శనివారం, మార్చి 19, 2011

కలుపు మొక్కలు

"అంటే నా ఆత్మద్రోహమూ, మన ప్రెసిడెంటు పశుత్వమూ కలిస్తే వొక బ్రాహ్మణ కుటుంబానికి భుక్తి ఏర్పరుస్తాయన్నమాట -- కదుటండీ?" ..... "కనక బాబయ్యా, ఈ రాత్రి ప్రెసిడెంటుని తీసుకురమ్మని ఆ వూరకుక్కతో చెప్పండి.. ఒక్క దమ్మిడీ అయినా పుచ్చుకోదనిన్నీ చెప్పండి..." ...సహాయం కోరి వచ్చిన పేద బ్రాహ్మణుడి కోసం ఆత్మద్రోహానికి సిద్ధపడ్డ ఆ స్త్రీ పేరు దుగ్గిరాల శేషాచలం. రాజమహేంద్రవరం మెరకవీధిలో పేరుమోసిన వేశ్య.

సహాయం కోరి వచ్చినాయన పేరు అవధాన్లు. ఆరుగురు ఆడపిల్లల్ని, ఒక మగ పిల్లవాడినీ కన్న తండ్రి. సమస్య అతని కొడుకు ఉద్యోగం. ఎఫ్యే ఎల్టీ ప్యాసైన ఆ కుర్రాడికి స్కూలు మేష్టరు ఉద్యోగం కావాలి. ఆ ఉద్యోగం ఇచ్చేది జిల్లా బోర్డు ప్రెసిడెంటు. శేషాచలం చెబితే ప్రెసిడెంటు కాదనడని ప్రెసిడెంటు దగ్గరి గుమస్తా చెబితే ఆవిడ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళాడు అవధాన్లు. అప్పుడే పూజ ముగించుకు వచ్చిన శేషాచలం తాంబూలంతో సత్కరిస్తుంది పంతులు గారిని.

తను వచ్చిన పని చెప్పిన అవధానులుని ఆమె ఒకటే ప్రశ్న అడిగింది. "...దేవుడున్నాడా అవధానులుగారూ!" జవాబు కూడా ఆవిడే చెప్పింది.. "అదేమంటే? దేవుడు లేడు, దెయ్యాలు మాత్రం ఉన్నాయి. ధర్మం లేదు, అధర్మం అంతటా నిండిపోయివుంది. మంచి మందులోకయినా లేదు, దౌర్జన్యం మాత్రం పెరిగిపోతోంది. నీతి మాలోనే కాదు, మన దేశంలోనే లేదు. ఎవరేం చెప్పినా శుద్ధ అబద్ధం తప్ప సత్యం లేనే లేదు. ఎటు చూసినా హింస. ఎక్కడ పట్టినా రక్తం. దేవుడు లేనేలేడండీ!"

శేషాచలం కోపానికి కారణం లేకపోలేదు. ఆమె ఒక బ్రాహ్మణ ఇంట్లో పెళ్ళికి మేళం వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇందుకు కారణం. మొగ పెళ్ళివారికి ప్రెసిడెంటు చుట్టం. ఒకరాత్రి బసకి రమ్మని కబురు. ఎప్పుడూ, ఎక్కడా, ఎవరి బసకీ వెళ్ళదు శేషాచలం. మేళం వెళ్ళిన చోట బ్రహ్మచర్యం ఆచరిస్తుంది కూడా. ఈ కారణానికి "వల్లకాదని" కచ్చితంగా చెప్పేసింది. ప్రెసిడెంటు నూరు రూపాయల కాగితం మీద పడేసినా, పుల్లాకు చూసినట్టు చూసి దూరంగా వెళ్లిపోయింది.

ఇది మనసులో పెట్టుకున్న ప్రెసిడెంటు, మర్నాడు సాయంత్రం సభలో ఆమె గజ్జె కట్టి ఉండగా విప్పించి సత్రకాయ చేత కట్టించాడు. రాత్రి ఊరేగింపులో ఆమెని గజ్జె కట్టమన్నాడు. "పశుత్వం కాని, యిది పగా బాబయ్యా? సభలో నాయకురాలిని గజ్జె విప్పించిన వాడూ, ఊరేగింపులో నాయకురాలిని గజ్జె కట్టమన్న వాడూ మనిషేనా? ....తరవాత వాకబు చేసాను. మన ప్రెసిడెంటుకి రూపత్రుష్ణ తప్ప మరేమీ లేదు. ఈ కుట్ర అంతా ఆ వూరకుక్కది... నేను శిఫారసు చెయ్యడం అంటే ఏమిటో తమకిప్పుడు బోధపడిందా?"

అవధాని వచ్చిన దారినే తిరిగి వెళ్ళిపోడానికి సిద్ధపడ్డాడు. "ఇంత కుట్రా? ఇంత ద్రోహమా? తనేలాగా తార్పుడుకాడే. నన్ను కూడా తనలాగా తయారు చేస్తాడా ఈ నీచుడు? నీకూ ప్రెసిడెంటుకీ ఇదివరకే సంబంధం ఉందనీ, ప్రాధేయపడితే నువ్వు శిఫారసు చేసి పని యిప్పిస్తావనీ వచ్చాను. పైగా, నువ్వింత యోగ్యురాలివని ఎరగనే ఎరగను. నేను బ్రాహ్మణ్ణి. వేదం వల్లించాను. యాచన చేస్తూ కుటుంబ పోషణ చేసుకుంటున్నాను. ఇకముందు మరో నలుగుర్ని ఆశ్రయిస్తూ ఉంటాను కానీ, వేశ్య అయినా కులాంగన లాగా అభిజాత్యం కల వొక కళావతిని తార్చడానికి నేను సాహసించలేను. కనక తల్లీ, నన్ను క్షమించు. నాకోరిక మరిచిపో, నాకు సెలవియ్యి.."

కానీ అందుకు శేషాచలం ఒప్పుకోలేదు. తన వల్ల ఒక వేదమూర్తి కుటుంబానికి జీవనాధారం ఏర్పడడం తన అదృష్టంగా భావించింది. తన జీవితంలో దీనినేంతో పవిత్రమైన సంఘటనగా తీసుకుంది. "...ఇంతకీ నేను పతివ్రతనెలాగా కాను. మగనాలినంతకంటే గాను. కనక దీనివల్ల నాకిప్పుడు కొత్తగా సంభవించే పాతిత్యం కూడా ఏమీ లేదు. నాకు విచారం లేదు. తమరూ విచారించ వద్దు.."

అంతటితో ఆగలేదు శేషాచలం. "...ఇక నేను వినను. తమరేమీ సెలవివ్వద్దు. ఇది ఇలా జరిగి తీరవలసిందే. మనవి చేసుకున్నాను కాదూ? పశువులతో సాహచర్యం మాకు పరిపాటే. బాబయ్యా, తమరు బెంగ పెట్టుకోవద్దు. ఇందాకా నేను చెప్పిన మాట ఆ వూరకుక్కతో చెప్పండి. మరోలాగా చేశారంటే, నేర్చిన వేదానికి తమరు ద్రోహం చేసినవారవుతారు.ఎప్పుడేనా దర్శనం దయచేయిస్తూ ఉందండి. అమ్మగారికి నా దండాలు మనవి చెయ్యండి."

ఏం మాట్లాడాలో తెలియని అవధాని "వేశ్యా కులంలో తప్ప పుట్టావమ్మా.." అంటూ ఆమె యోగ్యతని మెచ్చుకుంటే, "ఏం, వేశ్యాకులం అంత చెడిపోయిందా బాబయ్యా? అగ్రజాతి గృహిణులందరూ మచ్చ లేనివారేనా నాయనగారూ? మాలో నన్ను తల తన్నే ఇల్లాళ్ళు -- సానులయి ఉండిన్నీ పాతివ్రత్యానికి వరవడి పెట్టేవారు వేలున్నారు. కాని లోకం గుడ్డిది, పురుషులు మత్తులు.. ఇప్పుడిదంతా అప్రస్తుత ప్రశంస. దయచెయ్యండి. ఒక్కమాటు పాదాలు..." అంటూ నమస్కారం చేసుకుంది.

తర్వాత కథ ఏమయ్యింది? అవధానులు గారబ్బాయికి ఉద్యోగం దొరికిందా? శేషాచలం త్యాగం ఎవరికి ఎక్కువ ఉపయోగపడింది? సమాజంలో కలుపు మొక్కలు ఎవరు? ఇత్యాది ప్రశ్నలన్నింటికీ సమాధానమే ఏడు దశాబ్దాలకు పూర్వం శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి రాసిన కథ 'కలుపు మొక్కలు.' శాస్త్రి గారి కథల్లో నేను మొదట చదివిన కథ. ఈ ఒక్క కథతోనే ఆయన నా అభిమాన కథారచయితల జాబితాలో చేరిపోయారనడం అతిశయోక్తి కాదు. గురజాడ వారి 'మధురవాణి' స్ఫూర్తి, ప్రభావమూ శేషాచలం మీద ఉన్నాయనడం నిర్వివాదం. తెలుగు కథా సాహిత్యాన్ని ఇష్టపడే వారంతా తప్పక చదవాల్సిన కథ.

18 కామెంట్‌లు:

  1. మంచి కధ పరిచయం చేసారు.ఈ మధ్య రాయడం గణనీయంగా తగ్గించివేసారు?

    రిప్లయితొలగించండి
  2. చిన్నప్పుడు చదివాను. ఇది చదివిన తరువాత మళ్ళీ లీలగా గుర్తుకు వచ్చింది. వెతికి మళ్ళీ చదవాలి. మంచి కధ గుర్తు చేసినందుకు థాంక్యూ.

    రిప్లయితొలగించండి
  3. బావుంది .

    మొన్న ఎవరిదో వ్యాఖ్య చూసాను. గాంధీ లాటి వాళ్ళందరూ ఒకే సారి ఎందుకు పుట్టారు. దశాబ్దానికి ఒకళ్ళు పుట్టి ఉండవచ్చు కదా అని.

    ఇది మన తెలుగు రచయితలకు కూడా వర్తిసుందేమో అనిపించింది నాకు తెలిసినపాటిలో

    ఇంత ప్రగతి శీల (Progressive) భావాలు ఉన్న కథలు ఎప్పుడో ౫౦ ఏళ్ళ కిందట రాయడం ఆశ్చర్యంగా ఉంటుంది. చాలా కథలు ఇప్పటి సమాజానికి కూడా వర్తిస్తాయి అనిపిస్తుంది శాస్త్రి గారివి. మరి వాళ్ళు అప్పుడే అంత స్వాప్నికులా లేక మనం పెద్దగా ముందు కెళ్ల లేదో తెలియదు మరి

    రిప్లయితొలగించండి
  4. మురళి గారూ, మంచి కధను పరిచయం చేశారండీ. శాస్త్రి గారి కధలు అన్నీ కలిసి ఏదైనా పుస్తకంగా వచ్చాయా? ప్రచురణ కర్తల వివరాలు దయచేసి తెలుపగలరు.

    రిప్లయితొలగించండి
  5. మొదటి సారి మీ బ్లాగ్ కి వచ్చాను. మంచి టపా చదివాను.

    రిప్లయితొలగించండి
  6. చాలా ఆసక్తికరంగా వుందీ కధా పరిచయం. చాలా గాప్ తీసుకున్నారు ఈసారి టపా కి..

    రిప్లయితొలగించండి
  7. మురళి గారు మంచి మంచి కథలు పరిచయం చేస్తున్నారు. కాని మీరు మరీ ఆలస్యం చేస్తున్నారు. అది మాత్రం బాగాలేదు. మీరు ఇంతింత గ్యాప్ లు తీసుకోటానికి మేము ఒప్పుకోము. అంతే.

    రిప్లయితొలగించండి
  8. వైద్య భూషణ్ గారూ,

    శ్రీపాద వారి పుస్తకాలను మార్గదర్శి, కలుపుమొక్కలు, వడ్లగింజలు, నిలువు చెంబు,పుల్లంపేట జరీచీర అని ప్రగతి పుబ్లిషర్స్ వారు అయిదు సంపుటాలుగా ముద్రించారు. ఈ అయిదూ విజయవాడ నవోదయ వారి దగ్గర దొరుకుతున్నాయి. అభోవిజో లో కూడా దొరుకుతాయి.

    రిప్లయితొలగించండి
  9. @సునీత: రాయడమే కాదండీ.. బ్లాగులు చదవడం కూడా బాగా తగ్గింది. కొన్ని వ్యక్తిగత కారణాలు.. ఇదిగో, మళ్ళీ వచ్చే ప్రయత్నంలో ఉన్నాను.. ధన్యవాదాలు.
    @బులుసు సుబ్రహ్మణ్యం: శ్రీపాద వారి కథలన్నీ మళ్ళీ మళ్ళీ చదవాలనిపించేవేనండీ .. తప్పక చదవండి.. ధన్యవాదాలు.
    @వాసు: శ్రీపాద వారికి దూరదృష్టి హెచ్చు అనిపించక మానదండీ, ఆయన కథలు చదువుతుంటే.. మొత్తం సెట్ తీసుకున్నారా? నాకు 'అనుభవాలు, జ్ఞాపకాలూను' దొరకడం లేదు.. కొత్త ప్రింట్ కి టైం పట్టేలా ఉంది.. దేనికైనా టైం రావాలేమోనండీ :-) .. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  10. @లక్ష్మీనారాయణ సునీల్ వైద్యభూషణ: ప్రచురణ కర్తల వివరాలు వాసు గారు ఇచ్చారు చూడండి.. ధన్యవాదాలు.

    @హితుడు: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  11. @ప్రణీత స్వాతి: పూర్తిగా వ్యావహారికంలోనే ఉందండీ.. ప్రయత్నించండి.. ధన్యవాదాలు.

    @జయ: కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈమధ్యన కొంచం గ్యాప్ వచ్చిందండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  12. బావుందండీ కథా పరిచయం. మళ్ళీ పుస్తకం బయటికి తీసి చదివించారు నాచేత. నా దగ్గర 5 పుస్తకాల సెట్ ఉంది. "అనుభవాలు - జ్ఞాపకాలు" ఎప్పటినుండొ కొనాల్సిన లిస్ట్లో ఉన్నా కూడ కుదరటంలేదు ఏంటో.

    కొన్ని కథలు చదువుతుంటే, నిజంగానే ఆయన అంత ముందుచూపుతో ఆరోజుల్లేనే ఎలా ఆలొచించారా అనిపిస్తుంది. ఉదా: మార్గదర్శి అన్నపూర్ణ, కర్రసాము పోటీలు ఉన్న కథ, పేరు మర్చిపోయాను.)
    మీరిలాగే బాగా చదువుతూ మాకు కూడ చెప్తూ ఉండండీ. మేము మళ్ళీ ఇంకోసారి చదువుకుంటూ ఉంటాము.

    రిప్లయితొలగించండి
  13. @పద్మవల్లి: 'అనుభవాలు-జ్ఞాపకాలూను' ప్రస్తుతం ప్రింట్ లో లేదండీ.. విశాలాంధ్ర వాళ్ళు త్వరలో తెస్తారుట.. నేను కూడా ఎదురు చూస్తున్నా పుస్తకం కోసం. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. వెంకట్.సరయు: స్వాగతం అండీ.. ఇప్పుడే చూశాను మీ వ్యాఖ్య.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. Murali Garu..mee review chala bavundi..Subrahmanya Sastri gari katha "Arikalla Kinda Mantalu" chadivanu. Adi kuda Kaburlu.com ane blog lo..chala bavundi..meeru ippatike chidi vunraru..here's the link:

    http://www.kaburlu.com/welcome.php?page=katha/index.html

    రిప్లయితొలగించండి
  16. Alage..inko aNi mutyam lanti katha.."Enduku Paarestanu Nanna". Chaso garidi...adi kuda meeru chadivi post okati rayalani manavi:

    http://www.kaburlu.com/welcome.php?page=katha/index.html

    Pavan Kanakagiri

    రిప్లయితొలగించండి
  17. @పవన్: తప్పకుండానండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి