గురువారం, మే 06, 2010

సరిగమలు

పచ్చని కోనసీమలో గోదారి ఒడ్డున ఓ అందమైన పల్లెటూరు. ఊరి నడిబొడ్డున ఠీవిగా నిలబడ్డ దివాణం. ఆ దివాణంలో ఇల్లాలు సత్యవతమ్మ గారు. ఆవిడ ఏకైక కొడుకు కిట్టప్పకి పుట్టెడు అనారోగ్యం. అతను మొండివాడు, మూర్ఖుడు. అతనికి ఉన్న ఒకే ఒక్క బలహీనత తన స్నేహితుడు కాళిదాసు. కిట్టప్ప, కాళిదాసు ఒకరికోసం మరొకరు ఏం చేయడానికైనా సిద్ధమే. సత్యవతమ్మగారి బంధువుల అమ్మాయి జ్యోతి, తండ్రిని కోల్పోయి తల్లితో కలిసి దివాణం పంచన చేరింది.

సత్యవతమ్మ తీసుకున్న ఒక నిర్ణయం కిట్టప్ప, కాళిదాసు, జ్యోతిల జీవితాలని ఎలాంటి మలుపు తిప్పిందన్నదే క్రాంతికుమార్ దర్శకత్వంలో వచ్చిన 'సరిగమలు' సినిమా కథ. మలయాళంలో విజయవంతమైన 'సర్గం' సినిమాకి తెలుగు రీమేక్ అయిన ఈ సినిమాకి ప్రముఖ దర్శకుడు కే. రాఘవేంద్ర రావు, నిర్మాత సి. అశ్వని దత్ లు సమర్పకులుగా వ్యవహరించారు.

ఊళ్ళో సంగీతం పాఠాలు చెప్పుకునే విశ్వనాథం మేష్టారి (జే.వి. సోమయాజులు) కొడుకు కాళిదాసు (వినీత్). పేరుకి విశ్వనాథంగారి అబ్బాయైనా కాళిదాసు భోజనం, బసా అంతా దివాణంలోనే. తల్లి లేని కాళిదాసుని కన్నతల్లిలా ఆదరిస్తుంది సత్యవతమ్మ (భారతి). ఇక కిట్టప్పకైతే (మళయాళ నటుడు మనోజ్ కే.జయన్) కాళిదాసు సొంత తమ్ముడే. చదువు వంటబట్టని కిట్టప్ప ఊరిమీద బలాదూర్ తిరుగుతుంటే, అతని వెంటే ఉంటూ సిగరెట్లు, కిళ్ళీలు అందిస్తూ అతను మూర్చ వచ్చి పడిపోయినప్పుడల్లా చేతిలో తాళాలగుత్తి ఉంచి రక్షిస్తూ ఉంటాడు కాళిదాసు.

దివాణం ఆదరణతో జీవితం గడుపుతున్న జ్యోతి (ఓ ద్వందార్ధపు డైలాగుల హాస్య చిత్రంతో 'రంభ' గా తెలుగు తెరకి పరిచయమైన విజయవాడమ్మాయి విజయలక్ష్మి) విశ్వనాథం గారి దగ్గర సంగీతం నేర్చుకుంటూ, కిట్టప్పని ద్వేషిస్తూ, కాళిదాసుని మూగగా ఆరాధిస్తూ ఉంటుంది. వయసుతో పాటే అనారోగ్యమూ, మొండితనమూ మూర్ఖత్వమూ కూడా పెరుగుతాయి కిట్టప్పకి. చదువు సంధ్యలు లేకుండా కొడుకు చెడిపోతున్నాడన్న బాధ విశ్వనాథం గారిది. సంగీతం నేర్చుకుంటానన్న కాళిదాసుని చదువు మీద దృష్టి పెట్టమంటాడాయన.

జ్యోతి తనని హేళన చేయడంతో అవమాన పడ్డ కాళిదాసు కేవలం ఆరునెలల్లో శాస్త్రీయ సంగీతం క్షుణ్ణంగా నేర్చుకుని కచేరీలిచ్చే స్థాయికి ఎదిగిపోతాడు. కాళిదాసు-జ్యోతి ల ప్రేమ పాకాన పడుతుంది. మరో పక్క కిట్టప్ప ఆరోగ్యం క్షీణిస్తూ ఉండడంతో, అతనికి పెళ్లి చేయడమే సరైన చికిత్స అని చెప్పేస్తాడు ఆయుర్వేద వైద్యుడు (అతిధి పాత్రలో అల్లు రామలింగయ్య). కిట్టప్ప సంగతి తెలిసిన ఏ పిల్లా అతన్ని పెళ్లి చేసుకోదని తెలుసు సత్యవతమ్మకి. అందుకే దిక్కు లేని జ్యోతిని కొడుక్కిచ్చి పెళ్లి చేయాలని అనుకుంటుంది. కొడుకు 'లాంటి' కాళిదాసుని ఆమె ఎలా అడ్డు తొలగించుకుంది? అనంతర పరిణామాలు ఏమిటి? అన్నది మిగిలిన కథ.

పేరుకి తగ్గట్టుగానే చక్కని సంగీతం ఉంది ఈ సినిమాలో. బోంబే రవి సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాలోని 'స్వర రాగ గంగా ప్రవాహమే' అన్న పాట ఒక ఆణిముత్యం. జేసుదాస్ గొంతులో వినిపించే ఆర్తి ఈ పాటని మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా చేస్తుంది. "మట్టింటి రాయే మాణిక్యమైపోయె సంగీద రత్నాకరాన" అనే పంక్తి ఉచ్చారణలో కించిత్ శ్రద్ధ తీసుకుంటే బాగుండేది కదా అనిపిస్తుంది. జేసుదాస్ మరోపాట 'కృష్ణ కృపా సాగరం..' కూడా మళ్ళీ మళ్ళీ వినే పాట.

చిత్ర పాడిన 'సరిగమలాపవయా..' వింటుంటే పాత హిందీ పాటల బాణీలు గుర్తొస్తాయి. బాలు-చిత్ర ల 'గోదావరి పయ్యెద..' యుగళ గీతం చిత్రీకరణతో పాటు, మధ్యలో వచ్చే హమ్మింగ్ కూడా భలేగా ఉంటుంది. 'సంగీతమే..' శాస్త్రీయ బాణీ. పదహారేళ్ళ క్రితం విడుదలైన ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ సంగీత ప్రియుల ఇళ్ళలో వినిపిస్తూనే ఉంటాయి. మలయాళంలో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ సినిమా తెలుగులో అంత బాగా ఆడకపోడానికి కారణం 'నేటివిటీ' లోపించడమే అనిపిస్తుంది.

అప్పటికే 'సీతారామయ్యగారి మనవరాలు' లాంటి అచ్చ తెలుగు సినిమాలు ఇచ్చిన క్రాంతికుమార్, మళయాళ సినిమాని తెనిగించడంలో తడబడ్డారనే భావన కలుగక మానదు. ఫ్లాష్ బ్యాక్ నేరేషన్ తో సాగే కథనం, అనారోగ్యంతో ఉన్న సత్యవతమ్మని చూడడానికి సంగీత విద్వాంసుడు కాళిదాసు కారులో రావడంతో మొదలవుతుంది. వినీత్ నటనలో తడబాట్లు, జేవీ సోమయాజులు పాత్రకి బలం లోపించడం, అప్పటివరకూ కూనిరాగం కూడా తీయని కాళిదాసు కేవలం ఆరునెలల్లో శాస్త్రీయ సంగీత కచేరీలు ఇవ్వడం లాంటి లోపాలని సవరించుకుంటే చాలా చక్కని సినిమా అయ్యి ఉండేది.

మనోజ్ కే జయన్ బాగా నటించినప్పటికీ అతని పాత్ర తీరుతెన్నుల్లో లోపాలు కోకొల్లలు. ఆశ్చర్య కరమైన విషయం ఏమిటంటే రంభ ఈ సినిమా రెండో సగంలో చక్కని నటనని ప్రదర్శించడం. ఇంతటి అవకాశం ఆ తర్వాత ఏ సినిమాలోనూ ఈ అమ్మాయికి దొరకలేదనే చెప్పాలి. మళయాళ మాతృకలో తను నటించిన పాత్రే కావడం ఈమెకి కలిసొచ్చిన అంశం. స్క్రిప్ట్, నేటివిటీ, నటీనటుల నటన లో లోపాలు ఉన్నప్పటికీ కేవలం పాటల కోసం (నాకైతే లోకేషన్ల కోసం కూడా) చూడాలనిపించే సినిమా ఈ 'సరిగమలు.'

10 వ్యాఖ్యలు:

 1. మీ రివ్యూ బావుంది
  కొత్త సినిమా నా ఇది :(

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మంచి సినిమా గురించిన పరిచయం మురళి గారు. నాకైతే ఈ సినిమాలో పెద్దగా లోపాలేమీ కనిపించవు. చూస్తున్నంతసేపూ ఆస్వాదిస్తూ ఉండిపోతానంతే. మరీ ముఖ్యంగా పాటలు. "స్వరరాగ గంగా ప్రవాహమే" జేసుదాసు గొంతులో వింటుంటే అదో అధ్భుతం. "గోదావరీ పయ్యెద, క్రిష్ణమ్మ నా వాల్జడ" అందమైన అచ్చ తెలుగు పాట.ఈ పాటని చిత్రీకరించిన తీరు కూడా చాలా బాగుంటుంది. కోనసీమ, గోదావరి, లంగావోణీల్లో ఆ అమ్మాయి, వినీత్ డాన్స్ చూడడానికి ఎంత బాగుంటుందో.
  రంభ నటిగా కనిపించేది ఈ ఒక్క సినిమాలోనే. ఆమెలోని నటిని దాచేసి కేవలం గ్లామర్ డాల్ గా మిగిలిపోయింది అనిపిస్తుంది ఈ సినిమాలో ఆమె నటనని చూస్తే.
  చాలా రాసేసినట్టున్నానండీ. నాకిష్టమైనవాటి గురించి రాస్తే అంతే మరి. :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. ఇంత మంచి సినిమా అని నాకు తెలీదండీ.ప్రేమదేశం తరువాత వచ్చింది కదూ ఈ సినిమా..సినిమా సంగతి ఎలా ఉన్నా మీ వర్ణన మాత్రం అద్భుతం.సినిమా చూసి మీకు మళ్ళీ చెప్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మంచి సినిమా గురించి పరిచయం చేశారు :-) పాటలు తెగ వినడమే కానీ సినిమా గురించి పెద్దగా తెలీదు :-) ఇప్పటి వరకు ఇది రీమేక్ అనుకోలేదు డబ్బింగ్ సినిమా అనుకుంటున్నాను.

  నిజమే "సంగీదరత్నాకరం" విన్న ప్రతిసారి పంటి కింద రాయిలా తగుల్తూనే ఉంటుంది. జేసుదాస్ గారి కచేరికి వెళ్ళే అదృష్టం ఓ సారి కలిగింది కానీ అందులోని తెలుగు పాటల్లోని భాషా దోషాల వల్ల ఆయన పాడిన మళయాళీ పాటలే ఎక్కువ ఎంజాయ్ చేశాను :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ఈ టపాకు సంబంధం లేకపోయినా ఒక చిన్న విషయం.మీరు ఇన్ని పుస్తకాలు పరిచయం చేస్తున్నారు.మరి చారిత్రిక నవలలు ఏమీ పరిచయం చెయ్యరా.అడవి బాపిరాజు గారి"గోన గన్నారెడ్డి",నోరి నరసిం హ శాస్త్రి గారి"మల్లా రెడ్డి","ధూర్జటి" చాలా అద్భుతం గా ఉంటాయి.ఇవి మీ పరిచయం చేస్తే చదవాలనిపిస్తోంది(అవి ఇంతకు ముందే చదివా కాని మీ పరిచయం చదవాలని.అంతే)ఇప్పుడు దొరకట్లెదేమో గానీ నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్లు "చిక్క వీర రాజేంద్ర" అని ఒక అద్భుతమైన చారిత్రిక నవల కన్నడం లోంచి తెలుగు లోకి తెచ్చారు(ఆ నవలకు ఙ్ఞానపీఠము లభించిన సందర్భంగా)అది కూడా చాలా అద్భుతం గా ఉంటుంది.ఒక వేల చదివితే పరిచయం చెయ్యండి.
  -సంతోష్ సూరంపూడి

  ప్రత్యుత్తరంతొలగించు
 6. మురళి గారు చూడలేదండి ఈ సినిమా. మీకు హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఈ సినిమా చూడలేదండీ..పాటల్లో కూడా "స్వర రాగ గంగా ప్రవాహమే, గోదావరీ పయ్యెద" మాత్రమే విన్నాను. వీలు చిక్కితే తప్పకుండా చూస్తాను. మీ టపా ఎప్పటి లాగే చాలా బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. @హరేకృష్ణ: లేదండీ పాతదే.. డీవీడీ దొరుకుతుంది.. ధన్యవాదాలు.
  @శిశిర: సినిమా మీకెంత గా నచ్చిందో మీ వ్యాఖ్య చూడగానే అర్ధమయ్యిందండీ.. ధన్యవాదాలు.
  @రిషి: తప్పక చూడండి.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. @వేణూ శ్రీకాంత్: లేదండీ, రిమేక్ సినిమా.. భారతి, జెవి సోమయాజులు మాతృకలో లేరు. పైగా అచ్చ తెలుగు లోకేషన్లు.. జేసుదాస్ ఉచ్చారణ దోషాలు చాలా వరకూ సవరించుకోగలిగేవే.. దర్శకులు, సంగీత దర్శకులు ఎందుకు పట్టించుకోరో మరి.. ధన్యవాదాలు.
  @పక్కింటబ్బాయి: ప్రస్తుతం 'గోన గన్నారెడ్డి' చదువుతున్నానండీ.. ఫలానా విషయాలు మాత్రమే రాయాలి లాంటి నియమాలేవీ లేవండీ.. తీరిక దొరికినప్పుడల్లా రాస్తూ పోతున్నాను.. మీ సూచనకి ధన్యవాదాలండీ.. పుస్తకాలు చదవడానికి ప్రయత్నిస్తాను. ధన్యవాదాలు.
  @జయ: ధన్యవాదాలండీ..
  @ప్రణీత స్వాతి: తప్పక చూడండి.. మీకు నచ్చే అవకాశాలు ఉన్నాయి :-) .. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. ఎందుకో ఈసినిమా నాకంతగా నచ్చదు మురళిగారూ ...పాటలు మాత్రం చాలాబావుంటాయి.

  ప్రత్యుత్తరంతొలగించు