మంగళవారం, నవంబర్ 17, 2009

నాయికలు-కిరణ్మయి

చదివిన చదువును జీవితానికి అన్వయించుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ కొందరి కోవకి వస్తుంది కిరణ్మయి. ఆమె మనస్తత్వ శాస్త్రం లో పీజీ చేసింది. ఊహించని కష్టం వచ్చి పడినప్పుడు, అందమైన పొదరిల్లు లా ఉండాలని తను కోరుకున్న తన వైవాహిక జీవితం పునాది దశలోనే కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆ మనస్తత్వ శాస్త్రాన్నే తనకి ఆసరాగా చేసుకుంది కిరణ్మయి. పోలీసులకి దీటుగా అపరాధ పరిశోధన చేసి తన భర్తని రక్షించుకుంది. ఈ క్రమంలో 'లేడీస్ హాస్టల్' లో జరుగుతున్న అక్రమాలెన్నింటినో వెలుగులోకి తెచ్చింది.

కిరణ్మయిది విచిత్రమైన కుటుంబం. ఉద్యోగం నుంచి సస్పెండైన తండ్రి, ఇంటి బాధ్యత పట్టించుకోని అన్నలు. ఇంట్లో రాజకీయాలు చేసే వదినలు. ఏ ఇద్దరి మనుషుల మధ్యా అనుబంధం లేదా ఇంట్లో. 'తన' ఇల్లు అలా ఉండకూడదని కిరణ్మయి కోరిక. ఆమెకి పెళ్లి చేయడం కన్నా ఉద్యోగానికి పంపితే తనకి వెసులుబాటుగా ఉంటుందని ఆలోచిస్తాడు ఆమె తండ్రి. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెకో పెళ్లి సంబంధం వస్తుంది. పెళ్లి కొడుకు రంజీ క్రికెట్ ప్లేయర్.. పేరు రాయన్న. ఆమె కన్నా తక్కువ చదువుకున్నాడు. అయినా వాళ్ళ పెళ్లి జరిగిపోయింది.

మనస్తత్వ శాస్త్రం ఆధారంగా మొదటి రాత్రి తన భర్తని అంచనా వేసే ప్రయత్నం చేస్తుంది కిరణ్మయి. తన ఆశ, శ్వాస క్రికెట్టే అనీ, భారత జట్టుకి ఎంపికవ్వాలన్నది తన ధ్యేయమని రాయన్న చెప్పినప్పుడు, "రెండేళ్ళ పాటు ఉద్యోగం మానేసి ప్రాక్టీస్ మీద దృష్టి పెట్టండి.. ఈ రెండేళ్ళూ నేను ఉద్యోగం చేస్తాను.." అంటుంది, అప్పటివరకూ క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేని కిరణ్మయి. ఆమెతో తన జీవితం బాగుంటుందన్న నమ్మకం లుగుతుంది రాయన్నకి. తనకి ఏ అమ్మాయితోనూ శారీరక సంబంధం లేదని భార్యకి చెబుతాడతను. అమ్మాయిలు వచ్చి ఆటోగ్రాపులు తీసుకుంటారనీ, అంతకు మించి ఎవరితోనూ పరిచయం లేదనీ చెబుతాడు.

రాయన్నతో జీవితం తను కోరుకున్నట్టుగా ఉండబోతోందన్న నమ్మకం కిరణ్మయి కి కలుగుతున్న సమయంలోనే తలుపు చప్పుడవుతుంది. అర్ధరాత్రి వేళ వచ్చిన పోలీసులు రాయన్న ని అరెస్టు చేస్తారు.. లేడిస్ హాస్టల్ లో ఉంటున్న అపురూప లక్ష్మి అనే అమ్మాయి ఆత్మహత్యకి కారణమయ్యాడన్న అభియోగంపై. "నాకే పాపమూ తెలీదు.. కనీసం నువ్వైనా నమ్ము" అని భార్యకి చెప్పి పోలీసు జీపెక్కుతాడు రాయన్న. ఆ అర్ధరాత్రి వేళ తన మనో నిబ్బరం కోల్పోకుండా ఉండడం కోసం కిరణ్మయి చేసిన పని ఓ పుస్తకం తీసుకుని చదువుకుంటూ కూర్చోడం. ఆ మర్నాడే సెలక్షన్స్ కోసం పిలుపొస్తుంది రాయన్నకి.

అతనికి బెయిల్ ఇప్పించడం మొదలు సెలక్షన్స్ లో ఆడడానికి అతన్ని మానసికంగా సిద్ధం చేయడం వరకూ కిరణ్మయి చేసిన కృషి అసామాన్యమైనది. అతను సెలక్షన్స్ కి వెళ్ళగానే లాయర్ తో కలిసి భవిష్యత్ కార్యక్రమం ఆలోచించి, రాయన్న నిర్దోషి అని నిరూపించే ఆధారాలను వెతికే పనిలో పడుతుంది ఆమె. ఓ పక్క రాయన్న దోషి అని బలంగా నమ్ముతున్న పోలీసులు, మరోపక్క అతను నేషనల్ టీం లో సెలక్ట్ కాకూడదని పావులు కదుపుతున్న క్రికెట్ ప్రత్యర్ధులు, ఇంకోపక్క జరుగుతున్నా పరిణామాల వల్ల తనమీద తనకే నమ్మకం పోతున్న స్థితిలో ఉన్న రాయన్న.. కుటుంబ సభ్యులెవరూ సాయం చేయడానికి ముందుకు రాని నేపధ్యంలో పరిస్థితులతో పోరాటానికి సిద్ధపడుతుంది కిరణ్మయి.

రాయన్న భార్యగా కాక, ఓ విద్యార్ధిని గా హాస్టల్లో చేరిన కిరణ్మయికి రాయన్నని అనుమానించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయి. ఓ పక్క రాయన్నకి కావాల్సిన మనో ధైర్యాన్ని ఎప్పటికప్పుడు అందిస్తూనే, అతని నిర్దోషిత్వాన్ని నిరూపించే ఆధారాలు సేకరించడం మొదలు పెడుతుంది కిరణ్మయి. రాయన్న అపురూపలక్ష్మికి 'కొంత' సన్నిహితుడన్న విషయం తెలిసినప్పుడూ, ఆ అమ్మాయి రాయన్నని ప్రేమించిందన్న నిజం బయట పడినప్పుడు కలత చెందుతుంది కిరణ్మయి. అంతమాత్రాన తన బాధ్యతని మరచిపోదు. హాస్టల్ అమ్మాయిలతో స్నేహం చేసి జరిగినదేమిటో తెలుసుకుంటుంది. యండమూరి వీరేంద్రనాథ్ నవల 'లేడీస్ హాస్టల్' చదివిన ప్రతి ఒక్కరినీ చాలా రోజులపాటు వెంటాడే పాత్ర కిరణ్మయి. తనదైన శైలిలో ఆమె వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించారు యండమూరి.

ప్రతి అంశాన్నీ తనదైన దృక్కోణం నుంచి ఆలోచించడం, మానసికంగా బలహీనమైనప్పుడు సైతం ఆలోచనల్లో లాజిక్ ని విడిచిపెట్టక పోవడం కిరణ్మయి ప్రత్యేకత. చివరి ఆధారం దొరికే వరకూ రాయన్న నేరం చేసే ఉండొచ్చన్న ఆలోచన ఏమూలో గుచ్చుతూనే ఉంటుంది ఆమెని. వైవాహిక జీవితాన్ని గురించి సంతోషంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న సమయంలోనే పిడుగుపాటులా అనిపించే భర్త అరెస్టు మొదలు, ఇంటా బయటా అతనిపై వచ్చిన నిందలు, చుట్టూ ఉన్న మనుషుల నిజ స్వరూపాలు మరోసారి బహిర్గతం అవడం వల్ల కలిగే శూన్యత.. వీటన్నింటినీ ఎదుర్కొని తన లక్ష్యాన్ని సాధించిన కిరణ్మయి ని అభినందించకుండా ఉండలేం. ('లేడీస్ హాస్టల్,' రచన: యండమూరి వీరేంద్రనాథ్, 'నవసాహితి' ప్రచురణ, వెల రూ. 70, అన్ని ప్రముఖ పుస్తకాల షాపులు)

