ఆదివారం, మే 23, 2010

సినీరంగ శ్రీనాధుడు

"వేటూరి సినీ రంగ శ్రీనాధుడు .." సినిమాని ప్రేమించే ఒక మిత్రుడితో ఉదయాన్నే జరిగిన సంభాషణలో అతని నోటి నుంచి వచ్చిన వాక్యం ఇది. రోజంతా నన్ను వెంటాడుతూనే ఉంది. పేపర్లలో వేటూరి గురించి చదువుతున్నప్పుడు, టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడూ, ఇంకా ఏ పని చేస్తున్నా మళ్ళీ మళ్ళీ గుర్తొచ్చింది. దీనితో పాటే "వినువీధి నెదురెండ పొగడ దండ.." కూడా.

నిజమే.. వేటూరికీ శ్రీనాధుడికీ పోలికలు లేకపోలేదు. తమ కలాల ద్వారా నవరసాలనీ అలవోకగా పలికించడం ఇద్దరికీ వెన్నతో పెట్టిన విద్య. వారి వారి కాల మాన పరిస్థితులకి అనుగుణంగా రచనలు చేశారు ఇద్దరూ. తమ కావ్య కన్నియలకి పట్టాభిషేకం జరుగుతుండగా చూసి పులకించిపోయిన వాళ్ళే ఇద్దరూ. తమ తమ రంగాలలో తిరుగులేని స్థానం ఇద్దరిదీ. అంతేనా? ఎవరికీ తలవంచని స్వభావంలోనూ పోలిక ఉంది.

తను రాసిన ఎన్నో పాటల్లో వైరాగ్యాన్నీ, వేదాంతాన్నీ పలికించిన వేటూరి చివరి రోజుల వరకూ భోగ జీవితాన్నే గడిపారు. ఎలా సంపాదించారో అలాగే ఖర్చు పెట్టారు. లేకపొతే, మూడున్నర దశాబ్దాల పాటు సిని గేయ రచయితగా తిరుగులేని స్థానంలో ఉన్న వ్యక్తికి ఫిలింనగర్ లో సొంత ఇంటిని సమకూర్చుకోవడం అన్నది తీరని కోరికగా మిగిలిపోవడం ఎలా సాధ్య పడుతుంది?

ఆరోగ్యం మీద వేటూరికి మొదటి నుంచీ ఆశ్రద్దే అనిపించక మానదు, ఆయన జీవితాన్ని పరిశీలించినప్పుడు. ఎన్నో పాటలని ఆయన హాస్పిటల్ బెడ్ మీద నుంచే రాశారు. వేటూరితో పాటుగా తెలుగు సినిమాకి కూడా ఎంతగానో పేరు తెచ్చిన 'శంకరాభరణం' సినిమా ముగింపులో వచ్చే 'దొరకునా ఇటువంటి సేవ..' పాటని హాస్పిటల్ లోనే రాశారు వేటూరి. నిజానికి ఆయన పాటని డిక్టేట్ చేస్తుంటే, ఆ సినిమాకి దర్శకత్వ శాఖలో పనిచేసిన వంశీ డిక్టేషన్ తీసుకున్నారు.


చాలామంది గీత రచయితలతో పోల్చినప్పుడు, పాటని అతి తక్కువ సమయంలో రాస్తారన్న పేరుంది వేటూరికి. దర్శకుడు టి. కృష్ణ సన్నివేశం చెప్పగానే 'ప్రతిఘటన' సినిమాలో 'ఈ దుర్యోధన దుశ్శాసన..' పాటని పావు గంటలో రాశారు వేటూరి. నిజానికి ఆ సన్నివేశంలో డైలాగుల కన్నా పాట ఉంటే బాగుంటుందన్న సూచన ఆయన చేసిందే. భాష మీద పట్టు తో పాటు, స్వరజ్ఞానం ఆయనకున్న వరం.

ఎలాంటి పాటనైనా రాయగలగడం వేటూరికి ఉన్న అనేక ప్రత్యేకతల్లో ఒకటి. తను రాసిన పాటల్లో మాటలు రికార్డింగ్ సమయంలో మారిపోయినప్పుడు మౌనంగా ఉండిపోకుండా, ఆ విషయాన్ని సూటిగా ప్రకటించారు ఆయన. నిర్మాణ సంస్థ ఎంత పెద్దదైనా, హీరో, దర్శకుడు తనకి ఎంత దగ్గర వారైనా మాటల మార్పు విషయంలో రాజీ పడలేదాయన. ఈ ముక్కుసూటిదనం ఆత్మవిశ్వాసం నుంచి వచ్చిందేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

జీవితపు చరమాంకం విషయంలో శ్రీనాధుడి కన్నా వేటూరి అదృష్టవంతులనే చెప్పాలి. తనకి దక్కాల్సిన గౌరవం దక్కకపోవడం, లేదా ఆలస్యంగా దక్కడం జరిగిందేమో తప్ప అవమానం ఎదుర్కోవాల్సిన పరిస్థితి రాలేదు. అలాగే పాటలు రాయడం మొదలు పెట్టింది మొదలు, జీవితపు చివరి క్షణాల వరకూ యేరోజూ పాటకి దూరంగా ఉండలేదాయన. సాహిత్యంలో శ్రీనాధుడి లాగే, సిని సాహిత్యంలో వేటూరి ఒకేఒక్కడు.

23 కామెంట్‌లు:

  1. నేను పొద్దున్నే హారం చూస్తూ మీ టపా కోసమే వెతికాను..తప్పకుండా మీరు వేటూరి గురించి ఓ టపా రాసే ఉంటారన్న నమ్మకంతో...
    వేటూరి స్థానం తర్వాత కాలంలో ఇంకెవరూ భర్తీ చేయలేరంటే అతిశయోక్తికాదేమో...
    కొంచెం క్లుప్తంగా టపా ముగించేశారేమో అని అనిపించిందండి.

    రిప్లయితొలగించండి
  2. ఆయనకి దక్కాల్సిన దక్కలేదేమో అనిపిస్తుంది నాకు. ఆయన తెలుగు వారవడం మన అదృష్టం. వేరే భాష లో ఇలాంటి కవికి ఇంకా గౌరవం దక్కేదేమో. తెలుగుకు ప్రాచీన భాష హోదా ఇవ్వకపోతే తన జాతెయ పురస్కారాన్నే తిరస్కరించడానికి సిద్ధపడిన వేటూరి కి తెలుగు వారు కనీసం ఒక పద్మ అవార్డు కూడా తెచ్చుకోలేక పోవడం సిగ్గుచేటు.

    రిప్లయితొలగించండి
  3. "అలలు కదిలినా పాటే
    ఆకు మెదిలినా పాటే
    కలలు చెదిరినా పాటే
    కలత చెందినా పాటే
    ఏ పాట నే పాడనూ..."

    మొన్నరాత్రి టీవీలో ఈ వార్త చూసిన దగ్గర్నుంచీ..ఏ పాట గొప్పదని రాయాలో, ఏ పాటను వర్ణించాలో అర్ధంకాక టపా రాయలేక ఊరుకుండిపోయానండి....

    పైన కోట్ చేసిన సీతామహాలక్ష్మి లోని పాట ఎవరైనా వినాలనుకుంటే ఈ లింక్లో వినచ్చు.
    http://old.musicindiaonline.com/p/x/qyv_g512Dd.As1NMvHdW/?done_detect

    రిప్లయితొలగించండి
  4. బాగా పోల్చారు. జీవితపు చివరిక్షణాలవరకూ పాటతో మమేకమవడం కాక ఈ వయసులో కూడా అంతే అందమైన పాటలు రాసిన ఆయన మరికొన్నేళ్ళు ఉండి ఉంటే బాగుండేదని ఆశపడని తెలుగు వారు ఉండరేమో...

    రిప్లయితొలగించండి
  5. కృష్ణా తరంగాల సారంగాలు, వెన్నెల్లో గోదారి అందం తన పాటల్లో ఎంతో మధురంగా మలచిన ఆ కమ్మని పాటల సృష్ఠికర్త, మౌనమై మెరిసి....గానమై పిలిచి...గగనానికి తరలి పోయిన మహోన్నతమైన ఈ మేధోసంపద ఇంక మనకు దక్కదంటే..అబద్ధమనే అనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  6. మురళి గారు !వేటూరి గారి మరణం తో తెలుగు తల్లి మరో ముద్దు బిడ్డ ని కోల్పోయింది .

    రిప్లయితొలగించండి
  7. ఆయన పాదరసం లాంటి వాడు, ఏ పాత్రలో పోస్తే ఆ రూపు దాల్చినట్టు నిర్మాత దర్శకుడు ఎలా ఉపయోగించుకుంటే అలా చిలికించాడు కిలికించితాలు.ఏది ఏమయినా సినిమా రంగం ఒక గొప్ప సాహితీ కుసుమాన్ని కోల్పోయింది.మనం కూడ ఒక మహామహుడ్ని కోల్పోయాము.ఆయన లేని లోటు కొంత వరకూ ఏ ఒకరిద్దరో కొంతవరకూ తీర్చగలరేమో కాని పూర్తిగా న్యాయం చెయ్యలేరు అన్నది నిర్వివాదాశం.

    రిప్లయితొలగించండి
  8. చక్కటి విషయాలు చెప్పేరు. మంచి పోలిక. గొప్ప కవి గారికి ఇంకో సారి ఆశ్రునివాళి.

    రిప్లయితొలగించండి
  9. టైటిలు చాలా బాగుంది మురళిగారు.
    నిజమే. ఇట్లాంటీ మహానుభావులెవరైనా .. తెలుగు వాళ్ళుగా పుట్టడం మన అదృష్టం, వాళ్ళ దౌర్భాగ్యం.

    రిప్లయితొలగించండి
  10. nijangane,veturigari sthanaani evvaru barthi cheyyaleru....naaku chaala badavesindi.
    adento! goppa vallandaru krishna gilla valle,gamanincheraa?

    రిప్లయితొలగించండి
  11. వేటూరి గారిని కపిల్ దేవ్ తో కూడా పోల్చవచ్చు.
    ఇద్దరూ ఆల్ రౌండర్లే.

    తెలుగు సినిమా పాట ఉన్నంతవరకు వేటూరి గారి పేరు వినపడుతూనే ఉంటుంది.
    ఆయనకు అంతకంటే గౌరవం ఇంకేం కావాలి?

    రిప్లయితొలగించండి
  12. ఈ పాటల తోటమాలికి దక్కాల్సిన గౌరవము దక్కలేదు. మన రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపలేదు. పద్మ అవార్డ్స్ కి ఈయనకంటే అర్హుడిని చూపించండి. ఏమి చేస్తాం. తెలుగు పాట ఉన్నంత వరుకు వేటూరి తెలుగు ప్రజల మనస్సులో వుంటారు.

    రిప్లయితొలగించండి
  13. మురళి గారూ...,

    నమస్కారం. క్రొత్తగా నేను హారం ప్రచార బాధ్యతను తీసుకున్నాను. కాబట్టి హారం గురించి
    ఓ నాలుగు మాటలు చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను. హారం ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. హారం ప్రతి ఐదారు
    నిమిషాలకు మీ బ్లాగునుంచి టపాలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,
    మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం. హారంలో వ్యాస రచయితల పేర్లు, వ్యాఖ్యాతల పేర్ల పైన క్లిక్ చేసి సులభంగా వారి వారి వ్యాసాలను,వ్యాఖ్యలను చూసికొనే వీలుంది.

    తాజా టపాలనే కాక బ్లాగుల్లో లభ్యమయ్యే జ్ఞానాన్ని వివిధవర్గాలగా క్రోడీకరించి, గత నాలుగు సంవత్సరాలుగా
    తెలుగు తల్లి నోటినుంచి రాలిన ముత్యాలను గుదుగుచ్చి మీ ముందుంచుతుంది. ఈ ప్రయత్నంలో
    హారం ప్రస్తుతానికి ఆధ్యాత్మికం, పద్య సాహిత్యం, సాంకేతికం, హాస్యం, పాటలు,సినిమాలు, బొమ్మలు,సంగీతం, కవితలు, బాలసాహిత్యం, వంటలు మొదలైన వర్గాలుగా క్రోడీకరించి చూపిస్తుంది. .

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో హారం లింకు ను వుంచి ప్రోత్సహించండి. హారం లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు. అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి . టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.

    - హారం ప్రచారకులు.

    రిప్లయితొలగించండి
  14. మురళిగారూ ! వేటూరిగారి గురించి మీరు రాసినదాన్ని బట్టి చూస్తె పోలిక సరైనదే అనిపిస్తుంది . ఆయనకు సొంత ఇల్లు లేదంటే ఆశ్చర్యమే మరి ! ఆయన పాటలున్నంతకాలం ఆయన జీవించే ఉంటారు ...మహాకవికి నివాళులు !

    రిప్లయితొలగించండి
  15. మురళి గారు ఏమైపోయారండి. అరోగ్యం అస్సలు బాగోలేదా, లేక ఏదైనా చాలా ఎక్కువ బిజీగా ఉన్నారా? 'కనిపించుటలేదు ' అని ప్రకటన ఇవ్వాల్సిన టైం వచ్చినట్లుంది:)

    రిప్లయితొలగించండి
  16. Murali Garu,
    Mee meeda naaku chala kopam vastunnadi.
    Prathi roju mee blog open chestanu.
    Kani kotha posts emi kanipinchadam ledu.
    Regular ga post chestaru ani aasisthu....

    Krupakar Reddy

    రిప్లయితొలగించండి
  17. మురళి గారు ఇదేం బాగా లేదు. నెమలి వన్నెలు లేక చిన్నబోతున్నాము.

    రిప్లయితొలగించండి
  18. @శేఖర్ పెద్దగోపు: వేటూరి గురించి యెంత చెప్పినా తక్కువే అవుతుంది కదండీ.. ధన్యవాదాలు.
    @వాసు: అవార్డులు వచ్చిన కొందరి గురించి జనానికి తెలీదు.. ఆయన పాటకి మెచ్చి జనం కట్టిన పట్టం కన్నా అవార్డులు గొప్పవి కావు అని సరిపెట్టుకోవాలండీ.. ధన్యవాదాలు.
    @తృష్ణ: లంకె ఇచ్చినందుకు ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  19. @వేణూ శ్రీకాంత్: నిజమేనండీ.. కానీ, కాలం చాలా క్రూరమైనది... వ్యాఖ్యకి ధన్యవాదాలు.
    @జయ: యెంత చక్కగా చెప్పారండీ.. ఆయన ఆనిముత్యాలని మరోసారి గుర్తు చేశారు.. ధన్యవాదాలు.
    @తువ్వాయి: నిజమండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  20. @శ్రీనివాస్ పప్పు: పాదరసం.. చక్కని పోలిక అండీ.. ధన్యవాదాలు.
    @భావన: ధన్యవాదాలండీ..
    @కొత్తపాళీ: ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  21. @సవ్వడి: ధన్యవాదాలండీ..
    @అనఘ: అవునండీ.. కృష్ణా జిల్లాలో పుట్టిన చాలామంది గొప్పవాళ్ళు అయ్యారు.. ధన్యవాదాలు.
    @బోనగిరి: కపిల్ నే వేటూరి తో పోల్చాలేమోనండీ.. వేటూరి కన్నా చిన్న కదా.. ధన్యవాదాలండీ..

    రిప్లయితొలగించండి
  22. @Anjaas: ధన్యవాదాలండీ..
    @హారం ప్రచారకులు: అభినందనలండీ..
    @పరిమళం: ధన్యవాదాలండీ..
    @జయ, కృపాకర్: ఏం చెప్పాలో అర్ధం కావడం లేదండీ.. నామీద నాకు కోపం వచ్చే సందర్భం ఇది.. మీ అభిమానానికి వేవేల ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి