శనివారం, డిసెంబర్ 26, 2009

ఐదేళ్ళ క్రితం...

ఎప్పటిలాగే ఆరోజు కూడా తెల్లవారింది.. మామూలుగానే సమయం గడుస్తోంది. ఉన్నట్టుండి జనంలో కంగారు మొదలయ్యింది. మొదట తెలిసిన వార్త సముద్రం పొంగుతోందని. ఉప్పెన అనుకున్నాం. జరుగుతున్నది ఏమిటో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. జలప్రళయం అన్నారు కొందరు, భూకంపం రావొచ్చునన్నారు మరి కొందరు. టీవీలో ఏ చానల్ తిప్పినా తెర నిండా నీళ్ళే.

జరుగుతున్న ఉత్పాతం పేరు 'సునామీ' అని తెలిసింది ఎన్డీటీవీ చూస్తున్నప్పుడే. తీర ప్రాంతాలకి హెచ్చరికలు. నదులు కూడా పొంగ వచ్చన్న వదంతులు. వార్తలకన్నా వదంతులే ఎక్కువగా వేగంగా వ్యాపిస్తాయి. సముద్ర తీరానికి చాలా దూరంగానే ఉన్నా, బంధు మిత్రుల నుంచి ఫోన్లు. క్షేమం తెలుసుకోడం కోసం. హైదరాబాద్ వచ్చేయమన్నారు ఒకరిద్దరు. ఎందుకో తెలీదు కానీ ఆ మాట వినగానే నవ్వొచ్చింది.

మధ్యాహ్నం దాటేసరికి టీవీల్లో దృశ్యాలు మొదలయ్యాయి.. ప్రకృతి విలయానికి బలయిన వాళ్ళ మృతదేహాలు చూపించడం మొదలు పెట్టారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న బంధువులు. ఎంతటి వాళ్ళనైనా కలచివేసే దృశ్యాలు. మరణాల సంఖ్య ఇదమిద్దంగా తెలియకపోయినా నష్టం అపారం అని చెప్పాయి, టీవీ చానళ్ళన్నీ ముక్త కంఠంతో. ఓ పక్క మరో సునామీ గురించి వదంతులు, మరో పక్క గుట్టలుగా శవాలు.. రాత్రంతా ఇవే దృశ్యాలు టీవీల్లో.

మర్నాడు ఉదయం ఏ పత్రిక చూసినా ఇదే వార్త. నేలని కరిగిస్తున్న నీళ్ళు, శవాల గుట్టల ఫోటోలు. గడిచిన వందేళ్ళలోనే అతి పెద్ద ప్రకృతి వైపరీత్యం అన్నాయి సంపాదకీయాలు. ఇలాంటి విపత్తులని ముందుగా పసిగట్టగలిగే, నష్టాన్ని తగ్గించగలిగే వ్యవస్థ అభివృద్ధి చెందలేదన్న అంశం చర్చకి వచ్చింది. బాధితుల కుటుంబ సభ్యుల, ప్రత్యక్ష సాక్షుల కథనం ఒక్కటే.. ఊహించని వైపరీత్యం అని.

సునామీ మనుషుల్లో మానవత్వాన్ని మేల్కొలిపింది. మామూలు ప్రకృతి వైపరీత్యాలకి స్పందిచని వాళ్ళు సైతం ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారు. పెద్ద ఎత్తున నష్టపోయిన మత్స్యకారులకి ఇళ్ళు, వలలు అందించే ఏర్పాటు చేశారు. స్వల్పకాలిక, దీర్ఘ కాలిక సేవా కార్యక్రమాలకి రూపకల్పన జరిగింది. దీర్ఘ కాలిక ప్రాజెక్టులు ఇప్పుడు ఒక రూపు తీసుకున్నాయి.

రచయితలకి, కవులకి సునామీ ఒక రచనా వస్తువయ్యింది. ఈ మహా విషాదం నేపధ్యంగా తెలుగులో వచ్చిన కథ 'కడలూరు వెళ్ళాలి ఒక నీలిమ కోసం' ఎప్పటికీ మర్చిపోలేం. (ఈమధ్యనే 'హిమబిందువులు' బ్లాగులో ఈ కథ గురించి ఒక టపా వచ్చింది.) సునామీ దృశ్యాల్లాగే ఆ కథ కూడా చాలా రోజులు వెంటాడింది.

ఆంగ్ల పత్రిక 'ది హిందూ' ఆదివారం అనుబంధంలో వచ్చిన ఒక కథ కూడా చాలా ఆలోచింపజేసింది. ప్రకృతి విలయానికి పెద్ద ఎత్తున నష్టం జరగడానికి కారణం మనిషి అత్యాశే అన్న కాన్సెప్ట్ తో వచ్చిన కథ అది. బీచ్ కి దగ్గరగా ఇళ్ళు కట్టుకోడానికి ఏర్పాట్లు చేసుకున్న ఒక కుటుంబం తమకి నచ్చిన స్థలం కోసం రూల్స్ ని అతిక్రమించడం కథా వస్తువు. ఒక సిని గీత రచయిత అయితే 'వయస్సునామీ..' అంటూ ఏకంగా ఓ ప్రేమగీతం రాసేశాడు.

సునామీ వచ్చిన కొద్ది రోజులకి ఒక బీచ్ కి వెళ్లాను. వైపరీత్యం తాలూకు ఆనవాళ్ళు అక్కడ తాజాగా ఉన్నాయి. ఆపక్కనే సహాయ కార్యక్రమాలు మొదలయ్యాయి. సునామీ మనకి రెండు పాఠాలు నేర్పింది అనిపించింది. మొదటిది మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే.. రెండోది మానుషుల మధ్య సంబంధాలు బలహీన పడుతున్న ప్రతిసారీ వారిని కలిపే పనికి ప్రకృతి పూనుకుంటుంది అని..

13 వ్యాఖ్యలు:

 1. మానుషుల మధ్య సంబంధాలు బలహీన పడుతున్న ప్రతిసారీ వారిని కలిపే పనికి ప్రకృతి పూనుకుంటుంది

  nice

  ప్రత్యుత్తరంతొలగించు
 2. "మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే.. రెండోది మానుషుల మధ్య సంబంధాలు బలహీన పడుతున్న ప్రతిసారీ వారిని కలిపే పనికి ప్రకృతి పూనుకుంటుంది అని."

  బాగా చెప్పారు. వింత ఏమిటంటే మనిషి ప్రతిసారీ గెలిచే సాధనం దగ్గర ఉందనుకుని ప్రకృతి సుప్రీం అన్న మాట మరిచిపోతుంటాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. నాకు ఇప్పటికి కళ్ళముందు ఒక దృశ్యం గుర్తొస్తుంది .మరణించిన వారి సాముహిక బరియల్ దిహిందూ దిన పత్రిక మొదటి పేజే లో అత్యంత హృదయవిదారకంగా ప్రచురించింది ,అది పాండిచేరి చర్చి వద్ద బీచ్ ఫోటో , దేవుళ్ళ మీద విరక్తి కూడా కలిగింది ఆ దృశ్యాలు చూస్తే

  ప్రత్యుత్తరంతొలగించు
 4. >>మొదటిది మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే<<

  బాగా చెప్పారు .. కాదు నేనే గొప్ప అనుకున్న రోజు ఆ మనిషి జీవితం ముగిసినట్టే ..

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే...మీరు చెప్పింది కరెక్టండి!

  ప్రత్యుత్తరంతొలగించు
 6. సునామి.... ఈ మూడక్షరాల పదం వింటే ఇప్పటికీ ఆ ప్రాంత ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయి, మనకి ఆ దృశ్యాలు ఇంకా కళ్ళముందు మెదులుతూనే ఉంటాయి. ప్రకృతి ముందు మానవుడెంత అనిపిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. @అశోక్: ధన్యవాదాలండీ..
  @సునీత: ఉన్నమాటే కదండీ.. ధన్యవాదాలు.
  @చిన్ని: ఆ ఫోటో గురించి చాలా అభ్యంతరాలు వచ్చాయని తర్వాత ఆ పత్రికలోనే చదివినట్టు జ్ఞాపకం అండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. a2zdreams: నిజమేనండీ.. ధన్యవాదాలు..
  @శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ.
  @పద్మార్పిత: ధన్యవాదాలండీ..
  @సిరిసిరిమువ్వ: అంత తొందరగా మర్చిపోగలిగే విలయం కాదు కదండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏమిటంటే అండమాన్ నుంచి చెన్నయి వరకు రావడానికి సునామికి రెండు మూడు గంటలు పడితే, ఈ లోపు ప్రజలకి హెచ్చరికలు ఇవ్వలేరా?
  దీనికి సునామి హెచ్చరికల వ్యవస్థ ఎందుకు? అక్కడ అప్పటికే సునామి వచ్చింది కదా. ఇక్కడకూడా రావచ్చునని అనుమానించలేరా?
  అసలు దేశంలో ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏదైనా అవాంతరం రాబొతుందని నిరంతరం పసిగట్టే యంత్రాంగం (24 గంటలూ పనిచేసే) ఉందా?
  పరిశోధనా సంస్థలన్నీ ఏం చేస్తున్నాయి?

  ప్రత్యుత్తరంతొలగించు
 10. "మనుషుల మధ్య సంబంధాలు బలహీన పడుతున్న ప్రతిసారీ వారిని కలిపే పనికి ప్రకృతి పూనుకుంటుంది" ప్రస్తుత మన ( రాష్ట్ర ) పరిస్థితి చూసి మనసుకు బాధనిపించి ఏ బ్లాగో గుర్తులేదుగానీ ఇదే కోరుకున్నా ఎప్పుడో రాబోయే ప్రళయం ఇప్పుడే రాకూడదా అని !చెన్నై లో సైకతశిల్పులు చేసిన శిల్పాలు పేపర్ లో చూసినపుడు మనసు కలచివేసిందండీ ...

  ప్రత్యుత్తరంతొలగించు
 11. "మనిషి కన్నా ప్రకృతి ఎప్పుడూ సుప్రీమే. మానుషుల మధ్య సంబంధాలు బలహీన పడుతున్న ప్రతిసారీ వారిని కలిపే పనికి ప్రకృతి పూనుకుంటుంది."
  మీరు చెప్పిన ఈ మాటలు అక్షర సత్యాలు.
  నాకైతే అప్పుడే ఐదేళ్ళు గడిచాయా అనిపిస్తోంది.. ఆ జ్ఞాపకం ఇంకా తడిగానే ఉంది :(

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @బోనగిరి: సునామీ అనుభవం తర్వాత యంత్రాంగం మీద దృష్టి పెట్టారండీ.. ఆ దిశగా ఇంకా కృషి జరుగుతూనే ఉంది.. ధన్యవాదాలు.
  @పరిమళం: ప్రస్తుత సమస్యలకి ప్రళయం పరిష్కారం కాదండీ.. ధన్యవాదాలు.
  @మధురవాణి: కాలం ఎక్కడా ఆగదు కదండీ.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు