఆరుగురం ఉన్నాం రిక్షాలో) కాలు విరగ్గొట్టుకున్నాను. తరువాత ఎన్నేళ్లో రిక్షా ఎక్కాలంటే భయం. ఆ భయాన్ని జయించేనాటికి ఆటోలు ఊరంతా విరివి గా తిరగడం మొదలయిపోయింది. రిక్షా టాప్ తీయించి "రాజు వెడలె రవి తేజములలరగ" అని వెళ్తూ ఉంటే ఆ అనుభూతి వేరులెండి.

    రిప్లయితొలగించండి
  9. riksha gurinichi alochisthe naaku eappudu chinnappudu telugu text book lo chadivina "RIKSHAVODU" paatham gurthukuvasthundi. rikhshavodu paathhanni " Narla Venakteswara Rao garu" vrasarani gurthu

    రిప్లయితొలగించండి
  10. ఇప్పుడు రిక్షా నడిపేవాళ్ళందరూ పెద్దవాళ్ళే ఉంటున్నారు.
    ఆ తరం వెళ్ళిపోయాకా రిక్షాలు అదృశ్యమవుతాయేమో?
    యువకులెవ్వరూ రిక్షాల జోలికి వెళ్ళడం లేదు.

    రిప్లయితొలగించండి
  11. రిక్షాలు తొక్కడం అంత సులభం కాదు. నేను అరగంట సేపు ఎండలో సైకిల్ తొక్కితేనే అలిసిపోయి పడిపోతాను. రోజంతా ఎండలో రిక్షా తొక్కాలంటే ఎంత శక్తి ఉండాలి? అంత కష్టపడినా వచ్చే డబ్బులు వాళ్ళు బతకడానికి సరిపోవు.

    రిప్లయితొలగించండి
  12. @రాజేష్ మారం: లేదండీ.. మనమే ఆ రేట్లకి అలవాటు పడిపోతాం, అంతే.. ధన్యవాదాలు.
    @హరే కృష్ణ: నిజమేనండీ.. ఎండా వానా ఉండదు వాళ్లకి.. ధన్యవాదాలు.
    @సునీత: హ..హ... సెటైర్ కాదనుకోండి :)) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  13. @శ్రీనివాస్ పప్పు: అవునండీ.. కలకత్తాలో వాళ్లకి యూనియనూ అవీ బాగా స్ట్రాంగా ఉన్నాయని చదివాను ఎక్కడో.. ధన్యవాదాలు.
    @కల్లూరి శైలబాల: మా గోదారి సైడు కూడా అలాగే ఉంటాయండీ :))..ధన్యవాదాలు.
    @సిరిసిరిమువ్వ: గోదారి వైపైతే చక్కగా కుషన్ సీటు ఉంటుందండీ.. ఆ ప్రయాణమే వేరు!!.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @కొత్తపాళీ: రిక్షా బేరం చేయడం ఒక కళ.. నాకు రాని కళ..ప్చ్.. ధన్యవాదాలండీ..
    @బులుసు సుబ్రహ్మణ్యం: ఇప్పుడు రిక్షాలు పెద్దగా కనిపించడం లేదండీ.. ఎక్కాలని అనిపించదు :(( ..ధన్యవాదాలు.
    @కొత్తావకాయ: హ..హ..హా.. మీరైతే 'రాణీ వెడలె..' అని పాడుకోవాలేమో కదండీ :))) ...ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @గోదావరి: త్రిపురనేని గోపీచంద్ అనుకుంటా 'రిక్షావోడు' అని ఒక కథానిక రాశారండీ.. ధన్యవాదాలు.
    @బోనగిరి; అవునండీ.. పోటీ బాగా పెరిగిపోయింది కదా, ఆటోల నుంచి.. ధన్యవాదాలు.
    @ప్రవీణ్ శర్మ: నిజమండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి