ఆదివారం, నవంబర్ 22, 2009

ప్యాసా

కొన్ని సినిమాలు ఉంటాయి. వాటిని చూడకుండానే మనం వాటి గురించి మాట్లాడేయగలం. ఎందుకంటే వాటిమీద అప్పడికే ఒక ముద్ర పడిపోయి ఉంటుంది. దానితో మనకి ఆ సినిమా గురించి మాట్లాడ్డం సులభమైపోతుంది. గురుదత్ సినిమా 'ప్యాసా' మీద పడ్డ ముద్ర 'ఏడుపుగొట్టు సినిమా' అని. నిజమేనా? యాభైరెండేళ్ళ క్రితం వచ్చిన ఈ సినిమాలో ఏడుపు తప్ప ఇంకేమీ లేదా?

సున్నిత హృదయాల సంఘర్షణ, కాలం చేసే గారడీని తట్టుకోలేని నిశ్చేష్టత, విధికి ఎదురీదలేని దైన్యత, ఎన్ని సమస్యలు ఎదురైనా చెక్కు చెదరని, వన్నె తరగని మానవత్వం, సున్నితత్వం.. ఇవన్నీ కనిపిస్తాయి 'ప్యాసా' (దాహార్తి) లో. బతక నేర్వని కవి విజయ్ (గురుదత్) బతక నేర్చిన అతని (ఒకప్పటి) ప్రియురాలు మీనా (మాలా సిన్హా) అతనిలోని కవిని ఆరాధించి, అతన్ని ప్రేమించే వేశ్య గులాబో (వహీదా రెహమాన్) ల కథ ఇది.

తెర మీద కథానాయకుడి పాత్రతో పాటు, తెర వెనుక రచన, నిర్మాణం, దర్శకత్వ బాధ్యతలు చూసింది గురుదత్తే.. అందుకే ఇది నూటికి నూరుశాతం గురుదత్ సినిమా. కథాకాలం దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి రోజులు. కాలేజీ చదువు పూర్తి చేసిన విజయ్ ఉద్యోగ ప్రయత్నాలలో విసిగి వేసారి, చిన్న చిన్న కూలిపనులు చేస్తూ ఉంటాడు. వృద్ధురాలైన తల్లి, అతన్ని పోషించడం బరువుగా భావించే ఇద్దరు అన్నలు. ఇదీ అతని నేపధ్యం.

విజయ్ యెంతో ఇష్టంగా రాసుకున్న కవిత్వాన్ని చిత్తుకాగితాలుగా అమ్మేస్తారు అతని అన్నలు. షాపులో అనుకోకుండా వాటిని చదివి, ముచ్చట పడి కొనుక్కుంటుంది గులాబో. మరోపక్క పత్రికాఫీసులో తన కవితలు చిత్తు కాగితాల బుట్టలో పడేయడం తో ఆగ్రహించిన విజయ్ వాటిని తీసుకుని ఇంటికి వస్తాడు. అన్నలు చేసిన పని తెలిసి వాళ్ళతో గొడవ పడతాడు. ఇదే అవకాశమని అతన్ని ఇంటి నుంచి గెంటేస్తారు అన్నలు.

పార్కులో తన కవితని పాడుతున్న గులాబో ని చూసి, మిగిలిన కవితల కోసం ఆమెని అనుసరిస్తాడు విజయ్. అతను 'కష్టమర్' అనుకుని ఇంటికి తీసుకెళ్తుంది ఆమె. అతనో బికారి అని తెలిసి వెళ్ళగొడుతుంది. ఆ తర్వాత తన దగ్గరున్నవి అతని కవితలే అని తెలిసి అతనిమీద ఇష్టం పెంచుకుంటుంది గులాబో. పని వెతుక్కుంటున్న విజయ్ కి మీనా ఎదురు పడుతుంది. నగరం లో పెద్ద ప్రచురణ కర్త ఘోష్ భార్య ఆమె.

ఘోష్ దగ్గర పనివాడిగా చేరతాడు విజయ్. మీనా-విజయ్ ల ప్రేమ గురించి తెలిసిన ఘోష్ అతన్ని పని నుంచి తీసేస్తాడు. రైలు కింద పడి ఒక వ్యక్తి మరణించడం, అతని వంటి మీద విజయ్ కోటు ఉండడంతో అందరూ చనిపోయింది విజయ్ అనే అనుకుంటారు. తన నగలు ఖర్చు పెట్టి ఘోష్ ద్వారా విజయ్ కవితల్ని అచ్చు వేయిస్తుంది గులాబో. విజయ్ ఆత్మహత్య వార్త కారణంగా ఆ పుస్తకాలకి యెనలేని డిమాండ్ వస్తుంది. ఇంతలో విజయ్ బతికే ఉన్నాడన్న వార్త తెలుస్తుంది.

విజయ్ బతికి ఉన్నాడని పాఠకులకి తెలిస్తే అతని పుస్తకాలకి డిమాండ్ ఉండదని భావించిన ఘోష్, అతని సోదరులని, మిత్రులని డబ్బుతో కొని, విజయ్ జీవించి లేడని ప్రచారం చేస్తాడు. ఘోష్ కారణంగా పిచ్చాసుపత్రిలో చేరి, అక్కడినుంచి తప్పించుకున్న విజయ్ భారీ ఎత్తున జరుగుతున్న తన సంస్మరణ సభకి హాజరవుతాడు. అతని కవితలు తిరస్కరించిన పత్రికా సంపాదకుడు విజయ్ ని గుర్తు పడతాడు. అతను బతికే ఉన్నాడని చెప్పడం ద్వారా, అతని చేత కవితలు రాయించి సొమ్ము చేసుకోవాలని పథకం వేస్తాడు ఆ సంపాదకుడు.

తన అన్నలు, మిత్రులు తన కళ్ళ ఎదుటే తను జీవించి ఉన్నాడా, మరణించాడా అని చెప్పడానికి బేరాలు కుదుర్చుకోడం చూసి చలించిపోతాడు విజయ్. సంపాదకుడు ఏర్పాటు చేసిన సభలో తాను విజయ్ ని కాదని చెబుతాడు. జనం కొట్టిన రాళ్ళ దెబ్బలు తిని, గులాబోతో కలిసి అస్తమిస్తున్న సూర్యుడి వైపు నిడిచి వెళ్ళిపోతాడు విజయ్. సినిమా ప్రారంభ సన్నివేశంలో జనం కాళ్ళ కింద పడి నలిగిపోయే పూలని చూసి బాధ పడడం మొదలు, ప్రతి సన్నివేశం లోనూ విజయ్ లోని సున్నితత్వాన్ని చూడొచ్చు.

మీనా తనకి ఎదురు పడినప్పుడు, తల్లి మరణ వార్తని సోదరులు తనకి చెప్పలేదని తెలిసినప్పుడు, వేశ్యా వాటికలో స్త్రీల జీవితాన్ని చూసినప్పుడు, 'తన' వాళ్ళంతా డబ్బు కోసం తను చనిపోయాడని చెప్పడానికి సిద్ధ పడ్డ సన్నివేశంలోనూ గురుదత్ నటన గుర్తుండి పోతుంది. తర్వాత చెప్పుకోవాల్సింది వహీదా రెహమాన్ గురించి. ఈ తెలుగు నటికి తొలి హిందీ సినిమా ఇది. క్లిష్టమైన పాత్రని సమర్ధంగా చేసింది. క్లోజప్ దృశ్యాల్లో చూపిన ఆమె కళ్ళు సినిమా పూర్తైనా వెంటాడతాయి. మాలా సిన్హాది గ్లామర్ పాత్ర. మాలిష్ చేసే సత్తార్ పాత్రలో జానీ వాకర్ నవ్వించడమే కాదు, కథలో కీలక మలుపులకి కారణమవుతాడు కూడా.

ఎస్డీ బర్మన్ సంగీతం లో సాహిర్ లూధియాన్వీ రాసిన పాటలూ, పద్యాలూ సినిమాకి ప్రాణం పోశాయి. గీతా దత్, మహమ్మద్ రఫీ, హేమంత్ కుమార్ లు ఆలపించారు పాటల్ని. సన్నివేశాలకి తగిన నేపధ్య సంగీతం. అక్కడక్కడా సినిమా కొంచం సాగతీతగా అనిపిస్తుంది. కథానాయకుడిది పాసివ్ రోల్ కావడం ఇందుకు కారణం కావొచ్చు. తెలుగులో శోభన్ బాబు కథానాయకుడిగా వచ్చిన 'మల్లెపూవు' సినిమాకి స్ఫూర్తి 'ప్యాసా'నే. ('చిన్న మాటా. . ఒక చిన్న మాటా..' పాట 'మల్లెపూవు' లోదే) మోజర్ బేర్ విడుదల చేసిన డీవీడీ క్వాలిటీ బాగుంది. ఇంగ్లీష్ సబ్-టైటిల్స్ సౌకర్యం ఉంది. (వెల రూ. 45)

21 కామెంట్‌లు:

  1. ఈ చిత్రంలోని అన్ని పాటలు మనసుని హత్తుకుంటాయండి.....

    రిప్లయితొలగించండి
  2. బాబోయ్.....మీరు నా పి.సిలోకి దొంగతనంగా వచ్చి నేను రాయబోయే కొన్ని పోస్టులను చూసేస్తున్నారేమో అని నా అనుమానమండీ...ఇది అయిదొసారొ..ఆరో సారో...ఈ సినిమా మీద రాయటానికి ముందుగా గురుదత్ మీద రాయాలని బోలేడు notes తయారు చేసుకున్నానిక్కడ.... :(

    Gurudatt is one of my most favourite directors. And the songs in this film are simly superb....

    "ये दुनिया अगर मिल भि जायॆ तो क्या है...."

    "जाने वो कैसे लॊग थॆ जिन्कॆ प्यार को प्यार मिला
    हम नॆ तो जब कलिया मांगी कलियॊं का हार मिला..."

    ఈ రెండు పాటలూ నాకు చాలా ఇష్టమైన పాటలు.... ఇంకా మిగిలినవి కూడా చాలా బాగుంటాయి.....

    "जानॆ क्या तुनॆ कहि जाने क्य मैनॆ सुनी...बात कुच बन ही गयी..."

    "जिन्हॆ नाज है हिंद पर वोह कहा है..."

    "सर जो तेरा चक्ररायॆ...या दिल डूबा जायॆ..." పాట "జానీ వాకర్" కు బాగా పేరు తెచ్చిపెట్టింది.

    And people who say this is "ఏడుపుగొట్టు film" are foolish. Totally this is one of some great films which leave a very special impact on our minds and hearts...

    రిప్లయితొలగించండి
  3. బాగుంది. నాకిష్టమైన సినిమాల్లో ఇదోకటి.

    రిప్లయితొలగించండి
  4. ఇంతకు ముందు ఈ సినిమా సమీక్ష 'సాక్షీ' లో వచ్చే బాలివుడ్ క్లాసిక్స్ శీర్షికలో ఖదిర్ బాబు గారు రాసింది చదివాను. అప్పుడే అనుకున్నాను చూడాలని. కానీ నాకు కూడా ఏడుపుసినిమా అన్న ఇంప్రెషన్ కలిగింది. ఇప్పుడు మీ రివ్యూ చదివాక ఖచ్చితంగా సీ.డి కొనుక్కుని చూడాలని నిర్ణయించుకున్నాను.

    రిప్లయితొలగించండి
  5. పరిచయం ఎప్పటి లానే బాగుంది మురళి గారు. కానీ సినిమాలో ఎన్ని ఉన్నా అన్నిటి వెనుకా అంతులేని విషాదం మాత్రమే కనిపిస్తుంది నాకెందుకో.. అందుకే ఇది కానీ మల్లెపువ్వు కానీ పూర్తిగా ఒకేసారి కూర్చుని చూడలేకపోయాను ఇంతవరకూ.

    రిప్లయితొలగించండి
  6. గురుదత్ ‘ప్యాసా’ సమీక్షపై ఒక సమీక్ష
    http://navatarangam.com/2008/07/review-of-the-review-of-pyasa/

    రిప్లయితొలగించండి
  7. Nenu ee cinema ni ippatiki chala sarlu chusanu, chusinappudu alla naku oka vishyam anipistundi, apptlo prajalu(50-60's) ippati laage ante swardam ga vundevaara ani?

    రిప్లయితొలగించండి
  8. నేను కాలేజి చదివే రోజుల్లో హాస్టలు కేఫ్టీరియా వాడు వేసే పాటల్లో తొలిసారిగా ఈ పాటలు విన్నా. భాష అర్ధం కాకపోయినా సమ్మోహితుణ్ణి అయిపోయా. ఉర్దూ వచ్చిన ఒక స్నేహితుడి సాయంతో జానె వొ కైసే సాహిత్యం తెలుగులో రాసుకుని బట్టి వేసి, అయినప్పుడూ కానప్పుడూ అపశ్రుతిలోనే పాడుకుంటూ ఉంటా. మొన్నా మధ్యన యూట్యూబ్ పుణ్యమాని ఈ సినిమా పాటలన్నీ దృశ్యకాలుగా చూశా. జిణే నాజ్ హై హింద్ పర్ .. మనసుని కలచి వేస్తుంది.
    Amazing lyrics - amazing music - amazing picturization.
    నాకు గొప్పగా నచ్చిన కవితా వాక్యం
    ఘం సే అబ్ ఘబరానా కైసా, ఘం సౌబార్ మిలా!
    కానీ తమాషా తెల్సా, ఆ నూటొకటో సారి కూడా మొదటి సారిలాగానే భయపెడుతుంది దుఖం!

    రిప్లయితొలగించండి
  9. సుమారు 41 -42 సంవత్సరాలక్రితం వైజాగులో చదూతున్నప్పుడు చూసిన సినిమా. ఆ జ్ఞాపకాన్ని తట్టి లేపారు. కృతజ్ఞతలు.

    రిప్లయితొలగించండి
  10. చదివినంత సేపూ ఇది మల్లెపువ్వు కధలా ఉందే అనుకున్నా ..చివర్లో మీరూ చెప్పారు .."చిన్నమాట "పాటని ఒక్కసారి వింటే నాలుగైదు రోజులు నాలుకమీదే ఆడుతుంది ఎవరికైనా....

    రిప్లయితొలగించండి
  11. వేణు శ్రీకాంత్, తృష్ణ గార్ల మాటే నా మాట.. చాలా మంచి సినిమా. సినిమాలో లాస్ట్ సాంగ్ అద్భుతంగా వుంటుంది..

    రిప్లయితొలగించండి
  12. ఇది ఎవర్ గ్రీన్ మూవీ అండీ. ఎవ్వరూ, ఎప్పటికీ మరిచిపోలేని సినిమా ఇది. ఇందులో ప్రతీ పాటా ఒకదానితో ఒకటి పోటీ పడుతూనే ఉంటాయి. ఇందులోని పాత్రలు కూడా నిజ జీవితంలో తరచూ చూసే పాత్రలే. ఎంతో సహజంగా దర్శకుడు మలచిన తీరు ఒక అద్భుతం అనిపిస్తుంది. గురుదత్త్ జీవితంలో ఇది కలికి తురాయి.

    రిప్లయితొలగించండి
  13. Amazing movie!! ఆసాంతం విషాదమైనా గురుదత్ నటనలోని ఒక ఆర్తిలాంటి భావన కదలకుండా చూసేలా చేస్తుంది.. తనవాళ్ళందరూ ఒక్కొక్కరిగా అతన్ని వెలెవేస్తుంటే 'ఎందుకంత బాధపడతావు, main hoon naa!" అని ఒక్క ఉదుటున లేచి వెళ్ళి చెప్పాలనిపిస్తుంది :-)

    రిప్లయితొలగించండి
  14. @పరిమళం: నేను కూడా టపా రాస్తూ ఆ పాటే పాడుకున్నానండీ (ఎవరికీ వినిపించ కుండా జాగ్రత్త పడ్డాలెండి) ..ధన్యవాదాలు.
    @నరసింహ: ఒక్కసారిగా గతం లోకి వెళ్లిపోయారన్న మాట.. ధన్యవాదాలు.
    @కొత్తపాళీ: భాషకి అతీతమైన భావం ఏదో ఉంది అనిపించిందండీ ఆ సాహిత్యంలో.. చాలా రోజుల తర్వాత మొన్నే డీవీడీ లో చూశాను.. వరుసగా రెండు సార్లు చూసినా మళ్ళీ చూడాలనిపిస్తోంది.. దుఃఖం అంటారా.. దాని పనే అది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  15. @రవి: స్వార్ధం అనేది మానవ నైజం అండీ.. కాలం తో పని లేదు దానికి.. ఆ మాటకొస్తే మన పురాణ పాత్రల్లో కూడా స్వార్ధం నిండినవి ఉన్నాయి కదా.. ధన్యవాదాలు.
    @కత్తి మహేష్ కుమార్: ధన్యవాదాలు.
    @వేణూ శ్రీకాంత్: పట్టి కుదిపే విషాదం అండీ.. కానీ ఒకసారి పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి.. ఆ అనుభూతి వేరు.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  16. @శేఖర్ పెద్దగోపు: ఖదీర్ వ్యాసం నేనూ చదివానండీ.. అన్నట్టు మీరు సినిమా చూశాక మర్చిపోకుండా ఓ టపా రాయండి.. సినిమాల గురించి మీరు రాస్తే చదవాలని ఉంది.. ధన్యవాదాలు.
    @సునీత: ఎందుకో అనిపించిందండీ.. మీకు నచ్చిన సినిమా అయి ఉంటుందని.. ధన్యవాదాలు.
    @తృష్ణ: రాయబోయే పోష్టులు చూడడం ఎలా సాధ్యం చెప్పండి? రాసినవి అయితే అనుమానించినా అర్ధం చేసుకోవచ్చు :):) మీరూ రాయండి.. హిందీ మీద అధారిటీ ఉన్న వాళ్ళు రాయడం ఎంతైనా డిఫరెంట్ గా ఉంటుంది.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  17. @పద్మార్పిత: నిజమండీ.. అన్నీ వెంటాడే పాటలే.. ధన్యవాదాలు.
    @ప్రణీత స్వాతి: వాళ్లకి చెప్పిన మాటలే మీక్కూడా :):) నాకు పాటలన్నీ బాగా నచ్చాయండీ.. మీరు చెప్పినట్టు చివరి పాట ప్రత్యేకం.. ధన్యవాదాలు.
    @జయ: అవునండీ.. గురుదత్ తప్ప ఎవరూ ఇలా తీయలేరేమో అనిపిస్తుంది.. ధన్యవాదాలు.
    @నిషిగంధ: అతని చిన్న చిన్న ఎక్స్ ప్రెషన్స్, ఏ మాత్రం 'అతి' అనిపించని నటన.. నిజంగానే అద్భుతం అండీ.. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  18. నేను ప్యాసా చూడలేదు కానీ మల్లెపువ్వు మాత్రం చూసా, అందులోని బాధ ఏదో చాలా రోజుల పాటు వెంటాడుతుంది. మీ పరిచయం మాత్రం చాలా బాగుంది

    రిప్లయితొలగించండి
  19. post chaduvutunappudu arey ee movie telugu lo undi anukunna...naku chala istam ayina movie mallepoovu...

    రిప్లయితొలగించండి
  20. @లక్ష్మి: మీకు 'మల్లెపూవు' నచ్చిందంటే 'ప్యాసా' అంతకన్నా బాగా నచ్చుతుందండీ.. తప్పక చూడండి.. ధన్యవాదాలు.
    @శిరీష: 'ప్యాసా' కూడా చాలా బాగుంటుంది, చూడండి. . ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  21. hai friends
    nenu na friends kalisi 5 minits short film prayatnam chesam.
    ee link lo choosi me comments teliyajeyandi.

    http://okkaavakasam.blogspot.com/2009/12/original-video-more-videos-at-tinypic.html

    రిప్లయితొలగించండి