శుక్రవారం, మే 14, 2010

నలుపు

"నలుపేమో నాకిష్టం.. మీ మనసు మీ ఇష్టం.. నాకోసం మీ ఇష్టం వదలద్దండీ.." ఏదో సినిమా పాట అనిపిస్తోంది కదూ.. వంశీ సినిమా 'అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు' లో "ఎన్నెన్నో వర్ణాలు.. " పాటలో వచ్చే లైన్ ఇది.. నన్ను పదే పదే వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా ఇష్టమైన రంగుల్లో నలుపు ఒకటి. ఈమాట చెప్పగానే కనీసం కొందరైనా చిత్రంగా చూస్తూ ఉంటారు, అందుకే ఎవరికీ చెప్పను నేను.

నలుపు కల్తీ లేని రంగు.. ఏ రంగైనా నలుపులో కలవాల్సిందే. సాహిత్యంలో, ముఖ్యంగా కవిత్వంలో నలుపు రంగుకి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఆమె కాటుక కళ్ళనీ, నల్లని వాలుజడనీ వర్ణించని కవులు అరుదు. నవలా రచయిత్రుల శకం నడుస్తున్న రోజుల్లో కథానాయకులందరూ పడవల్లాంటి నల్లరంగు కార్లలో తిరుగుతూ ఉండే వాళ్ళు. అన్నట్టు వంశీ బోల్డన్ని కథలు రాసినా, తొలినాళ్ళలో రాసిన 'నల్ల సుశీల' కథంటేనే తనకి బాగా ఇష్టం అని చాలా సార్లు చెప్పాడు.

నాకు చీకటి అన్నాకూడా చాలా ఇష్టం. చక్కగా చిక్కగా ఉంటుంది. "చీకటి ఎంత బాగుంటుందో.. మనం దీపం వెలిగించో, లైట్లు వేసో సహజమైన చీకటిని కల్తీ చేసేస్తున్నాం.." అని ఒక కొత్త ఫ్రెండ్ తో అన్నానీమధ్య. అటు వైపు నుంచి కొంచం కన్ఫ్యూజన్ వినిపించింది. మరీ కంగారు పెట్టేసినట్టు ఉన్నాను. రుతువేదైనా చీకటిరాత్రి అందం వేరు. వెన్నెలని మాత్రమే ఆస్వాదించి, చీకటిని ఆస్వాదించక పోవడం కరెక్టేనా?

దుస్తుల విషయానికి వస్తే నలుపు రంగుకి ఏ రంగైనా కాంబినేషన్ బాగోకపోవడం అనే సమస్య దాదాపు ఉండదు. పైగా మెయింటినెన్స్ సులువు. తెలుపు రంగు దుస్తులు వేసుకున్నప్పుడు ఉన్నంత జాగ్రత్తగా అస్సలు ఉండనవసరం లేదు. ఇలా లెక్క పెడితే నలుపు రంగు దుస్తులతో ఎన్ని లాభాలో. ఏమాటకామాటే చెప్పాలి.. ఈ రంగు ఎవరికీ సూట్ కాకపోవడం ఉండదేమో అనిపిస్తుంది.

ఒకప్పుడు నా వార్డ్ రోబ్ నిండా మూడొంతులు నల్ల రంగు దుస్తులే ఉండేవి.. కాలక్రమంలో అత్యంత సహజంగానే ఇతర రంగులూ వచ్చి చేరాయి. ఇంత చక్కని నలుపుని కేవలం నెగిటివ్ విషయాలు చెప్పడానికి ఉపమానంగా ఎందుకు వాడతారో అర్ధం కాదు. నల్ల బజారు, నల్ల ధనం లాంటి మాటలు కొంచం చిత్రంగా వినిపిస్తాయి. అలాగే ఆశుభానికీ, విషాదానికీ సూచికగా వాడడం కూడా అర్ధం కాని విషయమే.

ఎందుకంటే మన దేవుళ్ళకీ, నల్లరంగుకీ సంబంధం ఉంది. నల్లనయ్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. "నల్లని వాడు.. పద్మ నయనమ్ముల వాడు.." అంటూ బోల్డన్ని వర్ణనలు. హాలాహలం మింగాక శివుడి కంఠం నల్లగా మారిందంటారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోల్డన్ని ఉదాహరణలు దొరుకుతాయి. మొత్తం మీద నలుపు మరీ అంత తీసి పారేయాల్సిన రంగేమీ కాదు. కాదంటారా??

36 వ్యాఖ్యలు:

 1. అబ్బే మీరు చెప్పాక కాదని ఎందుకంటాం :-) అవుననే అంటాం ......ఎందుకండి కొత్త మిత్రులని కంగారు పెడతారు..మనసులో ఎన్ని క్వశ్చన్ మార్క్స్ పడున్టాయో....:-):)

  ప్రత్యుత్తరంతొలగించు
 2. అందుకే తెల్లనివన్నీ పాలు కాదు అని తెల్ల వాటికి కూడా ఒక చురక వేశారు లెండి :)

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నలుపుని ఇష్టపడేవాళ్ళు లోతయిన మనస్తత్వం కలిగివుంటారని మనస్తత్వ శస్త్రంలో చెపుతారు. పైగా అందరిలోనూ కొంత ప్రత్యేకంగా వుండాలని అనుకుంటారట. ఇవే కాకుండా, నలుపు హుందాతనానికి చిహ్నంగా వాడుతారు. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి తదితరులు వాడే కార్లన్నీ నలుపురంగులో వుంటాయి. గమనించండి. నా అంచనా ప్రకారం చీకటి మాత్రమే శశ్వతమయినది అనిపిస్తుంది. నవ్వుకోకండి. ఇది నిజం. ఒక సారి వెలుగు రావాలంటే ఎంతో కష్టపడాలి. అదే చీకటి లేదా నలుపు రావాలంటే ఒక్క సెకన్ చాలు. విశ్వమంతటా నింది వున్నది అనంతమయిన నలుపే కదా. (ఇంతకీ నాకు తెలుపంటేనే ఇష్టం)

  ప్రత్యుత్తరంతొలగించు
 4. నలుపు మరీ అంత తీసి పారెయ్యాల్సిన రంగైతే కాదులెండి...నా వరకూ అయితే లాప్ టాప్,మొబైల్ లాంటి ఎలక్ట్రానికి గాడ్జెట్స్, వాలు జడ, కాటుక కళ్ళు, ప్యాంట్ లు మాత్రమే నల్ల రంగులో నచ్చుతాయి...:)
  మీకు చీకటి నచ్చుతుందా? Interesting..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. "నలుపు నారాయణుని బోలు..ఎరుపు వెర్రి వెధవని బోలు" అని మా తాతగారు ఎప్పుడూ అంటూ ఉండేవారుట. ఎందుకయ్యా అంటే..ఆయనా అయన సంతానం నలుపు. అందుకని అలా సమర్ధించే వారుట. నలుపు తీసి పారేయల్సిన రంగు అస్సలు కానే కాదు. నాకూ చాలా ఇష్టమైన రంగు. మొన్నీ మధ్యే ఒక నల్ల చీర డిజైన్ చేసుకున్నా. ఇప్పుడు ఇంకోటి ప్రాసెస్ లో వుంది.
  వస్తువులూ..బట్టలూ వరకు నలుపు నచ్చుతుంది కానీ.. చీకటంటేనే నచ్చదండీ. చీకటి లో ఏవీ, ఎవరూ కనిపించరు, ఒంటరి తనం వెంట వస్తున్నట్టు వుంటుంది.
  ఒకే ఒకందుకు చీకటి నచ్చుతుంది..ఆకాశంలో చుక్కల్ని, చందమామని, చూడచ్చు. చందమామ ప్రసరించే చల్లని వెన్నెల చూడచ్చు అనుభూతించవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. బాగా చెప్పారు.నలుపు నాకూ చాలా ఇష్టం,కానీ చీకటంటే చచ్చే భయమండోయ్. కాని మా ఇంటిలోకి నల్లంచు ఉన్న చీర కూడా రానీయదు మా అమ్మ.

  పెళ్ళయ్యాకా హాయిగా వేసుకుంటున్నా నలుపుని

  ప్రత్యుత్తరంతొలగించు
 7. ఎన్నెన్నో "అందాలు "కాదండీ వర్ణాలు ......ఏదో తేడాగా వుందే!.....:-)

  ప్రత్యుత్తరంతొలగించు
 8. అవునండి. నలుపు మంచి రంగు. కారు చీకటి నల్లన, కన్నయ్య నల్లన,ఇంతి కన్ను నల్లన.. అశుభం కానికే కాదు లెండీ పెళ్ళి కొడుకు నల్ల సూట్ పెళ్ళి కూతురు తెల్ల డ్రెస్స్ వేసుకుంటారు కదా ఇక్కడ. దానిమీద జోక్ కుడా వుంది కదా, చెడు జరుగుతున్న వాళ్ళకు నలుపు మంచి జరుగుతున్న వాళ్ళు తెలుపు వేసుకుంటారు పెళ్ళి లో అని. :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 9. ఏమైనా నలుపు నాణ్యతకి చిహ్నం
  అందుకే ఆ రంగంటే నాకు ఇష్టం!

  ప్రత్యుత్తరంతొలగించు
 10. మావారు అంటుంటారు...నలుపు పర్మినెంట్ ఎండకు ఎండినా, వానకు తడిచినా అలాగే ఉంటుంది....అదే తెలుపుని ఏరంగైనా ఇట్టే మార్చేస్తుందని.
  మావారు నల్లనయ్య అందుకే నాకు నలుపే నచ్చుతుందండి:):)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. నలుపులో వుండే అందం వేరు . నల్లంచు తో వున్నా , వేరే ఏరంగు అంచు తో వున్నా చీరలు బాగుంటాయి . కాని మీరనట్లు మేంటేనెన్స్ మటుకు సులువు కాదు . స్టార్చ్ పెట్టగానే తెల్ల మరకలు వచ్చేస్తాయి .నేను కాటన్ నే కడతాను కనుక నా అనుభవం ఇది . నలుపు ఎక్కడైనా నచ్చుతుంది , కాని చీకటంటే మటుకు చాలా భయం .

  ప్రత్యుత్తరంతొలగించు
 12. నలుపు అంత బాగా మెచ్చుకున్నారు బాగుంది.. మరి నల్లని జీవిత బాగస్వామి మీకు వస్తే ఓకేనా... (ఒక వేళ ఆల్రెడీ పెళ్ళైపోతే.. ఈ కామెంటుని ఇగ్నోర్ చెయ్యండి.. :) (ఏదో అలా సరదాగా.. :))

  ప్రత్యుత్తరంతొలగించు
 13. నలుపు నా కిష్టమో లేదో తెలియదు కాని నా వార్డ్ రోబ్ లో మెజారిటీ ఈ రంగు దే , భరించలేని వెలుతురూ కన్నా మాత్రం చీకటే ఇష్టం :)

  ప్రత్యుత్తరంతొలగించు
 14. సేం పించ్.. నాక్కూడా నలుపంటే చచ్చేంత ఇష్టం.. పెళ్ళైన కొత్తల్లో నా దగ్గరున్న బ్లాక్ చీరలు, డ్రెస్ లు చూసి మా అత్తింటి వారు ఒక రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు.. నేను అదే రేంజ్ లో లైట్ తీసుకున్నాను :-)

  హ్మ్మ్.. కానీ చీకటి విషయంలోకి వస్తే అల్లెప్పుడో 'అనంతం' బ్లాగులో కారు ప్రయాణం టపాలో చెప్పినట్టు మనల్ని భయపెట్టడానికి ప్రకృతి ఏవేవో వైపరీత్యాలు సృష్టించక్కర్లేదు, పన్నెండు గంటలకోసారి మనమీద కప్పే చీకటి దుప్పటే చాలు... అదంటే నాక్కాస్త భయమే:(

  ప్రత్యుత్తరంతొలగించు
 15. తెలుపు కూడా చాలా సందర్భాలలో అశుభమే. అదే తెలుపు కొన్ని విషయాల్లో శుభం. అదే అర్ధంకాని కాంట్రోవర్సీ. ఒక్కో రంగుకి ఒక్కో అర్ధం కూడా ఉంది కదా. అంతే కాదు మనం ఇష్టపడే రంగును బట్టి మన మెంటాలిటీ కూడా ఎస్టిమేట్ చేస్తారు. దాదాపు రెండు, మూడు రంగులు ఇష్టపడ్తాము. అందులో నలుపు కూడా ఉంటూనే ఉంటుంది. మన జీవితమే ఇంద్రధనుస్సు కదా. నాకుకూడా నలుపు ఇష్టమే నండి:)

  ప్రత్యుత్తరంతొలగించు
 16. కరెక్ట్ గా చెప్పారు, నాకూ అదే అర్థం కాదు, నలుపు అంటే ఎందుకు అంట నెగటివ్ గా చూస్తారు అని..ఏదైనా ఫంక్షన్ కి నలుపు దుస్తులు వేసుకోవద్దు అంటారు ఏంటో?..నాకు కూడా నలుపు చాలా ఇష్టం..నలుపు ఏంటో అందంగా కనపడుతుంది నాకు..నాకు ఈ టపా చాలా నచ్చింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 17. మేమెందుకు కాదంటమండి! మా చెల్లి కూడ మీ కోవలోనే చేరుతుంది, దానికి నలుపంటే పిచ్చి (ఇప్పుడు నేను నలుపు రంగు బాగుండదంటే బ్రతకనిస్తుందా?)....నా మట్టుకు హరివిల్లు లోని రంగులన్నీ నాకు ఇష్టమే :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 18. నలుపు గురించి బాగా చెప్పారు మురళీ.. నాకూ నలుపు చాలా ఇష్టమైనా అమ్మ అస్సలు ఒప్పుకోకపోవడం తో నా వార్డ్ రోబ్ లో ఎక్కువ స్థానం ఇవ్వలేకపోయాను. అయినా ఎవరండీ అక్కడ నలుపుకు మరక అంటదూ అన్నది. ఇంచుమించు తెలుపు ఎంత జాగ్రత్తగా మెయింటెయిన్ చెయ్యాలో నలుపు అంతే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ మరకలు కనపడని విషయం లో మాత్రం నా ఓట్ బ్రౌన్ కే :-)

  చీకటి విషయంలో నాది కూడా మీ మాటే.. చక్కని చిక్కని నల్లని చీకటిని లైట్లతో కల్తీ చేసేస్తున్నాం :-)

  ప్రత్యుత్తరంతొలగించు
 19. ఎండా కాలం లో వేస్కుంటే తెలుస్తుంది నలుపు బట్టల బండారం:-)
  --సంతోష్ సూరంపూడి

  ప్రత్యుత్తరంతొలగించు
 20. మురళి గారు! నలుపుపై నాకు సదాభిప్రాయమే. అన్ని విషయాల్లో నచ్చదు కాని కొన్నింటివరకూ ఓకె.
  నాకు చీకటి మాత్రం చాలా ఇష్టం. మనకు తెలియకుండానే మనగురించి మనం ఆలోచించేలా చేస్తుంది.
  బహుశా!ఒంటరితనాన్ని ఇష్టపడేవాళ్లు చీకటిని ఇష్టపడతారనుకుంటా.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. మీ పోస్ట్ చదూతుంటే నాకో పొడుపు కథ గుర్తొచ్చింది. 8th క్లాసు చదివే నా మరదలు అడిగింది ఓసారి..
  "మల్లెపువ్వు నలుపు.. కాకి రంగు తెలుపు" ఎలాగో చెప్పుకోండి చూద్దాం? మీకు సమాధానం తెలిసే ఉంటుందిలెండి. ఎందుకంటే నేనే చెప్పగాలిగినప్పుడు ఎవరైనా చెప్పగలరని నా నమ్మకం ;-)

  'ఎన్నెన్నో వర్ణాలు' పాట నాకు చాలా ఇష్టం. ఆ సినిమా మొదటిసారి థియేటర్లో చూసినప్పుడు మొత్తం నలుపు తెలుపులో వంశీ అలంకరించిన ఇల్లు చూసి చాలా మురిసిపోయాను. నాకూ అలాంటి ఓ ఇల్లుంటే బాగుంటుందనిపించింది.
  నలుపు రంగు నాకు చాలా ఇష్టం. నా సెల్ ఫోన్, ఐపాడ్, కెమెరా, ల్యాప్ టాప్ అన్నీ నలుపే! నేను బ్లాకు ఇంకే ఎక్కువ వాడతాను వ్రాయడానికి. బట్టలు కూడా నలుపులోనే చాలా కొనుక్కోవాలని ఉంటుంది. కానీ, ఇంట్లో వాళ్ళు గొడవ పెడతారు ముఖ్యంగా శుభకార్యాలకి వేసుకోనివ్వరు. శని దేవుడికి నలుపు ఇష్టం అంటారు. అందుకే ఎక్కువ భయం అనుకుంటా అందరికీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 22. "..దీపం వెలిగించో, లైట్లు వేసో సహజమైన చీకటిని కల్తీ చేసేస్తున్నాం.." - బావుంది. నలుపును గెలిపించాలని మీవంటివారు అనుకున్నాక, గెలిచి తీరుతుంది.

  ----------

  కానీ, నలుపును కొంతమేరకే భరించగలమని నా ఉద్దేశం సార్.

  నల్..హటి నేపథ్యం పైన తెల్..హటి అక్షరాలతో ఉండే బ్లాగులు చూసారా? కళ్ళను చెదరగొట్టిందా లేదా? అదే మరి తెల్లటి తెర మీద నల్లటి అక్షరాలు చూడండి -బానే ఉంటాయి. ఎంచేతన్నమాటా..? నలుపు కొద్దిగా - కొద్దిగే - ఉంటే బాగుంటుంది. :)

  ఇపుడూ.. కాశ్మీరులో నలుపుందనుకోండి -కొట్టొచ్చినట్టు కనిపిస్తాది, మరదే తమిళ్నాడులోనైతే.. అక్కడ నలుపుకు ఇలవేటుంటది చెప్పండి? :)

  ప్రత్యుత్తరంతొలగించు
 23. నలుపు గాఢతకు చిహ్నం.అందుకే అనుకుంటా ఎవరైనా చనిపోతే నలుపు రంగు దుస్తుల్లో వెళ్తారు (నేను చూసిన హాలివుడ్ సినిమాల జ్ఞానం ప్రకారం). ఇహ పోతే, అన్ని రంగులు కలిపితే తెలుపు వస్తుంది అలాగే అన్ని రంగులని తీసేస్తే నలుపు మిగులుతుంది అందుకే అనుకుంటా శుభకార్యాలకు నలుపు పనికిరాదంటారు.రంగులని జీవితపు అనుభూతులతో పోల్చిచూసినప్పుడు నలుపు ఏ భావమూ లేని చప్పని కూరని తలపిస్తుంది, తెలుపు షడ్రుచుల కలయికలా కమ్మగా తోస్తుంది.
  జగదీష్ గారు చెప్పినట్టు ముఖ్యమంత్రులు,రాష్ట్రపతి తదితరుకు నలుపు వాహనాలు ఉండటానికి కారణం ఇదే, వాళ్లు రాగద్వేషాలు, బంధుప్రీతి వగైరా లేకుండా ఉండాలని.

  హ్మ్., నాక్కూడా అనిపిస్తుంటుంది స్వచ్చమైన చీకటిని కల్తీ చేస్తున్నామని. పూర్తిగా చీకటి కాదుగాని చుక్కలు ఉండే చీకటి ఆకాశమంటే నాకు చాలా ఇష్టం.

  ఇంతకీ మధురవాణీ గారి పొడుపుకథ ఎలా సరైందో ఎవరైనా చెప్తారా?‘ఎవరైనా’ చెప్పగలరు అని ఓ స్టేట్‌మెంట్ ఇచ్చి చక్కా వెళ్లిపోయారావిడ. నాకేమో తట్టడంలేదు. వా... :(

  ప్రత్యుత్తరంతొలగించు
 24. నలుపంటే నాక్కూడా చాలా ఇష్టం మురళిగారు చాలా అనేకంటే చాలా చాలా ఇష్టం అనే చెప్పాలి .అందరూ నలుపు అశుభం అంటారు కాని మా అమ్మ మాత్రం ఏమీ ఫర్వాలేదు అమ్మమ్మ నాకు పెళ్ళికూతుర్ని చేసినప్పుడు నల్లచీరే కట్టింది నేనూ బావున్నాను , మీరూ బావున్నారు రంగులో ఏ చెడూ ఉండదు అంతా మన మనసులోనే ఉంటుంది అంటుంది.అందుకేనేమో నచ్చితే చాలు సందర్భం గురించి ఆలోచించకుండా నలుపు కొనేస్తూ ఉంటాను.మరి నాకిష్టమైన రంగు గురించి టపా రాసినందుకు మీకు థాంక్స్ :)

  ప్రత్యుత్తరంతొలగించు
 25. @చిన్ని: అలా అంటారా? :-) :-) ధన్యవాదాలండీ..
  @స్ఫురిత: నిజమేనండోయ్.. మరి నల్లనివన్నీ నీళ్ళు కాదు కదా.. ధన్యవాదాలు.
  @ఎస్పీ జగదీశ్: చివరి వాక్యం బ్రహ్మాండం అండీ :-) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. @శేఖర్ పెద్దగోపు: అవునండీ.. నాకెందుకో చిన్నప్పటినుంచీ చీకటి బాగా ఇష్టం.. వాలుజడ, కాటుక కళ్ళ విషయం గుర్తు పెట్టుకుంటాం సార్ :-) ..ధన్యవాదాలు.
  @ప్రణీత స్వాతి: 'నలుపు-నారాయణుడు' నేను కూడా విన్నానండీ.. ఇంట్లోనూ ల్లని వాళ్లకి లోటు లేదు మరి :-) ..ధన్యవాదాలు.
  @మానస: పోనిలెండి.. మొత్తానికి మీకు నచ్చింది చేస్తున్నారు కదా.. ధన్యవాదాలు.
  @చిన్ని: సరి చేశానండీ.. ప్రత్యేక ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 27. @భావన: సూట్ జోక్ ఏదో మల్లాది నవలలో చదివానండీ.. పేరు గుర్తు రావడం లేదు.. ధన్యవాదాలు..
  @పద్మార్పిత: ధన్యవాదాలండీ..
  @సృజన: కొత్త విషయం తెలిసిందండీ మాకు :-) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. @మాలాకుమార్: మహిళల దుస్తులు ఏవైనా మెయింటినెన్స్ కష్టమే అని నా అభిప్రాయం అండీ.. నేను రాసింది మగ వారి దుస్తుల్ని దృష్టిలో పెట్టుకుని.. ఈ లైన్లో ఒకసారి ఆలోచించి చెప్పండి.. ధన్యవాదాలు.
  @చంద్రమౌళి మల్లెడ: ఇగ్నోర్ చేయమన్నారు కాబట్టి బతికిపోయానండీ :-) ..ధన్యవాదాలు.
  @శ్రావ్య వట్టికూటి: చూడగా చూడగా చీకటి అందం మరింత బాగా తెలుస్తుందండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 29. @నిషిగంధ: "మా అత్తింటి వారు ఒక రేంజ్ లో క్లాస్ తీసుకున్నారు.. నేను అదే రేంజ్ లో లైట్ తీసుకున్నాను :-)" అద్భుతం అండీ.. ఆప్రకారం ముందుకు సాగిపొండి :-) ..ధన్యవాదాలు.
  @జయ: నాక్కూడా నలుపు కాకుండా మరో రెండు మూడు రంగులు ఇష్టమేనండీ :-) ..ధన్యవాదాలు.
  @కిషన్ రెడ్డి: ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 30. @రాధిక: మీది వైడ్ చాయిస్ అన్నమాట.. ఇక సమస్య ఉండదు :-) ..ధన్యవాదాలండీ..
  @వేణూ శ్రీకాంత్: మనలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారని ఈ టపా వాళ్ళ తెలిసిందండీ.. బ్రౌన్ బాగుంటుంది కానీ, కాంబినేషన్ దొరకడం కొంచం కష్టం, నలుపుతో పోలిస్తే.. కాదంటారా? ..ధన్యవాదాలు.
  @పక్కింటబ్బాయి: రహస్యం ఏమిటంటే ఆ విరహం నుంచి పుట్టిన టపానేనండీ ఇది :-) ఇప్పుడింకా వర్షాలు వచ్చేస్తాయి కాబట్టి సమస్య ఉండదు.. ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 31. @సవ్వడి: కావొచ్చండీ.. నాకు చీకటి ఎందుకు ఇష్టమో సీరియస్ గా ఆలోచించలేదు ఇప్పటివరకూ.. ..ధన్యవాదాలు.
  @మధురవాణి: ఇల్లు విషయంలో నాకూ అదో తీరని కోరిక ఉందండీ.. మల్లెపువ్వుని నలిపితే వచ్చేది కాకి రంగే కదా మరి..? మీరే చెప్పాలి. ..ధన్యవాదాలు.
  @చదువరి: నాకెందుకో కాశ్మీర్ కన్నా తమిళ్ నాడే నచ్చుతుందండీ.. కొంచం తేడాగా అనిపిస్తోందా మీకు? :-) :-) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. @నాగార్జున చారి: ఆ పొడుపు కథని ఓ నాలుగైదు సార్లు చదివితే జవాబు వచ్చేస్తుందని నా నమ్మకం అండీ.. జవాబు కరెక్టో కాదో ఆవిడని అడిగాను.. చెబుతారేమో చూద్దాం.. ధన్యవాదాలు.
  @పరిమళం: మీ అమ్మగారికీ జై.. ధన్యవాదాలండీ..

  ప్రత్యుత్తరంతొలగించు
 33. మురళి గారు ఇందాకటినుంచి మీ సమాధానాలు ఒక్కొక్కటి పబ్లిష్ చేస్తుంటే చదువుతూ వస్తున్నాను:)

  మధురవాణి గారి పొడుపు కథకి నా ఉద్దేశ్యం ప్రకారం మల్లెపువ్వుని నలపమని, కాకి రంగుని తెలుపమని.

  ప్రత్యుత్తరంతొలగించు
 34. nalupu ishtam anna vallani anumananga chusthanu ...nalupu ante seni antaruga anduke nenu aa ranguki duram....meremo mallipuvvula...me ishtalemo chavu,nalupu,chikati ??

  ప్రత్యుత్తరంతొలగించు
 35. ఓర్నాయనో మీకు ఆ పొడుపు కధ తెలియలేదా... మల్లె పూవు నలుపు అంటే నలపమని ... కాకిరంగు తెలుపు అంటే కాకి రంగు ఏదో తెలపమని :) అంతే నా వాణి గారు..

  ప్రత్యుత్తరంతొలగించు
 36. @ నాగార్జునా చారి,
  అలా ఎందుకన్నానంటే, మనందరం బాగా ఆలోచిస్తాం కదండీ. కానీ, ఆ పొడుపు కథ అడిగింది స్కూల్లో చదివే అమ్మాయి అని చెప్పా కదా! కాబట్టి సమాధానం కూడా చిలిపిగా, సింపుల్ గా ఉంటుందని అలా అన్నాను.
  @ మురళీ గారూ,
  "మల్లెపువ్వు నలుపు, కాకి రంగు తెలుపు" ఈ statement కి justification ఏంటంటే.. మల్లెపువ్వుని నలుపు (నలిపెయ్యి), కాకి రంగు తెలుపు (రంగేంటో తెలుపు, చెప్పు) అని అర్ధమట. అబ్బ ఛా.. అనుకుంటున్నారా..నేనూ అప్పుడలాగే అనుకున్నా :D
  దానికి అదేమో.. అంతేనక్కా మరి..నువ్వేమో ఇదేంటి ఇలా opposite గా చెప్పింది అనుకున్నావ్ కదా.. కానీ, అందులో సరైన meaning ఉందా లేదా.. అంది. ఇంకేమంటాం!? అదన్నమాట సంగతి!

  ప్రత్యుత్తరంతొలగించు