ఆదివారం, డిసెంబర్ 20, 2009

కలల అలజడి

కల.. నిద్ర లేవగానే నెమరువేసుకునే ఒక జ్ఞాపకం.. అసలు కలలు ఎందుకు వస్తాయి? నిజానికి ఇదో పెద్ద టాపిక్.. పెద్ద పెద్ద శాస్త్రవేత్తలంతా సుదీర్ఘ పరిశోధనలు చేసి చాలా పుస్తకాలు రాశారు. మానవ మనస్తత్వానికీ, కలలకీ ఉన్న సంబంధాన్ని విశ్లేషించారు.. ఒక మనిషికి వచ్చే కలలని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వాడో తెలుసుకునే సిద్ధాంతాలు రూపు దిద్దారు.. ఇదంతా హైలీ ఇంటలెక్చువల్ పీపుల్ కి సంబంధించిన విషయం.

కానీ కలలు కేవలం మేధావి వర్గానికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. నిద్రపోయే ప్రతి జీవికీ.. అవును ప్రతి జీవికీ..కలలు వస్తాయి. కొన్ని అందమైనవి, మరికొన్ని భయపెట్టేవి. "నిద్రలో అందమైన కలొస్తే మేలుకోం.. ఆ కలని ఆస్వాదిస్తాం. అదే పీడ కలొస్తే.. నిద్ర మేల్కొంటాం," అంటుంది 'గమ్యం' సినిమాలో సరస్వతి పాత్ర. కథానాయకుడు అభిరాం కి నాయిక జానకి గురించి చెప్పేటప్పుడు ఆమె కలని ఉదహరిస్తుంది. పీడకల మనిషిని హెచ్చరిస్తుంది అంటుంది.

నిజమే కదా.. అందమైన కలొస్తే మళ్ళీ మళ్ళీ అదే కల రావాలని కోరుకుంటాం. ఎప్పుడు ఆ కల వస్తునా అని ఎదురు చూస్తాం. అదే పీడకల అయితే మళ్ళీ రాకపోతే బాగుండు అనుకుంటాం.. కొండొకచో వస్తుందేమో అని భయపడటం. చాలా ఏళ్ళ క్రితం నాకో పీడ కల వచ్చింది.. ఒకరోజు, రెండు రోజులు కాదు.. దాదాపు సంవత్సరం పాటు తరచూ వచ్చేది. ప్రతి సారీ కల చివర్లో హఠాత్తుగా మెలకువ రావడం, మంచినీళ్ళు తాగి నిద్రకి ఉపక్రమించడం..

అప్పట్లో మాటల సందర్భంలో ఒక మిత్రుడికి ఈ కల గురించి చెప్పాను. సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంత కోణం నుంచి ఆయన నా కలని విశ్లేషించిన తీరు చూశాక, ఇంకెప్పుడూ ఏ కల గురించీ ఎవరితోనూ చర్చించ కూడదని నిర్ణయించేసుకున్నాను. ఇంతకీ ఆ కల రావడం ఉన్నట్టుండి ఆగిపోయింది. ఇప్పుడు రమ్మన్నా రావడం లేదు. కల రావడం, రాకపోవడం మన చేతుల్లో లేదు కదా. చిన్నప్పుడు నేను చదివిన కథలు కలల్లోకి వచ్చేవి.

ఐదో తరగతి లో ఉండగా అనుకుంటా, ఒక కథ చదివి జ్వరం తెచ్చుకున్నా.. (కథ ఇప్పటికీ లీలగా గుర్తుంది, మామూలు కథే.. అప్పుడు సరిగా అర్ధం కాలేదు) చేసిన పొరపాటు ఏమిటంటే, డాక్టరు గారు ప్రేమగా మాట్లాడుతుంటే కథ చదివి భయపడ్డ విషయం చెప్పేశాను. ఫలితంగా పబ్లిగ్గా కథలు చదివే అవకాశం చాలా రోజులపాటు కోల్పోయాను. రహస్యంగా చదవడం, దొరికిపోవడం, దెబ్బలు తినడం..అదంతా వేరే కథ.

