గురువారం, డిసెంబర్ 10, 2009

నాలోనేను

ఆత్మవిశ్వాసానికీ, అహంభావానికీ మధ్య ఉన్నది అతి సన్నని రేఖ. మనకి ఆత్మవిశ్వాసంగా అనిపించిన భావనే ఎదుటివారికి అహంభావంగా కనిపించొచ్చు. 'నేను' అనుకోవడంలో ఆత్మవిశ్వాసం కొందరికి వినిపిస్తే, అహంభావం మరికొందరికి కనిపించొచ్చు. అది చూసే దృష్టికి సంబంధించిన విషయం. తెలుగు సినిమా రంగంలో 'బహుముఖ ప్రజ్ఞాశాలి' గా పేరు తెచ్చుకున్న భానుమతీ రామకృష్ణ ఆత్మకథ 'నాలోనేను' కూడా అంతే.

శాస్త్రీయ సంగీతం అయినా, సినిమా నటన అయినా లేదా జ్యోతిష్య శాస్త్రం అయినా.. తను అడుగు పెట్టిన రంగాన్ని పైపైన పరిశీలించి ఊరుకోకుండా, లోతుగా పరిశోధించి తనదైన ముద్ర వేయడం భానుమతి ప్రత్యేకత. తను ప్రవేశించిన ఏ రంగాన్ని గురించైనా సాధికారంగా, ముక్కుసూటిగా మాట్లాడడం భానుమతికే చెల్లు. ఫలితంగా ఆమె ఆత్మవిశ్వాన్ని చూసిన వాళ్ళ కన్నా, అహంభావాన్ని గురించి మాట్లాడేవాళ్ళే ఎక్కువ.

'అత్తగారి కథలు' ద్వారా ఆంధ్ర పాఠకులకి దగ్గరైన భానుమతి తన సుదీర్ఘ నట ప్రస్థానాన్ని 'నాలోనేను' పేరిట అక్షరబద్ధం చేశారు. చేయితిరిగిన రచయిత్రి కావడం వల్ల, చదివించే గుణం పుష్కలంగా ఉండేలా పుస్తకాన్ని తీర్చి దిద్దారు. 1994 సంవత్సరానికి గాను ఉత్తమ జీవిత చరిత్రగా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి పొందిందీ పుస్తకం. చిన్నప్పుడు తనని వీధిబడిలో చేర్చడంతో మొదలు పెట్టిన కథనం ఆద్యంతమూ ఆసక్తిగా సాగింది. స్కూలు వార్షికోత్సవంలో తొలిసారిగా లక్ష్మీదేవి, శ్రీరాముడి వేషాలు వేసిన జ్ఞాపకాలని అపురూపంగా గుర్తు చేసుకున్నారు భానుమతి.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మేకప్ అంతే మొదటినుంచే చిరాకేనట భానుమతికి. స్కూలు వార్షికోత్సవానికి అక్కమ్మ తనకి మేకప్ చేసిన ముహూర్తం బలమైనదని ఆమె నమ్మకం. భానుమతి తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారికి తన కూతురిని ఎమ్మెస్ సుబ్బులక్ష్మి అంతటి గాయనిగా చూసుకోవాలని కోరిక. అందుకోసం ప్రయత్నాలు చేస్తుండగానే 'వరవిక్రయం' సినిమాలో కాళింది పాత్రలో నటించే అవకాశం వచ్చింది ఆమెకి.

అటు ఇష్టం లేని నటన చేయలేక, ఇటు తండ్రిని నొప్పించలేక ప్రతిరోజూ ఏడిచే వారట ఆమె. అదొక్కటే కాదు, తను కంట తడి పెట్టిన సందర్భాల్ని ఆమె వివరిస్తుంటే పాఠకులకి ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే భానుమతికి ఏడిపించడమే తప్ప ఏడవడం తెలీదని బలమైన నమ్మకం మరి. ముక్కుసూటిగా మాట్లాడడం, నిక్కచ్చిగా వ్యవహరించడం భానుమతికి తండ్రి నుంచి వచ్చిన లక్షణాలు అనిపిస్తుంది, నిర్మాత, దర్శకులతో ఆమె తండ్రి వ్యవహరించిన తీరు చదివినప్పుడు.

కథానాయికగా నిలదొక్కుకుంటున్న కాలంలోనే రామకృష్ణతో ప్రేమలో పడ్డారు భానుమతి. పుస్తకం లో 'రామకృష్ణ ప్రేమ' చాప్టర్ చదువుతుంటే ఏదో సస్పెన్స్ నవల చదువుతున్న భావన కలుగుతుంది. ఇరు వైపులా తల్లి దండ్రుల ఇష్టానికి విరుద్ధంగా జరిగిన పెళ్లి వాళ్ళది. ఇంట్లోనుంచి పారిపోయిన క్షణాల్లో తన మానసిక స్థితిని ఆవిడ వర్ణించిన తీరు అపూర్వం. 'ఓహో..ఓహో.. పావురమా..' పాటకి స్ఫూర్తి ఒక ఆంగ్ల గీతం అని చెప్పినా, బెంగాలీ సినిమాలు చూపించి అక్కినేని నాగేశ్వర రావుకి తనూ, రామకృష్ణ నటన నేర్పించామని చెప్పినా భానుమతికే చెల్లింది.

తన వ్యక్తిగత జీవితం, సినిమా జీవితం, రచన వ్యాసంగం, ఇతర వ్యాపకాలతో పాటు ఆనాటి సామాజిక పరిస్థితులనూ పరామార్శ చేశాను భానుమతి. సినిమా రంగంలో వస్తున్న మార్పులనూ సూక్షంగా చెప్పారు తన ఆత్మకథలో. తను ప్రావీణ్యత సాధించిన ఒక్కో రంగాన్ని గురించీ ఒక్కో పుస్తకం రాయగలరు ఆమె. కానీ మొత్తం అంశాలన్నింటినీ కేవలం 246 పేజీల లోకి కుదించడం, ఎక్కడా సమగ్రత చెడకుండా జాగ్రత్తపడడాన్ని ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ముందుమాటలో డి.వి. నరస రాజు చెప్పినట్టుగా ఈ పుస్తకం చదవడం మొదలు పెడితే పూర్తి చేయకుండా పక్కన పెట్టలేం. (శ్రీ మానస పబ్లికేషన్స్ ప్రచురణ, వెల రూ. 125.).

15 వ్యాఖ్యలు:

 1. పుస్తకంలో నాకు బాగా నచ్చిన పార్ట్ ఆవిడ వివాహం గురించి ఆవిడ రాసిన చాప్టరే నండీ. ఆవిడ గురించి "కోతికొమ్మచ్చి"లో రమణ గారు రాసిన పేజీలు కూడా చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆవిడ "అత్తగారి కధలు" నాకు భలే నచ్చుతాయండీ.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చింది భానుమతి-రామకృష్ణల ప్రేమ-వివాహ ఘట్టం. ఒకరచయిత్రిగా ఆమె గురించి అంత అవగాహనలేని నేను చాలా ఆశ్చర్యపడ్డాను. కళ్ళకు కట్టినట్టు , చాలా సహజంగా ఉంటుందా చాప్టర్.. అలానే కోడలి గురించి ఏదాపరికం లేకుండా రాయడం కూడా..ఆమె అభిమానులు తప్పక చదవదగ్గ పుస్తకం..

  ప్రత్యుత్తరంతొలగించు
 3. భానుమతి నాలో నేను పుస్తకము గురించి నాకు తెలీదండి . అత్తగారికథలు నాదగ్గర వుంది . ఆ పుస్తకము ఎన్నిసార్లు చదివానో లెక్కలేదు . ఈ పుస్తకము కూడా తెచ్చుకుంటాను . భానుమతి గురించి బాగా చెప్పారండి .

  ప్రత్యుత్తరంతొలగించు
 4. ఈ పుస్తకం చదివినప్పటి నా మానసిక పరిస్థితి కారణమో మరిఎందుకో తెలియదు కానీ ఈ పుస్తకంలో కొన్ని సంఘటనలు మాత్రం చదివి పక్కన పెట్టాను, మీ పరిచయం చదివాక మళ్ళీ ఒక సారి పూర్తిగా చదవాలని అనిపిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మురళి గారు ఈ పుస్తకం ఆత్మకథ లాగా కాకుండా మనకి ఎన్నో అంశాలను తెలియ చేస్తుంది. ప్రతి అంశమూ చదవ దగ్గదే. అనుభవాలను మమూలుగా కాకుండా, ఆసక్తికరం గా రాయటంలో ఆమెకి ఆమే సాటి. అవునండీ, ఈ బుక్ పూర్తి అయే వరకు అస్సలు వొదలబుద్ధే కాలేదు. మీ పరిచయం కూడా చాలా బాగుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. భానుమతిగారి నటనలో పాత్రలు కూడా ఆవిడ నిజప్రవృత్తికి దగ్గరగా ఉంటాయేమో అనిపిస్తుంది మీ "నాలోనేను" పరిచయం చదివాక !

  ప్రత్యుత్తరంతొలగించు
 7. నేను మీరన్న ఈ రెండు రచనలూ చదివానండి.

  "అర్హతగలవారికి అహంకారం ఒక అలంకారం" ఒకవేళ ఆమె ఆత్మవిశ్వాసాన్ని అంగీకరించనివారు ఈ సూత్రం ఆపాదించి వదిలేస్తారులెండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 8. చక్కటి పరిచయం. నాకు భానుమతి గారి సినిమాలు చూడటం భలే సరదా.!
  కానీ, ఆవిడ రచనలు ఎప్పుడూ చదవలేదు. ఈ మధ్యే ఆవిడ 'అత్తా గారి కథలు' దొరికాయి నాకు.
  త్వరలో అవి చదివేయ్యాలి. దొరికితే మీరు చెప్పిన పుస్తకం కూడా చదవాలనిపిస్తుంది మీ ఆసక్తికరమైన పరిచయం చూశాక.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. అనేక మగ తారల అహాన్ని వారి సహజగుణంగా అంగీకరించేసే మనం, భానుమతి దగ్గరికి వచ్చేప్పటికి ఎందుకో ఆవిడ అహంకారానికి ముక్కున వేలేసుకుంటాం.
  మంచి పరిచయం మురళి గారూ.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. నాకు భానుమతిగారి నటన అన్నా, ఆవిడ ఒవర్ యాక్షన్ అన్నా (అభిమానుల మనోభావాలు దెబ్బతింటే క్షమించెయ్యండి) మహా చిరాకు, కానీ నాకు ఆవిడలో నచ్చేది మాత్రం ఆవిడ విగ్రహంలో అణువణువునా ఒలికే ఠీవీ, కళ్ళల్లో ప్రస్పుఠించే ఆత్మవిస్వాసం, మాటతీరులోని ముక్కుసూటితనం. ఆవిడ అత్తగారి కథలకు మాత్రం నేను వీర ఫాన్ ని.

  వచ్చే వారంలోపల మీ బ్లాగులోని పుస్తకపరిచయాలన్నీ చదివేసి ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి అని గాట్టిగా తీర్మానించేసుకున్నా. హైదరబాదు పుస్తక ప్రదర్శనశాలలో నో, ఈ గొడవల వల్ల అది మొదలు కాకపోతే విశాలాంధ్రా పుస్తకశాలలోనో ఇవన్నీ కొనేసి చదవాలి. క్రిస్మస్ సెలవులకి నా అజెండా అది :)

  ప్రత్యుత్తరంతొలగించు
 11. @రాజా: ధన్యవాదాలండీ..
  @తృష్ణ: ముళ్ళపూడి కూడా కళ్ళకి కట్టినట్టు రాశారండీ.. ముఖ్యంగా సిగరెట్ సీన్.. ధన్యవాదాలు.
  @ఉమాశంకర్: ఆమె అభిమానులు మాత్రమే కాదండీ, తెలుగు సినిమా అంటే ఇష్టం ఉన్నవాళ్ళంతా చదవొచ్చు.. ఇది కేవలం ఆమె కథ మాత్రమేకాదు.. తెలుగు సినిమా చరిత్ర .. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 12. @మాలాకుమార్: తప్పక చదవండి.. నిరాశ పరచదు మిమ్మల్ని.. ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: కూల్ గా ఉన్నప్పుడు తీసి చదవండి.. పది పేజీలు అయ్యేసరికి లీనమైపోతారు.. (స్వానుభవం) ధన్యవాదాలు.
  @జయ: నిజమేనండీ.. కేవలం ఆత్మకథ అనిపించదు.. బహుశా ఆవిడ స్టేచర్ వల్ల కావొచ్చు.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. @పరిమళం: నిజమేనండీ.. నాకూ అదే భావన కలిగింది.. ధన్యవాదాలు.
  @మరువం ఉష: నిజమేనండీ.. అహంకారమైనా అది భానుమతికి అలంకారమే.. ధన్యవాదాలు.
  @మధురవాణి: మీరు 'పెద్దరికం' చూశారా? కొంచం కష్టపడి జగపతి బాబుని భరించ గలిగితే మంచి సినిమా.. ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. @కొత్తపాళీ: బహుశా ఆవిడ మహిళ కావడం, అడుగు పెట్టిన చాలా రంగాల్లో 'తొలి మహిళ' కావడం వల్ల అనుకుంటానండీ.. ఆవిడ "ఆడదానికి అంట పొగరేమిటి?" అనుకున్న కాలంలో మనిషి కదా.. ధన్యవాదాలు.
  @లక్ష్మి: నటిగా భానుమతి నచ్చకపోయినా, దాని ప్రభావం ఈ పుస్తకం చదవడం మీద ఉండదండీ.. నాదీ హామీ.. ఎందుకంటె ఆవిడ తన నటన గురించి రాసింది చాలా తక్కువ.. అన్నట్టు నా బ్లాగు ఒక్కటే కాదు.. కూడలి, జల్లెడ లోని బ్లాగులు గాలించి తయారు చేసుకోండి జాబితా.. ఏడాదికి ఒక్కసారే పుస్తకాల షాపింగ్ అంటే భారీగానే కొనాలి మరి:):) ..ధన్యవాదాలు.

  ప్రత్యుత్తరంతొలగించు