20 కామెంట్‌లు:

 1. బాగుందండీ పరిచయం. ఎప్పుడో మా పెద్దమ్మ ఇంట్లో చదివిన గుర్తు...

  రిప్లయితొలగించు
 2. మురళి గారు, ఎప్పుడూ మీ నాయికల పరిచయం చూసి కుళ్ళుకుంటూ ఉంటాను. నాకు వాళ్ళెవరూ తెలీదు మరి. పోని నాకు తెలిసిన వాళ్ళ గురించి మీరు రాయరు. తెలుగు బ్లాగుల్లో ఇలా అడగటం తప్పేమొ గాని, మీరు ఒక ఎలిజబెత్ బెన్నెట్ ని, ఒక నటాషా ని, లేక డొమొనిక్ ని కనీసం ట్రేసీ విట్నీ లేక జెన్నిఫర్ పార్కర్ ని ఇలా విశ్లేషణాత్మకంగా పరిచయం చేస్తే చదవాలని ఉంది.

  రిప్లయితొలగించు
 3. ఆమె ఉన్నతమైన వ్యక్తిత్వత్వం తో పాటూ ....అపురూపలక్ష్మి డైరీ ....ఆమె కుటుంబమూ ...కూతుర్ని చూడకూడని పరిస్థితిలో చూసిన ఆ తండ్రి మానసిక వేదనా ..పుస్తకం చదివిన చాన్నాళ్ళ వరకు గుర్తుండిపోతాయి ....మళ్ళీ పుస్తకం తీసి చదవాలనిపించేలా రాశారు ..ధన్యవాదాలండీ !

  రిప్లయితొలగించు
 4. యండమూరి గారి నుండి వెలుబడ్ద మంచి సస్పెన్స్ నవల. కథ క్లుప్తంగా బాగా చెప్పారు మురళి గారు.

  రిప్లయితొలగించు
 5. నాకు నచ్చిన యండమూరి నవలలో ఇది ఒకటి . మంచి నవలను మళ్ళీ గుర్తు చేసారు !

  రిప్లయితొలగించు
 6. హమ్మయ్య, ఈ సారి మొత్తానికి నేను చదివిన నవల గురించి రాసారు. వీరేంద్రనాధ్ నవలలు నాకిష్టం అందుకే ఇది చదివేసాను. బాధకలిగించే, ఎప్పటికైనా గుర్తుండిపోయే ఈ నవల మరచిపోవటం కష్టం. ఈ నవల నా కెంతో ఇష్టం. ధన్యవాదాలు మురళి గారు.

  రిప్లయితొలగించు
 7. ఈ నవల పేరు వినగానే నాకు ఎప్పుడూ ఈ వాక్యం ఠక్కున గుర్తొస్తుంది :-)
  "వాట్ డూ యు సే ఆఫ్టర్ యు సే హల్లో - కిరణ్మయీ"

  కిరణ్మయిని చక్కగా పరిచయం చేశారు.. పుస్తకం అంతా ఆవరించి ఉన్న ఆమెని ఇలా నాలుగైదు పేరాగ్రాఫుల్లో చూపించడం నిజంగా కష్టమైన పని! ఈ పుస్తకంలో నాకు బాగా నచ్చింది భార్యాభర్తల మధ్య మొదట్లో దగ్గరతనం బిల్డ్ చేసిన తీరు!

  రిప్లయితొలగించు
 8. Hello Murali garu,
  Eenadu lo mee blog gurinchi chadivinappati nunchi regular ga mee blogs chaduvutunnanu. kani comments rayatam kudaraledu. Naku mee blogs chala baga nachutai. Mee blog vallane naku inkonni blogs parichayam ayyayi. Meeru rase novels gurinchi chadivinappudu kuda inta manchi novels chadive adrustam miss ayyane anipistundi. Nenu US lo vundatam valla ippudu aa novels dorakatam kastam. Kani avi online lo dorike chance edaina vunte cheptara please.

  రిప్లయితొలగించు
 9. మంచి పరిచయం.. అక్కడక్కడ కొంచెం బోరింగ్‌గా అనిపించినా, చదివిన తరువాత చాలా రోజులు గుర్తుండిపోయే నవల.. ఎలాంటి పరిస్ఠితుల్లోనైనా, నాయిక లాజికల్‌గా ఆలోచించడం బావుంటుంది..

  రిప్లయితొలగించు
 10. ఎప్పటిలానే పరిచయం చాలా బాగుంది మురళి గారు. ఇది కూడ ఆంధ్రభూమి వారపత్రిక లో సీరియల్ గా వచ్చినట్లు గుర్తు. అప్పట్లో రాయన్న అరెస్ట్ మరియూ కొన్ని ఎపిసోడ్స్ మాత్రం చదివినట్లు గుర్తు. వాటివలన మరియూ ఈ నవలపై నే విన్న కామెంట్స్ వలన కాస్త చులకన అభిప్రాయం కలిగి చాలా రోజులు పట్టించుకోలేదు. పూర్తినవల ఒక నాలుగైదేళ్ళ క్రితం చదివాను, చదివిన వెంటనే కిరణ్మయి పాత్రకి అభిమానినైపోయాను. అపురూపలక్ష్మి పేరు కూడా చాలా చిత్రంగా అనిపించేది :-)

  రిప్లయితొలగించు
 11. నేను చదివానుగా.... ఇంకా ఎంతమంది నాయకిలు వున్నారో ? మాంచి నాయకుడి గురించి రాయొచ్చుగా

  రిప్లయితొలగించు
 12. నేను ఈ పుస్తకం పోయిన యేడాది అమెరికాలో ఒంటరిగా గడిపిన ఒక వారాంతంలో చదివాను. కూర్చున్నదాన్ని కూర్చున్నట్టే ఉండిపోయా కానీ చదవటం మాత్రం ఆపలేదు, కాని నేను నాయిక పేరు మాత్రం గుర్తు పెట్టుకోలేదు అది వేరే విషయం :) బాగుంది మీ పరిచయం

  రిప్లయితొలగించు
 13. @కొత్తపాళీ
  అవునా! మీ కోరిక కాదనడం బొత్తిగా ఇష్టం లేదు ...నా హీరో ల గురించి త్వరలో -:)

  రిప్లయితొలగించు
 14. @తృష్ణ: యండమూరి నవలలు సెలెక్టివ్ గా చదివే వాళ్ళు కూడా చదివే నవలండీ.. ధన్యవాదాలు.
  @Ruth: నిజానికి నాకు బాగా తెలిసిన తెలుగు నేపధ్యం ఉన్న నాయికల గురించే నేను సరిగ్గా రాయగలుగుతున్నానా అన్న డౌట్ వస్తోందండీ నాకు.. ఆంగ్ల నాయికల గురించి రాయాలన్న ఆలోచన నాకూ ఉంది.. ఈసందర్భంగా మీకో మాట.. మరేమీ లేదండీ.. మనం తెలుగు వాళ్ళం.. తెలుగు పుస్తకాలు కూడా చదువుదాం.. ఏమంటారు? ..ధన్యవాదాలు.
  @పరిమళం: యండమూరి అభిమాని నుంచి వచ్చిన కాంప్లిమెంట్... ధన్యవాదాలండీ...

  రిప్లయితొలగించు
 15. @కృష్ణ రాజేష్: నిజమేనండీ.. మొదటిసారైతే ఊపిరి బిగబట్టి చదివాను.. ధన్యవాదాలు.
  @శ్రావ్య వట్టికూటి: ధన్యవాదాలండీ..
  @జయ: కిరణ్మయి కి చాలా మంది అభిమానులు ఉన్నారన్న మాట:) ..ధన్యవాదాలండీ..

  రిప్లయితొలగించు
 16. @నిషిగంధ: నేను ప్రస్తావించాలని, ప్రస్తావించకుండా వదిలేసినా వాక్యం.. మొదటి సారి చదివినప్పుడు నన్ను చాలా రోజులు వెంటాడిన వాక్యం.. 'పుస్తకం అంటా ఆవరించి ఉన్న..' నిజానికి యండమూరి నవలలన్నింటిలోనూ నాయికలే ఆవరించి ఉంటారండీ :):) ..ధన్యవాదాలు.
  @కరుణ: మిమ్మల్నిలా కలుసుకోడం చాలా సంతోషంగా ఉందండీ.. మీరు కూడా ఒక బ్లాగు మొదలు పెట్టండి మరి. తెలుగు లో రాయడానికి ఈ లంకె సాయపడుతుంది చూడండి.. http://www.google.com/transliterate/indic/Telugu ధన్యవాదాలు.
  @మేధ: మొదటి సరి చదివినప్పుడు లోపాలు కనిపించవు కానీ (సస్పెన్స్ వల్ల) మళ్ళీ చదివినప్పుడు లోపాలు చాలానే కనిపిస్తాయండీ.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 17. @వేణూ శ్రీకాంత్: అపురూప లక్ష్మి పేరు మాత్రమే కాదండీ.. పాత్ర కూడా కొంచం చిత్రంగానే ఉంటుంది.. అయినా మీరు చదివారు కదా.. ధన్యవాదాలు.
  @చిన్ని: ఏమండీ 'నాయికలు' బోర్ కొట్టేస్తున్నారా?? నాయకుల గురించి మహిళలు ఎవరైనా రాస్తే బాగుంటుంది కదండీ.. ధన్యవాదాలు.
  @లక్ష్మి: కిరణ్మయి పేరు మర్చిపోయారా?!! నిజమేనండీ ఆపకుండా చదివేస్తాం.. ధన్యవాదాలు.

  రిప్లయితొలగించు
 18. @కొత్తపాళీ: నా మనసులో మాట మీరు చెప్పారు.. ధన్యవాదాలు.
  @చిన్ని: నాదీ కొత్తపాళీ గారి మాటేనండీ..

  రిప్లయితొలగించు
 19. హమ్మయ్య...ఇన్నాళ్లకీ నాకు తెలిసిన నవల గురించి చెప్పారు :) :)
  అసలు మొత్తం నేను చదివిందే యండమూరి నవలలు కొన్ని, యుద్దనపూడివి కొన్ని.
  నేను రెండు మూడేళ్ళ క్రితమే ఈ నవల చదివాను. అయినా నాకు నచ్చింది.
  'కిరణ్మయి' ని, మొత్తం నవలని మీరు వర్ణించిన తీరు అద్భుతం.!
  ఒక్క క్షణం నేను చదివిన 'లేడీస్ హాస్టల్' నవల గురించేనా అనిపించింది. అంటే ఎలా చెప్పాలో తెలీట్లేదు కానీ...మీరు రాసిన తీరు నాకు చాలా చాలా నచ్చేసింది.
  నేను చెప్పాలనుకున్న భావం మీకు అర్ధమైందా లేక కన్ఫ్యూస్ చేసానా :(

  రిప్లయితొలగించు