పొరుగూరు హైస్కూలికి నడుచుకుంటూ వెళ్లి వచ్చేటప్పుడు, చెప్పుకోడానికి కథలేమీ లేకపొతే మాకొచ్చిన కలల గురించి చెప్పుకునే వాళ్ళం. అప్పట్లో అందరికీ లెక్కల మేష్టారు, డ్రిల్లు మేష్టారు ఎక్కువగా కలలోకి వచ్చే వాళ్ళు. కాలేజీ రోజుల్లో కూడా కొన్ని కలలు చెప్పుకోడానికి భలే వీరోచితంగా ఉండేవి. నాకు ఏదైనా సినిమా బాగా నచ్చితే అది మొత్తం కలలోకి వచ్చేస్తుంది, డైలాగులు, సంగీతంతో సహా.. కానీ ఎప్పుడైనా మధ్యలో మెలకువ వస్తే, ఇక కల అక్కడితో ఆగిపోతుంది.

మనం బాగా మానసిక ఒత్తిడికి గురయినప్పుడు పీడకలలు వస్తాయని, సంతోషంగా ఉన్నప్పుడు అందమైన కలలు వస్తాయని నా చిన్న పరిశీలన. ఒకే కల రిపీట్ కావడం అన్నది పీడకలల విషయంలో జరిగినంత తరచుగా అందమైన కలల విషయంలో జరక్క పోవడం ఒక విషాదం. కల్లోకొచ్చిన పిల్లని హీరో ప్రేమించి పెళ్లి చేసుకోడం అన్నది వెండితెరకి సూపర్ హిట్ ఫార్ములా అయి కూర్చుంది.. సినిమా నాయికా నాయకులది ఏంపోయింది.. విదేశాల్లో డ్యూయెట్లు పాడుకుంటున్నట్టు కలగనేస్తారు.. ఖర్చు నిర్మాతదే కదా పాపం.

ఇక కలల మీద వచ్చిన సినిమా పాటలకైతే కొదవే లేదు. ఒకటా రెండా.. ఎన్నని చెప్పాలి? ప్రేమ గీతమైనా, విరహ గీతమైన కల అనేది ఒక కరిగిపోని కవితా వస్తువు సిని గేయ రచయితలకి.. "కలల అలజడికి నిద్దుర కరవై.. అలసిన దేవేరి అలమేలు మంగకీ.. తెలవారదేమో స్వామీ.." అని 'శ్రుతిలయలు' సినిమా కోసం సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన పాటని అన్నమాచార్య కీర్తన అనుకుంటారు చాలామంది. జేసుదాసు పాడిన విధానం ముఖ్యంగా 'కలల అలజడికి' అని పలికే విధానం నాకు బాగా ఇష్టం.. ఇవీ కలల గురించి కొన్ని కబుర్లు.

20 కామెంట్‌లు:

  1. “మనం బాగా మానసిక ఒత్తిడికి గురయినప్పుడు పీడకలలు వస్తాయని, సంతోషంగా ఉన్నప్పుడు అందమైన కలలు వస్తాయని నా చిన్న పరిశీలన”
    నిజమే కావచ్చు . మనం ఎకువగా ఏ విషయాన్ని గురించి ఆలోచిస్తామో ఆ విషయానికి సంబంధించిన కలలు వస్తాయి.
    నేను చిన్నప్పుడు చెస్ నేర్చుకున్న రోజు రాత్రి కలలో అన్నీ నలుపు తెలుపు గడులె.

    రిప్లయితొలగించండి
  2. :) బాగున్నాయి మీ కలల కబుర్లు... చిన్నప్పుడు నాకు ఒక కల పదే పదే వస్తుండేది. అదేంటంటే మా చిన్నక్క ఏదో తినే పదార్ధాన్ని ఇద్దరికీ సగం సగం పంచకుండా తను పెద్ద ముక్క తీసుకుని నాకు చిన్నముక్క ఇచ్చేస్తున్నట్టు..ఇక చూస్కోండి నిద్దరలోనే గొప్ప కోపం వచ్చేసి మా అక్క చెయ్యనుకుని తలగడని కొరికేసేవాడినంట...అప్పటినుండి మా అమ్మ నాకు ప్రతీది పెద్దముక్క ఇవ్వడం చేస్తేగానీ నా కల కరగలేదు..:)

    రిప్లయితొలగించండి
  3. కల గంటి కల గంటి ఇప్పుడిట కలగంటి మురళి గారొక పోస్ట్ కలలపై రాస్తారనీ.... కలగంటి కలగంటి.. :-) బాగుందండి కలల కథ.

    రిప్లయితొలగించండి
  4. మురళీగారు మీ కలల కబుర్లు బాగున్నాయండి!
    నాకు తెలిసి ప్రేమకి కలలు కనడం జన్మహక్కండి:)

    రిప్లయితొలగించండి
  5. పాపం కలకి భయపడి దొంగకథల బుల్లెబ్బాయయ్యారన్నమాట. ;) నాకూ కలలని విశ్లేషించుకోవటం చాలా ఇష్టమండి. పీఢకలలు రావటం చాలా అరుదు. విచిత్రం, అర్జునుడిబాణాలు ప్రదీప్ గారి తాజా కవిత కలల మీదే.

    మళ్ళీ లోతుగా ఆలోచించే పని లేదు. నా వ్యాఖ్యనే కాపి కొట్టుకుని ..

    కలలని సాక్షాత్కారం చేయగ చేసే తపస్సు నిదుర.
    కలలని సాకారం చేయగ నిలిచే ఉషస్సు నీదేగా.

    కలలు కరగవు చెరగవు మరుగవవు
    ఎద లయలో కొలువై మెదులుతూనేవుంటాయి.
    కలలు, నా కలలు కల్లలు కాని కలలు
    వూహా కన్నియలై, ఉరిమే మేఘాలై
    వూగే పూరెమ్మలై, తూగే తూనీగలై
    నేనన్న నిజాన్ని నాకు నిరూపిస్తూ..

    *** నాకు కలలు గుర్తు చేసుకుని కొరిలేట్ చేసుకోవటం చాలా ఇష్టం. అందుకే నిద్ర లేవగానే వచ్చిన కలని పలకరిస్తూ నాతోనే ఆపేస్తాను. చెరగనీయను

    రిప్లయితొలగించండి
  6. కలల అలజడి బావుంది.. :)
    అంతకుముందు నాకు వెరైటీ కలలు వస్తుండేవి.. కానీ, ఇప్పుడు మాత్రం నా కోడ్‌బేస్, మా బాసాసురుడు అధవా క్లైంట్ మహాశయుడు తప్పించి మిగతా ఏమీ కలలోకి రావడం లేదు...

    రిప్లయితొలగించండి
  7. మొత్తానికి కలల లోకంలో మీరు విహరించి నన్ను విహరింపచేసేసారు కదా :)

    నాకు చిన్నప్పుడు ఎప్పుడూ వచ్చే కల (అంటే నేను కావాలని కనే కల) మైసూర్పాక్ తో ఇల్లు, అందులో ఎక్కడ చూసిన రసగుల్లాలూ... నా మిఠాయిల పిచ్చిని కలలో తీర్చేసుకునేదాన్ని.

    ఇంకొంచం పెద్దయ్యాక హిమక్రీముల వరద వచ్చినట్టు, అందులో నాతో పాటు నా దోస్తులు కూడా ఈత కొట్టుకుంటూ పొట్టపగిలేలా హిమక్రీములు లాగించినట్టూ...

    ఇప్పుడెంత సేపూ క్లయింటూ, రిక్వైర్మెంట్సూ...అదీ కథ

    రిప్లయితొలగించండి
  8. కలగురించి బాగా చెప్పారండి . నిజమే పీడకలలు రిపీట్ అయినట్లు మచి కలలు కావెందుకో ?

    రిప్లయితొలగించండి
  9. మురళిగారు , మీరేం రాసినా మాలోకి మేం తొంగిచూసుకోవలసి వస్తోంది...అనుకోకుండానే అసంకల్పిత ప్రతీకార చర్యలా ..అలా జరిగిపోతుందిమరి ! కలలకు విశ్లేషకులుంటారని తెలీదు. "సిగ్మండ్ ఫ్రాయిడ్ సిద్ధాంతం" ఈమాట యండమూరిగారి ఏదోఒక నవల్లో ఉపయోగించినట్టు గుర్తు !"స్వప్నాలు నిగూఢ వాంఛలను అర్థం చేసుకోవటానికి సోపానాలు "అని ప్రతిపాదించినట్టు మాత్రమే చదివాను కాని నాకు వాటిని విశ్లేశించటమెలాగో దానిగురించి తెలీదు కొంచెం వివరంగా చెప్పగలరా ? లేదా ఈ టాపిక్ తెలుగు అనువాదం ఉందా తెలియచేయగలరా.....ప్లీజ్ !

