శనివారం, నవంబర్ 07, 2009

ప్లంబరుడు

మా ఇంట్లో ట్యాప్ కి జలుబు చేసింది. శీతాకాలం లో మనుషులకి జలుబు చేయడం మామూలే కానీ, ఈసారి వెరైటీ గా ట్యాప్ కి జలుబు చేసింది. అదేదో యండమూరి సస్పెన్స్ నవల్లోలా ఠాప్ ఠాప్ ఠాప్ మంటూ ఒకటే చప్పుళ్ళు. చేతనైన వైద్యాలు చేసినా లాభం లేకపోవడం తో ప్లంబర్ ఆచూకీ వెతికి కాకి చేత కబురు పంపాను. యధాప్రకారం ప్లంబర్ రాలేదు. కబుర్లు మోసుకెళ్ళ లేక కాకులు నాకు కన్పించడం మానేశాయి. ఇక లాభం లేదని నేనే రంగం లోకి దిగాను.

నిన్న తనని కలిస్తే ఇవాళ తప్పక వస్తానని మాటిచ్చాడు. తన పేరు బాషా అని చెప్పి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు. నిజానికి బాషా ఒక్క సారి చెబితే వంద సార్లు చెప్పినట్టే.. కానీ, ఎందుకైనా మంచిదని ఉదయాన్నే నేనే బయలుదేరాను, బాషా ని తోడ్కొని రావడం కోసం. "ప్లంబరంటే డాక్టర్ లెక్క సార్.. మాతోని పనుంటే మా తానికే వస్తారు జనం.." ఇది బాషా మొదటి డైలాగు. కొంచం షాక్కొట్టినా తట్టుకున్నాను. అవసరం నాది కదా.

ఒక చిన్న చేతి సంచీ తో ఇంట్లోకి అడుగు పెట్టి నలు వైపులా కలియ చూసి, "ఇల్లు కట్టేది వేస్ట్ సార్.. ఏదొక ప్రాబ్లం ఉంటది.. అదే రెంట్ అనుకో.. ఏమొచ్చినా ఓనర్ చూస్కుంటడు" అని మరో విలువైన అభిప్రాయం ప్రకటించాడు. నిజానికి నేను మా ఓనర్ చెవిలో ఇల్లు కట్టుకుని పోరినా పనవ్వక పోవడం తో, బోల్డంత బిజీ గా ఉన్నా కూడా స్వయంగా ప్లంబర్ వేటకి బయలుదేరాను, 'చెవిలో జోరీగ' లాంటి పోరు పడలేక. అయాచితంగా నన్ను ఇంటికి ఓనర్ ని చేసేసినందుకు లోపల్లోపల సంతోష పడ్డాను.

"గిది మార్వాలే సార్.. నాతాన కొత్తదుంది" అని సంచిలోనుంచి ఓ ట్యాప్ తీశాడు. నాకు తెలియకుండానే నేను బాషా అసిస్టెంట్ గా మారిపోయాను. ఇంటికి వచ్చిన వాళ్ళని పలకరించి మాట్లాడడం గృహస్తు మర్యాద కదా.. అందుకని బాషా తో మాటకలిపాను. అతను చాలా స్వేచ్చా పిపాసి అనీ, బడి బందిఖానాలా అనిపించడం వల్ల చిన్నప్పుడే చదువు మానేసి ప్లంబింగ్ నేర్చుకున్నాడనీ తెలిసింది. ఒకే చోట ఉండడం తనకి చిరాకుట.. అందుకే ఊళ్ళు తిరుగుతూ ఉంటాడుట.

"సదివి బాగుపన్నోడెవడు సార్? ఎంత సదివినా ఒకని కింద నౌక్రీ నే సెయ్యాలి" మరో జ్ఞాన గుళిక ని ప్రసాదించాడు. "నా తమ్ముడు పది సద్విండు.. నౌక్రీ ల చేరిండు.. ఏం లాబం? పాణం బాలేకున్నా పనికి పోవాలె.. ఏడకీ పోనీకి లేదు.." అతనితో మాట్లాడడం కన్నా, చెప్పింది విని గమ్మునుండడం మంచిదని అభిప్రాయానికి వచ్చేశాను. "గదే నన్ను సూడండి.. నచ్చితే పని చేస్తా.. లేకుంటే ఫోన్ బంద్ చేస్తా.. ఎవడేమంటడు?" నేను ఓవర్ హెడ్ టాంక్ ఆపి, తను వదలమన్నప్పుడు నీళ్ళు వదిలే పనిలో ఉన్నాను. ట్యాప్ సెట్ అవ్వలేదు. మళ్ళీ బిగిస్తున్నాడు.

"పిల్లకాయలు సదువులు సదువులని తిరుగుతుంటే బాదేస్తాది సార్.. అంతా నౌక్రీ కోసం తిప్పల్లెక్క. గదే ఏదన్నా పని నేర్సుకున్నరనుకో, ఒకని తో పని లేకుండా ఆల్లే సంపాదిచ్చు కోవచ్చు కదా.. నా లెక్క పని చేసేటోనికి ఉన్న గౌరం, నౌకరి చేసేటోనికి ఏడికెల్లి వస్తది సారూ?" అతను పని పూర్తి చేసి చేతులు తుడుచుకుంటున్నాడు. నేను 'ఉషాపరిణయం' క్లైమాక్స్ లో సుమన్ గారి విశ్వరూపం చూసినప్పుడు కూడా అంతగా చేష్టలుడిగి పోలేదు. మనం జీవితంలో ఎంతమందినో కలుస్తూ ఉంటాం.. కొందర్ని ఆలస్యంగా.. ఇతన్నైతే జీవిత కాలం లేటుగా.. డబ్బులిచ్చి బాషా ని పంపించాను.

31 కామెంట్‌లు:

 1. ఆహ నా తెలియకడుగుతా ఏమిచేసేవారో ? మీరిలాంటి ఆలోచనలు చేస్తున్నారని మీ బామ్మకి తెలిస్తే మిమ్మల్ని మీ స్కూల్ రోజులకి తీసుకెళ్ళి చెవులు మెలెయ్యగలరు జాగ్రత్త :)

  రిప్లయితొలగించు
 2. బాగా సెలవిచ్చారు.

  రిప్లయితొలగించు
 3. ప్లంబరుడు, మీకు బ్రమ్హాండమైన ట్రైనింగ్ ఇవ్వటమే కాక, జ్ఞానోదయం కూడా కలిగించిందుకు అతనికి మీరు జీవితమంతా ఋణపడి ఉండాల్సిందే నండి మురళి గారు. కొంపతీసి, మీ పిల్లల చదువులు మానిపించేయలేదుకదా! ఉషాపరిణయాన్ని థియేటర్ కి వెళ్ళి మరీ చూసొచ్చిన వాళ్ళున్నారని... నాకు కాస్త ఆలస్యంగానే జ్ఞానోదయమైందండి.

  రిప్లయితొలగించు
 4. దేని డాక్టర్ దానికి ఉండాలండీ. ఆ మధ్యన మా ఇంట్లో ఒక ఫాన్ తిరగటం మానేస్తే మావారు ఎలక్ట్రీషియనవుదామని తెగ ప్రయత్నించారు పాపం...మర్నాడు ఆ డాక్టర్(ఎలక్ట్రీషియన్ ) వచ్చి స్విచ్ బోర్డ్ మీద చెయ్యి వెయ్యగానే అది తిరగటం మొదలెట్టింది...

  రిప్లయితొలగించు
 5. హి..హీ...అవునూ ఆయన అలా మాట్లాడుతుంటే బ్యాక్ గ్రౌండ్ లో భగవద్గీత ఎవరో ప్లే చేసినట్టు మీరు ఫీలవలేదా? :)
  చదివిన తర్వాత నాకొచ్చిన ఓ సరదా ఆలోచన..
  --" భాష "---
  కాప్షన్: వీడు కాకుల మాట వినడు.

  రిప్లయితొలగించు
 6. నాకూ ఇలాంటివాళ్ళు తారసపడినప్పుడు ఇలానే అనుకుంటుంటాను. వాళ్ళ గురించి ఒక టపా వ్రాస్తాను.

  రిప్లయితొలగించు
 7. "ప్లంబరంటే డాక్టర్ లెక్క సార్.. మాతోని పనుంటే మా తానికే వస్తారు జనం.. ఇది బాషా మొదటి డైలాగు. కొంచం షాక్కొట్టినా తట్టుకున్నాను"..
  ఆ విధంగా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాడన్నమాట "ప్లంబరుడు". జ్ఞాన చక్షువులు తెరిపించినట్టున్నాడు మురళీగారూ..!

  రిప్లయితొలగించు
 8. మీరునేను బ్లాగ్‌స్నేహంచేస్తున్నామని మీకుళాయికీ, మాకుళాయికీ తెలిసిపోయిందడోయ్. మొన్నటినుంచి కూడబలుక్కున్నాయి రెండున్నూ. తమాషా ఏమిటంటే రేపుదయం 'ప్లంబరుడు‌' అనే శీర్షికతో ఒకటపా పెడదామనుకున్నా. ఈలోగామీరు.
  ఇక్కడ దానిపెంకితనానికీ, నాబద్దకానికీ తీవ్రపోరాటం జరిగుతోంది. కాకపోతే ఆపోరాటం రోజంతాకాదు. సెషన్లవారీగా. ఆకుళాయిలో తాగేనీళ్లు రోజుకి మూడుదఫాలుగా వదుల్తారు. అప్పుడుమాత్రమే.
  నాకుమీలా జ్ఞానోదయం చేసే ప్లంబరుడు దొరక్కపోవచ్చు. నేనుండేది కంపెనీగృహాల్లో కాబట్టి వచ్చేవాడూ బాషాలాగా లోకాన్ని చదివినవాడూ, బేతాళకథలు చెప్పగల్గినవాడూ కాకపోవచ్చు. అన్నట్లు బాషాతత్వం బోధపడి వాటిని మీపిల్లలపై ప్రయోగించేరు? :)

  రిప్లయితొలగించు
 9. దివ్యోపదేశం దివ్యోపదేశం :)
  @శేఖర్ .. హ హ హ

  రిప్లయితొలగించు
 10. మీ ప్లంబరుడు ద్వారా మాకు కూడా ఙ్జానోదయం అయిందిగా:):)

  రిప్లయితొలగించు
 11. మురళీ గారండీ,

  పాడు జీవితమూ..ఈ నౌకరీ జీవితమూ
  ప్లంబరోని జీవితమూ .. పసందైన జీవితమూ

  అని కలవరిస్తున్నంట్టుంది మీ టపా చూస్తుంటే. మీ మనసులో అచ్చు గుద్ది వెళ్ళాడు :) .ప్లంబరోడా మజాకా నా !

  ఎందుకో గానీ ఈ శీర్షిక చూడగానే ఆ మధ్య అమెరికాలో తెగ పాపులర్ అయిన " జో.. ది ప్లంబర్" ఠక్కున గుర్తుకు వచ్చాడు.

  రిప్లయితొలగించు
 12. నురళి గారు
  చదువు కునె వాడు పుస్తకాలె చదువుతాదు అదే బయట థిరిగి పది చొట్లపని చేసె వాదు మనుషుల్ని ,జీవితాన్ని చదువుతాడి ..

  అల్లంటి వాడె ఈ ప్లంభరు గారు...

  www.tholiadugu.blogspot.com

  రిప్లయితొలగించు
 13. తుంబురుడు, నారదుడు లాగ ప్లంబరుడు టపా పెటు భలే ఉంది. జీవిత సారాన్ని పిండి పిప్పి తీసి ఎంత సింపుల్ గా అందించాడండి ప్లంబరుడు . భేష్.

  రిప్లయితొలగించు
 14. నిజమే అందరు బాషాలా ఆలోచిస్తే నిరుద్యోగమే వుండదు కదా !

  రిప్లయితొలగించు
 15. బాగుంది గా జ్ఞాన బోధ. ఇంకా నయ్యం ఇంకా కొంచం పెర్సనల్ గా వెళ్ళి 'ఎందుకు సార్ ఇంత చదువుకున్నారు నల్లా షురు చెయ్యటం రాదు ఎమి బతుకిది' అంటే ఇంకా మొహమాటం వేసేది.:-) మా అత్త ఎప్పుడు అంటూండేది చదువుకున్న వాడి కంటే చాకొలోడు మేలని అది గుర్తు వచ్చింది నాకు.

  రిప్లయితొలగించు
 16. ఐతే గీతోపదేశంలా భాషా ఉపదేశం జరిగిందన్నమాట ! మీరాకాసేపూ అర్జునుడిలా మారిపోయారా :)

  రిప్లయితొలగించు
 17. ప్లంబింగ్ చేసేవాడిని ప్లంబరుడు అంటే
  డ్రైవింగ్ చేసేవాడిని డ్రైవరుడు అనాలా? ఇంకా వెరైటీగా డ్రై-వరుడు అనాలా?

  తృష్ణ గారు, ఇంగ్లీష్ సినిమాలలో ఎవరింట్లో పనులు వాళ్ళే చేసుకోవడం చూస్తుంటాం కదండి!

  రిప్లయితొలగించు
 18. @శ్రావ్య : హమ్మా... బామ్మ పేరు చెప్పి భయ పెట్టేద్దామనే..?:-) ..ధన్యవాదాలు
  @naagodu: ధన్యవాదాలు..
  @జయ: లేదు లెండి, ఆ భయమేమీ లేదు. మీరు సుమన్ అభిమానులని మరీ తక్కువ అంచనా వేసినట్టున్నారు? :-) ..ధన్యవాదాలు..

  రిప్లయితొలగించు
 19. @తృష్ణ: నిజమేనండీ..ఎవరి పని వాళ్ళే చెయ్యాలి :-) ..ధన్యవాదాలు.
  @శేఖర్ పెద్దగోపు: సూపర్ కాప్షన్ :-) ;-) ..ధన్యవాదాలు.
  @భవాని: రాయండి.. ఎదురు చూస్తున్నాం :-) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 20. @ప్రణీత స్వాతి: నిజమేనండీ.. ధన్యవాదాలు.
  @సుబ్రహ్మణ్య చైతన్య; అయితే రాయండి మీ ప్లంబర్ అనుభవాలు.. ధన్యవాదాలు.
  @కొత్తపాళీ: :-) :-) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 21. @పద్మార్పిత: జాబ్ మానేస్తున్నారా కొంపతీసి :) :) ..ధన్యవాదాలు.
  @భాస్కర రామిరెడ్డి; నా టపా ఏమో కానీ, మీ పాట మాత్రం భలే ఉందండీ.. ధన్యవాదాలు.
  @కార్తీక్: బాగుందండీ మీ విశ్లేషణ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 22. @వాసు: అంతేనంటారా??...ధన్యవాదాలు.
  @చిన్ని: మీకు అలా అనిపించిందా?? ..ధన్యవాదాలు.
  @భావన: అలా అనలేదు లెండి, అదృష్టవశాత్తూ. :) ..ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 23. @లక్ష్మి: :)) ..ధన్యవాదాలు.
  @పరిమళం: తప్పదు కదండీ మరి;) ..ధన్యవాదాలు.
  @బోనగిరి; డ్రై-వరుడు ..ఇదేదో బాగుందండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 24. మీ ప్లంబరుడి జ్ఞాన బోధ బాగుందండి .

  రిప్లయితొలగించు
 25. మురళి గారు, మీకు ప్లంబరుడు, ఎలా జ్ఞాన బోధ చేసాడో, అలానే బెజవాడలో, మా మంగలి వాడు ప్రతిసారి నాకు జ్ఞానబోధ చేస్తాడు. ఆర్దికమాంద్యం వల్ల IT ఉద్యోగాలు ఊడాయంటూ పేపర్లు గగ్గోల్లు పెట్టడంవల్లన ఏమో, అతను ప్రతీసారీ, ఉద్యోగాలలో ఏముంది బాసు, గొడ్డుచాకిరి తప్పించి, కులవృత్తిని నమ్ముకున్నవాడు ఎప్పటికి కింగ్ అంటాడు!

  రిప్లయితొలగించు
 26. "కులవృత్తికి సాటిలేదు గువ్వలచెన్నా"
  అన్నారు.
  ఎవరన్నారో నాకు గుర్తులేదు.

  రిప్లయితొలగించు
 27. @మాలాకుమార్: ధన్యవాదాలు.
  @వేణూ శ్రీకాంత్: :-) :-) ..ధన్యవాదాలు
  @వీరుభొట్ల వెంకట గణేష్: హ..హ.. బాగుందండీ మీ వాడి బోధ.. ధన్యవాదాలు.
  @బోనగిరి: 'గువ్వలచెన్నా' మకుటంగా ఒక శతకం ఉందని ఎక్కడో చదివిన జ్ఞాపకం అండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 28. టైటిల్ :)
  పొస్ట్ super
  కొసమెరుపు excellent

  రిప్లయితొలగించు