    @ శేఖర్ గారు :) :)

    రిప్లయితొలగించండి
  10. లక్ష్మి గారి చిన్నప్పటి కల సూపర్ :))

    నాకు ఇప్పటికీ వచ్చే కల రేపట్నించీ పరీక్షలైతే ఇవాళ్టి రాత్రి నా పుస్తకాలు కనబడక ఇల్లంతా చిందరవందర చేస్తూ వెతికేస్తుంటాను :-)

    @ "ఫలితంగా పబ్లిగ్గా కథలు చదివే అవకాశం చాలా రోజులపాటు కోల్పోయాను."
    నేనూ షాడో పుస్తకాలు చదవడం మొదలుపెట్టిన మొదట్లో, నిద్దట్లో యాక్షన్ సీన్లన్నీ చేస్తే మా నాన్నగారు మరునాడు ఉదయం పళ్ళుకూడా తోమకముందే ఆ పుస్తకాలన్నిటిని వాటి రహస్య ప్రదేశాలనించి వెలికితీయించి చెత్తకుప్పలో పారేయించారు! :-)

    రిప్లయితొలగించండి
  11. కొన్నికలలు బాగా గందరగోళంలో పడేస్తాయండీ. ఆరోజంతా దానిప్రభావం ఉంటుంది. స్కూల్లో చదివేరోజుల్లో రాత్రంతా కల్లో ఫీల్డింగ్ నిలబెట్టేవాడీని. ఎవడైనా కాచ్ వదిలారో పక్కన పడుకున్నవాళ్ళు అయిపోయారే.
    కాలేజీకెళ్ళాక కలల్లోకి వేరెవరో వస్తారని ఫ్రెండ్స్ అనుకునేవాళ్ళం . ప్చ్. ఆకలలకోసం ఎదురుచూసి చూసి నాచదువైతే అయిపోయింది కానీ నిరాశే ఎదురయ్యింది.
    మాపిన్నీకూతురైతే నిద్రలోనే పాఠం అంతా ఒప్పచెప్పేస్తుంది.

    రిప్లయితొలగించండి
  12. మంచి విషయం రాసారండీ. జెర్మన్ సైకాలజిస్ట్ Sigmund Freud తన పుస్తకం "The Interpretation of dreams" లో కలల గురించి చెప్పిన unconcious wish-fulfillment సిధ్ధాంతాన్నే నేను చాలా ఏళ్ళ క్రితం కొన్న Sri Arobindo writings and Mother writings extracts ఉన్న ఒక పుస్తకంలో చదివాను. ఏది ఏమైనా కలలకూ, మనిషి మనస్థత్వానికీ చాలా దగ్గర సంబంధం ఉంది. పీడకలకైనా, మంచి కలలకైనా మన "సబ్కాన్షియస్ మైండ్" లో తిరగాడే రకరకాల భావాలే కారణం. మానసిక స్థితిని బట్టి కొన్ని మనం అర్ధం చేసుకోగలం. కొన్నింటిని చేసుకోలేము...

    నాకు ఒకేలాంటి కల 5,6 ఏళ్ళపాటు వచ్చిందండీ. ఒక రెండేళ్ళ నుంచీ ఇక రాలేదు.. అంటే నా కలకు సంబంధించిన విషయం లోని భయం నాకు అప్పటికి పోయిందన్నమాట.

    రిప్లయితొలగించండి
  13. @అప్పారావు శాస్త్రి: నన్ను లెక్కలూ, ఎక్కాలూ చాలా రోజులు కలవర పెట్టాయండీ :) ధన్యవాదాలు.
    @శేఖర్ పెద్దగోపు: మీ కల వెనుక ఏదో కుట్ర ఉందని నా అనుమానం (పెద్ద వాటా కొట్టేయడానికి).. మొత్తానికి లాభదాయకమైన కల గన్నారు కదా :):) ..ధన్యవాదాలు.
    @భావన: హమ్మో.. మీకు కల్లో తెలిసిపోయిందా..!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  14. @పద్మార్పిత: మీతో ఏకీభవిస్తున్నానండీ.. ధన్యవాదాలు.
    @మరువం ఉష: ఏం చెయ్యమంటారు చెప్పండి.. అలా దొరికిపోయాను.. ధన్యవాదాలు.
    @మేధ: విశాలాంధ్ర స్టాల్లో ఏం జరిగిందో రాయకపోయారంటే మేమందరం కూడా కలలోకి వస్తాం :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @లక్ష్మి: అబ్బ!! మిఠాయిల విషయంలో నాకు సమ ఉజ్జీ దొరికారు.. ప్చ్.. నాకెప్పుడూ స్వీట్స్ కలలోకి రాలేదండీ.. కాకపొతే అప్పుడప్పుడు చక్కర రాశుల్లో ఆడుకుంటున్నట్టు కలొచ్చేది :):) ..ధన్యవాదాలు.
    @మాలాకుమార్: నాకూ అదే బాధగా ఉందండీ.. ధన్యవాదాలు.
    @పరిమళం: కలల మీద తెలుగులో చాలా పుస్తకాలే ఉన్నాయండీ.. కాని వాటి 'సాధికారికత' గురించి చెప్పడం కష్టం.. పుస్తక ప్రదర్శనలో చూడండి, కనిపిస్తాయి :):) ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @నిషిగంధ: మీరూ 'కల' బాధితులే అన్నమాట!! నాకు చిన్నప్పుడు, ముఖ్యంగా టెన్త్, ఇంటర్ లో పరీక్షా రాసి హాల్ టిక్కెట్ నంబర్ వేయడం మర్చిపోయినట్టు కలొచ్చి, భలే భయమేసేదండీ.. ధన్యవాదాలు.
    @సుబ్రహ్మణ్య చైతన్య: కాలేజీ కలల విషయంలో నేను మీకు తోడున్నాను కదా.. మిత్రులు చెప్పే కళలు వింటుంటే ఒక్కోసారి అవి కథలేమో అన్న డౌట్ వచ్చేది నాకు.. ధన్యవాదాలు.
    @తృష్ణ: ఫ్రాయిడ్ ని గురించి చాలా చోట్ల చదివాను కానీ, ఆయన రాసినవేవీ చదవలేదండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @ తృష్ణ .. ఫ్రాయిడ్ ఆస్ట్రియా దేశస్థుడు.

    నాకు చిన్నప్పుడు పరీక్షలకి సంబంధించి చాలా కలలొచ్చేవి, పరీక్ష మధ్యలో పెన్నులో ఇంకైపోయినట్టు, పది పేజీలు ఆన్సర్లు రాసేశాక వెనక్కి తిప్పి చూస్తే కాయితాలన్నీ తెల్లగా ఉన్నట్టు, నే వెళ్ళిన పరీక్ష నిన్ననే జరిగిపోయినట్టు. ఇలాగ .. అందుకే పీహెచ్‌డీ కేండిడెసీ పరీక్ష తరవాత ఇంక జన్మలో పరీస్ఖలు రాయనని ఒట్టేసుకున్నా. ఏదో ఆ పైవాడి దయవల్ల అలా నడుస్తోంది. :)

    రిప్లయితొలగించండి
  18. @కొత్తపాళీ: మీకేదో 'పరీక్షల ఫోబియో' లాంటిది ఉన్నట్టు అనుమానంగా ఉందండీ :):) హైస్కూలు దాటేశాక పరిక్షలేప్పుడూ నన్ను భయపెట్టలేదు!! ..ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  19. I have a doubt on dreams. Are the dreams in black n white or color? When ever I got a dream, i tried to figure it out, But unfortunately i didnt remember the backgorund, but the dream will last for along time. Really I m so curious to know this. Do we dream in Color or Black n White.? :) (I May be silly.)

    రిప్లయితొలగించండి
  20. @Damo': చాలా ఆసక్తికరంగా ఉంది మీ సందేహం.. నా కలలు మాత్రం రంగులలోనే వస్తాయండీ.. కలగా కాక జరుగుతున్నట్టుగా అన్నమాట.. ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి